Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 19


    "ఏమనిపిస్తుంది? ఎదురు ప్రశ్న వేశాడు శ్రీనివాసరావు.
    "ఆమె గుర్తురాదూ.....?"
    "మరచిపోతే కదా గుర్తురావడానికి?"
    "అంత మరువలేని మమకారం ఉన్నప్పుడు ఆమెనుంచి విడాకులెలా తీసుకున్నారు? మరొక భార్యను కట్టుకుని ఆమెతో సంసారం ఎలా చెయ్యగలుగుతున్నారు? నన్ను కవ్వించాలని నేనేమంటానో వినాలని ఆ మాటలు" అంది శాంత బుంగమూతి పెట్టి.
    శూన్యంలోకి చూస్తూ మౌనంగా వుండిపోయాడు శ్రీనివాసరావు.
    కొన్ని క్షణాలు మౌనం తర్వాత "బాబుకి ఆమె పేరే కదూ పెట్టారు? అడిగింది శాంత.
    "అవును" నెమ్మదిగా అన్నడు శ్రీనివాసరావు.
    "మీకు ద్రోహం చేసి, వ్యభిచరిం......""శాంతా" అరిచినట్టు అని "నువ్వలా అనకూడదు ఆమె స్థానం నీకిచ్సింది. ఆమె అన్నం నువ్వు తింటున్నావు.....తాళికట్టాను. అనుభవించాను. అంతే. ఆమెకు నేను కానీ డబ్బు పెట్టలేదు, పువ్వూ, చీరా, జాకెట్టూ ఏమీ ఎప్పుడూ నేను కొనివ్వలేదు. పైగా ఆమె నేను సంపాదించే డబ్బు నా ప్యాస్ బుక్ లో నెలనెలా కొంత వేసేవారం. ఆ డబ్బూ నేనే తీసుకున్నాను....కొనాళ్ళు పగతో. ఇప్పుడు పశ్చాత్తాపంతో. రమ నాకెప్పుడూ గుర్తుంది. నువ్వు మరోలా ఫీలవ్వకు.....రమని ఆదరంగా. అభిమానంగా చూడలేకపోయాను. నా ప్రాణం కన్నా ఎక్కువైన బాబుకి ఆ పేరు పెట్టి........క్షంతవ్యున్ని కాలేను కాన్......కృతజ్ఞత ఆమెకు ఆమె ఎక్కడ ఉన్నా తెలియపరుచుకున్నాను అంతే....." అంటూ దీర్ఘంగా నిట్టూర్చి వత్తిగిలి పడుకున్నాను శ్రీనివాసరావు.
    రమాకుమార్ పక్కన చోటుచేసుకు పడుకుంది శాంత. భర్త మనస్సులోని మార్పు కొన్ని క్షణాలామెను కలవర పెట్టింది.
    తొందరగా వచ్చేస్తానని ఇంట్లో చెప్పి పొలానికి శ్రీనివాసరావుతో వెళ్ళింది రాధ. ఎద్దులకి దాణా వేయించడం. మళ్ళు దున్నించడం ఏవేవో రైతులకి పనులు పురమాయిస్తున్న శ్రీనివాసరావుని బాబయ్యా. మీరు.... మీరు. ఇప్పట్లో ఆ ఊరు వెళ్ళరా? సంకోచంగా అతనివైపు చూస్తూ అడిగింది రాధ.
    "ఏ ఊరు?....." ప్రశ్నించాడు నవ్వుతూ.
    "విశ్వనాధన్ తమ్ముడు. ఫారెన్ వెళ్ళాడని చెప్పానుగా ఓ సారి అతనీ సరికి వచ్చేసి ఉండాలి అంటూ తలవాల్చి నిల్చుంది.
    ఒక్కక్షణం ఆమెవైపు పరిశీలనగా చూసి "ఆ.....వచ్చేస్తే" అన్నాడు శ్రీనివాసరావు.
    "అతడు చాలా మంచివాడు బాబయ్యా. ఒక్కసారి అతన్ని...
    వద్దమ్మా! అతనా అన్నకి తమ్ముడు కాడా. ఇహ ఆ ఊరూ ఆ అన్నదమ్ములూ ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. నా గుండెలు పిండి నట్టవుతుంది."
    రాధ ఇంకా ఏమో చెప్పబోతోంది. విశ్వనాధన్. వాసూరావ్ ఆ పేర్లే ఉద్భవించవద్దని తీవ్రంగా వారించి మళ్ళీ తనపనుల్లో లీనమయ్యాడతను.
    నిస్సహాయంగా నిస్పృహగా ఏదో ఆలోచనలో అలా నిల్చుండి పోయింది రాధ. "మిత్రులిద్దరూ ఆ వివాహం సంగతి గుప్తమన్నాలే! విశ్వనాధన్" రాధ ఏమయిందని ప్రశ్నించే వాసూరావుకి ఏమని జవాబిస్తాడు రమణికి ఏమని చెప్పిఉంటాడు. రాధ మరణించింది. నో అహ అలా చెప్పడు మరణమంటే గుట్టుగా నలుగురికి తెలియకుండా ఎలా జరుగుతుంది. అలా నమ్మించ లేడు లేచిపోయిందని చెప్తాడు నమ్మినా నమ్మలేకపోయినా ఏం చేయగలరు..... వచ్చి అడిగే దాకా ఎందుకు? ఈ సరికి ఉత్తరం వ్రాసే ఉంటాడలా.....రామకృష్ణ నన్నెలా అపార్ధం చేసుకుంటాడో.....రామకృష్ణ నాకేమైనా ఉత్తరాలు వ్రాసి ఉంటాడు..... భగవాన్ ఎంత దురదృష్ట వంతురాలను? రామకృష్ణ భార్యవనిపించుకున్న క్షణాల్లో నా హృదయమెంత పొంగి పోయింది. ఈ తను నెలా పులకించింది? నా మనస్సెంత తియ్యని ఊహలతో పరవశించింది. రిజిష్టారాఫీసునుంచి తిన్నగా దుర్గగుడి కెళ్ళి భార్యా భర్తలుగా ఆమెకు కుంకుమ పూజచేసి, అతని ప్రక్కన నిల్చుని దుర్గకు నమస్కరించేప్పుడు మమ్మల్నే పరిస్థితుల్లోనూ విడదీయకు అంటూ మనసారామ్రొక్కుకుంది రామకృష్ణ చిరునవ్వుతో తన నుదుట కుంకుమపెట్టే టప్పుడు. తానే స్వర్గ ధామాలకో పయనిస్తూన్నట్లు పరవశించింది. అతని నుదుటన నువ్వుకూడా కుంకుమ ఉంచు అన్నాడు వాసూరావ్ చిన్నగా చెయ్యి కంపిస్తూంటే నెమ్మదిగా రామకృష్ణ నుదుటన బొట్టు పెట్టేటప్పుడు తన వళ్ళు సిగ్గుతో ముడుచుకుపోయింది అమ్మా దుర్గా నన్ను రామకృష్ణ దగ్గరకు చేర్చే భారం నీదే........ఆమె కనులు చెమ్మగిల్లాయ్. బాబయ్యకి జరిగిన సంగతులన్నీ వివాహం సంగతి చెప్పేస్తే..... ఇప్పుడా ఇన్నాళ్ళూ దాచి.....అమ్మ గురించి ఆ వేళ లాడ్జిలో చెప్పేటప్పుడు చెప్పెయ్య వలసింది. ఇప్పుడు రామ కృష్ణతో తన వివాహం సంగతి చెప్తే. తన నెలా అపార్ధం చేసుకుంటారో... కానీ భగవంతుడు నా జీవితం ఎలా మలుపులు తిప్పాలనుకుంటున్నాడో ఏ పాపమూ ఎరుగని నన్ను రామకృష్ణ అపార్ధం చేసుకోకుండా ఏనాటి కైనా అతణ్ణి చేరగలిగితే ధన్యురాలినే, బాబయ్య ఇంట్లో ఉండిపోతాను పెళ్ళికి వత్తిడిచేస్తే చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను అని నిశ్చయించుకున్న రాధ దీర్ఘంగా నిట్టూర్చి....ఇంటికెళ్ళిపోతాను బాబయ్యా అని చెప్పి ఇంటికి వచ్చి, రమాకుమార్ ను ఎత్తుకు ముద్దాడుతూ కూర్చుంది.

                                     *    *    *

    
    'ఇదేమి టండీ ఇలా వ్రాస్తాడు ఉత్తరాలూ, వాడి మనసు బాగుండలేదట ఇప్పట్లో సంబంధాలవీ చూస్తే అస్సలీ రాడట బాగుంది కాదూ." అంది కామేశ్వరి భర్త చేతిలో ఒక కవరు పెడుతూ.
    చదివిన మూర్తి! ప్చ్....వాడి ధోరణేమిటో అర్ధంకావడంలేదు. రానీ వస్తాడుగా వచ్చాక ఏదో సమ్మంధం రైటు చేద్దాం. నువ్వు ఉత్తరాల్లో పెళ్ళిలో గట్టాలేం వ్రాయడు. నీ ఇష్టప్రకారం చేసుకుందువుగాని తొందర్లేదు. పెళ్ళి కని వ్రాయి, నేనూ అలాగే వ్రాస్తాను" అన్నాడు.
    ముప్పయేళ్ళు వస్తున్నాయి వంటికి. ఎప్పుడు చేసుకుంతడు పెళ్ళి. ఈ సరికి నలుగురు పిల్లల తండ్రయే వయసుంది. అదేక్కడి దాన్నో తెచ్చి పెంచుతున్నాడు శ్రీను. దాన్ని వీడి కంట గట్టాలని వాడు చూస్తున్నాడు. వాడికి మామయ్యంటే అభిమానం. కొంపదీసి ఆ పిల్లను వీడు ముద్దెట్టుకుంటానంటే చచ్చామన్నమాట. వాడు వచ్చే లోపున ఏదైనా సమ్మంధం రైటుచెయ్యండి! తాంబూలాలు పుచ్చేసుకుందాం" అంది కామేశ్వరి.
    "మీ తమ్ముడు పెంపుడు కూతురెలా ఉంటుంది?" అదోలా నవ్వుతూ అడిగాడు మూర్తి.
    "అబ్బో అదా! సినీ స్టారులా ఉంటుంది. మా తమ్ముడి మొదటిభార్య అదే రమ ఉండేది గుర్తుందా! కళ్ళు చెదిరిపోయేలా అలానే ఈ పిల్లా మెరపు తీగలా వుంటుంది. ఇప్పటికాలపు పిల్లలకేమిటి? సంప్రదాయం కుటుంబ గౌరవం ఇవేమీ అక్కర్లేదు. అందులోనూ మనవాడు దేశాలు తిరిగి వస్తున్నాడా! ఆ పిల్లను చూసి. కులం గిలం జాన్తానయ్ అంటే ఉరోసుకోవాలి."
    "అబ్బా ఎందుకే అలా బెంబేలెత్తిపోతావ్? ఇంకా వాడు మన గడపలోకి రాలేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరు ఈ ఇంటి కోడలిగా రావాల్సి ఉందో ఆ అమ్మాయి రాక తప్పదు" అన్నాడు మూర్తి నవ్వుతూ.
    "అలాగే వేదాంతం వల్లించండి. ఏ దొరసాన్నో తీసుకొచ్చి ఇదిగో మీ కోడలని చూపిస్తాడు. చురచురా చూసింది భర్తవైపు కామేశ్వరి.
    "ఓసి పిచ్చీ! ఇప్పుడా అనుకుంటున్నావ్! నా కెప్పుడో తెలుసు. ఎన్నిసార్లు పెళ్ళి మాటెత్తినా వాడెందుకు దాటేస్తున్నాడో తెల్సా? వాడెవర్తికో ..... నసిచ్చాడు. వాడు రాగానే నీకు నచ్చిన అమ్మాయిని తీసుకురా పెళ్ళి చేస్తా నంటాను. చూస్తుండు. నీకు కోడలూ సంవత్సరం తిరక్కుండా మనవలూ కామేశ్వరమ్మ గారు....
    'ఛ - ఊరుకోండి చీమ కుట్టినట్లన్న ఉండదు' కసురుకొంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది.
    రెండు సంవత్సరాలకు పూర్వం విదేశం వెళ్ళబోతూ ఇంటికి వచ్చిన రామకృష్ణ గుర్తొచ్చాడు మూర్తికి. ఉత్సాహంగా. సంతోషంగా మాట్లాడేస్తున్న రామకృష్ణతో. మరెప్పుడు పెళ్ళి చేసుకుంటావురా కృష్ణా. మమ్మల్ని వేధించుకు తింటున్నావు సుమా!" అన్నాడు తను నిష్ఠూరంగా 'వస్తూ మీ కోడల్ని వెంటబెట్టుకు వస్తానుగా" అంటూ హాస్యంగా నవ్వుతూన్న రామకృష్ణని మీ అమ్మ నీమాట నిజమనుకొని రాగం లంకించుకొంటుంది. అలాటి మాటలాడకు అంటూ మందలించాడు. తను అబ్బ ఎన్నాళ్ళయి పోయింది? తొందరగా వచ్చేస్తే బాగుండును. కళ్ళు కాయలు కాసి పోతున్నాయి'. అనుకున్న మూర్తి లెటరు పాడ్, పెన్నూ తీసుకున్నాడు.
    
                                                         *    *    *

    "ఇంటి దగ్గర నుంచే మైనా జాబు వచ్చిందా?' ఆత్రుతగా అడిగాడు రామకృష్ణ.
    "ఆ.....ఇంటిదగ్గరనుంచా? అంటే మా అన్నయ్య దగ్గరనుంచా? ఆ గొంతులో కలవరం తడబాటు వాడిపోయిన వదనంతో ఎటో శూన్యం లోకి చూస్తూ ఆలోచిస్తూన్న వాసూరావ్ అన్నాడు.
    "అవును మీ అన్నయ్య దగ్గరనుంచే?"
    ఆ వచ్చింది. విశేషాలు లేవు మామూలే అంతా బాగున్నారు ఏ క్షేమం వ్రాయమని నిన్నడిగేననీ. అన్నాడు గబగబా.
    కొన్ని క్షణాలు వాసూరావ్ వైపు పరిశీలనగా చూసిన రామకృష్ణ ఏమిటో దాస్తున్నావ్? నిజంచెప్పు.... పనేమి అయిపోనులే!" అన్నాడు నవ్వబోతూ.
    నిదానంగా ఆలోచించి ఏదో నిశ్చయానికొచ్చినట్టు దీర్ఘంగా నిట్టూర్చి. "దాచడానికేముంది! ప్రస్తుతం రాధ అన్నయ్య ఇంట్లో లేదు"
    "మరెక్కడి కెళ్ళింది!"

 

                       
    "వదినతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందట. తానూ రాధా ఇద్దరంఉంటే బాడుండదని" ఆమెతో పంపించాడట.
    "నమ్మమంటావా?"
    అబద్దం ఆడాల్సిన అవసరం నాకేముంది?"
    "అయితే ఆ ఉత్తరం నాకు చూపించు. చెయ్యి చాచాడు రామకృష్ణ.
    "చూపిస్తాలే రేపు."
    "ఏం ఇప్పుడెందుకు చూపించలేవూ?"
    "బాగుంది. నా మాటమీద నమ్మకం పోయిందీ ఎక్కడో పడేశాను. చూసి ఇస్తాలే" అంటూ మరొక మాటల్లోకి తమాషాగా దింపాడు వాసూరావ్.
    రాత్రి మంచంమీద వాలాడే కాని అతనికి నిద్ర పట్టలేదు. తాను రాధను పధ్నాలుగేళ్ళ అమ్మాయిగా ఉన్నప్పుడు చదువు కొన్నాళ్ళు చాలించి ఉద్యోగం వెలగబెడుతూన్నప్పుడు వాసూరావ్ తో స్నేహం ఎక్కువయ్యాక వాళ్ళింటికెళ్ళినప్పుడు తొలిసారిగా చూశాడు. తనకన్నా పది సంవత్సరాలు చిన్న ఆ అమ్మాయిపై తన దృష్టి నిలిచిపోయింది. ఆ పిల్ల క్రమంగా అతని హృదయాన్నాకర్షించింది. అతని మనస్సు దోచుకుని పెళ్ళి చేసుకున్న రాధ కథ ఏమిటో మరి! వారెలా ప్రేమికులయారో!

                                                         *    *    *

    "వాసూ!...... ఆ అమ్మాయి మీ చెల్లెలా?" అడిగాడు రామకృష్ణ కాఫీ సిప్ చేస్తూ.
    "ఆ అలాటిదే."
    "అంటే?"
    "మా అమ్మ స్నేహితురాలి కూతురు. తర్వాత చెప్తాలే" అన్నాడు వాసూరావ్ తలవంచి కూర్చున్న రాధవైపు చూస్తూ.
    గ్రహించిన దానిలా చివాలున లేచి వెళ్ళబోయింది రాధ.
    "అరె. వెళ్ళిపోతున్నావేం? కూర్చో నాలాటివాడే నీకు రామకృష్ణ అన్నాడు" వాసూరావ్.
    "అవతల పనుంది బాసూ?".......నిలవకుండా వెళ్ళిపోయింది రాధ.
    "వెళ్తూన్న రాధవైపు అదోలా చూశాడు రామకృష్ణ.
    "అంత ఇదిగా చూస్తున్నావ్......ఎలా వుంది మా రాధ? చిన్నగా నవ్వి కనుబొమ్మ లెగరేశాడు వాసూరావ్.
    "వెరీ నైస్ గర్ల్ ...... మీ అమ్మ ఫ్రెండ్ కూతురా? అంటే?"
    "అదంతా సీక్రెట్.....అమ్మతో చదువుకున్న ఆమె కూతురు ఆమె పోతూ అమ్మకి అప్పగించిందని అంతవరకూ మాకు తెల్సు".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS