Previous Page Next Page 
నీరజ పేజి 19


    లక్ష్మీదేవి మొదట్లో నీరజను ఎంత చీదరించుకున్నా రానురాను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. పగలంతా పనిచేసివచ్చినా, రాత్రి ఒక్క నిముషమయినా విశ్రాంతి తీసుకునేదికాదు నీరజ ... ప్రభు మంచం పక్కనే కూర్చునేది ... డాక్టర్ ఇయ్యమన్న మందులు తనే స్వయంగా ఇచ్చేది ... నీరజ మనిషా, యంత్రమా అని ఆశ్చర్యపడేది లక్ష్మీదేవి.
    నెలరోజులు హాస్పిటల్ లో ఉండేసరికి ప్రభు ఆరోగ్యం చెప్పుకోదగినంత బాగుపడింది.
    "నువ్వు ఉద్యోగం చేస్తున్నావా?" అన్నాడు ప్రభు.
    నీరజ బ్రతిమాలుతున్నట్లు "నీకు పుణ్యం ఉంటుంది-ఇప్పుడేమీ అనకు... ఇప్పుడిప్పుడే అత్తయ్యకు నామీద కోపం పోతోంది. పైగా..."
    ఏదో చెప్పబోయి ఆగిపోయింది నీరజ.
    "పైగా...ఏమిటి?" రెట్టించాడు ప్రభు.
    "మనం నీలకాంత్ అప్పు తీర్చుకోవద్దా!..." తలవంచుకుని అంది నీరజ.
    ప్రభు నవ్వి నీరజ చేతిని ఆదరంగా నొక్కాడు.
    డాక్టర్ నారాయణరావుగారు ఆపరేషన్ చేస్తానన్నారు.
    "ఆపరేషన్ చేస్తే ఇంక ఈ నొప్పి మళ్ళీమళ్ళీ రాకుండా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది-కానీ కనీసం రెండునెలలైనా నా అబ్జర్వేషన్ లో హాస్పిటల్ లోనే ఉండాలి."
    ప్రభు ఆపరేషన్ చేయించుకోవటానికి ఒప్పుకున్నాడు. ప్రభు నచ్చజెప్పగా లక్ష్మీదేవికూడా ధైర్యం తెచ్చుకుంది. దిగాలుగా కూర్చున్న నీరజ చెక్కిలిమీద కొట్టి "ఏమిటా పోజు! నువ్వు పక్కన ఉండగా నాకేం భయం!" అన్నాడు ప్రభు.
    నీరజ నవ్వేసింది.
    డాక్టర్ నారాయణరావుగారు ప్రభుకు ఆపరేషన్ చేశారు. సక్సెస్ అయింది. నీరజ చేస్తున్న సేవను చూసి లక్ష్మీదేవి మనసులో కోపమంతా పోయింది.
    నీలకాంత్ అప్పుడప్పుడు ప్రభును చూడటానికి వస్తూనే వున్నాడు. నీలకాంత్ రాగానే అదొకవిధంగా మారిపోయే నీరజను చూస్తుంటే ప్రభుకు జాలిగానే ఉంది. ఆ రహస్యమేదో తనకు చెప్పకుండా ఎందుకు ఉండాలని కష్టంగానూ వుంది.

                               

    ఆ రోజు ఒక యువతి, యువకుడు వచ్చారు. వాళ్ళతో కలిసి రమణ్ లాల్ తన గదిలోకి వెళ్ళాడు. తనకు ఆలస్యమవుతుందని నీరజ లోలోపల చికాకు పడింది. పది, పదకొండు దాటినా రమణ్ లాల్ క్రిందకు రాలేదు. అసహనంగా ఎదురుచూస్తున్న నీరజకు సన్నని మూలుగు వినిపించింది. ఆ గదిలోకి ఎవ్వరూ రాకూడదని రమణ్ లాల్ ఆర్డర్. ఆ కారణంచేత మూలుగు వినిపించినా వెళ్ళలేకపోయింది నీరజ... మూలుగు మళ్ళీ వినిపించింది... శక్తినంతా కూడదీసుకుని ఎవరో గొంతెత్తి పిలుస్తున్నట్లుగా ఉంది. నీరజ ఉపేక్షించి ఊరుకోలేకపోయింది. సాహసించి పైకి వెళ్ళింది. తలుపులు వేసిఉన్నాయి. కిటికీలోంచి చూసింది. రమణ్ లాల్ కిందపడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ అతనిదగ్గర ఏదో వెతుకుతున్నారు. గౌను లోపలి జేబులోంచి పిస్టల్ తీసి పిచ్చిగా పేల్చింది. అదాటుగా ఉన్న వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు.
    "డర్టీ రోగ్! వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు..." అంటూ యువకుడు యువతి చెయ్యిపట్టుకుని మెరుపులా పారిపోయాడు-నీరజ గదిలోకివచ్చి రమణ్ లాల్ ను చూసింది. స్పృహ లేకుండా పడిఉన్నాడు. బలమైన దెబ్బలు తగిలాయి.
    అతిప్రయత్నం మీద రమణ్ లాల్ ను సరిగ్గా పడుకోబెట్టింది నీరజ. దెబ్బలకు కట్లు కట్టింది. ముఖంమీద చన్నీళ్ళు జల్లింది. ఒక్కసారి కళ్ళు తెరచి నీరసంగా ఏదో గొణిగి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు రమణ్ లాల్.
    ఏంచెయ్యాలో తోచక అక్కడే అలాగే కూర్చుండిపోయింది నీరజ.
    దాదాపు రెండు గంటల తర్వాత స్పృహ వచ్చింది రమణ్ లాల్ కి. తన ఎదురుగా కూర్చున్న నీరజను ప్రశ్నార్థకంగా చూసాడు.
    "వాళ్ళు వెళ్ళిపోయారు..." అంది నీరజ.
    ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకువచ్చింది రమణ్ లాల్ కి. ఒక్క ఉదుటున లేచికూర్చుని 'స్కౌండ్రల్స్' అన్నాడు పళ్ళు నూరుతూ... తనను తను నిగ్రహించుకుని ఆశ్చర్యంగా నీరజను చూస్తూ "నువ్వు వాళ్ళను వెళ్ళగొట్టగలిగావా?" అన్నాడు.
    "తప్పు చేసేవాళ్ళకు వాళ్ళ మనసే పెద్ద శత్రువు_పైగా వాళ్ళు ఏవైపునుండీ ఏ ఆపదా శంకించకుండా ప్రమత్తులై ఉన్నారు. నేను కిటికీలోనుండి పిస్టల్ పేల్చేసరికి కంగారుపడి పారిపోయారు."
    "పిస్టల్! నీదగ్గర పిస్టల్ ఉందా?"
    "వయసులోఉన్న ఆడపిల్లను. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పిస్టల్ ఎప్పుడూ నాదగ్గర ఉంచుకుంటాను."
    అకస్మాత్తుగా ఏదో గుర్తుకువచ్చినట్లు రమణ్ లాల్ తన జేబు తడుముకున్నాడు. పర్స్ తగిలేసరికి వికసించిన ముఖంతో పైకితీసి ఆత్రంగా నోట్లు లెక్కపెట్టుకున్నాడు. సంతృప్తిగా నిట్టూర్పు విడిచాడు.
    పకపక నవ్వింది నీరజ... సిగ్గుపడినట్లు తలవంచుకున్నాడు రమణ్ లాల్.
    తన పర్స్ లోంచి కొన్ని నోట్లు తీసి "ఇంద!" అన్నాడు.
    "దేనికి?"
    "వెయ్యి రూపాయలు!"
    "ఎంత? అని అడగలేదు. 'దేనికి?' అన్నాను."
    "ప్రతి మనిషికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఏ భావాన్నయినా అతను ఆ భాషతో మాత్రమే వ్యక్తీకరించగలడు. ఇవాళ నన్ను కాపాడినందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోగలిగిన భాష ఇదే!"
    అప్పటికీ నీరజ చెయ్యిజాపలేదు.
    "నా ప్రాణం విలువ నా దృష్టిలో వెయ్యిరూపాయలేనా అని ఆశ్చర్యపడుతున్నావా? అది అంతే? బ్రతికి బయటపడ్డానుగా! డబ్బు తేలిగ్గా వదులుకోలేను. తీసుకో! డబ్బును చులకనగా చూడకు! దానితో చాలా అవసరాలు ఉంటాయి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS