Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 19

 

    శాంతాదేవి పక్కున నవ్వింది.
    శ్రీనివాసరావు పనిలో మునిగిపోయేడు.
    "ఈ మధ్య నేనంటే మీకు కోపంగా వుంది గదండీ?"
    "లేదు. కాని ప్రమాణం చేసి చెప్పను"
    "అంత ఒత్తిడి చేయను లెండి .....ఇవాళ నా పుట్టినరోజు!"
    "అలాగా, చెప్పారు కాదే! మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!"
    "అపుడే దీవిస్తే ఎలా? సాయంత్రం - అఫీసవగానే , మీరు మా యింటికి రావాలి. స్వీట్సు పుచ్చుకోవాలి. ఆపైన ఆశీర్వదించాలి."
    "అలాగే సాయంత్రం అఫీసైన వెంటనే తప్పకుండా వస్తాను , సరేనా?"
    "........"
    "ఇంకా ఏమైనా మాటాడాలా?"
    "మరేం లేదు. విసుక్కోకండి. సర్లెండి పని చేసుకోండి. సాయంత్రం మాత్రం తప్పకుండా రండి."
    'అలాగే"
    "శాంతాదేవి అకస్మాత్తుగా అడిగింది -
    "మా యిల్లు తెలుసాండి మీకు?"
    "తెలీదండి"
    "మరెలా వస్తానన్నారు?"
    "ఎవర్నయినా కనుక్కుని...."
    "ఆ అవస్థమీ అక్కర్లేదు. నేను గుర్తులు చెబుతాను గాని కొంచెం మీ పని ఆపండి. అయ్యో అలా చూస్తారేం ఖర్మ ?.......అవునండీ , మా యిల్లెక్కడో తెలీకుండానే యెలా వస్తానన్నారు? అంటే రాకూడదనేగా......ఇక మాటాడకండి మరి! గుర్తులు చెబుతాను. తిన్నగా వచ్చేయండి. నల్ల చెరువు దగ్గిర రామమందిరం తెలుసుగా .....ఆ అక్కడే ఆ మందిరానికి ఎదురుగా ఉన్న పెంకుటిల్లు సరిగ్గా చెప్పండి. ఎన్ని గంటలకి వస్తారు?"
    "ఏడింటికి"
    "మరిందాక అఫీసైన వెంటనే వస్తానన్నారు!"
    "అలా అన్నానా ? క్షమించండి. నేను సరిగ్గా ఏడింటికె వస్తాను. ఆరు నుంచి ఎడింటి వరకూ ట్యూషనుందిగా ."
    "అయితే మీకోసం ఎదురు చూస్తూంటాను, నిరుత్సాహపరచరుగా?"
    "ప్రమాణం చేసేదా?"
    "వద్దులెండి . ఇంక మీ పని చూసుకోండి. ఆఫీసరు వచ్చే వేళయింది గూడాను."
    శాంతాదేవి అక్కణ్ణింఛి వెళ్ళిపోయిన తరవాత , అతను పైళ్ళల్లో తల దించేసి కూచున్నాడు. అతన్నిప్పుడు యస్టాబ్లిష్ మెంటు సీటుకి మార్చేరు.
    సరిగ్గా పదకొండు గంటలకి ఆఫీసరు వచ్చేడు.
    అయన వచ్చిన దగ్గిరనింఛి హడావుడి ఎక్కువైపోయింది. నిమిషానికో గుమస్తా ఆ గదిలోకి వెళ్ళిరావడం జరుగుతుంది. కొందరు బిక్కమోహాలతోటి మరికొందరు ఉత్సాహంగానూ ఆ గదినుంచి వస్తున్నారు.
    శ్రీనివాసరావు ఇందిరకు ట్యూషన్ చెప్పెడమనే విశేషం. ఆఫీసు జనాభాని ఆకర్షించిన మాటేంత నిజమో, ఈ విశేషాన్ని శ్రీనివారావు స్వలాభం వేపు తిప్పుకునే మనిషి కాదని వాళ్ళంతా అనుకునేది అంత నిజమే.
    అతనికి ఆ ఆఫీసులో ఒక గౌరవమైన స్థానముంది. అతను ఈ రకమైన లౌక్యాలకు దూరంగా వుండే మనిషిని వాళ్ళకు తెలుసు. ఇందిరకు ట్యూషను చెప్పే అవకాశం శ్రీనివాసరావుమినహా మరెవరికైనా లభిస్తే, ఆ మనిషిని కాకులు పొడిచినట్టు పోడిచేవాళ్ళు.
    శ్రీనివాసరావుకి ట్యూషను ఫీజుంటూ ఏమీ ముట్టలేదు. అతను అడగనూ లేదు. విద్యాదానం మహా గోప్పదానమని అతని ఉద్దేశం. సరిగ్గా ఆరింటికి వెళ్ళి పాఠం చెప్పి, మళ్ళీ ఏడింటికి వచ్చేసేవాడు. ఇప్పటికి ఇందిరా వాళ్ళమ్మ పేరే తెలిదతనికి. ఆ యింటి దగ్గిర ఆఫీసరుతో మాటాడిన రోజులు వెళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అదీనూ ఇందిర చదువు గురించిన విషయమే.
    "ఈ పరీక్షలో ఇందిర పాసవుతే చాలు. ఆ చేయి చేసిన పుణ్యాల జాబితాలో ఒక యెంట్రీ దాసుకోవచ్చానే వుద్దేశం మినహా అతనికి మరో ఆశ లేదు. ఆఫీసరన్నట్లు ఇందిర సరదాలు గల పిల్ల. ఆ పిచ్చి సరదాలవల్లనే పరీక్ష పోయింది గాని, తెలివి గల స్టూడెంట్ అని అతను గ్రహించగలిగేడు.
    పన్నెండున్నరకి శ్రీనివాసరావుకి ఆఫీసరు నుండి పిలుపు వచ్చింది. వెళ్ళేడు.
    "నే నివాళ మూడింటికి కెంప్ కి వెడుతున్నాను రావ్ గారూ! చెక్కులేమైనా వుంటే .....అన్నట్టు సింహాద్రి గారిందాకా ఫోన్ చేశారు. పాతిక వేలకి వారిదో బిల్లుంది గదా! దానికి చెక్కు రాయండి."
    "వరసగా రాస్తున్నాను సార్!"
    "వరసేమిటండీ , ముందా చెక్కు రాసి పట్రండి. తరవాతవి తరవాత సంతకం చేస్తాను."
    (అవును సార్! నిజమే సింహాద్రిగారి చెక్కు అర్జెంటే! ఎంచేతనంటే వారిని మీ యింటి దగ్గర నాలుగురోజుల క్రితం చూసేను. కొత్త సోఫా సెట్టు మీ యింటికి పట్టుకు వచ్చి కూలీలతో కూలి డబ్బుల బేరం గురించి పోటాడిన మనిషేగా సింహాద్రి! బాగుంది. తప్పకుండా వారి బిల్లే ముందు పాస్ చేస్తాను. లేకపోతే , సోఫాసేట్టు మళ్ళా వెనక్కి పోవచ్చు. ఇంకేవరివి రాయమంటారు? ఇందిరమ్మకి బర్త్ డే ప్రెజెంట్ గా నెక్లెసిచ్చిన జే.వి. రావ్ అండ్ సన్స్ వారి చెక్కు కూడా అర్జంటేనా? సార్. ఒక పని చెయ్యండి. మన తాలూకు మనుషుల లిస్టు నా ముందుంచేస్తే మీ మాట లేకుండా నే చెక్కులు రాసి పట్టుకు వస్తాన్నేను.")
    "ఇంకా ఏవైనా అర్జంటు చేక్కులున్నాయంటారా."
    "ఉన్నాయండి."
    'అయితే ఓ పని చేయండి. సింహాద్రి గారితో పటు అర్జంటువన్నీ రాసేయండి. నేను మూడింటివరకూ ఉంటాను. సంతకాలు చేసి కెంప్ కి వెడతాను. ఓ.కే.?"
    "అలాగేనండి"
    "మంచిది. వెళ్ళిరండి."
    అతను వచ్చేసింతరవాత ఆంజనేయులు వెళ్ళేడు.
    ఆంజనేయులు వెళ్ళిన అయిదు నిమిషాలకి కాబోలు, ఆఫీసు టాపు లేచిపోయెంతగా అయన గర్జిస్తున్నారు. అంజనేయులేదో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అయన వినిపించుకోవడమే లేదు.
    "నెల్లాళ్ళు సుఖంగా గడిచిందంటే మళ్ళా గాలి మారిందేమిట్రా వెంకటాచలం?" అన్నాడో గుమస్తా మరో గుమస్తాని చూస్తూ.
    "మాయ - వెధవ మూడ్సూ వీడూనూ . ఈ కొడుకు ఎప్పుడు ట్రాన్సఫరవుతాడో గానోరేయ్. ఆంజనేయులు చస్తున్నాడు. అదే నేనవుతేనా? గాలి తీసుందును."
    శ్రీనివాసరావుకి క్షణం సేపు ఏమీ తోచలేదు. శాంతాదేవి వేపు చూసేడు. ఆవిడ చాలా ప్రశాంతంగా పని చేసుకుంటుంది."
    లోన మాటలింకా బయటికి వినిపిస్తూనే ఉన్నాయి.
    "...... మీ మనసెక్కడో పెట్టుకు పనిచేస్తారూ? ఏమిటీ అవకతవక రాతలు? ఎస్టాబ్లిష్మెంట్ సీటంటే మజాకా అనుకున్నారా? హేడ్డాఫీసు గాడిద అడగదేమిటి? మీరిచ్చే రిప్లై ఏమిటి? మధ్య నన్ను యిరికించేట్టున్నారే ఖర్మ?"
    అంజనేయులేదో అని వుంటాడు.
    "అంటే ఏమిటి? మీ జూనియర్ చేసిన తప్పుకి మీరు బాధ్యులు కారన్నమాట!  జూనియర్స్ రాసిందానికి గుడ్డి సంతకాలు చేసేందుకేనా మీరు బాధ్యులు ? ఎవరండీ మీకు ప్రమోషనిచ్చింది? నాన్ సెన్స్ .....ఇంకేమీ మాటాడవద్దు. ప్రమోషనిచ్చింది ? నాన్ నేన్స్ .....ఇంకేమీ మాటాడవద్దు వెళ్ళండి. ఆ ఫైల్ నా మోహన కొట్టండి నేనే రాసుకుంటాను ....మీరిక నన్ను విసిగించకండి . ప్లీజ్ గో...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS