అయినా బుద్దిమంతుడిలా జ్ఞానిలా రవికాంత్ మాటాడిన నాలుగు అక్షరాలూ ఆమె విచారన్నంతా చేత్తో తీసేసినట్టుగా చేశాయి.
దాంతో తృప్తిగా భోజనం ముగించింది.
చీర మార్చుకుని వేనిటీ బాగ్ తీసుకుని ఆఫీసుకి తయారయేసరికి తొమ్మిదిన్నర!
ఆవేళకీ శశికాంత్, విమల కాలేజీలకి వెళ్ళిపోయాడు.
తల్లి మందు తాగేసి వెళ్ళిపడుకుంది.
కడుపునిండా భోజనం పడటంతో పేపరు చదవలేక పోయానన్న బాధని మరచిపోయి వెళ్లి ఆమె ప్రక్క మంచం పై పడుకున్నాడు నారాయణ.
"నాన్నా! ఆఫీసుకి వెళ్ళొస్తాను. వచ్చేప్పుడు పేపరు తెస్తాను. ఇక ఆయన్ని అడక్కండి!" అంది.
"అదో ఖర్చా!" అంది సుందరమ్మ.
"లేదు లేదమ్మా! రోజూ మా ఆఫీసుకి రకరకాల పేపర్లు వస్తాయి! పేపరు రాత్రికి తెచ్చి రేపు ఇచ్చేస్తే సరిపోతుంది ఇన్నేళ్ళుగా నాకు ఆ ఆలోచనే రాలేదు."
నారాయణ కళ్ళు మిలమిల మెరిశాయి.
అది చూసిన నంద నిట్టూర్చింది.
అక్కడినుంచి హాల్లోకి వచ్చేసరికి రవికాంత్ తన బెడ్డింగ్ వేసుకుంటున్నాడు.
"పడుకుంటావా? బయటికి వెళ్ళేట్టయితే అమ్మతో చెప్పి వెళ్ళు తలుపు వేసుకోమను!"
తలూపేడు అతను!
ఏదో చెప్పలేని ఆనందంతో బయటకు అడుగుపెట్టింది నంద. కొన్ని కొన్ని విషయాలు మనస్సుని పాడు చేస్తాయి. మరోసారి ఒక్కో విషయం మనస్సునిండా ఆనందాన్ని నింపుతాయి. ఆ కష్టానికీ, యీ సుఖానికీ, ఆ బాధకీ, యీ సంతోషానికీ కూడా కారణాలు చాలా స్వల్పంగానే వుంటాయి. అంతటి సముద్రం ఉప్పొంగి పోవటానికి ఇంత చిన్న చంద్ర కుబుసం ఉదయించటమే కారణమవుతుంది! ఆ సముద్రంలోనే ఇక్కడో ఓ పోటు పొడిస్తే అంతటి సముద్రమూ అల్లకల్లోల మవుతుంది! కారణాలు స్వల్పమే అయినా ఫలితాలు మాత్రం అసల్పంగానే వుంటాయి!
11
సరిగ్గా తొమ్మిదీ నలభై అయిదుకి బస్టాపులో ఆమె అడుగు పెడుతూ వుండగానే తన ఆఫీసు రూట్ లో వెళ్ళే సిటీబస్ వెళ్ళిపోయింది. పిల్లాడికి చేతికందే తాయిలం ఎగిరిపోయి నట్టనిపించింది.
ఉస్సురని నిట్టూర్చింది నంద.
మరో పావుగంట దాకా బస్ లేదు. మార్గాంతరము లేదు. సకాలంలో ఆఫీసుకి చేరలేదు. ఈ రోజు ఆఫీసు లేటే అనుకుంది.
రిక్షాలో వెళ్ళాలంటే రెండు రూపాయలు అడుగుతాడు. రెండు రూపాయలు ఓవర్ డ్రాఫ్టే! ఎవరైనా తోడు ఎక్కితే ఒక రూపాయితో వెళ్ళొచ్చు! అయినా ఖర్చే! రోజుల్లో రూపాయి ఖర్చంటే మాటలా?
దానికంటే మేనేజర్ తో నాలుగు చివాట్లు సున్నితంగా తినటం చౌక! రూపాయెక్కడ? చివాట్లెక్కడ!
ఒక రూపాయి అంటే మాటలా! ఆ రూపాయి యింకోలా ఖర్చు చేసుకోవచ్చు! దాంతో రెండు రోజులకి కూరగాయలకి వస్తుంది అనుకుంది! నలుగురూ తృప్తిగా తినచ్చు.
"హలో!" మధురమైన పిలుపు.
చప్పున తల తిప్పి చూసింది నంద.
మోటార్ బైక్ నిశ్శబ్దంగా వచ్చి ఆగింది ఆమె పక్క.
ఆపింది వన్ టవున్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అనీల్! ఆమె క్లాస్ మేట్! బెస్టు ఫ్రెండ్!
డిగ్రీ చేతికిరాగానే కాంపిటేషన్ ఎగ్జామ్ రాసి సెలక్టయ్యి ఇక్కడికి వచ్చాడు.
అతన్ని చూడగానే ఆమె ముఖం విప్పారింది. ఉస్సురుమన్న ప్రాణం లేచొచ్చింది. "అనీల్ జస్టు కొంచెం లిఫ్ట్ ఇస్తావా? బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది అని అందామె.
"ఊ బావుంది! నాకిప్పుడే డ్యూటీ వచ్చింది"
"ఇంతకంటే డ్యూటీ ఏముంది నాకు హెల్ప్ చెయ్యటం కంటే అంది.
"ప్రభుత్వం జీతం ఇచ్చేది ఆడవాళ్ళని ఎక్కించుకుని తిరగటానికా అన్నాడు.
"కాదా? ఆపదలో వున్న వారిని, ఆడవాళ్ళని కాపాడటం కాదా మీ డ్యూటీ!" చిలిపిగా ప్రశ్నించింది.
"ఆల్ రైట్! ఎక్కి కూర్చో!"
అటు, ఇటు చూసింది ఎవరూ తెలిసిన ముఖాలు కన్పించలేదు. 'హమ్మయ్య' అనుకుంది.
ఉత్సాహంతో బాక్ సీట్ మీద కూర్చుంది.
"గట్టిగా పట్టుకో!"
అతని భుజాలపై చెయ్యి వేసింది.
"నడుం పట్టుకో!"
"ఛీ! పో-"
"అయితే నీ యిష్టం యాక్సిడెంటయితే నా బాధ్యత లేదు!"
"అనిల్" మృదుస్వరంతో పిలిచింది.
ఆమెకు అతన్ని ముట్టుకోగానే వళ్ళంతా పులకరించి పోయింది.
మెల్లిగా స్లో చేశాడు సైకిల్ ని "ఏమిటి?"
"రోజూ నన్నిలా సైకిల్ పై డ్రాప్ చేస్తూ వుండరాదూ పాతిక రూపాయలు ఆదా అవుతుంది."
"నందా నా మాట వింటావా?"
"వింటూనే వున్నాగా!"
"అదికాదు ఆచరణలో పెడతావా? నువ్వు పెట్టిన కండిషన్ కాస్త సడలించు" కొద్దిగా ఆగి మళ్ళీ అన్నాడు.
"అంటే ఏం లేదు. మనం రిజిస్టర్ మేరేజ్ చేసుకుందాం. మా అమ్మా, నాన్నా వత్తిడి ఎక్కువైంది. నాన్న డబ్బాశ! అమ్మకి నాకు నీపై ఆశ! పెళ్ళి చేసుకుంటే ఇన్ని బాధలు వుండవు చెప్పానుగా! నీ జీతం వాళ్ళకి ఇచ్చెయ్ విమల, శశి ఉద్యోగస్తులు అయ్యేదాకా అలాగే ఇవ్వు! వాళ్ళ అవసరాలు తీరాక నీ పేర వేసుకుందువు."
నంద సమాధానం యివ్వలేదు.
"మాటాడవేం?"
"ఎప్పటి మాటేగా?" అనిల్! నువ్వు నన్ను అనుమానించకు! కాలేజీలో మనకెప్పుడు స్నేహం అయిందో అప్పుడే నేను మానసికంగా నీ భార్యని అయ్యాను. మానాన్న ఉద్యోగం పోవటం ఒక్కటే కారణం కాదు. మా అన్నయ్యకి మతి పోవటమే కాదు. మా అమ్మ అనారోగ్యం ముఖ్య కారణం వాళ్ళకి డబ్బివ్వచ్చు. కానీ మా అమ్మా, నాన్నా, అన్నయ్య చంటిపిల్లల లాంటివాళ్ళు. వాళ్ళకి సేవ ముఖ్యం. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే వాళ్ళ సేవ చేయనా? నీ కనుకూలంగా వుండనా?" ఆమె కంఠంలో బాధ్యత బరువుగా పలికింది.
