Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 2

 

    ఏ కాలేజిలోనైనా అక్కడ ప్రదర్శించే నాటకం స్థాయి సర్వసాధారమైనదని చెప్పవచ్చు. అలాటి స్థాయిని మించిపోయి నాటకాలు ప్రదర్శించే బృందం పేరు రావ్ అండ్ హిజ్ ఫ్రెండ్సు. వాళ్ళందరూ నటనలో సిద్దహస్తులని పెద్ద పేరు. స్థానికంగా స్థిరపడిన కొన్ని పెద్ద నాటక సమాజాల జాబితాలో వీళ్ళూ ఉన్నారు.
    రెండో రంగం ప్రారంభంలోనే రావ్ ధరించిన ఆఫీసరు పాత్రకి రంగులు పులుముకున్నాడు. అతనా వేదిక మీద మూర్తిభవించిన హోదాతో వెలిగిపోతూ, తన దగ్గిర పని చేస్తున్న గుమాస్తాల ప్రాణం తినే అధికారిగా చాలా బాగా నటించసాగెడు.
    "అవునయ్యా వరదరాజులు! ప్రేమ కోసం సెలవు పెట్టి అది మంజూరు కానంతమాత్రాన జీవితాన్నే తిట్టుకునే పూల్ నేమనాలి?"
    "అన్నారుగా సార్! పూలని.
    "అంజనీలు సెలవు పెట్టేడు. రీజన్ అడిగేను. ప్రేమ అన్నాడు. ఇటీజ్ సిల్లీ!"
    "అతనో ప్రేమికుడు సార్!"
    "ప్రేమ.....ప్రేమికుడు . ఫెంటాస్టిక్ ! మనిషి బతికి చచ్చేది ఈ ప్రేమ ఒక్కదానికోసమేనా? ఈ ఒక్క ప్రేమ కోసమే మనిషి పుట్టాడా? ప్రేమనే పదార్ధం మినహాయించి వీళ్ళక్కావలసిందింకేమీ లేదా? నే నొప్పుకొని మిస్టర్! ఇటీజ్ నాన్ సెన్స్. ప్రేమ కోసం ఏడ్చి చచ్చేవాళ్ళనీ , బతికి ప్రేమా ప్రేమా అని కలవరించే వాళ్ళని సహించలేను."
    "కాని సార్! ప్రేమ పవిత్రమైనది. దైవ సమానంగా కొందరెంచుకుంటారు సార్!"
    వరదరాజులు వేషంలో ఉన్న సుబ్బారావు మాటల్ని వినిపించుకులేదు ప్రేక్షకులు. చాలా రోషంగా, చాలా కటువుగా మాట్లాడిన రావ్ మాటలే బాగా పనిచేసాయి. అందువల్ల, రావ్ మాటలకి గబగబా చప్పట్లు పడిపోయాయి. ఆ రొదలో సుబ్బారావు వేషాన్ని మెచ్చుకునే అవకాశం దూరమైంది.
    రావ్ సంతోషించెడు. తన వేషానికంత బరువు గల మాటల్ని ఎంచి రాసిన రచయిత మిత్రుణ్ణి లోలోపల అభినందించేడు. 'అవును మరి, బత్తిగా ప్రేమేమిటసలు' అని కూడా అనుకున్నాడు.
    నాటకం సాగిపోతుంది జోరుగా. అంజీనీలు పాత్రలో ముకుందం వచ్చేడు. అతను తన ఉద్యోగానికి రాజీనామా యిచ్చేందుకు వచ్చెనని చెప్పినప్పుడు ఆఫీసరు మండిపోయే సన్నివేశం రక్తికట్టింది.
    "సార్....నేనీ ఉద్యోగం చేయలేను."
    "ఎందుచేత"
    "ఇక్కడ బండ చాకిరికి మనిషి బానిసై పోవడం తెలిసింది నాకు. మనిషి ఆఫీసరే నాలుగ్గోడల మధ్య బందీగా మారిపోయే ప్రమాదాన్ని నేనూహించేను. ఈ నరకంలో మనిషి విలువలు కొన్ని కూలిపోతున్న వైనాన్ని నేను తెలుసుకున్న మీదట బెంగ పడిపోతున్నాను. సుఖం లేని చాకిరీకి అంకితమవడం నాకిష్టం లేదు. ఇరవై నాలుగ్గంటలూ సీటునే ధ్యానిస్తూ కలల్నీ ఆశల్నీ చంపుకోవడం నేను భరించను. అందుచేత, నేను రాజీనామా యిస్తున్నాను."
    ఆఫీసరు వేషంలో ఉన్న రావ్ పకపకా నవ్వేసి, అంజనీల్ని క్ర్రూరంగా చూచి అన్నాడు.
    "వెల్ సేడ్ మై డియర్ బోయ్! బయటకు పోయి ఏవిధంగా బతకాలనుకున్నావ్. ప్రేమ తిని బతుకుతావా? నిన్ను ప్రేమించిన మనిషి నీ హోదా అడిగితే నిరుద్యోగిననే చెబుతావా?"
    "నాకు రెక్కలున్నాయి సార్. నన్ను నేను పోషించుకోవడం తెలుసు. నన్ను నమ్మిన మనుషుల్ని ఉద్దరించడమూ తెలుసు. ఇక్కడ మాత్రం నా రెక్కల్ని కట్టింది మీరు."
    "లెస్ టాక్ ....యూ...."
    "మాట మిగలకండి. మనకి కొన్ని హద్దులున్నాయి."
    ఇంత రసవత్తరంగా నడిచిన సన్నివేశం సుబ్బారావు దగ్గిరికి వచ్చి, అతను పోర్షను మరిచిపోవడం మూలంగా కొంచెం పట్టుదప్పినా మ రావ్ దాన్ని చాతుర్యంతో నిలబెట్టగలిగేడు.
    దానితో రావ్ మీద ప్రేక్షకులకూ, న్యాయ నిర్నేతలకూ గౌరవం పెరిగిన మాట వాస్తవం. సస్టేజి మీదకు వచ్చి రావ్ ని అభినందించి , మరునాడు తమ ఇంటికి రావలసిందిగా ఆహ్వానించేడు.
    

                                                      *    *    *

    (ఈ కధలోని కధనాయకుడినట్ల రచయితకి జాలి గలదు. ముఖ్య కధకి పరిచయ వాక్యాలుగా పై సన్నివేశం అవసరమవునా కాదా అనేది రచయిత చెప్పదలుచుకోలేదు. కధా ప్రారంభం సందడిగా ఉంచి సంతోషించాలానే తాపత్రయానికి రచయిత లొంగిపోయేడు - రచయిత)
    

                                                             2

    సగటు మనిషి బతుకులో కొంతకాలం కలగా జరిగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ అతని జీవితం తాలుకూ అసలు జీవితం ప్రారంభం.
    "ఎక్కడ సార్."
    "అదిగదిగో .....ఈ నేల మీద కనిపించే మాసిపోయిన బంగాళాలాంటి ఇంట్లో, కావిడి పెట్టెలూ, పాత టైప్ మిషన్లూ , పక్క వాళ్ళూ , పంకాలూ ఉన్న ఆ మధ్య హల్లో చివరి బల్ల ముందు తలవంచుకుని రాసుకుంటున్న మనిషేవరు? ఆ బంగాళా ఎవరిది"
    "భలేవారు సార్! వెధవ విట్టూ మీరూనూ! నవ్వించేయకండి . నాకు ఒళ్ళు మంట. అతను గుమాస్తా సార్! అది గుమాస్తాలాఫీసు."
    "ఒకసారతన్ని పిలు"
    "ఎందుకేమిటి"
    "ముందు పిలవ్వోయ్"
    "సార్, బీవన్ గారూ, మిమ్మల్ని పిలుస్తున్నారు సార్!"
    "ఎవరు?"
    "తెలీదండి"
    "ఎవరండి .....ఓహో తమరా? నమస్కారం. ఇటోచ్చారే . వేళాకోళంగా వుందా. వెళ్ళేళ్ళు . అసీసరోచ్చే వేళయింది. చెక్కు రాసుకేళ్ళాలి. పని పాడుచేయకు పో."
    "వెధవ పని నువ్వూను. అస్తమానం వుండేదేగా . రెండు నిమిషాలు నాకు తగలెయ్ ముందు. చెప్పు నీ పేరేమిటి."
    "బీ వన్"
    "బీ వన్"
    "యస్, బీవన్"
    "అది నీ సీటు పెరనుకుంటాను!"
    "అవునది నా సీటు పేరే!"
    "నాక్కావలసింది నీ సొంతపేరు."
    "మరచిపోయేను. అయిన అవన్నీ ఎవడికి గుర్తు."
    "మరచిపోయేనా."
    "నీకేమైనా చెవుడా యేమిటి. మరిచిపోయేనని చెప్పడంలే"
    "నువ్వు బి.ఎ. గదూ."
    "అవుతే."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS