ఒక్క క్షణం అవాక్కయి పోయింది సీత. హక్కులూ అధికారాలూ అంటూ వాదించి తను నెగ్గలేదు. కాని తన బాబుకి అన్నీ తన అలవాట్లే రావాలనీ, తన లాగే వాడు సత్యం అలవాట్ల కీ అభిరుచులకీ దూరంగా వుండాలనీ తను ఎంతగానో కోరుకుంది. తల్లిగా తనకి ఆమాత్రం కోరుకునే అధికారం లేదా -- అందర్నీ వదులుకు వచ్చిన తను చివరికి తన కడుపున బిడ్డన యినా తన అభిరుచులకి అనుగుణం గా పెంచుకోలేదా? సత్యం మాంసాహారం తీసుకుంటాడు అన్న స్పృహ తనకు అతని పట్ల గత ప్రేమలో చాలాభాగం హరించి పోయేలా చేసి తన జీవితాన్ని మోడులా తయారు చేస్తోందే, ఇంక ఈ బాబు కూడ అచ్చం తండ్రిలా తయారయితే తను చూసి భరించ గలదా. ఇంక తన మాట సాగనే సాగదా. సత్యం పట్టుదల తనకి తెలియనిది కాదు. అతను పంతం కొద్దీ ఏదైనా ఒకమాట అన్నాడంటే ఇంక అలాగే భీష్మీంచుకు కూర్చుంటాడు. పట్టూ విడుపూ అనే మాటకి అర్ధం కూడా తెలియనట్లు ప్రవర్తిస్తాడు ఒక్కోసారి -- బాబు విషయంలో తను తన మాట చెల్లనివ్వడని మనస్సు కి రూడి అయిపోతున్నా లేని బింకం, గంబీర్యం తెచ్చుకుని అంది. 'బాబు నా కడుపున పుట్టాడు. వాడికి కూరగాయలే ఇష్టం అవుతాయి. బలవంతాన మీ తిళ్ళు అలవాటు చెయ్యకండి.'
ఎంత ఫూల్ వి? అన్నట్లు చూశాడు సత్యం. 'చిన్నతనం నుండి మనం ఎలా పెంచితే పిల్లలు వాటికే అలవాటు పడిపోతారు -- ముందు నుండీ అలవాటు లేక మధ్యలో మాలాంటి వాళ్ళ మద్జు మసలవలసి వస్తేనే నీలా గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటారు-- బాబుకి అలాంటి అవస్థ పట్టకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతున్నాను-- బాబు చక్కగా బలమైన ఆహారం తీసుకుని చాలా ఆరోగ్యంగా పుష్టిగా వుండాలి. ఎంత సేపూ బీరకాయ, పొట్లకాయ కూరలు తింటూ నీలా ఈసురో మంటూ వుండనివ్వ ను'--
సత్యం వెటకారం చూస్తుంటే సీతకి ఉక్రోషం ముంచుకు వచ్చింది. 'మీ తిండి తినే వాళ్ళంతా బలంగా ఆరోగ్యంగా వుంటారనా మీ ఉద్దేశ్యం ? ఆ లెక్కని వాళ్ళకి జబ్బులే వుండకూడదు -- ప్రపంచ జనాభాలో అధిక భాగం మీలా మాంసాహారం తినేవాళ్ళే అయినా ఆస్పత్రులన్నీ ఇలా రోగులతో నిండి పోతున్నాయెం?'-
'వాళ్ళందరి జబ్బులకీ కారణాలు మరేమయినా కావచ్చు కాని, ఆహార లోపం మాత్రం కాదు-- ఒకవేళ అదే కారణం అయితే అలాంటి పుష్టి కరమైన ఆహారం తీసుకో గలిగే శక్తి వాళ్ళకి లేకపోవటం ముఖ్యమైన కారణం కావచ్చు-- అయినా ఆ గొడవంతా ఇప్పుడెందుకు-- ప్రపంచంలో ఎన్ని ఆస్పత్రులు వున్నాయి. ఆ ఆస్పత్రులకి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు-- ఆ వచ్చిన వాళ్ళలో శాకాహారు లేంతమంది , మాంసాహారు లేంతమంది , అసలు వాళ్ల రోగాలకి కారణం ఏమిటి, పుష్టి కరమైన ఆహారం తీసుకోక పోవటమా లేక మరేదైననా అన్న ఈ స్టాటిస్టిక్స్ నాకు అనవసరం....బాబుకి నా భోజనం పెట్టె మాట మాత్రం ఖాయం ....బాబు నా కొడుకు నా ఇంటి పేరుతొ నా కులం పేరుతొ అందరూ వాడిని గుర్తిస్తారు. నీకు ఇష్టం వున్నా, లేకపోయినా ఇది జరిగి తీరుతుంది-- వాడికేవో మీ అలవాట్లు పట్టుబడి పోతున్నా యని నువ్వు బాధపడినా నేను చెయ్య గలిగిందేమీ లేదు.
అతని నిశ్చయం వింటుంటే సీతకి పుట్టెడు దిగులూ దుఃఖము ముంచుకు వచ్చాయి-- ఇంక అతనితో వాదించి లాభం లేదని ఆమెకి అర్ధం అయిపొయింది. 'మరో మార్గం ఏదైనా ఆలోచించాలి.' అనుకుంది.
అందుకని బాబుకి త్వరగా అన్నం పెట్టేయాలని ప్రయత్నిస్తుంటే సత్యం కూడా అవేల్టి కే తయార యి వచ్చి కూర్చునే వాడు-- ఒకవేళ అతను ఇంట్లో లేకుండా చూసి వాడికి హడావిడిగా భోజనం పెట్టేసినా మళ్లీ తన ప్రక్కన కూర్చో పెట్టు కుని, ఏ కూరా అన్నమో రెండు ముద్దలు పెట్టి తన పంతం నెగ్గించు కునే వాడు -- ఇలా బాబు భోజనం విషయమై ఏ పూటా తగూ తప్పేది కాదు, అంత జరిగీ చివరికి సత్యం మాటే నెగ్గేది -- ఇంక ఇది పని కాదని సీత కొన్ని పూటలు తను భోజనం చెయ్యటం మానేసింది.
'ఏం? సత్యాగ్రహం చేస్తున్నావా? ఇలాంటి నిరాహార దీక్షలకి ఈనాడు విలువ లేదు నా దృష్టిలో....' అనేవాడు సత్యం హేళనగా.
ఏం చెయ్యాలో తోచక ఒకోక్కనాడు ఏడుస్తూ కూర్చునేది సీత. 'ఛ-- ప్రేమ ప్రేమంటూ కళ్ళు మూసుకుపోయి ఈ పెళ్లి చేసుకున్నాను-- అయిన వాళ్ళందరి కీ దూరం అయాను-- ప్రేమించిన వాడు ఏవో ఆదర్శాలు, అభిమానాలు వర్ణిస్తూంటే అదంతా నిజమే అని నమ్మాను-- తీరా పెళ్లి అయాక ఆ మొగుడు చేసిన వాగ్దానాలు నిలుపుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు వుండటమే కాకుండా చివరికి నా కడుపున పుట్టిన బిడ్డని కూడా నా అభిరుచులకి దూరం చేస్తున్నాడు...నేను అన్నీ చూస్తూ సహిస్తూ పడి వుండటం కన్న చేయగలిగింది ఏమీ లేదా? తగవులతో పోట్లాటలతో ఈ సంసారం గడిపే కన్నా బాబుని తీసుకుని నేను వేరే వెళ్లి పోతేనో? అందుకు వారు అంగీకరిస్తారా, నువ్వు పొతే పో, బాబుని మాత్రం ఇవ్వను అంటే నేనేం చేస్తాను.......ఇవన్నీ నేను ఆనాడు ఎందుకు ఆలోచించలేదు? వ్యామోహం అనే ఒక మత్తు నన్ను ఆవరించుకుని ఏ విషయాన్ని ఆలోచించ గలిగే శక్తీ నాకు లేకుండా చెయ్యటమే కాకుండా ఎవరైనా చెప్పినా వినే స్థితిలో అర్ధం చేసుకునే పరిస్థితి లో లేకుండా చేసింది-- లేకపోతె ఆనాడు అమ్మ నాన్నగారు అన్ని విధాల అలా చెప్తుంటే నేను పెడచెవిని పెడతానా, ఇదంతా నేను చేసుకున్నదే' అని వో విధమైన విరక్తి తోనూ, అశాంతి తోనూ రోజులు గడపటం మొదలు పెట్టింది.
అలా మరో సంవత్సరం గడిచింది -- వో ఉదయం సత్యం నిద్ర లేవగానే చెప్పింది సీత. 'బాబు రాత్రంతా సరిగా నిద్ర పోలేదు. ఇప్పుడు చూస్తె ఒళ్ళు వెచ్చగా వున్నట్లుంది.' అని.
సత్యం కూడా బాబు ఒంటి మీద చెయ్యి వేసి చూసి 'ఔను. జ్వరం వున్నట్లే వుంది.' అని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్లాడు.
నాలుగు రోజులు గడిచి పోయాయి. ఈ నాలుగు రోజులూ సత్యం రోజూ శ్రద్దగా డాక్టరు దగ్గరి కి వెళ్లి మందు తీసుకొస్తూ వుండేవాడు. డాక్టరు కూడా పిల్లవాడిని జాగ్రత్తగా పరీక్షించి మందులు ఇస్తుండే వాడు. అయితేనేం కాస్త కూడ గుణం కనిపించలేదు-
బాబు కళ్ళు తెరవటానికి కూడా ఒపిక లేనివాడిలా కళ్ళు మూసుకుని మూలుగుతూ మంచం మీద పడుకుని వుంటే భార్యాభర్తలు అదివరలో తమ మధ్య రేగిన కలతలని కూడా మరిచిపోయి ఆదుర్దాగా ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ బాబు మంచం ప్రక్కనే కాలం గడిపేవారు-- ఎన్ని చేస్తేనేం అయిదో నాడు బాబు అందరినీ విడిచి వెళ్ళిపోయాడు.........
బాబు పోయాడనే టెలిగ్రాం అందుకుని సత్యం తల్లీ తండ్రీ వచ్చారు-- కొడుకూ కోడలు తో పాటు కాస్సేపు ఏడ్చి, మరి కాస్సేపు వాళ్ళని వోదార్చి ఇంటి పనులలో జోరబదిపోయింది సత్యం తల్లి---
వాళ్లతో ఏవో ఖబుర్లు చెప్తూ వాళ్ళ బలవంతం మీద భోజనం చేస్తూ సత్యం తన దుఃఖాన్ని కాస్త మరిచి పోగలిగాడు -- కాని సీత మాత్రం మళ్లీ మామూలు మనిషి కాలేకపోయింది. కడుపు శోకంతో పాటు ఆ ఇంట్లో ఏ వస్తువుని చూసినా ఏ మనిషిని చూసినా ఏమిటో విరక్తి వంటి భావంతో ఆమెలో అణు వణువూ ఎదురు తిరిగింది -- ' తను ఏం చూసి ఈ పెళ్లి చేసుకుంది ?-- చివరికి దాని వల్ల ఏం సుఖం అనుభవించింది ?-- నిండు హృదయంతో ఆ వ్యక్తిని ఆరాధించి అభిమానించి, సంతోషంగా సంసారం చేసినది పెళ్లి అయిన కొత్తలో కొద్ది రోజులు మాత్రమె -- ఆ తరువాత భర్తలో మార్పు వచ్చింది అని గ్రహించినా అప్పటికే తను తల్లి కాబోతున్నానని తెలుసు కనక పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం ఆ అయిష్టాన్ని ఎలాగో సహించింది -- ఆ తరువాత తన బాబు కూడా తన కోరికలకీ అభిరుచులకీ వ్యతిరేకంగా పెరుగుతున్నాడని బాధ కలిగినా వాడిని వదలలేక వాడి మీద మమకారాన్ని చంపుకోలేక ఈ సంసారంలో ఎంతో అశాంతి నీ అసంతృప్తి ని భరిస్తూ వచ్చింది -- ఇవాళ బాబు ఆ బంధాన్ని తెంచుకుని భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయాడు -- ఆ భర్తకి తన తోడిదే లోకం కాదు -- తన కోసం తన ప్రేమ కోసం ఈ అమాయకురాలు ఎన్నింటి నొ పోగొట్టుకుంది అనే ధ్యాస లేదు-- అతనికి తన వాళ్ళంతా వున్నారు. తను కోరిన రీతిగా జీవిస్తున్నాడు. ఇంక ఇలాంటి సంసారంలో తను ఎందుకోసం పడి వుండాలి? ఉహు-- అది తన వల్ల కాదు. తను కోరుకున్నది ఇలాంటి జీవితం కాదు-- ఒక మనిషి అలవాట్లని అసహ్యించు కుంటూ ఆ మనిషితో అనుబంధాన్ని పెంచుకోతం తన వశం కాదు......వెళ్లిపోవాలి--- ఈ మనుష్యులకి దూరంగా వెళ్లిపోవాలి-- ఈ ఇంట్లో , ఈ వ్యక్తితో నేను సంసారం చెయ్యలేను....అని అనేక సార్లు మధనపడి చివరికి వో నిశ్చయానికి వచ్చి అప్పటికప్పుడే వుమేన్సు హాస్టలు కి వెళ్లి గది మాట్లాడుకు వచ్చింది. అందరికీ చెప్పి సామాను తీసుకు వెళ్లి పోయింది-- సత్యం కూడా బలవంత పెట్టలేదు.
ఇది జరిగి నాలుగు సంవత్సరాల పైన అయింది. సత్యం వాళ్ళ మామయ్యా కూతుర్ని పెళ్లి చేసుకుని సుఖంగా వున్నాడు. సీత ఉద్యోగం చేసుకుంటూ ఆ హాస్టల్లో అలాగే ఒంటరి జీవితం గడుపుతోంది.
జరిగిందంతా తెలుసుకుని కూతురి పట్ల జాలితో పాత కోపం మరిచిపోయి సీత తల్లీతండ్రీ బంధువులు ఎప్పుడైనా వెళ్లి ఆమెని పలకరించినా సీత మాత్రం ఎంతో ముభావంగానే వుంటుంది తప్ప ఎవరితోనూ సంతోషంగా కలిసి మెలిసి వుండదు. 'జీవితంలో నేను వొడి పోయాను....అందరూ కధలా వింతగా చెప్పుకునే అంశం అయిపొయింది నా జీవితం.' అనుకుంటూ ఏదో అశాంతి గా రోజులు గడిపెస్తోందే తప్ప అడివరకటి మనిషి కాలేక పోతోంది ఇప్పటి దాకా.
'ఇదీ కధ -- వర్ణాంతర వివాహాలని నేను నిరసిస్తున్నానని , ఏవేవో చెప్పి నువ్వు నిర్ణయం మార్చుకునేలా చెయ్యాలని నేనను కుంటున్నా ననీ నువ్వు అనుకోకు. అలాంటి పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా వున్నవాళ్ళూ వున్నారు-- నాలుగు రోజుల్లో ఆ వ్యామోహపు మత్తు వదిలిపోయి ప్రేమనీ, సంసారాన్నీ మున్నాళ్ళ ముచ్చటగా చేసుకుని ఆ తరువాత ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా అయిపోయిన వాళ్ళూ వున్నారు అది వారి వారికి ఎదురయిన పరిస్థితులని బట్టి , ఆయా సమయాలలో వారు ప్రవర్తించే తీరుని బట్టీ వుంటుంది .....నాకు తెలిసింది చెప్పానంతే' అన్నాడు వాసు.
'స్నేహితుడిగా ఈమాత్రం చెప్పగలిగే హక్కు నీకు వుంది -- దానికి నేనేమీ అనుకోను....ఇంక కళ్యాణి చరిత్ర అంతా విని నేను ఒక నిర్ణయానికి వచ్చాను-- మాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయినా తట్టుకుని నిలబదతాము-- నన్ను మరి వెనక్కి లాగటానికి ప్రయత్నించకు ...చేతనయితే, ఇష్టం వుంటే ఏమైనా సహాయం చెయ్యి.' అన్నాడు మురళీ.
'వో తప్పకుండా -- మీ పెళ్ళికి నేనే పెద్దని. సరేనా' అన్నాడు వాసు ఆప్యాయంగా మురళీ చెయ్యి అందుకుంటూ.
'వో-- థాంక్స్ ' అన్నాడు మురళీ.
'నాకు చాలా సంతోషంగా వుంది-- నా స్నేహితుడు ఒక మంచి పని చేస్తున్నాడని గర్వంగా వుంది' తన చేతిలోవున్న మురళీ చేతిని అభిమానంగా నొక్కుతూ అన్నాడు వాసు. అంతలోనే ఏదో స్పురించింది 'పోనీ , ఇలా పెళ్లి చేసుకుంటున్నట్లు మీ వాళ్ళకి వుత్తరం వ్రాస్తేనో' అన్నాడు సాలోచనగా సంశయంగా మురళీ కళ్ళల్లోకి చూస్తూ.
'ఉహూ వద్దు నాకిష్టం లేదు పెళ్లి జరిగిపోయాక వ్రాస్తాను' వెళ్ళటానికి ఉద్యోక్టుడవుతో లేచి నిలబడ్డాడు మురళీ.
'సరే-- విష్ యూ గుడ్ లక్' అంటూ స్నేహితుడిని సాగనంపాడు వాసు.
