తమ కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఎరిగిన పార్వతి , ఈనాటికి లా కడుపు చేత్తో పట్టుకుని ఉద్యోగం కోసం వెతుక్కోవలసి వచ్చినందుకు పద్మజ తల్లిదండ్రులిద్దరూ చాలా బాధపడ్డారు.
చిన్నతనంలోనే తల్లి పోయింది. అనుకున్న పెళ్ళి జరగనే లేదు. మళ్ళీ మళ్ళీ పెళ్ళి సంబంధాలు చూసే తాహతు లేదు. తండ్రి దిగుళ్ళ తో కృశిస్తూ అంతంత మాత్రంగా తిరుగుతున్నాడు. వెనక ఇంకా ఇద్దరు పుల్లలున్నారు. పార్వతి ఉద్యోగం చెయ్యాలంటే ఏమంత తప్పు లేదనిపించింది కామేశ్వరమ్మ కు కూడా. ఈశ్వర సోమయాజి పార్వతి విషయంలో శ్రద్ధ వహించి స్వయంగా ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లతో మాట్లాడాడు. ఏమంత శ్రమ పడకుండానే మూడో నాటి కల్లా పార్వతి గుమస్తాగా చేరింది ఒక ఆఫీసులో.
పద్మజను రైలెక్కించి కిటికీ దగ్గర నిలబడి కృతజ్ఞతా పూర్వకంగా అంది పార్వతి: "పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాననుకోకు గానీ, నీ ఋణం తీర్చుకోలేను పద్మా! నాకిప్పుడెంతో ధైర్యంగా ఉంది. భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా సునాయాసంగా భరించగలననిపిస్తోంది. ఇక మాకేమీ లోటు లేదు. అంతా బాబాయి గారి దయ."
నవ్వింది పద్మజ. "ఉద్యోగస్తురాలీవి కూడాను, పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నాన్న మరో కూతురు కోసం ఈమాత్రం చెయ్యలేడూ?"
గార్డ్ పచ్చ జెండా ఊపుకుంటూ పార్వతి పక్కగా నడిచి వెళ్ళాడు. ఈల వేస్తూ పెట్టె ఎక్కాడు. రైలు కొండ చిలువ లా కదిలింది. "పారూ, ఉత్తరాలు వ్రాస్తుండు. "కర్చీఫ్ ఊపుతూ గుమ్మంలో నించుంది పద్మజ. చివరి పెట్టె కూడా చూసివేనక్కు మళ్ళింది పార్వతి.
మూడు రోజుల నుంచీ ఆఫీసుకు వెళ్ళి వస్తుంది పార్వతి. తను ఉద్యోగం చేస్తుందనుకొంటే ఏమిటో గర్వంగా ఉంది. పెళ్ళి చేసుకుని తండ్రినీ, పిల్లల్నీ వదిలి పరాయి చోటుకు [పోవాలని సిద్దంగా కూర్చున్న తను, భుజాల మీద పెద్ద బాధ్యతే మోపుకోంది. తన దారి తను చూసుకోకుండా మీకందరికీ నీడగా నేనున్నానంటూ ధైర్యంగా నిలబడింది అంతకన్నా ఏం కావాలి?
ఇంటికి వచ్చి కుంపటి అంటించుకుంటుంటే, సరిగ్గా వారం రోజుల క్రిందటి లాగే, పట్టు చీర కుచ్చేళ్ళ రెపరెప లాడించుకుంటూ పది మంది పేరంటాళ్ళతో బొట్టు పెట్టటానికి వచ్చింది అన్నపూర్ణమ్మ. "కోడల్ని తీసుకు వచ్చాం పార్వతీ!" చూసి తాంబూలం తీసుకు వెల్దువు గాని, ఒక్కసారి రా అమ్మా!" అంది బొట్టు పెడుతూ.
"అలాగే, అత్తయ్యా!" అప్రయత్నంగానే అనేసింది పార్వతి.
"మరిచి పోకు సుమీ!' అంటూ మరోసారి హెచ్చరించి హడావుడిగా వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ.
విస్మయంగా చూస్తూ నించుంది పార్వతి. మనుష్యులెంత చిత్రంగా ప్రవర్తించగలరు! వీధిలో అందర్నీ పిలిస్తే మాత్రం తననూ ఎందుకు పిలవాలి? తను ఎదిరింటి వారమ్మాయి తప్పితే వాళ్ళకేమీ కాదా? ఈ రెండిళ్ళ మధ్య ఏమీ జరగలేదా? జరిగిందేదో పట్టించుకోనంత సామాన్యమైన విషయమేనా అది?
"చూశావా , నాన్నా? అన్నపూర్ణత్తయ్య రెండుసార్లు వచ్చి బొట్టు పెట్టి పిల్చింది రమ్మని" అంది తండ్రితో.
మాస్టారేమీ విస్తుపోలేదు. "వియ్యానికి పనికి రాని మనం కయ్యానికి కూడా పనికి రామమ్మా! వాళ్ళ కసలేమీ జరిగినట్టు లేదు. మన పరిస్థితి ఆలోచించే తీరిక కూయా వాళ్ళకి లేదు. అందరితో పాటు ఎప్పట్లా మనం ఇరుగుపొరుగు వాళ్ళమే. ఇక మనకి మాత్రం ఆ పట్టింపు లెందుకుండాలి? వాళ్ళు ఇంకెంత చేసినా మన పరువు మర్యాదలు పోగొట్టలేరు కదా? వాళ్ళు మనకేమీ కారు. వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాల్సిన ఖర్మేమీ మనకి లేదు. ఓసారి నువ్వూ వెళ్ళి పెళ్ళి కూతుర్ని చూసి వచ్చేయి! మర్యాదగా ఉంటుంది."
"అలాగే నాన్నా! నేనూ అదే అనుకున్నాను."
సుశీలను చూడాలన్న కోరిక పార్వతికి లేక పోలేదు. అయినా ఆ అవకాశం కోసం తనకై తను మాత్రం ప్రయత్నించలేదు.
నాలుగైదు రోజులు గడిచాయి. పెళ్ళి వారింట్లో సందడి దాదాపు తగ్గిపోయింది. ఎక్కడి చుట్టాలక్కడ సర్దుకున్నారు. పెళ్ళి కూతుర్ని తీసుకు వెళ్ళలేదన్న సంగతి రూడిగా తెలుసుకుంటూనే ఉంది పార్వతి.
రుక్కును వెంట బెట్టుకుని ఓ సాయంత్రం పూట ఎదర గేట్లో అడుగు పెట్టింది . గుండె లెందుకో కంగారుగా కొట్టుకుంటుంటే పైట కొంగు తీసి భుజం నిండా కప్పుకోంది.
నెమ్మదిగా చీడీ లెక్కుతుంటే హాల్లోనే కనిపించింది అన్నపూర్ణమ్మ. "రా, అమ్మాయ్! రా, పార్వతీ! పద .సుశీల మేడ మీదుంది. ఫర్వాలేదు లే వెళ్ళు. ఎవరూ లేరులే. తీసి కెళ్ళవే, రుక్మిణీ, నాకు కొంచెం పనుంది. తర్వాత వస్తాను. కాస్సేపు కూర్చుని మరీ వెళ్ళు" అంటూ, మాటకూ మాటకూ అతక్కుండా పోతక్కుండా మాట్లాడి తను లోపలికి వెళ్లి పోయింది. "మొన్న పిలిస్తే రానే వచ్చావు కాదేం?" అని అడుగుతుందేమో అనుకొంది పార్వతి. పిలవటం పిలిచిందే గానీ తన రాకకోసం అవిడేమీ ఎదురు చూసినట్లు కనిపించలేదు. "ఫర్వాలేదు లే , వెళ్ళు, ఎవరూ లేరులే" అంటుందేమిటి? ఎవరుంటే మాత్రం తనకీ ఇంట్లో కొత్తా? ఒకవేళ రఘూ ఉంటె తను వెళ్ళ కూడదని ఆవిడ ఉద్దేశ్యమా/ గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళి పోవాలనిపించింది పార్వతికి. రుక్మిణి చెయ్యి పట్టుకు లాగుతుంటే ముందుకు నడిచింది.
సుశీల చటుక్కున లేచి నించుంది. ఒక్కసారి పార్వతిని చూసి తల దించుకొంది. "మా అక్కయ్యే నండీ!" అంది రుక్మీణి ఇద్దరికీ పరిచయం చేస్తూ.
"కూర్చోండి." నెమ్మదిగా అంది తివాచీ చూపిస్తూ. రుక్కుకు సుశీల దగ్గర చాలా స్నేహం ఉన్నట్టుంది. కొత్తేమీ లేకుండా మాట్లాడేస్తుంది. పార్వతి మాట్లాడకుండా తివాచీ అంచున కూర్చుని సుశీలను పరకాయింపుగానే చూసింది. గదిలో అడుగు పెడుతూ సుశీలను చూసినప్పుడే చాలా నచ్చింది పార్వతికి. పచ్చగా సన్నగా పొడుగ్గా అతి నాజుగ్గా తమల పాకు ఈనే లాగ ఉంది సుశీల. భోగభాగ్యాలతో పెరిగిన సున్నితత్వం ఆమె శరీర సోయగాలతో లీనమై కనిపిస్తుంది. రిబ్బను లా జరీ అంచున్న లేత గులాబీ రంగు చీర కట్టుకుంది. బొమ్మకు అద్దినట్టుగా చిన్న చిన్న పువ్వులున్న సిల్కు చోళీ వేసుకొంది. ఉంగరాల నుంచి ముద్దులు మూటకట్టె ముత్యాల వడ్డాణం వరకూ దాదాపు అన్నీ నగలూ అలంకరించుకున్నట్టే ఉంది. అన్నీ ఆ శరీరానికి సహజంగా అతికిపోయాయే గానీ ఒక్కటీ అతిగా , వేరుగా కనిపించలేదు.
(3).jpg)
పాలరాతి బొమ్మ లా ఉన్న ఆమె సౌందర్యం లోఏదో మార్దవం, అనుభవం గాని సౌరభం ఆకళింపు చేసుకొంది పార్వతి.
సుశీల సిగ్గుగా తల దించుకుని దగ్గరే కూర్చుంది. ఎన్నో అడగాలని పించింది. ఎంతో మాట్లాడాలని పించింది. రఘూ అదృష్టవంతుడు!
"మీరు ....మీరే కదూ, మావారితో కలిసి చదువుకున్నారట?" అతి మృదువుగా నెమ్మదిగా మాట్లాడింది సుశీల.
కొంచెం కంగారు పడింది పార్వతి. ఎలా మాటలు కలపాలో తెలీని స్థితిలో సుశీల అలా అడగటంతో, "నేను.....ఒక్కదాన్నే కాదుగా? ఈ వీధిలో చాలామంది పిల్లలం కలిసి చదువుకున్నాం. పద్మజ అని మాతో చదువుకున్న స్నేహితురాలు ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మద్రాసు లో డాక్టర్ చదువు చదువుతుంది." అని అవసరమో కాదో ఆలోచించకుండానే అదంతా చెప్పేసింది.
"అవును. మావారు చెప్పినట్టే గుర్తు. మొన్న రుక్మిణి వస్తే కాబోలు మీ గురించి చెప్పారు" అంది నవ్వి సుశీల.
పార్వతి సుశీల కళ్ళలోకి లోతుగా చూడబోయింది. సాధ్యం కాలేదు. రఘు తనను గురించి ఏం చెప్పాడు? ఖరీదు చెల్లించి కొనుక్కోలేక పోయిందని చెప్పాడా? ఎవరెలా ఆరాధించినా సుశీలకే దక్కానని చెప్పాడా? అంతకన్న మరేం చెప్పగలడు?
ఎంతసేపు కూర్చున్నా మాటలేమీ పెరగలేదు. సుశీల ముఖ కవళికలు తను అనుకున్నట్లుగా లేవు. భార్య భర్తల కిద్దరికీ సరిపడక, సుశీల కన్నుల్లో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయనీ, బహుశా జాలిగా నిట్టుర్చుతూ ఉంటుందనీ -- ఏవేవో అనుమానాలతోనే వచ్చింది పార్వతి. సుశీల బాధపడాలని పార్వతి కోరిక కాకపోయినా ఆ బాధ తప్పదనుకొంది ఎందుకో. కాని, అటువంటి అనుభూతులేమీ సుశీల మొహం మీద ముద్ర పడలేదు. సుశీలను చూశాక పార్వతి హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. జన్మ జన్మలకూ సుశీల అటువంటి అశాంతికి గురి కాదనిపించింది.
అంతవరకూ చేతి రుమాలు లో జాగ్రత్తగా చుట్టి పట్టుకున్న వెండి కుంకుం భరిణె కొంచెం సంకోచం గానే సుశీలకు అందిస్తూ, "నా బహుమతి గా తీసుకుంటారా? ఇలాంటివి మీకు ఎన్నయినా ఉంటాయి. కాని , నేను ఇచ్చానన్న గుర్తుతో దీన్ని మీరు వాడుకుంటానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది." అంది.
సుశీల వెంటనే దాన్ని అందుకుంది. ఒక్క క్షణం దీక్షగా చూసింది. "తప్పకుండా వాడుకుంటాను. నాకు చాలా నచ్చింది కూడాను" అంది నవ్వుతూ. పార్వతి "నేనిక వెళ్తాను" అని లేచి నిలబడుతుంటే "అప్పుడప్పుడు వస్తూ ఉండండి అక్కయ్య గారూ!" అంది సుశీల.
సూటిగా చూసింది పార్వతి. సుశీల మొహం లో ఎంతమాత్రం హేళన లేదు. ఆ అమాయకపు కన్నుల్లో కల్మషం లేదు. మనస్పూర్తిగానే అలా పిలిచినట్టు కనిపిన్చింది. ఆ ఒక్క పిలుపు తో తరతరాల బందావ్యాలు పెనవేసుకున్నంత సన్నిహితమై పోయింది సుశీల పార్వతి మనస్సుకు. సుశీల తనకు పరాయిది కానేకాదు. తను పొందగలదనుకున్న రఘూ సహధర్మచారిణీత్వం పొంది వచ్చింది. తను కోరుకున్న రఘూ సాన్నిధ్యం కోరి వచ్చింది. తన ఆశలూ, కలలూ, కాంక్షలూ -- అన్నీ సుశీల అనుభవించగలదు. తన చెల్లెలి కన్న మిన్న అయింది సుశీల పార్వతి అంతరంగానికి. "అలాగే, సుశీలా!" అనేసి గది బయటికి రాబోయింది. మెట్ల దగ్గర రఘూ కంఠస్వరం వినిపించటంతో ఆరాటం అణుచుకుంటూ తిరిగి గదిలోకే అడుగు పెట్టింది.
"ఇప్పుడు రఘు బాబు పైకి వస్తారా?"
"రారనుకుంటాను. స్నానానికి వెళ్తారు."
సుశీల చెప్పినట్టే రఘు బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. అన్నపూర్ణమ్మ నాలుగైదు ప్లేట్ల తో ఏవేవో ఫలహారాలు పళ్ళూ పట్టించుకు వచ్చింది. "అదేమిటి? అప్పుడే వెళ్ళిపోతూన్నావూ?"
"వెళ్తాలత్తయ్యా! నాన్న కింకా భోజనం పెట్టలేదు."
"అలాగే వేల్దువులే. కొంచెం ఫలహారం తీసుకో."
"అబ్బే! ఇప్పుడెం వద్దు."
రుక్మిణి చేతిలో నాలుగైదు అరటి పళ్ళు పెట్టింది. పార్వతికి బొట్టు పెట్టి తాంబూలం అందించింది.
గబగబా మెట్లు దిగి నడుస్తూ గేటు దాటింది పార్వతి. ఆ తర్వాత మళ్ళా సుశీలను గానీ, ఆ యింట్లో మరే వ్యక్తులనీ గాని చూడలేదు పార్వతి.
* * * *
