"ఇవన్నీ అప్పుడు ఆలోచించలేదేం అంటావు. అవన్నీ ఆలోచించే శక్తి ఉండదు. అదో ఆకర్షణ. మనసు పరిగెత్తిపోతూంటే కళ్ళెంవేసి ఆపలేం. నిన్ను విసిగిస్తూన్నట్లున్నాను."
"లేదు, విష్ణూ విసుగనిపించడం లేదు. చెప్పు."
విషాదంగా చూస్తూ, "నీ మాటకు ఆనాడు బీచ్ లో విలువే ఇచ్చి ఉంటే ఇంత జరిగేదికాదు. నీ విగ్రహం చూసి బాగానే కదా ఆశపడ్డాను. నువ్వు నన్ను తిరస్కరించావు. నా శరీరంలో ఆణువణువునా నీమీద పగ. నేను చేసేపనికి నువ్వు ఈర్ష్యతో కుళ్ళిపోవాలనుకొన్నాను. నిన్నా ఈర్ష్యలో మండించాలనుకొన్నాను. కానీ నేనే మాడిపోయాను. ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారంటారు. అక్షరాలా నిజం అయిపోయింది. నీ చెంపమీద నా గుర్తు ఉంచాను.
"అయినా నువ్వు అన్నీ మరిచిపోయావు. ఆ క్షణం నుంచీ ఆదుకొంటూనే వచ్చావు. ఇప్పటికీ నీకు ఎంతో ఋణపడి ఉన్నాను. రేపురాత్రి వెళ్ళిపోతాను. పొద్దున్నే వైజాగ్ వెళ్ళే ఫ్రెండ్ ఒకామె ఉంది. ఆవిడను కలుసుకొని రాత్రి వెళ్ళాలని చెప్పాలి. ఆవిడ ఇల్లు బేగంపేట అవతల ఉంది." బట్టలన్నీ మడతలుపెట్టి పెట్టెలో పెడుతూ అన్నది.
"పాపని బలరాంకి ఇచ్చేస్తే?" రాముకు ఏం చేయాలో పాలుపోక అన్నాడు.
విష్ణు పగలబడి నవ్వింది. ఇంకా ఇంకా నవ్వుతూనే ఉంది. రాము అప్పటికే పొరబాటుకు చింతిస్తున్నాడు.
"నాబాధ ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోలేదన్నయ్యా. ఈ బాధ భరించడం ఎంత కష్టంగా ఉంది దేవుడికి తెలుసు." మౌనంగా వింటున్నాడు రాము.
"అందరిలాగే నలుగురిలో ఫెళ్ళున చేసుకొందాం అనుకొన్నా ఈ పెళ్ళి. కానీ ఆయన..."
ఇంత కష్టంలో కూడా విష్ణుకు బలరాంమీద ఏ కసీలేదన్నట్లు స్పష్టంగా కనిపిస్తూంది.
"కాలేజీనుంచి రాగానే రూం లో పుస్తకలు పడేసి బీచ్ దగ్గరకు పరిగెత్తి వెళ్ళేదాన్ని. ఆ ఇసుకలో ఆయన ముందు అలా గంటల తరబడి కబుర్లు చెప్పడంలో ఏదో తృప్తీ ఆనందం అనిపించేవి. నీమీద సాదిద్దాం అనుకొన్న కబుర్లు గాలిలో కలిసిపోయాయి. నిజంగానే నేను ప్రేమిస్తున్నాను, నాటకం ఆడటం లేదు అని తెలియగానే ఆశ్చర్యం అనిపించింది. ఆయన పూర్తిగా నా వశం అయినట్లు భ్రమించేదాన్ని. గర్వంతో నా మనసు గాలిలో తేలిపోయేది.
"ఆయన్ను చూస్తే ఎవరూ మోసగాడు అనుకోరు. ఆ కళ్ళలో ఆకర్షణ అలాంటిది. ఎన్నోసార్లు అడిగాను. నన్ను మోసం చెయ్యనన్న రకరకాల వాగ్ధానాలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
"క్రమంగా బీచ్ మానేశాం. మొదట్లో భయపడ్డా తిన్నగా ఆయన ఇంటికే వెళ్ళేదాన్ని. ఇలా వెళ్ళడంలో కూడా నా కేమీ తప్పు తోచేదికాదు. ప్రపంచం నన్ను గ,అనించడం లేదనుకొన్నాను. బలరాం చచన రెండు చేతుల్లో ఇమిడిపోతూ భయాన్ని దూరంగా నెట్టివేసేదాన్ని.
"ఒకనాడు అటో ఇటో తేల్చుకోవాలని బయలుదేరాను. నన్ను ఎప్పుడు పెళ్ళిచేసుకొంటారు?" అన్నానుపరిశీలనగా చూస్తూ. చిన్నగా నవ్వారు. మాట్లాడరేం అని తిరిగి ప్రశ్నించాను.
"ఎక్స్ క్యూజ్ మీ, విష్ణు ప్రియా నేను వివాహితున్ని అన్నారు. నేను... నేను కలగంటం లేదుకదా. అదిరిపోయే మనసుని గట్టిగా ఓదారుస్తున్నాను. అంటే నేనెంత మోసపోయాను....
'నీకు చాలసార్లు చెప్పాలనుకొన్నాను, విష్ణుప్రియా! కానీ నాకు అవకాశం ఇవ్వలేదు నువ్వు. నాకు పదహారో ఏటే పెళ్ళి అయింది. ఆవిడ మొహంకూడా ఇప్పుడు గుర్తులేదు. తను ఎక్కువ చదవలేదు. నీలా అంధమైంది కాదు. ఇంతే ఊహించాను. కానీ...
'మొదటిసారి మొన్న వెళ్ళినపుడు మా బావమరదులూ, మామగారూ మొదలైనవాళ్ళంతా ఊరుకో లేదు. పట్టుబట్టి ఇంటికి తీసుకువెళ్ళారు. నా భార్య లక్ష్మి. నిజంగా లక్ష్మిలాగే మెరిసిపోతూంది. నేను మోసం చేశాను. ఇద్దరిలో ఒకరు బలికావాలి. తప్పదు, నీ సంగతి ఎవరికీ తెలియదు. లక్ష్మిని కాదంటే కోర్టు ఒప్పుకోదు. నలుగురిలో నిన్ను భార్య అని చెప్పుకోగల అర్హతలు నీకూ, నాకూ కూడా లేవు' అన్నారు.
'అంటే?'
'కేవలం నిన్ను వ్యభిచారిణిగా నిర్ణయిస్తుంది. నిన్ను ఒకవేళ భార్యగా అంగీకరిస్తే నేను నా మామగారి మంచి లభించిన ఆస్తిపాస్తులు వదులుకోవాలి. ఉద్యోగం లేదు. నిన్ను పోషించలేని స్థితిలో నా జల్సాలను మానుకోవాలి. చాలా ఆలోచించి నిర్ణయానికి వచ్చేశాను.'
'ఏమని?' ఆత్రంగా అడిగాను. అప్పటికే నాలో ఏదో ఆశ!
'ప్లీజ్, నన్ను మరిచిపో ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలి. లక్ష్మిని వదులుకోవడమ నాకు సాధ్యం కాదు.'
"భగవాన్! నే నెంత పొరబడ్డాను! ఎంత మోసపోయాను! మరిచిపోవాలిట. అది నాకు సాధ్యమేనా? తన అత్యాశకి బలై పోయి తన చిహ్నం నాలో పెరుగుతున్న విషయం తనకి తెలియకపోయినా నాకు తెలియదూ? ఏం చేయను? కేసు...ఎవరిమీద ఏమని పెట్టను? తను అన్నట్టు నాకు డబ్బు ప్రధానం కాదు. ఆయన ఆస్తిలో వ్యభిచారిణి సంతతికి దక్కే వెధవ డబ్బు నాకు వద్దు.
"నా మనసు - రాయిలాంటి మనసును కరిగించి కరిగించి చివరకు ఒక అపాత్రుడికి దానంచేసి నా బ్రతుకుని గంగలో కలుపుకొన్నాను. తను సులభంగా మరిచిపోయారు... ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ పాపని ఇవ్వమంటే... గుర్తు వచ్చింది. మరిచిపోయేవాళ్ళకి మనం గుర్తు ఎందుకు చెయ్యాలో అర్ధం కావడంలేదు."
"నిజమే, విష్ణూ. నేను పొరబాటే అన్నాను. నేను ఒకరకంగా ఏదీ త్వరగా నిర్ణయించుకోలేని మనిషిని. నా అవసరాలేమిటో నాకే తెలియవు." రాము మెల్లగా అన్నాడు.
"అవును, నాకు తెలుసు. నువ్వు వట్టి అమాయకుడివి. అరె! కబుర్లలో పడి పాపను చూడనే లేదు. నువ్వు చెప్పలేదేం, అన్నయ్యా? నీ ఒళ్ళోనే నిద్ర పోయింది. బట్టలు తడిపేస్తుందేమో. ఈ బట్ట ఉంచు." విష్ణు బట్ట సరిగాచేసి మెల్లగా ఏదో గుర్తు వచ్చినట్లు అంది:
"మొన్న స్టేషన్ దగ్గర పబ్లిక్ రోడ్ మీద చూడు, ఎంతపని జరిగిందో."
రాము ఆలోచన ఆరోజుమీదకు పోయింది. అన్ని ఆఫీసులూ వదిలే టైములో ఎవర అభాగ్యురాలు, స్టేషన్ పక్క మెడమీద ఉంటున్న మనిషి నడిరోడ్డు మీద హత్యా చేయబడింది. కన్నెగా ఉన్న రోజుల్లో చేసిన అన్యాయానికి ఫలితం అనుభవించింది. ఈ వార్త జంట నగరాల్లో ఎవరికి తెలియనిది?
లైట్లు వెలిగాయి. విష్ణు గదిలో లైటువేసి అన్న గారి మొహంలోకి చూసింది.
"ఏమిటలా చూస్తున్నావ్?" అడిగాడు రాము.
"లైటువేసి దేవుడి మొహం చూడలన్నయ్యా..." మెల్లగా చూపుల్ని తిప్పి పిల్లవైపు ఆపింది.
భుజం మీద చేతులువేసి కదులుతూంది పాప. జారిపోతున్న పాపను సరిగా పడుకోబెట్టుకొని మెల్లగా లేచి నిలబడ్డాడు.
"పాపని ఇలా ఇవ్వన్నయ్యా. నీ కసలు చేతకాదు కూడా."
వెనక్కు తిరిగి నవ్వాడు రాము. "అక్కడికి మీ అందరికీ పుట్టినప్పటినుంచే అలవాటైనట్లు మాట్లాడుతున్నావు."
"అది కాదన్నయ్యా. ఇటువంటివి వదినలు నేర్పాలి."
"వదిన!" నిట్టూర్చాడు రాము. పిల్లను తీసుకొనే ప్రయత్నంలో భుజంమీద చేయివేసి రాము మొహం లోకి చూసింది. నిరాశా, నిస్పృహలమధ్య పాపను ముద్దు పెట్టుకొంటూ, "వస్తా, విష్ణూ" అన్నాడు.
మెట్లు దిగి దూసుకుపోతూంటే తల కిటికీ ఊచలకు కొట్టుకుంటూ హృదయవిదారకంగా ఏడుస్తూంది విష్ణుప్రియ.
విష్ణుప్రియను ఓదార్చాలని మనసు వేధిస్తున్నా వడివడిగా అడుగులు ముందుకువేస్తూ వెనుతిరిగి చూడకుండా మోటార్ సైకిల్ శబ్దంలో విష్ణుప్రియ ఏడుపు శబ్దాన్ని కలిపేశాడు.
