మెట్ల మీదనుంచే కేకపెట్టాడు - "భారతీదేవీ! ఓ భారతీదేవీ!" అంటూ.
వంట ఇంట్లో అన్నం వండుతున్న భారతీదేవీ బావగారి గొంతు విని పరుగున వచ్చింది, చేతులు ఈడుచుకుంటూ.
"పాపని తీసుకోండి, భారతీదేవీ!"
రెండు చేతులతోనూ పాపను అందుకొని హృదయానికి హత్తుకుంది. రాము దూరంగా నిలబడి చూస్తున్నాడు. భారతీదేవి గుండెలమీద చిన్న చిన్న చేతులతో కొడుతూ నవ్వుతూంది పాప వంకరమూతి పెట్టి.
తల్లి కొంగు పట్టుకొని కళ్ళు పైకెత్తి చూస్తున్నాడు బాబు.
"అమ్మా, చెల్లి కదూ?"
భారతీదేవీ కొడుకు మొహంలోకి చూసింది. "చెల్లికాదు, బాబూ. పాప." భారతీదేవి చాలా తెలివైంది. రాము ఊపిరి పీల్చుకొన్నాడు.
వేణుగోపాల్ కొడుకును కౌగిలించుకొని ఏదో ఆశీర్వదించాడు.
* * *
పాపను ఉయ్యాల ఊపడం బాబుకు భలే సరదా. ఏడ్చేపాపను గిలక్కాయతో ఊరుకోబెట్టి పాప నవ్వుతూంటే చప్పట్లు కొడుతూ పెదనాన్న మొహంలోకి చూడడం మహాఇష్టం.
"చూడండి, బాబా! నేను ఆడిస్తేనే పాప ఆడుకొంటుంది." అక్కడికి తనే పెద్ద 'హీరో' అయినట్లు జేబులో చేతులు వేసుకొని ఠీవిగా పచార్లు చేస్తాడు.
పాత స్టెతస్కోపు చెవుల్లో దూర్చుకొని, "బాబా! పాపకు జ్వరం వచ్చింది. మందివ్వండి" అంటాడు. రాము నవ్వుతూంటే తల్లిని బలవంతంగా పిలిచి పాలు పట్టమని మారాం చేస్తాడు. పాప అంటే బాబుకు ప్రాణం.
భారతీదేవీ సంరక్షణలో తెల్లగా, బొద్దుగా పాప ఉయ్యాల సరిపోనంత పెద్దదైపోయింది. కన్నూ ముక్కూ అచ్చుగుద్ధినట్లు విష్ణు పోలికే. నుదురు విశాలంగా, కళ్ళు చక్రాల్లా విష్ణు రబ్బరుబొమ్మలా మొదటిసారి తన ఇంటికి వచ్చినప్పుడు పాపలాగే ఉండేది అంటాడు వేణుగోపాల్.
* * *
కాఫీ తాగుతూంటే ఫోన్ విధి విరామం లేకుండా మోగుతూంది. కుడిచేత్తో కాఫీ కప్పు పట్టుకొని ఎడమ చేత్తో రిసీవర్ అందుకొన్నాడు రాము.
"హలో!"
"............................"
అవతలనుంచి వచ్చిన సమాధానం పూర్తికాలేదు. కాఫీ కప్పు ధన్ మని శబ్దం చేస్తూ క్రిందపడి తునా తునకలైపోయింది.
"అమ్మా! బాబా కాఫీ కప్పు పగలకొట్టారమ్మా!" ఫిర్యాదు చేస్తూ పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయాడు బాబు.
మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి రఁయ్ మని దూసుకుపోసాగాడు రాము.
* * *
"అంతా వెతికాం, సార్! ఎక్కడా కనబడలేదు." ఎవరో అంటున్నారు.
రాము కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. గొంతు వణికిపోతూంది. చేతుల్లో పటుత్వంలేదు. ఆయాసంగా అడిగాడు: "సరిగా చూశారా?"
"ఎస్, సార్! అతనే కాదు. ఇంకా నలుగురు ఇంజనీర్లు కూడా ఉన్నాఉర్. కానీ ఎవరూ కనిపించడం లేదు. కొండవాలుకు వెళ్ళిన లాంచీ కొండకే గుదుకుందో లేక సుడిగుండంలోనే పడిపోయిందో అర్ధం కావడం లేదు."
"శవాలైనా కనిపించవచ్చుగా?"
"లేదు, సార్. లాంచీ తాలూకు చిన్న కర్రముక్క కూడా కనిపించడంలేదు!"
* * *
వేణుగోపాల్ నిలదీసి అడిగాడు: "ఏరా? ఇన్నాళ్ళూ ఊరుకొంటూంటే ఇంకా ఎక్కువైపోయింది. చెప్పు, ఇంత రాత్రివరకూ ఏ బార్ లో ఉన్నావు?"
రాము కళ్ళు ప్రొద్దుటినుంచీ తిరగడంవల్ల ఎర్రబడిపోయాయి. అర్ధం తెలియని ఆవేశంలో నీరసించిపోయి తూలుకూడా వస్తూంది.
వేణుగోపాల్ కొడుకును భుజాలు పట్టుకొని ఆపాడు. తండ్రిని కౌగిలించుకొని బావురుమన్నాడు రాము.
సంగతి తెలియని బారతీదేవీ, వేణుగోపాల్ అయోమయంగా దిక్కులు చూస్తున్నారు. "నాన్నా....నాన్నా!" రాము గొంతులో మాటలు పెగలడంలేదు.
"నాన్నగారూ.......రవి.....తమ్ముడు....."
అదిరిపడ్డాడు వేణుగోపాల్. కళ్ళు చిట్లించి కనుబొమ్మలు ముడిచి కొడుకు భుజాలు కుదిపేస్తూ, "కొంపతీసి ఏమీ కాలేదు కదా!" అన్నాడు.
భారతీదేవి పిచ్చిదానిలా కళ్ళప్పగించి చూస్తూండి పోయింది.
రాము పసివాడిలా ఏడుస్తున్నాడు. "అవును, నాన్నగారూ కొండల్లో ఏక్సిడెంటు అయింది. ఒక లాంచీ పూర్తిగా కనిపించడంలేదు. అందులోనే తమ్ముడు రవి ఉన్నాడు."
వేణుగోపాల్ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. "బాబూ, రవీ! ఎక్కడికి వెళ్ళిపోయావు, నాయనా! నిన్నెవరేమన్నారు, బాబూ! కోరి చేసుకొన్నావు బాబూ......భారతీదేవి..."
రాము మోకాళ్ళమీద తల పెట్టుకొని ఏడుస్తున్నాడు. బాబు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, "బాబా, ఏడవకండి!" అని రాము కళ్ళలోకి బలవంతంగా చేతులతో తలెత్తి మరీ చూస్తూ అరుస్తున్నాడు.
భారతీదేవి కూర్చున్నచోటే గుమ్మానికి తల బాదుకుంటూ ఏడుస్తూంది. రాము మెల్లగా లేచివెళ్ళి భారతీదేవిని దగ్గరకు తీసుకొని, "ఏడవకండి, భారతీదేవీ. మీరు ఏడుస్తూంటే బాబు చూడండి, బిక్కమొహంతో ఎలా చూస్తున్నాడో" అన్నాడు.
"నిన్ను నాశనం చేశాడమ్మా. దీనికి కారణం నేనే. వాడిని ఇంజనీర్ చదివించకపోతే బడిపంతులుగా ఇంట్లోనే ఉండేవాడు." వేణుగోపాల్ దిక్కులు పిక్కటిల్లేటట్లు విలపిస్తున్నాడు.
"నాన్నగారూ, మీరు ఏడవకండి. మీరు ఏడుస్తూంటే భారతీదేవి స్పృహతప్పి పడిపోతోంది." ఇంజక్షనిస్తూ అన్నాడు రాము.
"అవున్రా నేను ఏడవకూడదు. ఏడిచేందుకు నేనెవర్నీ! నాకు కన్నపిల్లలే అయితే ఇలా దగా చేసేవారా? మీ అమ్మ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి ఎలా చిత్ర వధ చేస్తోందో చూడు." అతని పిత్రుహృదయంలో పరితాపం అలాంటిది.
ఒక చేత్తో కన్నీటిని తుడుచుకొంటూ, రెండో చేత్తో భారతీదేవి పడుకొన్నచోట తలగడ తెచ్చి భారతీదేవి తలను జాగ్రత్తగా దానిమీదకు చేర్చాడు.
రాము మెదడంతా దొలిచేస్తూంది. తను ఇందుకే ఇంకా బ్రతికిఉన్నాడు- చెట్టంత తమ్ముడిని సాగర్ కొండలకు అప్పగించి గుండెలు మండే బాధ భరించడానికి. తండ్రి పిచ్చివాడిలా దుఃఖిస్తూంటే చేతకాని వాడిలా పచార్లు చేస్తున్నాడు.
* * *
భారతీదేవీ గదిలోంచి బయటకు రావడంలేదు. రాము ఎన్నోసార్లు గదిముందుకు వెళ్ళి భయంతో వెనక్కు వచ్చేశాడు.
వంట ఇంట్లోకి తనే దారితీసి జీవితంలో మొదటి సారి కాఫీ తయారుచేసి తీసుకువచ్చాడు. పిల్లలిద్దరికీ పాలు పట్టాడు.
తండ్రి కాఫీ తాగలేదు. చేతికివచ్చిన కొడుకును పోగొట్టుకొని కుమిలిపోతున్నాడు.
వీధిలో రిక్షా ఆగింది. ఎత్తుగా బలంగా ఉన్న అతడిని చూసి రాము రెప్పలు టపటప లాడాయి.
అతనుకూడా క్షణం పరిశీలనగా చూశాడు. అతని కళ్ళు ఎర్రబడిపోయాయి. క్రాపు చెదిరిపోయింది. గడ్డం పూర్తిగా మాసిపోయింది. దుమ్ము ధూళీతో నిండిపోయాయి అతని బట్టలు. ఇద్దరి నోట్లో మాటలు కరువైపోయాయి.
అతనే గొంతు పెగుల్చుకొని, "నేను రామకృష్ణ నండి" అన్నాడు.
అదిరిపడ్డాడు రాము. భారతీదేవి అన్న రామకృష్ణ, "రండి లోపలికి." తను ముందు దారితీస్తూ రామకృష్ణకు దారి చూపాడు.
అన్నను కౌగిలించుకొని బావురుమంది భారతీదేవి. రేగిన జుట్టు, చెదిరిన కుంకుమతో భారతీదేవి చూడటానికే అసహ్యకరంగా కళతప్పి రెండు మూడు రాత్రులకే అస్థిపంజరంలా తయారైంది.
"ఏం చేస్తాం, చెల్లీ! ఖర్మ!" రామకృష్ణ శూన్యం లోకి చూడసాగాడు.
* * *
రవి అంతు తెలియక పదిహేను రోజులు దాటి పోయాయి. వేణుగోపాల్ మంచానికి ఆనుకొని ఉండిపోయాడు.
"మామయ్యగారూ, భారతీదేవిని మా ఊరు తీసుకు వెళ్ళడానికి వచ్చాను. పంపుతారా?" గుమ్మం దగ్గర నిలబడి వినయంగా అడిగాడు.
దుఃఖాన్ని దిగమింగుతూ, "నాదెంలేదు, నాయనా. రాముని అడుగు" అన్నాడు వేణుగోపాల్.
సోఫామీద పిల్లల్ని ఇద్దర్నీ దగ్గరకు తీసుకొని ఆడిస్తున్నాడు రాము. రామకృష్ణ హాల్లోకి వచ్చి మెల్లని స్వరంతో అడిగాడు.
"నాకు సెలవు అయిపోయింది, బావగారూ నేను చెల్లాయిని తీసుకు వెళ్ళాలని వచ్చాను. దానికి ఈ ఇల్లు గుర్తుగా మిగిలింది. అంతే. నాతో నా ఇంటికి చెల్లెల్ని పంపుతారా?"
రాము అటువైపు తిరిగాడు. గుమ్మంలో భారతీదేవీ నిలబడే ఉంది. ఒంటినిండా కొంగు కప్పుకొని ముఖాన బొట్టులేకుండా రెండే రెండు బంగారు గాజులతో అలిసిపోయిన కళ్ళతో శుష్కించిన శరీరంతో కట్టె బొమ్మలా నిలబడింది.
రాము కళ్ళముందు రవిని పొరుగూరు పంపే రోజున కనబడిన భారతీదేవి కనిపిస్తూంది. ఆరోజు తలనిండా పూలతో పొడుగుబట్టతో నిండుగా నవ్వుతూ భర్తను సాగనంపిన ఆనాటి భారతీదేవి ఈవేళ మచ్చుకైనా కనబడటంలేదు.
ఏడ్చి ఏడ్చి ఉన్న రాము మనసు మొద్దుబారిపోయింది. బాధలకు అతీతంగా తయారవుతూంది అతని హృదయం.
"ఏరా బాబూ, నువ్వూ, అమ్మా మామయ్యగారి ఊరు వెడతారా?" ఈ ప్రశ్న భారతీదేవికి అందేలాగా వేశాడు.
బాబు ఒళ్ళో కూర్చొని రాము మొహంలోకి చూసి రామకృష్ణవైపు చూశాడు.
మాసిన గడ్డంతో, బరువెక్కిన హృదయంతో తనపాలిట శత్రువులా కనిపిస్తున్నాడు బాబు కళ్ళకు మేనమామ.
"అన్నయ్యా!" గొంతు విని వెనుతిరిగాడు రామకృష్ణ.
"అత్త ఈ ఇల్లు నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆయన ఏమిటో చేయనంటూనే దగా చేశారు. మామ గారు పెద్దవాడు అయారు. ఈ ఇల్లు వదిలి ఎలా రాను! నేను రానని అన్నానని కోపగించుకోకన్నయ్యా. నేను తప్ప ఈ ఇంట్లో ఎవరూ లేరు. నేనుకూడా చూస్తూ చూస్తూ ఎలా అన్యాయం చేయను?"
రామకృష్ణ అర్ధం చేసుకొన్నాడు. తనూ తండ్రీ అనుభవించడం లేదూ? ఆడహ్దిలేని ఇల్లు ఎలా ఉంటుందో తనకు తెలియదూ? భారతీదేవికి దగ్గరగా వచ్చి తలమీద చేయివేసి, బాబునూ, అక్కడే ఉన్న పాపనూ ముద్దు పెట్టుకొని వస్తానని చెప్పి చేతిసంచీతో బయలుదేరాడు రామకృష్ణ.
రామకృష్ణ భుజంమీద చేయివేసి కొంతదూరం వెళ్ళాడు రాము. "మీ చెల్లెల్ని పంపించలేదని బాధ పడకనది. మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చూసి వెడుతూండఅవచ్చు. ఎప్పటికీ మీకోసం మా ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయి."
రామకృష్ణ కళ్ళతోనే కృతజ్ఞత తెలుపుతూ మౌనంగా తల దించుకొన్నాడు.
జేబురుమాలుతో కళ్ళు వత్తుకొని వెనుతిరిగి చూడకుండా చేతిలో చేయివేసి తీసి సాగిపోతున్న రామకృష్ణను అలాగే నిలబడి చూడసాగాడు రాము.
* * *
విష్ణుప్రియ కూతురు రాము భుజంమీద ఆడుకుంటూంది. సంధ్యాసమయం అయిపోతూంది. చాలా రోజులకు భారతీదేవి స్వయంగా ఇంట్లో దీపాలు వెలిగించి, పూజగదిలో దేవుడిముందు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.
ఎవర్నీ రానివ్వలేదు వేణుగోపాల్. అతను అంత రంగం విప్పి పెద్దకొడుక్కు ఎప్పుడో చెప్పాడు- రవి ఆనాడు వెళ్ళి తిరిగి రాలేదు; కనక కర్మకాండ చేయడానికి వీల్లేదని. అతని మనసేదో నమ్మకానికి గురై పోయింది. వెళ్ళినవాడు తప్పక వస్తాడు. కాకపోతే శవం కనిపించదూ? మనిషి ఉన్నాడనే తృప్తి ఆయనకు.
తెల్లచీరతో నుదుట కుంకుమ లేకుండా భారతీదేవి తిరుగుతూంటే వేణుగోపాల్ చూడలేక గది బయటకు రావడానికే భయపడుతున్నాడు.
"భారతీదేవి!" అంటూ వచ్చిన రాము చేతిలో తల్లి బీరువాలోంచి తీసిన బంగారు గాజులూ, కుంకుమ భరిణా, పూలదండా, కొత్తచీరా ఉన్నాయి. "భారతీ దేవీ, ఇవి తీసుకోండి" అన్నాడు రాము.
భారతీదేవి మాట్లాడలేదు. తీసుకోలేదు.
"తీసుకోండి, భారతీదేవీ! రవి పోలేదు. నాగార్జునసాగర్ నుంచి తిరిగివస్తాడు. ఆ నమ్మకం నాన్నగారికి ఉన్నది. మీరిలా ఉంటే నాన్నగారు కృంగి పోతున్నారు. ఈ చీర కట్ట్టుకోండి. అమ్మలా ఇంట్లో గలగలా తిరుగుతూంటే నాన్నగారికి తృప్తి."
భారతీదేవి అప్పటికీ మౌనంగానే ఉంది.
"నేను నా చేతులతో ఇవ్వడంలేదు, భారతీదేవి! మీ అనుమానం అదే అయితే ...." రాము మనసు క్షణంలో బాధతో నిండిపోయింది. ఛ! తన కసలా ఉద్దేశ్యమే లేదు. తన తమ్ముడు రవి ప్రాణానికి ప్రాణంగా చూసుకొన్న ఈ భారతీదేవి తనకు ప్రీతిపాత్రురాలు తప్ప మరేమీ కాదు. దేవుడి మందిరం ముందు పెట్టి వెళ్ళిపోయాడు రాము.
భారతీదేవి మనసు నిజంగానే బాధపడింది. రాము సంగతి తనకు తెలియదూ? మందిరం ముందే అలంకరణకు ఉపక్రమించింది.
* * *
వాలు కుర్చీలో వెనక్కు చేరగిలబడి పాపను గుండెల మీద పడుకోబెట్టుకొని, కాళ్ళమీద బాబును కూర్చోబెట్టుకొన్నాడు రాము. తల ఎత్తితే గోడమీద లెక్క లేవన్ని మెడల్స్ తో తీయించుకొన్న తన ఫోటో నవ్వుతూ కనిపిస్తూంది.
బొంబాయిలో నిర్వర్తించిన చదరంగం పోటీలో తను ఫస్టు వచ్చాఉద్. 'గోల్డు మెడల్' అందుకొంటూంటే ఎన్నో పత్రికలు తన బొమ్మను అచ్చు వేయించాయి. ఆనాడు ఇంటా బయటా ఎక్కడ చూసినా గెలుపు తనదే. తను 'చదరంగం ఛాంపియన్' కాలేజీలో.
జీవితపు చదరంగంలో విధి కెదురుగా నిలబడి ఆట ప్రారంభించాడు గర్వంగా. విధి ఆలస్యంగా బయలుదేరి నలుపూ తెలుపూ గళ్ళనే రాత్రి పగలూ దూకేసి రాజుగా నిలబడ్డ తనను కట్టేసింది. అందుకే తను కట్టుబడిపోయాడు. ఎటునుంచి చూసినా 'తెరిచి రాజు' అయిపోతున్నాడు.
చదరంగంలో బంట్ల మాదిరి తన పరివారం అంతా చేతకానివాళ్లై ఓడిపోయారు. కుడిభుజంలాంటి మంత్రి ఉన్నా ఆటలో గెలుపు తనదే అయ్యేది. మంత్రిలాంటి తమ్ముడిని కర్మ స్వాహా చేసింది.
ఒంటి ఏనుగులాంటి తండ్రి ఏం చేయగలడు? ఏనుగు ఎలాంటిదైనా జవసత్తాలు ఉడిగిపోయి తనను తానే రక్షించుకొంటుందా? రాజును రక్షిస్తుందా?
జోడు గుర్రాలు ఉన్నా టకటకా ముందుకు సాగిపోయేవాడు. చిన్నతనంలోనే పిరికిపంద అంటూ జయ లక్ష్మి లాంటి గుర్రం ఒంటరిగా వదిలేసింది. భారతి లాంటి గుడ్డిగుర్రం ఏం చేయగలదు? గుర్రం ఉంటేకదా శకట్లు ఉండేవి? రెండు రకాల కుంటి గుర్రాల తాలూకు శకట్లు బాబూ, పాప రూపంలో తనను అంటిపెట్టుకుంటే ఇంకా తనకు శకటుఎక్కడిదీ? విధి ఊపిరి సలపనివ్వకుండా ఎత్తుమీద ఎత్తు వేస్తూ తనను చేతకానివాడిని చేసి ఆట కట్టేసింది.
సిగరెట్ కాలి కాలి చేతివేళ్ళకు తగిలింది. దూరంగా విసిరేసి నిద్రలో ఉన్న పాపను ముద్దు పెట్టుకొన్నాడు. కాళ్ళమీద అలాగే నిద్రపోతున్న బాబు అంతకంతకు బరువెక్కిపోతున్నాడు.
గుండెలమీంచి పాపనూ, కాళ్ళమీదనుంచి బాబునూ తీసుకువెళ్ళి మామగారి పక్కన మంచంమీద పడుకోబెట్టింది భారతీదేవి. ఇదివరకులాగే భారతీదేవి రాకను గుర్తు చేస్తూ ఆభరణాలు ఘల్లుఘల్లు మంటున్నాయి.
జయ హఠాత్తుగా కళ్ళలో కనిపించి నాట్యం చేస్తూంది. ఆరోజుల్లోనే కాదు, తను ఇప్పుడూ, ఇంకా కొన్ని ఏళ్ళు పోయినా అసమర్దుడే. ఆ రోజుల్లో జయ కావాలనిపించే మనసును 'ఎందుకని?' అడిగే సాహసంకూడా లేని పిరికివాడు. 'పిరికిపంద!' చెవులు చిల్లులు పడేట్లు అంటూంది జయ స్వరం.
జీవితంలో జరిగిన సంగతులు మొదటినుంచీ నెమరు వేసుకొంటూ పోతే ఆ బాధలే తీయగా, హాయిగా ఉన్నాయి. మేఘాల్లోకి జారిపోతున్నాడు చంద్రుడు. చలిగాలి వీస్తూంది. 'జయా, ఎక్కడున్నావ్? నువ్వే ఉంటే నా స్థితి ...' రాము మనసు జయ పరిష్వంగంకోసం విలవిలా తన్నుకొంటూంది. కానీ...
జీవితపు చదరంగంలో కట్టుబడిన రాము కళ్ళకు పెద్ద పెద్ద గీతాలు అడ్డంగా నిలబడి దాటకుండా చేత్శున్నట్లు కనిపిస్తూంది. భారంగా కళ్ళు మూసుకొన్నాడు నిట్టూరుస్తూ, హాస్పిటల్, రోగాలూ...'రా, రామూ!' అంటున్నాయి నవ్వుతూ.
---సమాప్తం---
