భారతీదేవి గాఢంగా నిద్రపోతూంది రవి గుండెల్ల్లో తలదాచుకుని. రవి మెడచుట్టూ చేతులు వేసిన భారతీ దేవి ప్రశాంతంగా సర్వం మరిచిపోయి నిశ్చింతగా స్వప్న లోకాల్లో విహరిస్తూంది. దూరంగా బాబు నిద్రపోతున్నాడు.
ఉన్నట్టుండి కెవ్వున కేకవేసింది భారతీదేవి. నిద్రలో ఎవరో తట్టి లేపినట్టు ఉలిక్కిపడ్డాడు రవి. "ఏమిటి? ఏమైంది?" భార్యను కుదిపేస్తూ ఖంగారుగా అడిగాడు.
భారతీదేవి నిద్ర లేచికూడా ఏడుస్తూంది. భార్యను ఓదారుస్తూ అడిగాడు: "దేనికి, భారతీదేవి? ఏదైనా కలగన్నావా?"
భయం భయంగా భర్త మొహంలోకి చూస్తూ హఠాత్తుగా రవి మెడచుట్టూ చేతులువేసి భుజంమీద తల వాల్చేసింది.
"చెప్పు, భారతీదేవీ! అది కల. తెలివి తెచ్చుకో. ఏమైంది? కలగన్నావా?" రవి బుజ్జగించాడు.
భారతీదేవి ఏడుపు తగ్గించి మెల్లగా అంది: "మీరు పని చేస్తున్న 'డామ్' దగ్గర లేడీ టైపిస్ట్ కూడా ఉన్నది. అబ్బ! కలై నా మరిచిపోలేకుండా ఉన్నాను." చెంపలమీద కన్నీరు మెరుస్తూంది.
రవి ఘొల్లున నవ్వాడు. "చెప్పు, భారతీదేవీ. నీ కళ భలే ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇంతకీ ఆ టైపిస్ట్ ఏం చేసిందేమిటీ?"
కోపంగా రవిని రెండు చేతులతో పరుపుమీధకు తోసేసింది భారతీదేవి.
"ఏయ్! ఆగవోయ్, భారతీదేవీ చెప్పు పూర్తిగా."
"ఫోండి!" విసురుగా అంది.
"టైపిస్టు దగ్గరకా?" రవి వేళాకోళం ఆడాడు.
తలగడమీద పడుకున్న రవి గుండెలమీద తల ఆన్చి భారతీదేవి చిన్నపిల్లలా ఏడ్చేసింది. "మీరు వెళ్ళవద్దు. నాకు భయంగా ఉంది."
"పిచ్చిపిల్లా! భయం దేనికే?" వీపుమీద చేయి వేశాడు రవి.
"ఆ టైపిస్టు నాలాగే మీ గుండెలమీద తల ఆన్చి భుజాలచుట్టూ చేతులువేసి నిల్చుంది. నేను దూరంగా నిలబడి మిమ్మల్ని పిలిచాను. మిమ్మల్ని అలాగే వాటేసుకొని నావైపు నిర్లక్ష్యంగా చూసింది. మీరు ఉలిక్కిపడి నా దగ్గరకు వస్తూంటే దూరంగా లాక్కుపోతోంది.
"నేను పరిగెత్తి వస్తున్నాను. కానీ ఎంతకీ చేరుకోవడం లేదు. మీరు సిగరెట్ వెలిగించారు. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఆయాసం వస్తూంది. పిలిచినా మీరు పలకరు. దాని వెంటబడి ముందు మీరూ, మీ వెంక నేనూ పరిగెత్తిపోతూనే ఉన్నాం.
"కటిక చీకటి. నా కళ్ళకి ఏమీ కనిపించడంలేదు. ఆ కాలేకాలే సిగరెట్ దారి చూపిస్తోంది. అది మీ చేతి లోంచి విసిరేసింది. ఆ ముక్కవచ్చి నా చీరమీద పడ్డది.
"నా చీర కాలిపోతోంది. మీరు నా దగ్గరకు రావడం లేదు. పరిగెత్తుతూంటే మంటలు. మంటలకి నా ఒళ్ళు కాలిపోతోంది." భారతీదేవి మొహంలో భయం పోలేదు. ఇంకా ఆయాసపడుతూనే ఉంది.
"లేదు, భారతీదేవీ, నిన్ను వదిలి ఇంకొకరిని చూడటానికి కూడా నాకు టైము లేదు." కళ్ళు మూసుకొన్న రవి కళ్ళలో వైదేహి కనిపించి మాయమైంది. భారతిని గాఢంగా కౌగలించుకొన్నాడు. భారతి అలాగే రవి గుండెలమీద నిద్రపోతూంది.
* * *
వేణుగోపాల్ వరండాలో నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. డాక్టర్లూ, సర్జన్లూ, నర్సులూ ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతున్నారు. స్వచ్చంగా తెల్లని బట్టలతో హుందాగా, ఠీవిగా మనసంతా మమతను జీర్ణించుకొని అటూ ఇటూ తిరుగుతున్నారు.
ఓ మూల చనిపోయేవారు బళ్ళమీద తరలి వెళ్ళి పోతున్నారు. పుట్టిన పాపల 'కేర్' మనే శబ్దంకూడా చక్కగా వినిపిస్తూంది. హాస్పిటల్ అంతా సందడిగా, కోలాహలంగా ఉంది. నాలుగు గంటలైపోవడంతో రోగులకోసం వచ్చే బంధువుల సంఖ్య అధికంగా కనిపిస్తూంది.
తండ్రి అనుమతిమీద సికిందరాబాదు హాస్పిటల్ కు తీసుకువచ్చి చేర్పించాడు రాము. తలుపు తెరిచి నర్సు చెప్పింది వేణుగోపాల్ ను ఉద్దేశించి: "ఆడపిల్ల!"
ఆడపిల్ల. పదేపదే గొణుక్కుంటున్నాడు. యాభై దాటిన వేణుగోపాల్ శరీరం వార్ధక్యాన్ని కౌగిలించుకొంది. బాధలతోనూ, వేదనలతోనూ సడలిపోయిన వార్ధక్యాన్ని పదిలపరుచుకోవాలన్నా భార్య తోడు లేకపోవడంవల్ల సాధ్యం కావడంలేదు.
కారు మలుపుతిప్పి ఇంటికి చేర్చాడు.
* * *
రెండు మూడు గంటల తరవాత బెడ్ మీద పడుకోబెట్టారు విష్ణును. అలిసిపోయి నీరసంగా కళ్ళు మూసుకొంది. చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాము.
అటునుంచి ఇటు కదిలిన చెల్లెల్ని ఆప్యాయంగా తనివితీర చూడసాగాడు. మెల్లగా కళ్ళు తెరిచి రాము వంక చూసి సిగ్గుతో తల దించుకొంది.
నుదుటిమీద చేయివేసి అడిగాడు రాము: "ఎలా ఉందమ్మా?"
బరువుగా కళ్ళు పైకెత్తి ప్రశాంతంగా నవ్వి చుట్టూ చూసింది. అంత నీరసంలోనూ, దుర్భరమైన బాధలోనూ తన బిడ్డకోసం వెతుకుతున్నాయి కళ్ళు రెపరెపలాడుతూ. మెల్లగా అడిగింది: "ఏదన్నయ్యా?"
గ్రహించాడురాము. "ఇంకా డ్రెస్సుచేయలేదమ్మా!"
"ఆడపిల్లేనా?" భయంగా తను ఆమాట వినకూడదన్న బెంగలో అడిగింది.
తల ఊపాడు రాము, "అవు" నంటూ.
పెదవుల్ని పంటితో నొక్కి దుఃఖాన్ని దిగమింగాలనుకొంటే సాధ్యం కాలేదు. కళ్ళలో కారేనీళ్ళు చెంపలమీద పడ్డాయి.
"ఛ! దేనికీ ఏడుపు? పాపని చూస్తే అలా అనవు.రబ్బరు బొమ్మల ఉంది, విష్ణూ" అని తిరిగి ప్రశ్నించాడు: "చూడు, విష్ణూ, నీ కూతుర్ని నాకు ఇస్తావా?"
స్వచ్చంగా నవ్వింది విష్ణు: "ఏడుస్తున్నానని ఓదారుస్తున్నావు కానీ నిజంగా నువ్వు తీసుకొంటావా? పతిత పిల్లకదా?"
"విష్ణూ!" గట్టిగా అరిచాడు. "ఏం మాటలని, విష్ణూ! అయితే నన్నుకూడా అలాగే అనుకొంటున్నానన్నమాట!"
తప్పు చేసినదానిమాదిరి తల దించుకొంది. నర్సు పాపను తీసుకువచ్చి విష్ణు పక్కను పడుకోబెట్టి వెళ్ళిపోయింది.
కనులైనా తెరవని పాప దిక్కులు చూడాలనే ప్రయత్నంలో చిందులు తొక్కుతూంది. పాపపు ప్రపంచంలో దుర్భరంగా గడపాలని పాపకేం తెలుసు? అటు తిరిగింది పడుకొంది విష్ణు. మాతృహృదయాన్ని ఎంత తల్లడిల్లుతున్నా వినిపించుకోనట్లు అదిమివేస్తూంది. ఇద్దరు నవనాగరిక విద్యావంతుల దౌర్భాగ్యపు పనికి పాపిష్టి చిహ్నం అని తెలియని పాప అమాయకంగా పొత్తిళ్ళలో ముడుచుకొంది.
రాము కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. పసిపాపను తనే స్వయంగా పొత్తిళ్ళు సరిచేసి పడుకోబెట్టాడు.
విష్ణు ఏడుస్తూనే ఉంది.
"చూడు, విష్ణూ ఇటు తిరుగు." విష్ణు పలకలేదు. చూడలేదు. కొంగు ముఖాన అడ్డం వేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
"విష్ణూ, ఇటు చూడమ్మా. నీ కింకేమీ భయంలేదు. నీకు నేను ఉన్నాను. పాపం! పసిది దానికేం తెలుసు? దాన్ని అన్యాయం చేయకు. అమ్మవి కదా?"
విష్ణు తిరిగి చూసింది, రాము కళ్ళలోకి మౌనంగా విష్ణు చేతిని పాప భుజంమీద వేయించి కళ్ళలోకి చూశాడు.
విష్ణు కళ్ళు దించుకొని చూపుల్ని తన బిడ్డమీదకు పంపింది మెల్లమెల్లగా.
* * *
పెట్టే బెడ్డింగూ సర్దేసి తండ్రికి నమస్కరించాడు రవి. వేణుగోపాల్ చిన్నగా ఏదో ఆశీర్వదించాడు, పసివాడు తండ్రికోసం ఏడుస్తూనే ఉన్నాడు. తలుపు తెరుచుకొని రాము లోపలికి వచ్చాడు. "రా బాబూ!" చేతులు చాపి భారతీదేవి చంకలో పిల్లవాడిని తీసుకొని ముద్దు పెట్టుకొన్నాడు.
పసివాడు ఏడుపు మానేశాడు. "న్నయ్యా, మరి నేను వెళ్ళొస్తా. నాన్నగారూ, మీ ఆరోగ్యం జాగ్రత్త." రవి వంగి రాముకుకూడా నమస్కారం చేశాడు. రాము తమ్ముడిని లేవదీసి కౌగిలించుకొంటూ, "నువ్వు భారతీ దేవి విషయంలోనూ, బాబు విషయంలోనూ బెంగ పెట్టుకోకు" అన్నాడు.
మనస్ఫూర్తిగా నవ్వాడు రవి. "నువ్వుఉండగా నాకేం బెంగ లేదన్నయ్యా" అని తండ్రివైపు నిశితంగా చూస్తూ, "నాన్నగారూ, తొందరలో ఇక్కడికే ట్రాన్స్ ఫర్ చేయించుకొంటాను. మీరేమీ బాధ పడకండి" అంటూనే భారతీదేవీ గదిలోకి అడుగుపెట్టాడు.
మంచంమీద కూర్చుని విచారంగా ఎటో చూస్తూంది భారతీదేవి. బలవంతంగా లేవదీసి రెండు చేతులతో బంధించివేశాడు. "నువ్వు నవ్వాలి, భారతీదేవీ."
భారతి నవ్వలేదు. కళ్ళు మూసుకొని భర్త గుండెలకు హత్తుకుపోయింది.
"టైపిస్ట్ దగ్గరకు వెడుతున్నావోయ్!" రవి పరిహాసం చేశాడు.
మెడమీద చేతులువేసి మొహం పైకెత్తి రవి కళ్ళలోకి చూస్తూ, "వద్దు, నా కలని జ్ఞాపకం చేయకండి. నేను భయపడిపోతున్నాను" అంటూంటే చెంపల మీదుగా కారే నీరు రవి చేతుల్ని తడిపేస్తూంది.
"ఏడవకు, భారతీదేవీకి నామీద నమ్మకం ఉంచుకో. నేను నీ భర్తని. నీకున అధికారం మరెవరికీ లేదు." ఎత్తిన భారతీదేవి మొహంలోకి పరీక్షగా చూస్తూ కళ్ళమీదుగా, చెంపల పక్కగా వచ్చిన దృష్టిని పెదవుల వరకూ తప్పించి ఆపేసి అక్కడ ఏదో మధురిమ వంటిది దొరకగానే చవిచూస్తూ ఆగిపోయాడు రవి.
"ఒరే, రవీ! టైమైపోతోందిరా!" వీధిలోంచి కేకవేశాడు వేణుగోపాల్.
"వస్తున్నా, నాన్నగారూ." అంత గట్టిగానూ అరిచి భారతీదేవిని దూరగా జరిపి, "మరి వెడుతున్నా" అన్నాడు.
కారు అంతకంతకు దూరమైపోతూంది. వీధిలోనే మలుపు తిరిగేవరకూ నిలబడ్డారంతా. "ఆ రోజులే బావున్నాయి." వేణుగోపాల్ గడిచిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అంతవరకూ ఊరుకున్న బాబు తండ్రి ఊరికి వెడుతున్నాడని గ్రహించి ఏడుపు లంకించుకొన్నాడు. రాము మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని దూరంగా తీసుకుపోయాడు.
* * *
మూడు నెలలు గడిచిపోయాయి. రవి అప్ప్డుఅప్పుడు వచ్చి వెడుతూనే ఉన్నాడు. అటు ఇంజనీర్ రవిచంద్ర పెరుతోబాటు ఇటు డాక్టర్ శ్రీరాం పేరుకూడా వేణుగోపాల్ చెవిలో దద్దరిల్లుతూనే ఉంది. ఈజీచైర్ లో పడుకొని ఆకాశంలోకి చూస్తూ కాలుమీద కాలు వేసుకొని మనవడితో రోజులు దొర్లించడం అంత కష్టంగా తోచలేదు వేణుగోపాల్ కు. అయినా అప్పుడప్పుడు తన జీవిత భాగస్వామిని చేసిన అన్యాయం కళ్ళముందు లీలగా మెదిలి 'అభాగ్యురాలు! బ్రతకలేక చచ్చిపోయింది' అనుకొని చెమర్చిన కళ్ళను తడుచుకొంటూనే ఉన్నాడు. మిగిలిన సమస్య అల్లా ఇక పెద్దకొడుకు శ్రీరాం పెళ్ళి గురించే.
* * *
సాయంత్రం అయిపోయింది. పిల్లకు నీళ్ళుపోయించి కాటుకా బొట్టూ పెట్టి తెల్లని ఇస్త్రీ మడతల్లో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకొని కంట తడిపెట్టింది విష్ణుప్రియ.
మోటార్ సైకిలు ఆపి లోపలికి వచ్చి గదంతా పరికించి, "ఎక్కడికైనా వెడుతున్నావా?" అని అడిగాడు రాము.
రామును కూర్చోమని కుర్చీ చూపిస్తూ అవునన్నట్లు తల ఊపింది విష్ణు.
"ఎక్కడికి?" ఆదుర్దాగా తిరిగి అదే ప్రశ్న వేశాడు.
"ఇక్కడనాకు శాంతి లేదన్నయ్యా. ఎక్కడికైనా వెళ్ళి కొన్నాళ్ళు ఉంటే..."
"అవును, బాగానే ఉంటుంది. మనిషికి ప్రశాంతి లేకపోతే పిచ్చి పట్టినట్లు అవుతుంది." రాము సమర్ధించాడు.
"పాపని వైజాగ్ లో నాకు తెలిసిన ఆశ్రమం....."
"విష్ణూ!" గర్జించాడు రాము. విష్ణు చెప్పవలసింది సగంలోనే ఆగిపోయింది.
"నీకెంత సిగ్గులేదు! పాపచుట్టూ ఇంతమంది ఉంటే ఆశ్రమానికి ఇస్తావా? నే నేమయ్యాననుకొన్నావు? చచ్చాననుకొన్నావా? చస్తే బాగానే ఉండేది, విష్ణూ. ఈ సమస్యలలో అడకత్తెరలా నలిగిపోయే వాడిని కాదు."
దూరంగా కిటికీ ఊచలు పట్టుకొని నిలబడింది విష్ణు. కిటికీలోంచి చూస్తూంటే సికిందరాబాద్ శ్మశానవాటిక స్పష్టంగా కనబడుతూంది. ఆకాశాన్నంటుకొనే మంటలు శ్మశానభూమిని వెలుగులో నిలిపేస్తున్నాయి. ఒకమూల స్నానాలు చేసేవారు, మరోమూల ఇళ్ళకు దారిపట్టే వారు. వచ్చేవారు వస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెడుతూనే ఉన్నారు. ఎక్కడా విశ్రాంతి కనబడటంలేదు. కపాలాలు పగిలి వెక్కిరిస్తూ దూరంగా పడిపోతున్నాయి. పుర్రెల్లోంచి వికటాట్టహాసాలు, ఒకప్పుడు మీకంటే కూడా మేము దర్జాగా బ్రతికామోయ్ అన్నట్లు విష్ణు క్షణం భయపడి దృష్టి తప్పించింది.
రాము పాపను తన ఒడిలోకి తీసుకొన్నాడు. చేతులూ కాళ్ళూ తటపటలాడిస్తూ మేనమామ గుండెల్ని తన్నేస్తూంది పాప. "పాపకి అమ్మ ఉంది. బంధుజనం ఉన్నారు. మాలో ఎవరం దూరం చేసుకొంటాం అని ఆశ్రమానికి ఇచ్చేస్తానంటున్నావు, విష్ణూ?"
"నువ్వు చాలా అమాయకంగా మాట్లాడుతున్నానన్నయ్యా. పాప పెరిగి పెద్దదౌతుంది. నాన్న ఏరి అంటుంది. లోకం నోరు మూసుక్కూర్చోదు. పాప నాన్న ఏరి అమ్మడూ? అంటుంది. ఏమని చెప్పను? అనవసరమైన సానుభూతి ప్రదర్శిస్తుంది. చాటు మాటున అనేకం అంటుంది. లేచిపోయిందాని కూతురోయ్ అని వ్యాఖ్యానం చేస్తుంది. పాపనాన్న ఎవరని చెప్పను? ఎలా తలెత్తుకోను? నా మనసు మండిపోయేక్షణంలో ఈ పాపిష్ఠి చేతులతో ఇంకా ఏమైనా చేస్తా నేమో...ఎవరికీ తెలుసు? దాని ఖర్మ! అంతే. ఆహ్ది దిక్కులేని అనాథలాగే పెరగాలి.
"నీ కళ్ళతో నువ్వెన్ని కేసులు చూడలేదు? కన్నబిడ్డను హాస్పిటల్ ముందే వదిలేసి ఎంతమంది వెళ్ళేవారుకారు? పెంచలేకనా ... ఒక్కనాటికి కాదు. పెంచగలిగే స్తోమతు ఉన్నా దైర్యం ఏదీ?
"అమ్మమ్మ ఉంది పాపకు అన్నావు. ఎంత పొరబడ్డావన్నాయ్! పెళ్ళిపందిరి, ఆవిధంగా కన్నీటిమయం అయిపోతే అమ్మా, నాన్నా హాస్పటలో చేర్పించి ఏమన్నారో తెలుసా?"
"ఏమన్నారు?"
"మాకున్నది ఏదో మేము తింటున్నాం. మాతో బాటు వచ్చి మా పేరు ప్రతిష్టలు నాశనం చేయకు. నువ్వు మాకు పుట్టలేదనుకొంటాం. కాకపోతే చచ్చిపోయావు అని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకొంటాం అన్నారు. నువ్వు నమ్మవు. అవున్లే. మంచివాళ్ళ దృష్టికి చెడు కనిపించదంటారు." విష్ణు కాస్సేపు ఆగింది అయాసంగా.
"అత్తకూడా అన్నదా?"
"అత్త ఎక్కువేం? ఆవిడ కన్నమాత్రాన అలా అనకూడదని రూల్సేమీ లేవుగా? ఇప్పుడు చూడు. పాప విషయమే తీసుకో. నేనుమాత్రం అమ్మను కానూ? బిడ్డ చెడుదైపోతే ఆ తల్లి ఎందుకు క్షమిస్తుంది? నా బిడ్డ అభంశుభం ఎరగనిదే కావచ్చు. కానీ ఆ బిడ్డతో నేను ఉంటే నాకు కళంకం. ఇందులో నా స్వార్ధం ఉంది. అలాగే అమ్మకీ. నాకు పురుడు వచ్చింది. అదే మరోరకంగా అయితే ఎన్నెన్ని వేడుకలు, ఎంత కోలాహలం జరిగేవి! ఈ ప్రపంచంలో ఉన్న కట్టుబాట్లకీ, సంఘనియమాలకీ దూరంగా బ్రతకడం కష్టం కాదన్నయ్యా."
రాము ప్రశ్నార్ధకంగా చూశాడు.
