Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 18

 

    "నాకెవ్వరూ లేరు" అని గట్టిగా అరవాలనిపించింది కుసుమకు. అంతలోనే "రేపే వేడదామనుకుంటున్నాను." అందామనుకుంది. ఏదీ అనలేకపోయింది.
    చాలాసేపటికి అంది. "నాకెవ్వరూ లేరని చెప్పాను."
    "అది నేను నమ్మనని నీకు తెలుసు. నీకు అమ్మో, కాదో తెలియదు కాని, నీకు కావలసిన అప్తులున్నారని నాకు తెలుసు."
    "ఎలా?"
    "ఎలా అని అడగకు నాకు తెలుసు అంతే?"
    ఆ మొండితనం చూస్తేనే వళ్ళు మండుతుంది. కుసుమకు. ఎంత ధైర్యం? తన విషయం ప్రతిదీ తెలుసునన్నట్లు ప్రవర్తిస్తాడు. అసలే చికాకుగా వున్న కుసుమ మనసు పరిపరివిధాల పోయింది.
    "ఛీ..... యితని పరిచయమే కాకపొతే తనకీ సమస్యలన్నీ ఉండేవి కావు. ఎక్కడకు వెడదామన్నా వదలని హోదా, గౌరవం..... హాయిగా స్వేచ్చగా వుందామన్నా వీలుకాని యీ పరిధి. ఆ క్షణంలో ఆమెకు ఆ యిల్లు ఓ బందిఖానా లాగా కనిపించింది. తన్ని అర్ధం చేసుకోడు, తన దారిన తన్ని పోనివ్వడు..... ఎన్నాళ్ళీ జీవితం, ఏమయినా సరే, తనిక్కడి నించి శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్లు అతని తెలియ పర్చాలి. అతను అంగీకరించి పంపితే సరేనని , లేకుంటే తన దారిన తను పోవాలి." అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చేసింది. వెంటనే ప్రభాకర్ తో "నా కోసం మీ ప్రయత్నాలు అనవసరం. నేనింక యిక్కడ వుండలేను" అని చెప్దామనుకుంది.
    ఫోను గజగజా మోగింది.
    సుదీర్ఘంగా నిట్టూర్చింది.
    ఆమె వంక ఒక్క క్షణం చూసి లేచి ఫోను తీసుకున్నాడు.
    "హలో...."
    "హలో ప్రభాకర్ ...గోపాల్ హియర్,"
    అంతవరకూ ప్రసన్నంగా వున్న ప్రభాకర్ ముఖం సీరియస్ గా మారిపోయింది. ఒక్కసారి కుసుమ వంక చూచాడు. అప్పుడే పక్కనే వున్న మాగజైన్ అందుకుని పేజీలు  తిప్పుతోంది.
    "యస్...." అన్నాడు ప్రభాకర్.
    "నీవడిగిన వివరాలు అన్ని తెలిశాయి. చాలా ముఖ్యం అన్నావు కదా అని వెంటనే ఫోన్ చేశాను." అన్నాడు గోపాల్.
    "థాంక్స్. రేపొద్దున్న ఆఫీసుకు వెడుతూ వచ్చి కలుస్తాను. నీకు వీలవుతుందంటే....."
    ఒక్క క్షణం అటు వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కొద్దిగా ఆశ్చర్య మనిపించింది గోపాల్ కు.
    "నాకు వీలవుతుంది." అన్నాడు క్లుప్తంగా. "సరే!" అంటూ ఫోన్ మూసేశాడు.
    తుది మొదలు లేని సంభాషణ మీద అట్టే కుతూహలంగా అనిపించని కుసుమ పుస్తకం చదువు కోవడం లో నిమగ్నమయింది.

                                       23
    మర్నాడు ఉదయమే ఆఫీసుకు వస్తూ గోపాల్ ని కలుసుకుని వచ్చాడు ప్రభాకర్. ఎంత ఆలోచించినా గోపాల్ చెప్పిన విషయాలకు తను ఆశించిన విషయాలకు ఎక్కడా ఏ సంబంధం కనిపించలేదు.

 

                           
    "సుమారు 18, 17 ఏళ్ళ నుంచి అదే యింట్లో వుంటున్నారుట. నువ్వు చెప్పిన రాజ్యలక్ష్మీ అనే ఆవిడ. ఆవిడ కూతురు కాక యింకో ,ముసలమ్మా కూడా వుండేదిట. కొన్నేళ్ళ క్రితం ఆ ముసలమ్మ చనిపోయింది. రాజ్యలక్ష్మీ బయటకు రావడం నలుగురి లో తిరగటం అనేది చాలా అరుదయిన విషయం. కాని అవిదకేదో పోలీసు రికార్డు వుందని.... తెలిసింది. కాని ఆ వివరాలు పూర్తిగా తెలియవు. వాళ్ళ అసలు వూరు ఇది కాదని, సిరిపురం ....అటు ఎటు వైపు నించో వచ్చారు. కాని ఒక విషయం ఏమిటంటే.... మొదట్లో ముసలమ్మ , ఆమె మనమరాలు  వంటరిగా వుండేవారుట, తరువాత రాజ్యలక్ష్మీ వచ్చిందని..... వీళ్ళతోనే వుంటుందని రకరకాలుగా అంటారు. కొత్తవాళ్ళ రాక మొదట్లో ఎంత క్యూరియాసిటీ కలిగించినా, తరువాత , తరువాత ఎంత చప్పగా చల్లారి పోతుందో నీకు తెలుసు." అన్నాడు గోపాల్. "ఆవిడ రికార్డు విషయం తెలిశాక మళ్ళీ చెప్తాను."
    గోపాల్ చెప్పినవన్నీ వింటూ మౌనంగా వుండిపోయాడు ప్రభాకర్.
    "యీ విషయాలు ఏమయినా పనికి వస్తాయా?' అడిగాడు గోపాల్.
    తల వూగించాడు  . ఔనూ, కాదూ అని ఎటూ ఖచ్చితంగా తేల్చకుండా , 'యిప్పుడు ఆవిడ కూతురు ఎక్కడ పనిచేస్తోంది?"
    "ఏదో పెద్ద సిటీ లో పని చేస్తోందిట. ఏ వూరో అది తెలియదు. కావాలంటే కనుక్కోవడం పెద్ద కష్టం కాదు."
"థాంక్యూ . యింక నే వెళ్తాను. మిగిలిన విషయాలు తెలియగానే ఫోను చెయ్యి."
    "తప్పకుండా?" అన్నాడు గోపాల్.
    బ్రతుకంతా ఎవరితో సంబంధం లేనంత అజ్ఞాతంగా నిర్లిప్తంగా, ఎందుకు గడప వలసి వచ్చిందో..... అయినా యింతకాలం ఏ ఆధారంతో గడిపారో ఊహ తెలిసినప్పటి నుండి కటిక దరిద్రం తప్ప మరొకటి అనుభవించ లేదు." కుసుమ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తను ఆశించిన విషయాలు ఏమీ తెలియలేదు. ఎక్కడ మొదలైన ప్రయత్నం అక్కడే వుంది. ఏ వివరాలయినా తెలిస్తే గాని తను చేయగలిగింది ఏమీ లేదు..... కుసుమ సమస్యలు సమస్యలు లాగానే మిగిలి పోతాయి. నిరుత్సాహంగా నిట్టూర్చాడు.

                                      24
    ఆరోజు వుదయం నుండి మహా చిరాకుగా వుంది ప్రభాకర్ కు. ఆ సాయంత్రం తనతో బాటు కుసుమను కూడా బొంబాయి తీసుకు వెళ్ళాలని డాక్టర్ని సంప్రదించాలని ఎన్నో అనుకున్నాడు. ఏ ఒక్క పని మొదలెట్టినా, అన్ని విఘ్నాలే! కుసుమ అయిష్టానికి తగ్గట్టే ఆ క్రితం సాయంత్రం నుండి రంగనాధం గారి ఆరోగ్యం బాగా లేదు. అనారోగ్యంతో వున్న తండ్రికి ఆసరాగా తను వుండకుండా -- కనీసం కుసుమ నయినా ఇంట్లో వుంచకుండా వెళ్ళడానికి మనస్కరించ లేదు ప్రభాకర్ కి.
    తను బొంబాయి వేళ్ళనక్కరలేదని తెలుసుకుని తేలికగా నిట్టూర్చింది కుసుమ. అంతలోనే ఆమెకు ఏదో చిన్నతన మనిపించింది. మావగారి అనారోగ్యం మూలంగా తన ప్రయాణం ఆగిపోయినందుకు తను సంతోషిస్తుంది పరోక్షంగా యిది తను కోరుకోలేదు కదా! అనిపించింది. అంతలోనే.....ఛ....ఒక్కొక్కసారి తన మనసు యింత అల్పంగా ఎందు కాలోచిస్తుంది?" అనుకుంది.
    చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేయించి తప్పని సరైన ప్రయాణానికి అయిష్టంగానే సిద్దమవసాగాడు ప్రభాకర్. అవసరమయితే తనకు ఎక్కడికి ఫోను చెయ్యాలో అన్నీ చెప్పి వుంచాడు.
    సూట్ కేస్ సర్దుకుని క్రిందకు వెళ్ళబోతూ వుంటే గోపాల్ దగ్గర నుంచి ఫోను వచ్చింది గబగబా అందుకున్నాడు.
    "నీకు కావలసిన విషయాలు తెలిశాయి. నువు బొంబాయి వేడుతున్నావని తెలిసింది. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను ఊళ్ళో వుండక పోవచ్చు."
    గోపాల్ చెప్తున్నది వింటున్న ప్రభాకర్ కనుబొమలు ముడుచుకు పోయాయి. మొహమంతా సీరియస్ గా అయిపొయింది. ఎక్కడా ఒక్క ముక్క కూడా పొల్లు పోనీయకుండా వింటున్న అతనికి, మనసంతా ఏదోగా అయిపొయింది.
    "అయితే ఆ చిన్న అమ్మాయి ఏమయింది ఆ రాత్రి?" అడిగాడు.
    "అంతకుముందే ఎక్కడికో పంపించిందిట, ఆ తరువాత ఆవిడే మయిందో, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు."
    "యింకేమయినా తెలిశాయా?"
    "యింకేం లేవు-"
    "థాంక్స్ గోపాల్. ఈ సహాయం ఎప్పటికి మర్చిపోలేను. బొంబాయి నుంచి రాంగానే వచ్చి కలుస్తాను."
    "ఓ.కే. హేవ్ నైస్ ట్రిప్."
    ప్రయాణం చేస్తున్నంత సేపు తన చుట్టూ తిరిగే ఆలోచనలతో సతమతమయిన అతనికి విమానం బొంబాయి ఎప్పుడు చేరిందో కూడా తెలియలేదు.
    'సిరిపురం , అవును. తనకు కొద్దిగా గుర్తు. తనకు 14, 15 ఏళ్ళు వుంటాయేమో ! అప్పుడు పేపర్ల నిండా అదే! కాని నాన్న ఏ ఒక్క పేపరు తన దాకా రాకుండా కట్టుదిట్టం చేశారు. సిరిపురం జమీందారు అంటే తన తాత. అయన ఒక్క కొడుకు. .. తన మేమమామ పోయాక జరిగిందా సంఘటన.....యిది జరిగిన కొద్ది నెలలకే తన తాతగారు కూడా పోవడంతో ....మళ్ళా ఆ విషయం ప్రస్తావించడమే జరుగలేదు.
    అయితే మాత్రం దానికి.... కుసుమ చాయలకు...ఎంత ఆలోచించినా సంబంధం కనుపించలేదు. ఏదో జరిగి వుండాలి.... అయినా అలాంటి జీవితం గడపవలసి వచ్చిందంటే పరిస్థితులు ఎంత దారుణ మయినవో ....తినేందుకు తిండి లేక- చెప్పుకునేందుకు నావారనే వాళ్ళే లేక, పరిస్థితులకు లొంగి పోయి, జీవితమంతా నాశనమయి......
    అదే అయి వుండాలి. రాజ్యలక్ష్మీ నలుగురి లో కలవక పోవడానికి... కాని కుసుమ.... మగవారంటే తల్లి కున్న అసహ్యం అంతా కూడగట్టుకు పుట్టిందా? లేక తల్లికి జరిగిన అన్యాయాలకు ఆమె మనసంతా కఠిన మయి పోయిందా? అయినా ఆమెను భయపెట్టే విషయాలకు కారణ మేమయి వుంటాయి?
    కుసుమ మానసికంగా బాగుపడాలంటే -- ఆమె సమస్యలకు మూలం తెలియాలి.... తన ప్రశ్నలకు జవాబు దొరకాలి.... కాని ఎలా ఎక్కడ ప్రారంభించడం.......


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS