20
అప్పుడే కన్ను మూత పడుతున్న సమయంలో తలుపు చప్పుడయ్యే సరికి, ఎక్కడ లేని విసుగూ వచ్చింది ఉమకు. అంతలోనే సర్దుకుంది. విసుక్కునేందుకు వచ్చిందా తానీ ప్రదేశానికి? కళ్ళు నులుముకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది. గిరి నవ్వుతూ లోపలకు ప్రవేశించాడు. విద్యుత్ర్ససారిత ప్రదేశం లో నిలువబడినట్లు , ఉమ సర్వ శరీరము చంచాలించింది.
"గిరీ" అని అస్పష్టంగా , మత్తుగా గాడంగా తనలో తానను కుంటూ అతని గుండెల మీద వాలి పోయింది ఉమ, అప్రయత్నంగా గిరి చేతులు కూడా ఉమను చుట్టి వేశాయి. ఉమ సర్వాంగాలూ , "గిరీ! గిరీ!" అని పిలుస్తున్నట్లుగా తోచింది గిరికి. తన హృదయానికి అత్యంత సమీపంగా ఉన్న ఆమె హృదయం ఎన్నో మహా కావ్యాలను తన హృదయానికి అందజేసింది. యావత్ప్రపంచము , శూన్యమై నట్లు, ఆ శూన్యం లో , తామిద్దరూ మాత్రమే ప్రకశిస్తున్నట్లు భావించింది గిరికి--
అంతలోనే సృహణీయుడైనాడు గిరి. తనను చుట్టిన ఉమ చేతులను మృదువుగా సడలించి, దూరంగా తొలగి -- "ఇదేమిటి ఉమా?' అన్నాడు --
ఉమ ముఖం ఎర్రబడింది. అవును ఇదేమిటీ? తను గిరిని ఎంత ఆరాధిస్తున్నా, ఒక్కనాడైనా అతనిలో హద్దులు మీరి మాట్లాడింది లేదు. అతని అభిప్రాయం కూడా తెలిసి కోకుండా తానిలా తెలిపోయిందేమిటి?
వంచిన తల ఎత్తలేక పోయింది ఉమ. అయినా జరిగిన దానికి ఆమెకు కష్టం కలుగలేదు. ఉచితమో, అనుచితమో యవజ్జీవితమూ తల్చుకుని మురియుడానికి ఒక్క క్షణ మైనా ప్రసాదించాడు తనకు భగవంతుడు -- తన స్త్రీ జన్మ సార్ధక మైంది. అప్రయత్నంగా తనను చుట్టిన గిరి చేతుల నుండి తన శరీరానికి వ్యాపించిన మధురిమ, ఎన్ని జన్మలకు సరిపోదూ?
తలవంచుకుని తెర్రబారిన చెక్కిళ్ళ తో, అర్ధనిమీలిత నేత్రాలతో, అనురాగ పూర్ణమైన మందహాసం తో తన ఎదురుగా నిలువబడిన ఉమను చూసి గిరి హృదయం బావురుమంది. "నేనెంత దురదృష్ట వంతుడనీ?'అనుకోకుండా ఉండలేక పోయాడు.
"మీరు చాలా అలసి నట్లున్నారు. నేనలా తిరిగి వస్తాను." అన్నాడు గిరి.
ఉమ కంగారుగా "లేదు! లేదు! నేనేం అలసి పోలేదు. పొద్దయి పోయింది ఇంకా నిద్రేమిటి?" అంది.
నిజంగానే ఆమె అలసట అంతా యెగిరి పోయింది. ఒకవేళ పడుకున్నా తానింక నిద్ర పోగలదా?
"మీరు డ్యూటీ కి ఎన్ని గంటలకు వెళ్ళాలీ?' అన్నాడు గిరి.
"న్యాయంగా తొమిది గంటలకు---కానీ, ఎప్పుడంటే అప్పుడు పిలుపు వస్తూనే ఉంటుంది.
"బొత్తిగా విశ్రాంతి ఉండదను కుంటానేం?'
ఉమ తలెత్తి గిరి వంక చూసి అదోరకంగా నవ్వింది. "విశ్రాంతి ఉండకూడదనేగా ఇక్కడకు వచ్చింది?"
గిరి గుండెల్లో గుచ్చుకుందా నవ్వు. తన భావోద్వేగాన్ని అణచుకోలేక ముఖం తిప్పుకున్నాడు.
"మీకు స్నానానికి ఏర్పాటు చేస్తా నాగండి." అంటూ ఉమ లోపలకు వెళ్ళబోయింది--
"స్నానమేమిటి? ముఖం కూడా కడుక్కో లేదు."
"అయితే ముఖం కడుక్కోవటానికి వేడినీళ్ళు పెడతాను.
"మీ కెందుకు శ్రమ? పని వాళ్ళు లేరా?"
"ఇక్కడ అందరూ పని వాళ్ళే! ఒక హాస్పిటలు సర్వేంటే వస్తుంది. కానీ, ఇంకా చాలా ఆలస్యంగానే వస్తుంది. అయినా మీకు వేన్నీళ్ళు పెట్టడం నాకు శ్రమా?! ఇంతకంటే ఆనందం కలిగించేది ఇంకొకటి ఉండదు-- ఈ మాత్రం అదృష్టం కోసం ఎన్ని జన్మలైనా తపస్సు చేస్తాను."
గిరి ఇంకేమీ మాట్లాడలేదు. క్షణక్షణానికి అతని హృదయం వశం తప్పుతుంది. ఉమను గాడంగా పొదువుకుని తనలో లీనం చేసుకోవాలనే తీవ్రమైన ఆకాంక్షను, అతి నిగ్రహంతో అణగద్రొక్కుకుంటున్నాడు గిరి-- అతని సర్వ ఉద్రేకాలకూ, ఒకటే మంత్రం 'ఉమ హరి సొత్తు -- హరి ప్రణయిని --' ఈ భావన అతని సమస్త ఉద్రేకాలనూ తుడిచి పెట్టి, మమతలను మాత్రం నిలుపుతుంది.
ఉమ ఇచ్చిన వేడి నీళ్ళతో ముఖం కడుక్కుని, ఆమె అందించిన కాఫీ అందుకున్నాడు గిరి-- ప్రతి క్షణమూ, అతని హృదయం హాయి, హాయి మంటూనే ఉంది. ఉమ ఈ లోకంలోనే లేదు. ఆనాడు, ఆమెకు ప్రతి వస్తువు ఎంతో అందంగా, ప్రతి పనీ ఎంతో ఆహ్లాదకరంగా, లోకమంతా ఆనందమయంగా అనిపించసాగింది.
"ఇవాళ సెలవు పెడతాను.' అంది ఉమ.
గిరి తల అడ్డంగా తిప్పుతూ "వద్దు -- ఏ ప్రలోభమూ మిమ్మల్ని కర్తవ్య విముఖురాలినిగా చేయకూడదు." అన్నాడు.
'సరే! అయితే వీలైనంత త్వరలో వస్తాను."
"ఫరవాలేదు. నేను రాత్రి ట్రైను లోనే కాని వెళ్ళను. మీరు వచ్చిన తరువాతే , మనం సావకాశంగా మాట్లాడు కోవచ్చును."
"ఈరోజే వెళ్లి పోతారా?' దిగులుగా అంది ఉమ.
"అవును, సెలవు లేదు."
ఆరోజు ఇద్దరూ కూర్చుని అన్నాలు తింటుంటే ఉమ "నా చేతులతో మీకు వడ్డిస్తుంటే నాకు ఎంత సంతృప్తి గా ఉందొ చెప్పలేను. ఇట్లాంటి ఒక్క రోజు కోసం జీవితంలో ఎన్నైనా సంతోషంగా వదులుకో గలను" అంది.
గిరి తింటున్న అన్నం లోంచి చెయ్యి పైకి తీసి "మీరిలా చీటికి, మాటికీ, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తే, నేను ఇప్పుడే పారిపోతాను." అన్నాడు గంబీరంగా ----
ఉమ మాట్లాడలేదు కానీ, ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ కన్నీళ్లు చూసి గిరి ఆర్ద్ర స్వరంతో "ఉమాదేవీ! నేను వచ్చి మీకు కష్టం కలిగిస్తున్నానా?' అన్నాడు.
ఉమ వెంటనే "లేదు, లేదు." అంది--
క్షణకాలమాగి గిరి" నాకు తెలుసు -- నా రాక మీకు వ్యధ కలిగిస్తుందని -- అయినా తప్పని సరి కారణం వల్ల వచ్చాను. రాకపోవటానికి ఏమాత్రం వీలున్నా, వచ్చేవాడిని కాను." అన్నాడు ఉమ నవ్వింది.
"అట్లాంటి తప్పనిసరి కారణాలు కలగటం నా అదృష్టం. లేకపోతె, ఈ మాత్రంభాగ్యానికి కూడా నోచుకోక పోయేదానిని అయినా - ఏమిటా కారణాలు?" కుతూహలంగా అడిగింది ఉమా.
"మీరు డ్యూటీ నుంచి వచ్చాక చెపుతాను. హడావుడి గా మాట్లాడే విషయాలు కావు."అన్నాడు.
ఉమ ఆశ్చర్యంగా అతని వంక ఒక్కసారి చూసి ఊరుకుంది.
ఉమ హాస్పిటల్ కు వెళ్ళగానే , టేబిల్ మీది ఉమ ఫోటో గ్రాఫ్ తీసి గట్టిగా గుండెల కదుముకున్నాడు గిరి.
తన తలపు మాత్రంతో పులకితురాలయ్యే స్త్రీ ని తన సేవే, జీవితానందమానుకునే స్త్రీ ని తాను మానసికంగా, శారీరకంగా , అతి గాడంగా వాంచించే స్త్రీని తానై వదులుకునే దురదృష్టం , ఏ పురుషుడి జీవితంలో నైనా తటస్థ పడుతుందా?
భారంగా కనులు మూసుకున్నాడు గిరి. రైలు ప్రయాణం వలన అలసట అతనిని త్వరలోనే నిద్రాదేవి వడిలో చేర్చింది.
21

చూస్తూ ఉండగానే, ఉమ అందమైన పూల మాలగా మారిపోయింది. ఆ మాలలోని ప్రతి పువ్వూ ఎంతో అందంగా సువాసన లీనుతుంది. గిరి ఎంతో ఆప్యాయంగా ఆ మాలను తన మెడలో దరించ బోయాడు. అంతలో హరి దీనంగా రోదిస్తూ, రోషంగా బెదిరిస్తూ, ఆ మాల కోసం చేతులు జాపాడు. గిరి వదలలేక , వదలలేక కష్టంగా ఆ మాలను హరి చేతికి అందించాడు. కానీ ఆ మాల హరి చేతిలో, నిలవక జారిపోతుంది. హరి ఉక్రోషంతో దాన్ని నలిపి వేస్తున్నాడు -- గిరి విలవిలలాడి పోతున్నారు. అంతలో ఆ మాల హరి చేతులో నుంచి, జారిపోయింది. ఎక్కడి కో అగాధం లోకి పడబోతున్న ఆ మాల కోసం, ఆత్రుతగా "ఉమా!" అంటూ గిరి కూడా అగాధం లోకి దూకాడు.
ఉలికిపడి కనులు తెరిచాడు గిరి-- అతని చేతులు, తన మీదకు వంగిన ఉమను గట్టిగా పొదివి పట్టుకున్నాయి. అతని సర్వాంగాలకూ చెమటలు పట్టాయి.
సిగ్గుపడి ఉమను వదిలి లేచి కూర్చుని కళ్ళు నులుముకున్నాడు గిరి -- ఉమ లేచి నుంచుని "నన్ను కలవరిస్తున్నారేమిటీ?' అంది.
ఆమె కళ్ళు సంతృప్తి గా నవ్వుతున్నాయి. అతని తలగడ ప్రక్కనే ఉన్న తన ఫోటో ను చూసిన ఉమ స్వర్గ లోకాలలో తేలిపోయింది -- గిరి హృదయం లో తనకు స్థానముంది-- అతడేదో కారణం వలన కావాలని తనకు దూరంగా ఉంటున్నాడు."
"కలవరించానా?" అన్నాడు బిడియంగా గిరి--
"అవును. నేను వచ్చి చాలా సేపయింది. నిద్ర పోతున్న మిమ్మల్ని లేపటం ఇష్టం లేక వూరు కున్నాను-- ఇంతలో మీ పెదిమలు అస్పష్టంగా కదిలాయి. ఇంత చలిలో శరీరమంతా చెమట పట్టింది. నేను కంగారు పడి మిమ్మల్ని లేపబోయే సరికి, "మీరే లేచి 'ఉమా!' అంటూ గట్టిగా నన్ను పట్టుకున్నారు."
గిరికి తనకు వచ్చిన కల గుర్తు వచ్చింది. నవ్వు కున్నాడు. మనసులోని భావనల అనుసరించే కలలు వస్తాయి."
ఉమ అతనికి కాఫీ అందించింది.
"ఇక్కడ మంచి హొటలయినా లేదు.స్వీట్స్ దొరుకుతాయి కానీ, అవీ ఏమంత బాగుండవు. కొంచెం సేపాగి ఏదైనా, తయారు చేస్తాను.
"ఏం వద్దు. మీరు వంటలో లీనమయితే, నేను ఉండే , ఈ కాస్సేపటి లోనూ, ఎవరితో మాట్లాడనూ? పైగా నాకిప్పుడు ఆకలిగా లేదు, ఉమ ఇంకా వాదించకుండా వూరుకుంది. ఆమెకు కూడా అతడు చెప్పబోయే విషయాలని వినాలని చాలా కుతూహలంగా ఉంది.
గిరి ముఖం కడుక్కుని తయారయి 'అలా బయటకు పోయి, మాట్లాడుకుందాం .' అన్నాడు.
"అలాగే! కానీ మీరు కోటు వేసుకుని మఫ్లర్ చుట్టుకోండి. లేకపోతె, వచ్చేసరికి గడ్డ కట్టుకు పోతారు."
ఉమ తల మీదుగా వంటి నిండా కాశ్మీరు శాలువా కప్పుకుంది. లోపల స్వట్టర్ వేసుకుంది. అయినా చలికి ఆమె శరీరం కొద్దిగా వణకడం గమనించి, గిరి నవ్వుతూ "ఇంకా ఇక్కడి వాతావరణం మీ కలవాటు కాలేదా?' అన్నాడు.
"ఏం?' మీకప్పుడే అలవాటయిందా?"
"మేం మోటు వాళ్ళం-- వడగళ్ళు కురుస్తున్నా నిప్పులు కురుస్తున్నా సహించగలం."
'అది మొటుతనం కాదు. మీ వోర్మీ."
గిరి నవ్వి వూరుకున్నాడు.
వాళ్ళిద్దరూ నడుస్తుంటే దారిలో ఒక చోట చిన్న పిల్లలు ఆటలాడు కుంటున్నారు. అందులో మూడేళ్ళ పిల్లవాడు ఒక పుల్ల ముక్కను తుపాకీగా చేసుకుని గురి పెడ్తూన్నట్లు అభినయించి, నోటితో "డాం! డాం!' అంటున్నాడు. ఆ దృశ్యం గిరికి కూడా చూపించి ఉమ ఈ చైనా వాళ్ళు ఎంత పుణ్యాత్ము లో చూడండి. మన దేశంలో మూడేళ్ళ పసి వాడి దగ్గర్నుంచీ నూరేళ్ళ ముసలమ్మ వరకూ ఇంతటి చైతన్యాన్ని కలుగ చేసారు. నిద్రపోతున్న మనలను మేల్కొలిపారు. మన స్వాతంత్ర్యపు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేసారు. ఇంతటి ఉపకారం మన మిత్రులు కూడా చేయలేరు." అంది.
"మీరు అసలైన హిందువులా మాట్లాడారు. కీడులో గూడా మేలును గమనించటం హైదవుల లక్షణం."
"నిజమే! ఏ జాతి కైనా కొన్ని సామాన్య లక్షణాలుంటాయను కుంటాను. తమ లోపాలను తాము గురించ గలిగే ఆత్మ పరీశీలన , వాటిని ఒప్పుకోగలిగే స్తైర్యమూ , త్యాగ దీక్ష, విపరీతమైన ఉద్రేకమూ , ఆరంభ శూరత్వమూ , నిర్లక్ష్యమూ , అలసటా , మన జాతి సామాన్య లక్షణాలనిపిస్తుంది నాకు."
గిరి ఆలోచిస్తూ నడవ సాగాడు. అక్కడ ఒక భవనం వైపు చూపిస్తూ ఉమ "అదుగో అదే మా మిలటరీ హాస్పిటల్ ఇక్కడ అత్యవసర మైన కొంత ట్రీట్ మెంట్ జరిగాక, జోర్ హాట్ ' పంపిస్తాము. లేకపోతె, స్థలం సరిపోదు. ఈ సైనికుల మధ్య మా మనసు కూడా విచిత్రంగా ఉత్తెజమవుతుంది. ప్రతివారి మనసులోనూ, ఒకటే కోరిక. తన దేశం సంరక్షించుకోవాలని మృత్యు ముఖం లో ఉన్న ఏ ఒక్కడి నైనా, ఏం కావాలని అడిగినప్పుడు , యుద్ద రంగంలో ఉన్న తన తోటి సైనికుల కు తగిన సౌకర్యాలను అన్ని విధాలుగా కలిగించ వలసిందిగా కోరుకుంటాడే గాని ఏ ఒక్కడూ, తన కుటుంబాన్ని గురించైనా తలవడు. తమ బోటి సైనికులే తమ కుటుంబము -- దేశ సౌభాగ్యమే తమ సౌభాగ్యము అన్నట్లు ఉంటారంతా! ఏ మాత్రం కోలుకున్నా, మళ్ళీ వెంటనే యుద్ద రంగానికి పరుగెత్తాలని అత్ర పడతారు. మేము విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరించినా , వినిపించుకోరు. వీరి త్యాగ నిరతి ముందూ, వీరి కష్టాల ముందూ మనమూ, మన కష్టాలూ ఎంత ఆల్ప మైనవో అనిపిస్తుంది -- కారణం ఏదైనా, ఇక్కడికి వచ్చి, వీళ్ళ కోసం నేను చెయ్యగలిగింది చేస్తున్నందుకు , నాకు చాలా తృప్తిగా ఉంది.' అంది.
