Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 18

 

                                    7
    సుందర్రావు తో తార విషయం ప్రస్తావిస్తానని తారకు, అరుంధతి వాగ్దానం చేసింది గానీ, ఆనాడు తార ఫోన్ చేసేవరకూ ఆ విషయమే మర్చిపోయింది. పూజా పుష్పం లాంటిది తార! అతి సాహసంతో జీవితపు సవాలు నెదుర్కొని తన జన్మ సఫలం చేసికోవటానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో ఆమెకు తాను చెయ్యగలిగిందేమైనా ఉంటె, తనకు చాలా సంతోషమే! ఆనాడే రవి ద్వారా తననొకసారి కలుసుకొమ్మని సుందర్రావుకు కబురు చేసింది. కబురు అందుకొన్న వెంటనే వచ్చాడు సుందర్రావు.
    "నన్ను రమ్మని కబురు చేసావా?"
    ఆరోరకంగా నవ్వుతూ అన్నాడు సుందర్రావు. ఆ నవ్వును చూసి మనసులోనే అసహ్యించుకొంది అరుంధతి.
    "అవును! తార విషయంలో నువ్వు నిష్కారణంగా, నన్నిరికించావు. ఆ విషయం మాట్లాడటానికే పిలిపించాను."
    "ఓ! ఏమంటుంది తార?"
    "నువ్వూ బాగా ఆలోచించు బావా! రవి తెలివి గలవాడు. డాక్టర్ శ్రీధర్ అతనికి ఆర్ధిక సహాయం చేస్తానని మాటిచ్చారు. అతడు, తప్పక పైకి వస్తాడు."
    "ఈ సంగతి నేనూ విన్నాను. నీ మాట కాదనలేక శ్రీధరే అతనికి సహాయం చేస్తానన్నారుట కదూ! లక్కీ ఫెలో!"
    అరుంధతి మనసు భగభగలాడింది. ఈ 'లక్కీ ఫెలో' విశేషణం ఎవరికి, ఎందుకు వాడినట్లూ? కొన్నిసార్లు భాష కంటే , హవభావాలే మనో భావాన్ని సమర్ధంగా వ్యక్తీకరించగలవు. ప్రయత్నం మీద తన చికాకును నిగ్రహించుకోంది అరుంధతి --  మాములుగా "నీ కేలా తెలుసూ?" అని అడిగింది.
    సుందర్రావు అనవసరంగా నవ్వాడు.
    "మనం ఎంత రహస్యంగా ఉంచాలనుకొన్నా కొన్ని విషయాలు అందరికీ తెలియక మానవు."
    అరుంధతి రోషాన్ని అణచుకోలేకపోయింది. "నేను దాచాలని అనుకోలేదు. ఇందులో రహస్యమూ లేదు. అవును, నువ్వన్నట్లు అందరికీ అన్ని విషయాలో తెలుస్తూనే ఉంటాయి. ఎదుటి వ్యక్తుల్ని నొప్పించటం ఇష్టం లేని వారు తమకు తెలిసిన విషయాలు కూడా తెలియనట్లు నటిస్తారు. క్షుద్రమైన ఈర్ష్యతో తమను తామే దహించుకొనేవారు మాత్రమే తమకు తెలిసిన విషయాలను ఎలా ఉపయోగించు కొందామా అని చూస్తుంటారు.
    రూక్షంగా అన్న అరుంధతి మాటలకు ఉలికి పడ్డాడు సుందర్రావు. అరుంధతి ఇంత వాడిగా మాట్లాడుతుందని అతని కిప్పుడే ప్రధమంగా తెలిసింది. అరుంధతి ని అనునయించడానికి ప్రయత్నిస్తూ "నన్ను పొరపాటుగా అర్ధం చేసికోకు అరుంధతీ! ఈ విషయం నాకు తెలిసిందని అన్నా నంతే! పోనీలే! నేను నిన్ను నొప్పిస్తే క్షమించవూ? కలలోనైనా నేను నీ మనసు నొప్పించలేను" అన్నాడు.
    "మీ కన్నీళ్లు చూడలేను." అన్న శ్రీధర్ మాటలు ఎంత హాయిగా అనిపించాయో, సుందర్రావు మాటలు కంత రోత కలిగింది. సంభాషణ మార్చింది.
    "తార నీ అంగీకారం దొరకదేమోనని భయపడుతుంది. ప్రేమ విలువ తెలుసునన్నావు మరి, ఆ ప్రేమ జీవుల నాశ్వీరదించు!"
    "అరుంధతీ! నువ్వొక విషయం మరిచి పోతున్నావు. జీవితంలో అన్ని హంగులు ఉండి స్ప్రింగ్ మంచం మీద మఖమల్ దిండ్ల నానుకొని, ప్రేమ కోసం పరితపించడం వేరు! ప్రేమ, ప్రేమ, అంటూ నిద్తావసరాలకు కూడా తడుముకోవలసి రావటం వేరు! ఏమంటావ్?"
    అరుంధతి మనసులో చీదరించుకొంది. అయినా శాంతంగా , "ఇప్పుడు మన తారకు మరీ అంత దుర్గతి లేదు కదా!" అంది.
    "ఎందుకు లేదూ? రవి మహా అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్ న తీసికొంటాడే అనుకో! అంతమాత్రం చేత అతనికి మంచి ఉద్యోగం దొరుకుతుందని ఏమిటీ? ఫస్ట్ క్లాస్ ల వాళ్ళని హాయిగా వెనక్కు తొసెసీ పలుకుబడితో ధర్డ్ క్లాస్ ల వాళ్ళు ముందుకు రావచ్చు. ఇది మన దేశపు అదృష్టం. దేశంలోని వ్యక్తుల శక్తులను సక్రమంగా దేశం కోసం వినియోగించుకోగలిగే శక్తి ఇంకా మన ప్రభుత్వానికి రాలేదు. అదీగాక సుందర్రావు చెల్లెలు, ఇంకొకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే, వారాల కుర్రాణ్ణి వివాహం చేసికొంటుందా? నా పరువేం కావాలి?"
    సుందరావు తో మాట్లాడిన కొద్దీ , అరుంధతి కీ అతని పట్ల సాధారణ, స్నేహ భావం కూడా నశించి, అసహ్యం పెరగసాగింది. ఆమె సహనం నశించింది.
    "నీ యిష్టం! తార మాత్రం తన నిర్ణయం మార్చుకోనని చెప్పేసింది. శ్రీధర్ గారు రవికి సహాయం చెయ్యక పోయినా, తన నిర్ణయం మర్చుకోనేది కాదు. మనసు సమాధాన పరచుకొని, చెల్లెల్ని ఆదరిస్తావో, నీ చెల్లెల్ని నీకు కాకుండా చేసి కొంటావో , నువ్వే నిర్ణయించుకోవాలి."
    ఈ మాటలు వింటూనే సుందర్రావు మొహం తెల్లగా పాలిపోయింది. ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయాడు. అరుంధతి అక్కడి నుండి లేచిపోయింది. చాలాసేపటికి వెంకట లక్ష్మీ ద్వారా సుందర్రావు పిలుస్తున్నాడని తెలిసి అరుంధతి వచ్చేసరికి సుందర్రావు చిరునవ్వుతో "అరుంధతి! నా మనసు మార్చుకున్నాను. రవీ తారలను మనసారా ఆశీర్వదిస్తున్నాను. తారను దూరం చేసికోలేను." అన్నాడు.
    అరుంధతి మొహం వికసించింది. వెంకతలక్ష్మీ తెచ్చిన కాఫీని తానె స్వయంగా సుందర్రావు కు అందించింది.
    
                             *    *    *    *
    శ్రీధర్ వ్రాసిన వ్యాసం "ఇలస్త్రేటెడ్ వీక్లీ" లో ప్రచురించబడింది. "ఈనాటి మన వివాహలు " అనే శీర్షిక తో ఆంగ్ల భాషలో వ్రాసాడు. దీని మీద అంతులేనన్ని విమర్శలు వచ్చాయి. కొందరు అద్బుతంగా ఉందంటే, మరికొందరు దారుణంగా ఉందన్నారు. 'అబ్బ! ఎన్ని నిజాలు ఎంత సూటిగా చెప్పాడూ?" అని కొందరు ఆశ్చర్యపోతే , "వివాహ వ్యవస్థనే, కూకటి వేళ్ళతో పెల్లగించే లాగున్నాడ" ని మరికొందరు గుండె బాదుకోన్నారు.
    అరుంధతి కూడా ఆ వ్యాసం చదివింది. అదేమీ చిత్రమో , అందులో ప్రతి వాక్యమూ తనను చూసే వ్రాసారా అనిపించింది. ఆమాటే శ్రీధర్ తో అంది.
    శ్రీధర్ నవ్వాడు.
    'అలా అనిపించేది మీ ఒక్కరికే కాదు. ఇంచుమించు అందరికీ! అలా అనిపించేలా వ్రాయగలిగానంటే నేను కొంత సమర్ధుడి నే నన్నమాట!"
    "కానీ, ఎంత గొడవ లేవదీసారు? దానిమీద ఎన్ని వాదోపవాదాలు?"
    "ఈ రకంగా వ్రాసి నేనందరినీ మెప్పించలేనని నాకు తెలుసు! కానీ, ఒకరి మెప్పుకోసం నేను వ్రాయలేదు. నావైన ఆలోచనలు నాకున్నాయి. అని చెప్పగల భాష ఉంది. అందుకని చెప్పాను."
    "కానీ డాక్టరు గారూ! సంఘ శ్రేయస్సును ఆలోచించవలసిన బాధ్యత కూడా రచయిత మీద ఉంది కదా! హిందూ ఆధ్యాత్మిక తత్వానికి పట్టుకొమ్మయిన వివాహ వ్యవస్థ అర్ధ రహితమైన దానివిగా నిరూపించటం...."
    "ప్లీజ్! ఆగండి! మీరు నన్ను చాలా పొరపాటుగా అర్ధం చేసి కొంటున్నారు. ఒక్క మీరే కాదు. ఇంకా చాలా మంది , "వైయుక్తికమైన ఏవో కొన్ని వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని, మొత్తం వ్యవస్థ మీదికే దండెత్తటం అనుచిత' మని నన్నూ విమర్శించారు. మీరెవ్వరూ, నన్ను సరిగా అర్ధంచేసికోవడం లేదు. సాంఘిక సంక్షేమానికి వివాహం అత్యావశ్యకమనే వారిలో నేను మొదటి వాడిని. శాంతి, సౌఖ్యాలతో కూడిన చల్లని సంసారం కంటే మానవుడు కోరుకోదగింది లేదని నా గట్టి నమ్మకం. అయితే, నేననేది , అంటున్నది ఈనాడు మన మందరమూ, ఈ వివాహపు ప్రధానోద్దేశాన్నే మరిచి పోతున్నామని- ఆ కారణంగా దీని ప్రయోజనం మన చేతి వీరకాయ వంతుగానే సిద్దిస్తుందని.
    పరీక్షిన్మహరాజుకు జడిసి రూపాయి నాణెం లో ప్రవేశించిన కవి పురుషుని ధర్మమా అని ఈనాడు మనం జీవితంలో ప్రతి అంశాన్ని రూపాయి నయా పైసలలోకి మార్చి దాని విలువను కొలుచు కొంటున్నాను. అత్యంత సున్నితమూ, మానవ జీవితమూలమూ , జీవన మాధుర్యమూ అయిన స్త్రీ పురుష ప్రేమానుబంధాన్ని కూడా మనం అతి దారుణంగా రూపాయలలోకి మార్చేయ్యటానికి సిద్దపడి పోయాము. చిన్నప్పుడు భర్త హరి సుభాషితాల్లో చదువుకొన్న పద్యం గురు కొస్తుంది.
    "నీరము తప్త లోహమున నిల్చి యవామకమై
            నశించునా
    నీరమే ముత్యమట్లు నళీన దళ సంస్థితమై
            దనర్చునా
    నీరమే శుక్తిలోబడి మణిత్యముగాంచు
            సమంచిత ప్రభన్
    ...................'
    నిత్యజీవన సంగ్రామం లో అలసి సొలసిన మానవుడు హాయిగా సేద దీరటానికై భగవానుడు కురిపించే స్వాతి జల్లు ఈ స్త్రీ పురుష ప్రేమానుబంధం . మన హృదయాలను రూపాయి నాణేల తోనూ వ్యర్ధమైన వర్గ విభేదాలతోనూ, మూసేసుకొని,అపురూపమైన ఆ స్వాతి జల్లును వ్యర్ధం చేసికోవటమో,మన హృదయాలనే ముత్యపు చిప్పలుగా చేసికొని , భగవానుడు దయతో ప్రసాదించిన ఆ వరాన్ని గ్రహించి మనకు ఆనందమయ మార్గాన్ని చూసే సమంచిత ప్రభల నీ నే దివ్య మణిగా రూపాదించుకోవడమో , మన చేతులలోనే ఉంది.
    నీనిదే చెప్పాను. ఇది మన సాంఘిక సంక్షేమానికి భంగం కలిగించేటంత దారుణమైన విషయమా?"
    శ్రద్దగా డాక్టర్ చెప్పే మాటలు విన్న అరుంధతి కొంచెం సేపు ఆలోచిస్తూ కూర్చుంది.
    "అయినా ఇట్లాంటి సున్నితమైన విషయాలను సున్నితంగానే చెప్పాలి. మీరు మీ వ్యాసంతో మరీ పచ్చిగా వివరించారు. శరత్ బాబును చూడండి! సంఘం ఏ మాత్రమూ ఆమోదించని విషయాలను సంఘమంతా తలవూచేలాగ ఎలా చెప్పగలిగారో?"
    "కాంతవలె బోధించేది కావ్యం. నేను వ్రాసింది వ్యాసం. అదలా ఉంచి మీరు స్త్రీలు . నేను పురుషుణ్ణి. ఈ విషయంలో ఇంతకంటే నేను మాట్లాడలేను."
    అరుంధతి కనుబొమలు ముడి పడ్డాయి.
    "నేను స్త్రీనని మీరు కష్టపడి గుర్తు పెట్టుకొనక్కర్లేదు. ఆ విషయం మరిచి పోవటానికి ప్రయత్నించండి."
    "మీరు స్త్రీ అని మరిచి పోవటానికీ ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం అసలు గుర్తించకుండా ఉండటానికే కష్ట పడుతున్నాను. కానీ, ఎలా? మీరు ఉండుండి మెరుపులా నవ్వుతారు. మాట్లాడుతూ , మాట్లాడుతూ చటుక్కున కనురెప్పలు వాల్చుకొంటారు. ఏమైనా కొంచెం మాటలు, అటు, ఇటు దొర్లితే ముఖమంతా ఎర్రగా చేసి కొంటారు. అడుగడుగునా , మీ స్త్రీత్వం ఇలా ప్రత్యక్ష మవుతుంటే నేనెలా మరిచిపోగలమా?"

 

                        


    అరుంధతి చటుక్కున తన ముఖాన్ని రెండు చేతులతో దాచుకొంది.
    "అదిగో!" శ్రీధర్ నవ్వాడు.
    అరుంధతి చాలా సేపటి వరకూ, వంచిన తల ఎత్త లేకపోయింది. తరువాత శ్రీధర్ వంక చూడకుండా నెమ్మదిగా అంది. "స్త్రీ పురుషుల బేధానికి ప్రాధాన్యత నీయకుండా, సాధారణ స్నేహాన్ని పాటించగలగటం , సాధ్యమేనని అనుకోనేదాన్ని. నా సిద్దాంతం సరి అయినది కాదన్న మాట!"
    "ఎందుకు కాదూ! రవి మిమ్మల్ని 'అక్కయ్యా!' అని పిలిచినా మీరు సుందర్రావును 'బావా!' అన్నా మొత్తం మీద వారిరువురు పట్లా మీకు కలది స్నేహభావమే! వాళ్లతో మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని చాలాసార్లు చూసాను. అప్పుడు మీరేన్నడూ , మీ స్త్రీత్వన్నింతగా గుర్తు తెచ్చుకొని, వాళ్ళను అగ్ని పరీక్షకు పెట్టలేదు."
    "దోషం మీ సిద్దాంతంలో లేదు. మీలో ఉంది."
    "నాలోనా? నేను తప్పు చేసానా?"
    "మీలో అంటే, మీ భావన లోనిని! అంటే మనమధ్య ఉన్నది స్నేహం కాకపోవచ్చునెమో అని ...."
    శ్రీధర్ సాహసించి  అరుంధతి ముఖంలోకి చూసాడు. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. వెంటనే సోఫాలోంచి లేచి గబగబ బయటకు వెళ్ళిపోయింది.
    ఆమెను అనటానికి కానీ, వెనక్కు పిలవటానికి కానీ ఏ మాత్రమూ ప్రయత్నించలేదు శ్రీధర్. బరువుగా నిట్టూర్చి వూరుకున్నాడు అరుంధతిది యెంత సున్నిత హృదయమో , అర్ధం చేసికొన్న శ్రీధర్ తన మాటల కామె ఎంత వ్యధ పడుతుందో ఊహించకపోలేదు. బహుశ ఇకముందు ఆమె తనను కలుసుకోక పోవచ్చును కూడా! అరుంధతి వచ్చిన నాడు తన మనసు వరద గోదావరి లా పరవళ్ళు తొక్కుతుంది. సాధారణంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడని తన కామెతో గంటలు, సెకను లా గడిచి పోతాయి. ఏరోజు కారోజు ఆమె కోసం ఎదురు చూడటం తోనే ఏదో ఆనందం.
    గడాంధకార సదృశమయిన తన జీవితంలోని ఈ చిన్న తేజో కిరణాన్ని కూడా తన చేజేతులా దూరం చేసికొన్నాడు. ఇంక తన ఎడారి బ్రతుకే తనకు మిగులుతుంది. అయినా అరుంధతిని మేల్కొల్పక తప్పదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS