"నిజమే ఆ రోజులానే అన్పించింది. కాని ఇప్పుడా అమ్మాయి మొండితనం నిర్లక్ష్యం తెలుసుకున్నాక తల్లితండ్రులు, కులం, సాంప్రదాయం ఎరిగి పెళ్ళిచేసుకోవడమే మంచిదని పిస్తూంది."
"తాను నీ ఉత్తరాన్కి జవాబియ్యక పోవడం నేరమే ఒప్పుకుంటాను. రాధమీద, నాకూ కోపం వస్తూంది. కాని మా అమ్మ సంకర జాతి పిల్లను ఎప్పుడూ తను కన్నపిల్ల లా ప్రేమతో పెంచేది మా అమ్మకు చాలా కట్టుబాట్లూ నియమాలు ఉండేవి. నీకూ తెల్సు. అమ్మ ప్రాణస్నేహితురాలు కూతురు రాధ. రాధతల్లి ఒక వీరవనిత అనీ, ఆమె చాలా పవిత్రురాలనీ. అమ్మ నాన్న గారితో అనడం చాలాసార్లు విన్నాను."
"ఆమె పేరు?"
ఆ పేరు అమ్మ ఎప్పుడూ ఉచ్చరించడం మేం వినలేదు. రాధకూ తెలియదేమో! రాధ అమ్మ......అనిమాత్రమే నాన్నగారితో అనడం విన్నాను. నీ కిదివరకు చెప్పలేదు. రాధ మా ఇంటి కెలావచ్చిందీ?
చెప్తా విను. ఆరోజు....నేనూ అన్నయ్యా స్కూలు నుంచి వచ్చి అన్నాలు తింటున్నాం. అమ్మతో రమ్మని నాన్నగారు తన గదిలోంచి కబురు చేశారు. పావుగంటలో తిరిగివచ్చిన అమ్మ ఊరెళ్ళి వస్తాను. జాగ్రత్తగా ఉండండి. అని మాకూ, నాయర్ కీ పనివాళ్ళకీ చెప్పి తొందరగా వెళ్ళిపోయింది. మర్నాటి ఉదయానికి నా కింకా బాగా గుర్తు నీలం పువ్వుల పరికిణీ తెల్ల జాకెట్టూ చక్కని అందమైన అమ్మాయిని వెంట బెట్టుకుని వీధిగేటు తీసుకువస్తూంది అమ్మ. ఎదురు వెళ్ళి అమ్మా! ఆ అమ్మాయెవారమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి బాగా ఏడుస్తున్నట్టుంది మొహమంతా వాడి తడిగా ఉంది. "నీకు చెల్లెల్ని తెచ్చాను. నాన్నగారున్నారా? ఇంట్లో" అని అడిగింది. ఉన్నారని తల ఊపాను చేతి సంచితో వెళ్ళిన అమ్మ కొన్ని సామాను వెంటబెట్టుకు వచ్చింది. సమన్లు ఇంట్లో పెట్టించమని ఫ్యూన్ కి చెప్పి నేరుగా ఆ అమ్మాయిని తీసుకు నాన్నగారి గదిలోకి వెళ్ళి పోయింది. నేను వెంట వెళ్ళబోతూంటే బైట ఉండమని కసిరింది. తలుపు సందుల్లోంచి వాళ్ళు లోపల ఏం మాట్లాడుతున్నారో ఏమిటి చేస్తున్నారో అని కుతూహలంగా చూడసాగాను. అమ్మ చాలా నెమ్మదిగా నాన్నగారితో ఏమో చెప్తూ చెమ్మగిల్లుతూన్న కళ్ళు వత్తుకుంటూంది. నాన్నగారు ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ "నీ పేరేమిటమ్మా అని అడిగేరు 'రాధ'. అందా అమ్మాయి. అలా అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. నాన్నగారు నెమ్మదిగా ఆ అమ్మాయి తల నిమురుతూ. ఛ, ఛ ఏడవకు. మీ కక్కీ నేనూ ఉన్నాం కదమ్మా. నీకేం భయంలేదు. మా అబ్బాయిలున్నారు వాళ్ళతో స్కూలుకెళ్ళి చదువుకుందువుగాని అన్నారు. ఆ అమ్మాయి తల నిమురుతూ లాలింపుగా, రెండు మూడు రోజులకి మాతో బాగా పరిచయమయి పోయింది రాధ, తాను చాలామంచిపిల్ల, అమ్మా నాన్నగారూ, అన్నయ్యా నేనూ, మా అందరిమాటా వినేది. చాలా వినయంగా మర్యాదగా మెసిలింది కృష్ణా! రాధ ఇప్పుడిలా నీకు భార్య అయికూడా ఉత్తరం వ్రాయడాన్కి ఏమిటి అభ్యంతరం? ఎందుకు వ్రాయదో తఃనకూ, ఆమె సంగతి వ్రాయమని అన్నయ్యకూ వ్రాస్తాను, జవాబు తెప్పిస్తాను. నువ్వు అనవసరంగా మసస్సు పాడుచేసుకోకు. మనం దేశం తల్లి తండ్రులనూ వదిలి ఎందుకు వచ్చామో గ్రహించు. అక్కడ వదిలిన వాళ్ళ గురించి ఆరాటపడ్తూ ఇక్కడ నువ్వేం సాధించలేవు.....అలా దిగాలు పడి పోతూంటే అనారోగ్యమో పాడో అనుకున్నాను. ఇదా సంగతి.... రోజూ కలలోకి వస్తూందేమిటిరా రాధ? హాస్యంగా నవ్వుతూ అడిగాడు వాసూరావ్.
"పోదూ అన్నీ బాగా మాట్లాడి నవ్వుతాలు లోకి దిగుతావ్. ఉత్తరం వ్రాయి. అక్కడి నుంచి వచ్చిన జాబు నాకు చూపించు" అన్నాడు రామకృష్ణ.
అలాగే ఇవాళే వ్రాస్తాను అన్నాడు వాసూరావ్.
* * *
చక్కని అందమైన అబ్బాయిని ప్రసవించింది శాంత. గులాబి చేతులతో, కోమలంగా, పనసతొనలా పచ్చగా ఉన్న కొడుకుని ముచ్చటగా చూశాడు శ్రీనివాసరావు. వయసు మల్లిన జానకమ్మకెంతో సహాయంగా ఉంది రాధ. నడుం వంగిన రంగనాధం. కళ్ళజోడు సరిజేసుకుని అద్దాలు తుడిచి మళ్ళీ కళ్ళకు తగిలించుకుని. మనవడిని చూడబోతూ. మన రాధమ్మ రంగులో ఉంటాడా శాంతా! అడిగారు.
అచ్చం అలాగే ఉన్నాడు మామయ్యా ఎత్తుకుంటారా? ముసిముసిగా నవ్వుతూ అడిగింది శాంత.
పంచాంగం చూసి, మంచిరోజున...ఆ...వాణి లేపకు అంటూ వెళ్ళిపోయారు రంగనాధం.
బాలసారెకు కామేశ్వరిని బ్రతిమిలాడి తీసుకువచ్చాడు శ్రీనివాసరావు.
నామకరణం ఏమిటి బాబూ అన్న పురోహితుని ప్రశ్నకు రమాకుమార్. అన్నాడు శ్రీనివాసరావు, జానకమ్మా, రంగనాధం, శాంత అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా శ్రీనివాసరావు మొహంలోకి చూశారు.
అతని వదనంలో విషాదచ్చాయలు, వాతావరణమంతా ఒక్కక్షణం గంభీరంగా నిశ్శబ్దమయింది.....కానీయండి బాబూ ఎందుకాలశ్యం రమాకుమార్ అని వ్రాయించండి. అన్నారు రంగనాధం.
"నాన్నా మీకు.... అంటూ తలెత్తి తండ్రి వైపు చూశాడు శ్రీనివాసరావు.
నాకా పేరు ఇష్టమే బాబూ.....అన్నారు రంగనాధం నవ్వబోతూ.
బంధువులూ, స్నేహితులూ, విందులయి వెళ్ళిన తర్వాత అడిగింది కామేశ్వరి.... నాన్న పేరు పెట్టక రమాకుమార్ ఏమిట్రా తమ్ముడూ? అని.
మరొకడు పుడితే తప్పకుండా నాన్న పేరు పెడ్తానక్కయ్యా? లేకపోతే రాధ కొడుక్కి రంగనాధం అని నామకరణం వ్రాయిద్దాం" అన్నాడు నవ్వుతూ.
"బాగుంది.....అంతల సొంతలదాని......
అక్కయ్యా.....అలా మాట్లాడి నా మనస్సు నొప్పించకు రాధ నా కూతురు.... దైవం అనుకూలించి నువ్వూ బావా రామకృష్ణా అంగీకరిస్తే నీ కోడలు. అప్పుడు మనం కామన్ గా అమ్మా నాన్నా పేర్లు పెట్టిద్దాం" అన్నాడు నవ్వుతూ.
ప్చ్ నీ వెర్రి నీది. పోనీలే ఏదో సరైన పిల్లే. తాను మీ ఇంట్లో కాలుపెట్టింది.....ఎప్పుడైనా శాంతకి పిల్లలు పుడతారనుకున్నామా?....రమ పుట్టాడు.
"రమ..... నోట్లో గొణుక్కున్నాడు శ్రీనివాసరావు అందరూ అలా పిలుస్తారు కాబోలు అనుకోని.
ఆ రోజు రామకృష్ణ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారందరూ. వారి మాటల సారాంశం కామేశ్వరి కొడుకు పైదేశం వెళ్ళినట్టూ. వీళ్ళకి ఉత్తరాలు సరిగా వ్రాయడం లేదనీను.
కామేశ్వరి ఉన్న రెండురోజుల్లో రాధ చనువుగా ఆప్యాయతగా ఆమెతో మాట్లాడబోయింది. రాదను చూస్తూనే ఆమె మాటవింటూనే మొహం ముడుచుకునేది కామేశ్వరి.
కామేశ్వరికి ఖరీదైనచీర కొన్నాడు శ్రీనివాసరావు. ఆమె వెళ్ళిన తరువాత రాధకూ విలువగల పట్టుచీర తెచ్చాడు రామకృష్ణ. అంటే ఏ రామకృష్ణో, ఎక్కడ చదివి ఏ దేశం వెళ్ళాడో తెల్సు కోవాలనే కుతూహలంలో. సిగ్గూ సంకోచం అడ్డుతగుల్తూ ఉంటే ఓరోజు శాంతనిలా అడిగింది రాధ.
పిన్నీ అత్తయ్య కొడకుపేరు రామకృష్ణా? అని, నవ్వింది శాంత కాదంటూ?
మరి? ..... కళ్ళు పెద్దవిచేసి ఆమెవైపు చూస్తూ అంది రాధ.
"రంగనాధం.....అంది శాంత.
మరి మీరందరూ అతన్ని రామకృష్ణా అంటున్నారు. నవ్వబోతూ అడిగింది రాధ.
మీ అత్తయ్య తక్కువ ఘటమనుకున్నా వేమిటి భర్తతో తగవులాడి నా తండ్రి పేరు నేను పెట్టుకుంటానని. ఆయనచేత నామకరణం రంగనాధం అని వ్రాయించేసింది. "వాణ్ణి అలా పిలుస్తే నా గడప తొక్కొద్ధన్నారు. ఆవిడ మామగారు. అవేం తగవులో పట్టుదలలో సంవత్సరందాకా మనింట్లోనే ఉండిపోయిందిట ఈవిడ. మీ బాబయ్యకీ అర్ధంలేని పట్టుదలలు. కాని మీ తాతగారు ఏ ఎండ కా గొడుగు పట్టేస్తార్లే. ఆవిడ మామగారిపేరు "రామకృష్ణ". అలాగే పిలుద్దాం అనీ తన కూతురు తెలివితక్కువవదనీ, మెల్లగా రాజీకి తీసుకువచ్చి ఈమెను అత్తవారింటికి పంపించారుట.
"మీరు అప్పటికి లేరా?
అబ్బే నాకు అప్పటికి పెళ్ళేకాలేదు. నేను కాపరానికి వచ్చేసరికి రామకృష్ణకి పదేళ్ళుంటాయనుకుంటాను.
అతని పేరు రామకృష్ణ కాదనగానే కొంత కుతూహలం పోయింది రాధకు, శాంతే చెప్తూంది.
ఈవిడకే కాస్త చుండు గుణాలున్నాయి కానీ ఆ అబ్బాయి చాలామంచివాడు. ఇదివరకు ఉత్తరాలు వ్రాసేవాడు. ఏన్నర్ధమయి ఎందుకో, తీరికలేదో వ్రాయడం మానేశాడు. అతనికి నిన్నివ్వాలని మీ బాబయ్య చాలా ఆశపడుతున్నారు.
ఆ సంభాషణ అక్కడితో ఆపెయ్యాలనే ఉద్దేశ్యంతో రమకి పాలు పట్టావా పిన్నీ? అడిగింది రాధ.
నా మతిమరుపు మండా, మరచేపోయేను సుమీ! పాలుపట్టి రెండు గంటలయింది కదూ. ఓ సారి ఏడవరాదూ మీ తమ్ముడు? అంది శాంత. రమా కుమార్ పడుకున్న గదివైపు నడుస్తూ.
బాగుంది పిన్నీ. వాడిదా తప్పు? నవ్వింది రాధ.
"అందరూ బాబుని రమా రమా అని పిలుస్తుంటే మీకేమీ అన్పించడంలేదా?" ఓ రోజు రాత్రి శ్రీనివాసరావు కాళ్ళొత్తుతూ అడిగింది శాంత.
