"అంటే...ఈ శనిగొట్టు దరిద్రదేవతకోసం...ఈ పాషాణపు పిసినిగొట్టు కోసం...ఈ స్వార్థపిశాచి కోసం నీ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటావా?..."
"ఏదో ఆలోచిద్దాంలే!"
వెళ్ళిపోయాడు ప్రభు.
"ఛీ!ఛీ! ఇంత నరకం పగవాళ్ళకి కూడా వద్దు ... ఇంతకింతా అనుభవిస్తుంది. అనుభవించి తీరుతుంది..." కసిగా శపించింది లక్ష్మీదేవి.
లక్ష్మీదేవి ఆవేదన నీరజకు అర్థమవుతోంది. తను చెయ్యగలిగినది ఒకటే ఉంది.
"ప్రభూ! అత్తయ్య చెప్పిన ఉపాయమే బాగుంది..."
"ఏమిటది?"
"నువ్వు ఎవరినైనా పెళ్ళిచేసుకో! కట్నంగా బోలెడు డబ్బువస్తుంది. అన్ని సమస్యలూ తీరిపోతాయి..."
"ఏం? నన్ను చేసుకోవాలని లేదా నీకు?"
"లేదు..."
"అవును, నాకు ఉద్యోగం పోతే, ఈ బీదవాడితో నువ్వూ కష్టాలు పడవలసివస్తుంది..."
"సరిగ్గా ఊహించావు - నాకు సుఖపడాలని ఉంది...బోలెడు సుఖం."
నీరజ ఆ మాటలన్న ధోరణికి ప్రభు నవ్వాడు.
"నీరజా! నేను మరొకరిని చేసుకుని సుఖపడగలనని నువ్వు అనుకోగలవేమో, కానీ నన్ను వదిలి నువ్వు సుఖపడతావని నేను ఒక్కనాటికీ అనుకోలేను. నీదగ్గిర నిజంగా డబ్బు ఉంటే నాకు కాకుండా దాచుకుంటావని కూడా ఊహించలేను. అసలే నా మనసు చికాగ్గా ఉంది. ఈ ప్రస్తావన వదిలి మనకు అయిదువేలు ఎక్కడ అప్పుగా దొరుకుతుందో ఆలోచించు..."
నీరజ ఏం ఆలోచించగలదు?
ఆ సాయంత్రమే నీలకాంత్ ప్రభుదగ్గరకు వచ్చాడు.
"ప్రభూ! అయిదువేలకోసం అనవసరంగా ఇబ్బందులలో చిక్కుకుంటున్నావా?" అన్నాడు.
"నీకెవరు చెప్పారు?"
"నువ్వు చెప్పకపోయినా నాకు నీ సంగతులు తెలుస్తూనే ఉంటాయి_ఇవిగో, అయిదువేలు తీసుకువచ్చాను."
ప్రభు కళ్ళు నీరజ కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో అంత భయం...దేనికి?
"వద్దు నీలకాంత్ ఏదో ఉపాయం ఆలోచిస్తాలే!"
"పోనీ అప్పుగానే తీసుకో ప్రభూ! నెమ్మదిగా తీర్చుకోవచ్చు_ఆపదలో నిన్ను ఆదుకోలేకపోతే, ఆ తర్వాత స్థిమితంగా ఉండలేను..."
ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు నీలకాంత్ - లక్ష్మీదేవి ముఖం ఆవిరులను చిమ్ముతోంది... తను ఇంకా అభ్యంతరపెడితే తల్లి నీరజను ఇంకా ఎన్నెన్ని మాటలంటుందోనని భయపడ్డాడు ప్రభు. అదీగాక తనకైనా మరొక మార్గం తోచటంలేదు. చెయ్యిజాపి నీలకాంత్ దగ్గర డబ్బు తీసుకున్నాడు. "థాంక్యూ!" అన్నాడు గొణుగుతున్నట్లు. నీలకాంత్ నీరజను చూసి నవ్వి వెళ్ళిపోయాడు.
ప్రభు ఉద్యోగం పోలేదు_కానీ గుసగుసలు చెలరేగాయి_అటు ఆఫీసులోను, ఇటు ఇంట్లోను స్థిమితంలేక ప్రభు గుండెనొప్పి తిరగబెట్టింది.
ఏమాత్రం లేవలేని స్థితిలో అడ్డంపడిపోయాడు.
"ఇది ఏమాత్రమూ అశ్రద్ధచెయ్యటానికి వీల్లేదు అత్తయ్యా! వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి" అంది నీరజ.
"నీకెలా తెలుసు?"
"ఈ నొప్పి రావటానికి ఒకరకంగా కారణం నేనే! అప్పుడు నాకోసం వస్తూనే కారుక్రిందపడి దెబ్బతగిలించుకున్నాడు..."
ఈ సంగతి వినేసరికి లక్ష్మీదేవి కోపం, ఉద్రేకం పట్టలేకపోయింది.
"దౌర్భాగ్యులారా! వాడి ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే! వాడిని మింగి నా కడుపున చిచ్చుపెట్టి...ఛీ! ఛీ! ఏం మాట్లాడుతున్నాను నేను?"
దేనికీ చలించలేదు నీరజ...ఎక్కడలేని ధైర్యమూ తెచ్చుకుంది. హార్ట్ స్పెషలిస్ట్ నారాయణరావుగారి హాస్పిటల్ లో ప్రభును చేర్పించింది. డాక్టర్ నారాయణరావుకు చాలా మంచిపేరు ఉంది. అయితే అతడి హాస్పిటల్ లో సామాన్యులు చేరలేరు. డాక్టర్ ఫీజు, రూం రెంట్ అన్నీ చాలాచాలా ఎక్కువగా ఉంటాయి.
"ఇప్పుడెలా చేర్చావు ఆ హాస్పిటల్ లో ... వాడి ప్రాణంమీదకు వచ్చాక, ఇప్పుడు...ఆ డబ్బు నీదయిందా?..."
లక్ష్మీదేవి మాటల్లో ఏ ఒక్కదానికీ ఎలాంటి సమాధానము చెప్పలేదు నీరజ.
ప్రభు సిక్ లీవ్ పెట్టి నాలుగయిదు నెలలు విశ్రాంతి తీసుకోక తప్పదు. తను ఏంచెయ్యాలో నిర్ణయించుకుంది.
* * *
ప్రాక్, బాబ్డ్ హెయిర్, లిప్ స్టిక్...ఈ వేషంలో నీరజను చూసి తన కళ్ళను తను నమ్మలేకపోయింది లక్ష్మీదేవి.
"అత్తయ్యా! నేను ఉద్యోగ ప్రయత్నంమీద వెళ్తున్నాను" అంది నీరజ.
లక్ష్మీదేవికి కంపరమెత్తింది.
"వాడు అలా పడివుంటే నువ్వింత విడ్డూరంగా సింగారించుకుని ఉద్యోగానికంటూ బయలుదేరుతున్నావా? ఇలా సింగారించుకోకపోతే ఆ ఉద్యోగం దొరకదా?"
"దొరకదు!"
"అదేలాంటి ఉద్యోగమో!"
"చెప్పుకోదగినంత పరువైనది కాదు."
నీరజ వెళ్ళిపోయింది ... వెనుకటి అనుభవాలతో మళ్ళీ నీరజ పేరుతోనే ఉద్యోగ ప్రయత్నం చేయటానికి భయపడింది నీరజ.
నీరజ క్లబ్ లో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నరోజులలో కొన్నికొన్ని విషయాలు తెలుసుకుంది. ధనిక కుటుంబాలలో కొందరు ఆడవాళ్ళు ఇంటి విషయాలు ఏవీ పట్టించుకోరు. పిల్లల విషయం చూసుకోవటానికి ఇంటి వ్యవహారాలూ నిర్వహించుకోవటానికి మంచి జీతాలిచ్చి, వాళ్ళు చదువూ, సంస్కారమూ ఉన్న తనలాంటి వాళ్ళను పెట్టుకుంటారు. అలాంటి ఉద్యోగాలు నాలుగయిదు ఉన్నాయని తెలుసుకుంది. ఒక్కొక్కచోటికీ వెళ్ళి విచారించింది. సేఠ్ రమణ్ లాల్ ఇంట్లో అన్నివిధాలా అనుకూలంగా తోచింది ...అతని భార్య రోగిష్టిది_ అదేం రోగమోకాని ఎప్పుడూ మంచంలో పడుకుని మూలుగుతూ ఉంటుంది... అతనికి ఇద్దరు పిల్లలు_ఒక ఆడపిల్ల ___ ఆ పిల్లకు మనస్థిమితం లేదు. పెద్ద మొద్దుగా ఉంటుంది. ఒక మగపిల్లవాడు ... వాడికి రెండు కాళ్ళూ లేవు. వీల్ చైర్ లో దిగాలుగా కూర్చుని ఉంటాడు.
"అంతకుముందు ఉన్నమనిషికి మూడువందలిచ్చాను. నీకు నాలుగు వందలిస్తాను..." అన్నాడు రమణ్ లాల్.
పని చాలా ఎక్కువ...అనారోగ్యంతో ఉన్న గృహిణిని, వెర్రిబాగుల పిల్లను, కుంటిపిల్లవాడిని చూసుకోవాలి...ఏరోజుకారోజు ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ లెక్కలన్నీ రమణ్ లాల్ కు అప్పగించాలి...వేళకు మందులియ్యటంలో కాని, అన్నపానాదులలోకాని, ఎక్కడా ఏ పొరపాటూ జరగటానికి వీల్లేదు... కానీ, నాలుగువందల జీతం బాగా ఆకర్షణీయంగా ఉంది.
