Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 18

 

    "విన్నావుగా అంతా అయిపొయింది."
    నాన్నమాట ముద్దగా వస్తున్న వైనానికి అయన నోటి నుండి తమాషాగా వచ్చిన వాసనే కారణమని రావ్ గ్రహించేడు.
    "ఒరేయ్ నాన్నా. ఓటర్లకున్న నీతి నిజాయితీ మా పెద్దలకి లేవురా. సొమ్ము తిని కృతఘులైపోయేరు. లోకం గాడు యింటికి వచ్చేట్టగదూ? వాడివిరా రోజులు. తిరుగులేదింక. ఇక ఈ ప్రజలు బాగుపడరు. ఈ ప్రజల మొహాల్ని వాడు కన్నెత్తి చూడడింక. ఇంత అమాయకమైన ప్రజలకి దేవుడే దిక్కు ఏడవండిరా ప్రజలూ!  గుండెలవిసేలా ఏడవండి .....మీ అమ్మేదిరా శ్రీనూ?"
    ఆవిడ గుమ్మం దగ్గిరే నిలబడి ఉన్నది.
    "నేనిక్కడే వున్నాను."
    "నన్ను క్షమించవే పార్వతి."
    ఆ తల్లి ఆ మాటతో పులకించిపోయింది. ఎన్నాళ్ళకి మళ్ళీ "పార్వతి " అని పిలిచేరాయన! ఆమె గబగబా వచ్చి శ్రీను పక్కన కూర్చుంది.
    "నేను తగివచ్చానే పార్వతి! ఆశ్చర్యపడకు. మనసులో బాధ ఎక్కువై పోయి బసవయ్య గాడింట్లో నాకిష్టం వచ్చినంత తాగెను. క్షమించు. ఇవాల్టితో మనం పూర్తిగా అయిపోయేం. అటు డబ్బూ, ఇటు కీర్తి -- అన్నీ దెబ్బతో టాప్ మని పేలిపోయాయి. అయిపొయింది."
    పార్వతమ్మ లేచి నిలబడింది. శ్రీను గూడా లేచేడు.
    "కాసేపు మీరు పడుకోండి. రేపు మాట్లాడుకోవచ్చు. రా. రా శ్రీనూ."
    జానకిరామయ్య ఆ మాటతో అల్లాడిపోయేడు.
    "ఒసేవ్. నాకు రేపు మాట గుర్తు చేయకే బాబూ! మీరిద్దరూ నన్ను వదిలి పోకండి. వెధవ, పెద్దాడు నాకు చేతికందకుండా పారిపోయేడు. ఇవాళ వాడుంటే వాడిని సైతం "క్షమించరా రౌడీ , నీకు అన్యాయం చేసెనని ప్రాధేయపడేవాడిని. మీ అందరికీ అన్యాయం చేసెనే పార్వతి! అందరూ నన్ను క్షమించానని మాటివ్వండి."
    "ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. నువ్వు రారా శ్రీనూ"
    రావ్ చేతిని పట్టుకు బయటికి వచ్చింది పార్వతమ్మ. తరవాత ఆ గది తలుపు వేసింది. లోపల జానకిరామయ్యగారు ఏడుస్తున్న శబ్దమై తల్లీ కొడుకులు మొహమొహాలు చూచుకున్నారు.
    "నాన్న ఏడుస్తున్నాడమ్మా" అన్నాడు రావ్.
    "అయన తప్పు చేసిన మనిషి. మైకంలో వుండి ఏమైనా చేస్తారు . శ్రీనూ! నువ్వీ పతనాన్ని చూడకూడదు. వెళ్ళి నీ గదిలో పడుకో వెళ్ళు."

            
                                                           *    *    *

    ఆ రాత్రి తెల్లవారినప్పుడు....
    మొట్టమొదట తల్లి గావుకేక విన్నాడు రావ్.
    అదిరిపడి నాన్న గదిలోకి పరిగెత్తాడు.
    నాన్న మీద పడి అమ్మ ఏడుస్తుంది. రావ్ కి ఆ క్షణంలో అర్దమైంది . అతనక్కడే కూలబడి అమ్మని చూస్తుండిపోయాడు.
    అమ్మ చెప్పిన మాట నిజం - శనిగాడు ఈ యింట్లో తిష్టవేశాడు.


                                                              5


    రెండు నెలల నించీ యింట్లోనూ బయటా శ్రీనివాసరావుని చూచినవారంతా ఆశ్చర్యపోతున్నారు.
    "నాన్నా శ్రీనూ! పుల్లలా అయిపోతున్నావేంరా?"
    "మీ ఆలోచనలు కట్టిపెట్టి కొంచెం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి"
    "ఏమిటి సార్! బొత్తిగా పూచిక పుల్లై పోతున్నారేమిటి మరీను."
    శ్రీనివాసరావుకి వాళ్ళందరూ అంటున్నది నిజమేనేమో ననిపిస్తుంది.
    అతనికి మధ్య విపరీతమైన ఆకలి కలుగుతుంది. దరిద్రుడికి ఆకలెక్కువని అతను కొన్నాళ్ళూ సరిపెట్టుకున్నాడు. కాని, ఆ ఆకలి కేవలం దరిద్రం వల్లనే కాదని, శరీర యంత్రాంగంలో ఎక్కడో ఒకచోట ఏదో పెద్ద లోపమే చోటు చేసుకుందని అతను నమ్మేడు.
    డాక్టరు చేత తనకీ చేయించుకునెందుకు అతనికి దడగా ఉన్నది.
    ఈ డాక్టర్లు -- వృత్తి ధర్మమే అది కాబోలు -- దగ్గిరికి వచ్చిన మనిషిని తిన్నగా పోనీరు. జబ్బు ఒకటి అంటగట్టి మందులు పుచ్చుకోమంటారు. అక్కణ్నుంచి ఆ జబ్బు తినే డబ్బుకి అంతుండదు.
    ఈ అనుమానంతో అతనే డాక్టర్ని పలకరించలేదు.
    ఒకరోజు - అతను అద్దంలో చూస్తూ తల దువ్వుకుంటుండగా , కంఠం కిందగా చాలా అనవసరంగా ఉబ్బి ఉన్నట్టు గమనించి అదిరిపడ్డాడు. ఆరోజులగాయతూ వీలు చిక్కినప్పుల్లా అద్దంలో ఆ ప్రదేశాన్ని చూచుకోవడం అలవాటు చేసుకున్నాడు.
    ఒంట్లో నిస్సత్తువ , గుండెల్లో దడ - ఈ రెండు లక్షణాలూ ఆకలితో పోటీ పడుతున్నట్లు కూడా అతను గమనించేడు'.
    అతను సైకిలమ్మి, అమ్మకి మందూ, పిల్లలకి చిన్న సైకిలూ కొన్న నాటి నుంచీ కాలినడకన ప్రారంభించేడు. ఈ నడకతో అతను సతమతమైపోతున్నాడు.
    సైకిలమ్మిన అనందం ఆ మొదటి నెలతోనే దూరమైంది. మళ్ళా యిప్పటికీ అమ్మకి మందు కొననే లేదు. పిల్లలకి కొన్న కొత్త సైకిలిప్పుడు మూలానే వుంటుంది.
    శ్రీనివాసరావుకి మధ్య మాయదారి ఆలోచనలు తక్కువైనా, అనారోగ్యం మూలంగా నష్టం కాబోయే డబ్బు మీద బెంగ పెరిగి పద్దదై మనిషి మొత్తాన్నీ క్రుంగదీస్తుంది. అయితే, ఈ బెంగని ఆటను యితరులకు తెలీనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వున్నాడు.
    అతను, ఆఫీసుకు ఆ రోజు కూడా ఆలస్యంగానే వెళ్ళేడు. రిజిస్టర్ లో సంతకం పెట్టి సీటు కు వచ్చి కూర్చున్నాడు.
    అప్పటి కింకా ఆఫీసరు రాలేదు. పార్టీలు వచ్చేరు. వాళ్ళంతా డబ్బు అవసరంలో ఉన్న డబ్బు మనుషులు కనక, వాళ్ళ పనేదో ముందు చేసి గాని తల యెత్తెందుకు వీల్లేదు.
    అతనికీ మధ్య పార్టీల మీద కోపం బలిసిపోతుంది. వాళ్ళందరి కోసం ఒంట్లో ఉన్న శక్తి అంతా ఖర్చు పెట్టి అతను పీనుగులా తయారవుతున్నాడనే భ్రమ కూడా కలుగుతుంది.
    (నిజమేనండయ్యా! నేను మీ కూలిగాడినే! ఈ ఉద్యోగ ధర్మమంటూ నేను మీ అందరికీ అతి నమ్రతతో సేవ చేసే బానిసనే! నన్ను క్షమించండి బాబుల్లారా, నేనింక ఈ వుద్యోగం చేయలేను. నా ఒంట్లో బలం తగ్గింది. నా నేత్తుర్లో శక్తి తగ్గింది. నేనింక చెక్కులు రాయలేను. మీ లెక్కలు చూళ్ళేను. ఇంకా నాకు సెలవిప్పించండి. రేపు నేను మంచాన పడితే ప్రమోషను లేదు. నా అధికారులు నన్ను తొక్కి పెట్టి వుంచేరు. చాలీ అనుభవం!)
    అంతలోనే అతను ఆతను అవివేకానికి సిగ్గుపడిపోయి లెంపలు వేసుకుంటాడు. కనీసం ఉద్యిగమనే ఈ ఒక్క అర్హతతో అతను బతకగలుగుతున్నాడు అదీ లేకుంటే ఏనాడో తండ్రి గతి అతన్ని అలంకరించేది.
    అతను తలవంచుకుని పని చెసుకుంటుండగా శాంతాదేవి అతని సీటు దగ్గరికి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది. కూర్చుని అన్నది -
    "కొంచెం ఆగండి. మీతో ఒక్క నిమిషం మాటాడాలి."
    "శ్రీనివాసరావు ఆమెని చూచి అన్నాడు.
    "ఇవాళ పది చెక్కులున్నాయి. అక్కడేమో నలుగురు పెద్దలు నావేపు వేటకుక్కల్లా చూస్తున్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే , మీరు మాటాడ దలుచుకున్నది మాటాడండి. నేను పని చేసుకుంటూనే వింటాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS