అదిగో అదీ! ఆయనకి వచ్చిన ఆఖరి పాయింటు, తనొదిలేస్తే యింకొకరికి ఉద్యోగం! అంతే రాజీనామా పంపేశారు.
తర్వాత జీవితంలో డక్కా మొక్కలు చాలా తిన్నారు. అవమానాలూ, అనుమానాలూ, అవహేళనలూ ఎన్నో అనుభవించారు!
ప్రతినిత్యం ఒకసారయినా తన ఉద్యోగపు తొలిరోజుల్ని తనతో సహా అప్పుడు ఉద్యోగంలో చేరి ప్రిన్సిపల్, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ అయినవాళ్ళని చూసి బాధపడుతూ వుంటారు.
ఆఖరికి తన ఫ్రెండ్ మద్రాసునుంచి వచ్చి వెంకటేశ్వర విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ అయినరోజున ఆయనెంతో బాధపడ్డారు తన ఖర్మకి.
ప్రతినిత్యం ఉదయం ఇంట్లో కాఫీ తాగినా, భార్యని అడిగి రెండురూపాయలు జేబులో వేసుకుని అయ్యర్ హోటల్ కెళ్ళి వేడివేడి ఇడ్లీ కారప్పొడితో టిఫిన్ తిని, ఒకే ఒకసారి సిగరెట్ కాల్చి పేపరు కొనుక్కురావటం ఆయనకి అలవాటై పోయింది.
పేపరుకి చందాకట్టి తెప్పించుకోకూడదా అంటే ఎందుకు నేను ఎలాగూ వెళతాను కదా రోజూ అంటాడు ఆయన.
ఆయన పేపరుతో ఇంటికి వచ్చాడంటే సమయం చెప్పక్కర్లేదు- తొమ్మిదికి అయిదు నిముషాలు ఇటు వుంటుంది.
ఆయన్ని చూసి చేయి చాచాడు నారాయణ.
ఉద్యోగం పోయినా, మనిషిలో ఉత్తేజం పోయినా కొన్ని అలవాట్లు మాత్రం పోవు ఎవరికీ! నారాయణకీ కూడా అంతే!
రేడియోలో సైగల్ పాట వినటం, పేపరు చూడటం అతను మానలేకుండా వున్నాడు. అలవాటు అంతగా బానిసాని చేసేస్తుంది మరి!
"ఇదిగో పంతులూ! ఇప్పుడు పేపరు ఖరీదెంతో తెలుసా?" ఉల్లాసంగా అడిగాడు కామాక్షయ్య.
తల అడ్డంగా వూపేడు నారాయణ.
"అదీ సంగతి! తెలిస్తే యిలా చెయ్యి చాపవులే! అయినా హోటళ్ళ ముందు ముష్టెత్తు వాడిలా పేపరు కోసం చేయి చాచక పోతేనేం? కొని చదవలేవూ?" పెదాలపైనవ్వు. మనసులో కవ్వింపుతో అన్నాడాయన.
పెదవి విరిచాడు నారాయణ.
గలగల నవ్వేడు కామాక్షయ్య.
ఊరి వారందరికీ అతను లోకువ అయితే అతనికి నారాయణ లోకువ!
ప్రతిరోజూ పేపరు ఏదో ఒక వేళ యిస్తూ యితన్ని దెప్పి పొడుస్తాడు కామాక్షయ్య.
"ఇదిగో ఇలా రోజూ పేపరు ముష్టెత్తేకంటే అలా బజారుకెళ్ళి ఏ హోటలు ముందు నుంచుని చేయి చాచినా నలుగురు నాలుగు వేసినా పేపరు వస్తుంది! హాయిగా కొని చదవ్వచ్చుగా!"
నారాయణ ముఖంలో నరాలు బిగుసుకున్నాయి.
ఏదో తీవ్రమైన సమాధానం చెప్పాలన్న ప్రయత్నం వినిపించింది. కానీ నోరు పెగల్లేదు! ఏదో అశక్తత నోరు మూయించింది.
అంతలో ఆయన్ని అంటున్న మాటలు విన్న నంద చివాలున బయటికి వచ్చింది.
చిద్విలాసంగా నవ్వుతూ, హేళనగా చూస్తూ వున్న ఆయన్ని ఏమీ అనలేక "నాన్నా!" అని తండ్రిని కేకేసింది.
టీచర్ పిలుపు విన్న కాన్వెంటు కుర్రాడిలా ఇంట్లోకి వచ్చాడు నారాయణ.
"ఈయననా ఇంత మాటలన్నది!" అనుకుంది మనసులో. చివాలున ఇంట్లోకి వెళ్ళబోయింది.
"ఇదిగో అమ్మాయ్!" పేపరు అందించబోయాడు కామాక్షయ్య తన దర్జా అంతా పేపరివ్వటంలో వెలగబెడుతూ.
"అక్కర్లేదు లెండి? నేను మా ఆఫీసు లైబ్రరీలో తెస్తాను. లేదా నేనే బజార్లో నలుగురినీ ముష్టెత్తి తెస్తాను!" ఆవేశంగా అంది నంద.
"అబ్బో! ఎంత పౌరుషం!" వెక్కిరింతగా అన్నారాయన.
"ఏం ఉండకూడదా? ముష్టి పేపరు చదవటానికి మీ రెంత మాటలన్నారు. చచ్చే స్థితిలో వున్న పామయినా తిరగబడేట్టుగా వున్నాయి మీ మాటలు!" ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా ;లోపలికి వచ్చేసింది.
ముఖం కడుక్కొని బొట్టూకాటుకా దిద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది.
ఆసరికే విమల అందరికీ పల్లేలు పెట్టి వడ్డించేసింది.
అందరూ ఒకేసారి భోజనం చేస్తారు ఆ ఇంట్లో.
వెళ్ళి కూర్చుంది తనూ!
అందరూ సర్కిల్ లా కూర్చుని మధ్య పదార్ధాల గిన్నెలు వుంచుకుంటారు.
"కలిపి పెడతావా?"
ఉలికిపడింది ఆ మాటలకి.
రవికాంత్ అసలు మాట్లాడడు! ఎప్పుడూ మౌనం మౌనమే తన మూగ భాష అన్నట్టు మహామవునం వహించిన విస్సంగిలా వుంటాడు.
కాష్టమవునం. వాజ్ఞ్మవునం, క్రియామవునం, అక్షర మవునం పాటించడం సులభం కానీ మహామవునం పాటించటం కష్టమని మహా మహాయోగులే అంటారు.
అది అతనికి జబ్బువల్ల సులభ సాధ్యమైంది.
చిత్రం! అందరి మతిస్థిమితం లేని వాళ్ళలాగా అతను వెకిలిగా వెర్రిగా వుండడు-
ఆత్మ ప్రబోధం కలిగిన సన్యాసిలాగా వుంటాడు.
అలాంటి సోదరుడు నోరు తెరిచి "అన్నం కలిపి పెడతావా?" అని అడిగితే ఆమెకి ఎంతో ఆనందమైంది.
అందరి కన్నా ముందుగా అతను భోజనం ముగించి వెళ్ళిన తరువాత తను భోజనం ప్రారంభించింది.
రోజూ కంటే భిన్నంగా ఈ రోజూ అన్నీ మనస్సంక్షోభాలే!
దానికితోడు పూర్వపు రోజులు చప్పున గుర్తుకి వస్తూ వుండటం కంపేర్ అండ్ కాంట్రాక్టులాగా ఒక్కో సంఘటనకీ ఒక్కో పూర్వపు సంఘటన గుర్తు వస్తూ వుండటంతో ఆమెకి మనస్సు ఎంతో పాడైంది.
ఆఖరికి కామాక్షయ్యగారి మాటలు ఆమెకి శూలాల్లాగా అనిపించాయి!
