"రెండు లక్షల ఆస్తి మాత్రమేనా వదినా!"
"ఆస్తి సంగతి కాదయ్యా. నీకు కట్నం వస్తుంది, కట్నం" అన్నది.
"అబ్బా రెండు లక్షలేనా! ఓ అయిదు లక్షలయితే బావుండేది."
"అయిదు ఇప్పించేదాన్ని నువ్వు డాక్టరీ చదివి వుంటే."
"అమ్మో! డాక్టరు అంతగట్టి మగడా -"
పనిచేసుకుంటున్న పనిపిల్ల ఫక్కున నవ్వింది.
"మొన్న వచ్చి, ఇప్పుడా రావటం!" అన్నది సులక్షణ.
"నువ్వు రాకూడదా!"
"మీ అమ్మకు నన్ను చూస్తే ఏడుపు-"అన్నది మూతి తిప్పుతూ.
"సరేలెండి అన్నయ్య ఏడి?"
"భోజనం చేసి పడుకున్నట్టున్నారు . లేపనా!" అన్నది.
"లేపటం దేనికి? పది నిమిషాలు బబ్లుతో ఆడుకుంటాను."
"ఏమిట్రా!" మధుమూర్కి ఆవలిస్తూ వచ్చాడు.
"అది కాదన్నయ్యా! ఏమిటి రాధిక ప్రేమ గొడవ. నాన్నగారు సంబంధం చూస్తానంటున్నారు" అన్నాడు.
"చూడనీ........" అన్నాడు నిర్లక్ష్యంగా.
"చూడనీ అంటున్నావు. ఆరోజుకు ఈ అమ్మాయి అతను కలిసి ఎటన్నా వెడితే........."
"ఆ భయం నీకు అక్కరలేదు"
"అంత ధీమా ఏమిటన్నయ్యా"
"అదంతా నీ కనవసరం. నీ పేర రాధిక ఉత్తరం రాయటం తెలుసు. అవి చూచి నువ్వే ఉధ్దరిస్తున్నాను అనుకుంటున్నావేమో. ఆమె అనుకున్న పెళ్ళి జరుగదు --" కంయిమని కోపంగా చూచాడు.
అతనివల్ల ఒక్కమాట బయటికి రాదని తెలుసు. అందుకే సులక్షణ ఇచ్చిన కాఫీ త్రాగి బయటపడ్డాడు.
ఇంటికి వెళ్ళబుద్ది కాలేదు.
ఆలోచిస్తూ చెఱువు గట్టుకు వెళ్ళాడు. శ్రీనివాస్ కేమయి ఉంటుంది. ఒక్కసారి పోలీసులతో మాట్లాడితే?
లాభం లేదు. వారు అధికారం చేతిలో అణిగి, మణిగి ఉండే అమాయకపు హుందా గాళ్ళు.
మెల్లగా ఒక్కొక్కరాయి, నీళ్ళలో వేస్తూ కూర్చున్నాడు. సూర్యుడు పుడమి తల్లితో వీడ్కోలు తీసుకుని, సంధ్యాదేవికి ఆహ్వానం పలుకుతూ, వెళ్ళిపోయాడు. తన చిరునవ్వుతో చిరు చీకట్లు ప్రసరించింది సంధ్యాదేవి.
"వదులు........వదులు......వదలకపోతే. --"
"ఏమిటే చేస్తావ్........."
"ఏం చేస్తాననేది అనవసరం! మీలాంటి తోడేళ్ళలాంటి పురుషుల మధ్య తిరిగే స్త్రీని, నా ఆత్మరక్షణ నాకు తెలియదా!"
ఆ కంఠం తనకు చిరపరిచయమైనదే శ్వేతది.....
అతను లేచి వడి, వడిగా శబ్దం వచ్చిన వైపు వెళ్ళాడు.
చేతిలో రివాల్వర్ పట్టుకుని నిల్చుందామె. ఆమె ఎదురుగా ఒక నిర్ణయం తీసుకోలేనివాడిలా నిలబడి పోయాడు అర్జున్.
"బొమ్మ పిస్టల్ అనుకుంటున్నావేమో. నా ఆత్మరక్షణ కోసం తెచ్చుకున్నది కాల్చేస్తాను......"
సిద్దార్ధకు భలే థ్రిల్లింగ్ గా ఉంది. ఆడపిల్లలకు ఆ మాత్రం ఆత్మ ధైర్యం ఉండాలి." లేకపోతే సంఘంలో నిలువనియ్యరు.
"శభాష్!" చప్పట్లు కొట్టాడు.
ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"నువ్వు.......నువ్వా సిద్దూ!"
"నేనేరా బుద్దూ" నవ్వాడు సిద్దార్ధ.
"అది --- అది---"
"షటప్. మాటల మర్యాదగా రానియ్యి."
