"అదంతా నిజమే నాన్నగారూ! అతను మీకు భయపడి ఎక్కడో దాక్కుని రేపు రాడని నమ్మకం ఏమిటి!" అన్నాడు.
"సిద్దూ! వయసులో అనుభవంలో నీకంటే పెద్దవాడిని, అతని బెదడ వుండదు" అని నమ్మకంగా చెప్పాడు.
సిద్దార్ధకు పార్వతమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. అయితే శ్రీనివాస్ ను చంపేసారా! అతనికే అర్ధంకాలేదు.
"అబ్బాయి డాక్టరీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నల్గురు ఆడపిల్లల తరువాత పుట్టినవాడు.
పదెకరాల పొలమే వుందిగాని ఇప్పుడా ఏరియాలో లక్షరూపాయలకు ఎకరం అమ్ముతున్నారు" అన్నాడు.
"అలాగా!" అన్నాడు. అతని మనసులో శ్రీనివాస్ తిరుగుతున్నాడు. ఏమయినట్లు.
"రాధికకు ఏం తెలియదు......" అంటూనే అతను కళ్ళుమూసుకున్నాడు. అతని గురక వినిపించింది.
సిద్దార్ధ లేచి క్రిందికి వచ్చేసాడు.
రాధిక ఆశగా ఎదురు వచ్చింది.
"అన్నయ్యా! శ్రీనివాస్ గురించి చెప్పారా!"
"వాళ్ళు చెప్పరమ్మా! నేనే కలుసుకుంటాను. నువ్వేం కంగారు పడకు" అన్నాడు.
అతను ఆలోచిస్తూ ఊర్లోకి వెళ్ళాడు. యెవరికీ మధుమూర్తి, అన్నా, తండ్రి అన్నీ సదభిప్రాయం లేదు.
అతను ఆళోచించలేక పోతున్నాడు. అతను పార్వతమ్మ ఇంటికి వెళ్ళాడు. ఒక గది వెనుక వంటిల్లు, ముందు వసారా తప్ప ఏం లేదు, తన బంగళాకు, వారిల్లుకు పోలిక ఉన్నదా!
రాధిక పిచ్చిది. ప్రేమగుడ్డిది అన్నారు. అందుకే కాబోలు.
"శ్రీను సంగతి తెల్సిందా బాబూ!"
"ఇంకా లేదమ్మా" అన్నాడు.
"నా కడుపున పుట్టవల్సిన కొడుకు కాదు బాబూ! రాధికమ్మతో యెలా దోస్తి చేసిండో గాని ఆమెకు తగినవాడా! నాకంటే ఈ విషయాలు వాడే ఎక్కువగా ఆలోచించేవాడు" అన్నదామె ఏడుస్తూ.
"ఆరోజు అంటే అతనింట్లోనుండి వెళ్ళిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పు పార్వతమ్మా!" అన్నాడు.
"పట్నం నుండి వచ్చి, అన్నం తిన్నడయ్యా. అయిదు నిముషాలకెవరో పిలిస్తే బయటికి వెళ్ళిండు. తొంగిచూస్తే మధుమూర్తి. ఆయన నవ్వుతూ కులాసాగా మాట్లాడాడు. వచ్చి ఇంట్లో బియ్యం ఏరుకుంటున్న బాబూ. అక్కడోమాట ఇక్కడోమాట నా చెవిన పడింది బాబూ. మా రాధ అంతా చెప్పింది. మీ పెళ్ళి జరిపించే పూచి నాది అనటం. ఆ తరువాత బాబు వచ్చి నవ్వుతూ తను బయటికి వెళ్తున్నట్టు చెప్పాడు."
"అమ్మా! నేనో చోటికి వెళుతున్నాను. అంతా సవ్యంగా జరిగితే ఒంటరిగా రాను. జంటగా వస్తాను" అన్నాడు.
"అంతా మరిచిపోయి, బొంబాయి వెళ్తానన్నావు కదరా."
"ఒంటరిగా వెళ్తానన్నాను. ఇప్పుడు ఇద్దరం కాదు. కాదు, ముగ్గురం వెళతాం" అనుకుంటూ వెళ్ళిపోయాడు బాబూ.
"శ్రీనూ -" అంటూ వచ్చాను. అప్పటికే స్కూటర్ దూరం వెళ్ళింది అన్నది. ఆమెకు దుఃఖం ఆగటం లేదు.
"మీరూరుకోండి. బాలరాజు తండ్రి జంగయ్య కదూ........."
"అవును బాబూ! నా బిడ్డడికోసం వెతుకుతుంటే, ఓసి పిచ్చి ముఖమా మధుమూర్తి నడుగు" అంటాడు బాబూ.
తల పంకించాడు.
ఇదేదో పెద్ద మిస్టరీలా ఉంది.
ఈ మిస్టరీని యెలా విడగొట్టాలో అర్ధం కాలేదు.
అతను మెల్లగా అన్నగారిల్లు చేరాడు. బేబి, బబ్లు పరుగు..... పరుగున వచ్చి "చిన్నాన్నా!" అంటూ వాటేసుకున్నారు.
"ఏమండోయ్ రెండు లక్షలగారూ! అప్పుడప్పుడు మమ్మల్ని గుర్తుంచుకోండి" అన్నది మధుమూర్తి భార్య సులక్షణ. అన్ని అవలక్షణాలేగాని పేరుమాత్రం సులక్షణ.
