Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 17

       
                                     7
    మరో పది రోజులు గడిచి పోయాయి. "సీతా, ఈ పూట నాకోసం వంట చెయ్యకు. వో స్నేహితుడు భోజనానికి పిలిచాడు.' అన్నాడు సత్యం సాయంకాలం ఆఫీసు నుంచి వస్తూనే.
    ఒక్క క్షణం ఏదో అనుమానంతోనే అతని కళ్ళల్లో కి చూసి 'సరే' అనేసింది సీత.
    ఆ రాత్రి అతను తిరిగి వచ్చాక అడగకూడద నుకుంటూనే మళ్లీ అదే ప్రశ్న వేసింది సీత. సమాధానం అదే హోటలు పేరు చెప్పాడు సత్యం -- వో మూల వళ్లు మండుకుపోతున్నా మరేమీ అడగలేదు సీత. కాని ఆ తరవాత నెల రోజులలో ఏడెనిమిది సార్లు అతను పార్టీలు అంటూ బయట తిని రావటం అలా తిని వచ్చిన ప్రతి సారీ తనని దగ్గరకు తీసుకోబోయే సరికే తనకి భళ్ళున వంటి వచ్చినంత పని కావటం ఇంక ఇది భరించటం తన వశం కాదన్నట్లు వోసారి అడిగేసింది. 'మీనో రు ఏదో మసాలా వాసన వేస్తోంది-- నిజం చెప్పండి -- మీరు కూడా అవన్నీ తిన్నారు కదూ.'
    'అలా నిలదీసినట్లు అడుగుతున్నా వేమిటి -- ఔను తిన్నాను-- పదిమంది లోకి వెళ్ళినప్పుడు మనం కూడా సరదాగా వాళ్లతో కలిసి పోవాలి. లేకపోతె ఇదెక్కడి మాలోకం రా అన్నట్లు వాళ్ళంతా వెక్కిరిస్తారు.'
    'వాళ్ళంతా వెక్కిరిస్తారు అని వంక పెట్టకపోతే మీకే తినాలనిపించింది అని చెప్పరాదూ.' ఉడికిపోతూ మరో ప్రశ్న వేసింది సీత.
    'ఔను నిజమే -- నాకే తినాలనిపించింది మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను -- పుట్టినప్పటి నుండి వున్న అలవాటు, దాన్ని నీకోసం నేను మానుకోలేను-- అయినా ఆ అలవాటు ఏమీ సిగ్గుచేటయినదీ తప్పుపనీ కాదు--' గుంజు కున్నాడు సత్యం.
    'తప్పూ ఒప్పూ సంగతి కాదు-- నాకు దాని పేరు చెప్తేనే అసహ్యం -- నేనా మాట మీకు ముందే చెప్పాను. నాకోసం ఆ మాత్రం చిన్న త్యాగం చెయ్యలేనా అన్నట్లు మాట్లాడారు ఆనాడు -- అంతేకాదు గొప్పగా ప్రమాణం కూడా చేశారు.' ఉక్రోషంతో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ఎత్తి పొదుపుగా అంది సీత.
    'నిజమే నీకు మాట ఇచ్చాను-- కాదనను ఆహారపు అలవాట్ల లో మార్పు తెచ్చుకోటం ఏమంత కష్టం కాదని అప్పుడు భ్రమ పడ్డాను-- ఆ సంగతి ఒప్పుకోటానికి నేనేం సిగ్గుపడను-- కాని రామ రామ నీ చేతి వంట తింటూ వుంటే జిహ్వ చచ్చిపోయి తిండికే మొహం వాచిన వాడిలా అయిపోతున్నాను. అంటే నీకు వంట చేతకాదు అని చెప్పటం నా వుద్దేశ్యం కాదు-- ఆ రకం భోజనంతో నేను తృప్తి పడలేక పోతున్నా నంతే-- కోటి విద్యలూ కూటి కొరకే అన్నట్లు మనిషి ఏ వుద్యోగం చేసినా ఏ వృత్తి అవలంభించినా ఈ జానెడు పొట్ట తాపత్రయం కోసమే -- ఉదయం నుంచి సాయంకాలం దాకా ఫైళ్ళ లో తలదూర్చి బుర్రంతా వేడెక్కించు కుని ఇంకా వోవరు టైములు కూడా పని చేసి ఒళ్ళు నలగ గోట్టుకుని సంపాదించుకుంటూ కూడా తృప్తి అయిన తిండికి కూడ మొహం వాచిపోవటం నావల్ల కాదు-- నేను మాట తప్పిన వాడిని ప్రమాణాలు చేసి నిలబెట్టు కోలేక పోయిన వాడినీ అని నువ్వు చెప్పిన సరే, నేను ఇక నుండి ఈ పద్దతి లోనే నడవ దలుచు కున్నాను.'
    'మీరు ఏమీ వదులుకోలేక పోయి నప్పుడూ జిహ్వ కోరే రుచులని వదులుకో లేక పోయినప్పుడు హాయిగా మీ కులం అమ్మాయినే చేసుకుని వుంటే తీరిపోయేదిగా -- ఎవ్వరికీ ఏ బాధా లేకుండా సుఖంగా వుండేవారు. నన్ను మభ్య పెట్టి పెళ్లి చేసుకుని తీరా ఇప్పుడిలా వంచించే పరిస్థితి ఎదురవక పోయేది.'

                                  
    'నువ్వేదో మీ కులం గురించి అంతగా పొంగిపోయి గొప్పలు చెప్పుకోకు-- కోడి పులావ్ వుంటేనే కాని ముద్ద ఎత్తలేని మీ కులం వాళ్ళని చాలామందిని చూపిస్తాను-- ఇంట్లో శ్రీరంగ నీతులు వర్ణిస్తూ మిలిటరీ హోటళ్ళ లో ఆకలి తీర్చుకునే వారు ఎంతమంది వున్నారో లెక్క చెప్ప మంటావా -- అంతదాకా ఎందుకు మొన్న మా ఫ్రెండు ఇచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళలో అరడజను మందయినా వున్నారు మీ కులం వాళ్ళు! వాళ్ళకి వేరే వెజిటేరియన్ మీల్సు ఏర్పాటు చేసినా మా టేబిల్స్ మీదికే ఎగబడ్డారు అందులో సగం మంది -- దానికేం చెప్తావు.'
    'ఎవరో ఏదో చేస్తే దానికి నా బాధ్యత ఏమీ లేదు-- కొడు గుడ్డు కూడా ముట్టుకొని క్రిష్టియన్ ఫ్రెండు వుండేది నాకు. ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే మీరూ వుండగలరనుకుని మీరు మాట ఇవ్వగానే నమ్మేశాను....భర్త ఇష్టప్రకారం నడుచుకుంటూ అతని కోసం తన ఆహారపు అలవాట్లు మార్చుకునే వారు వుంటే వుండవచ్చు....కాని నాకు ఆ పదార్ధాల పేరు చెప్తేనే అసహ్యం .. ఆ సంగతి మీకూ తెలుసు.'
    'నేను కాదనటం లేదు. అందుకే నిన్ను తినమని బలవంతం చెయ్యటం లేదు. వండి పెట్టమని అంతకన్నా అడగటం లేదు.....రేపే నేను వంటకి వో మనిషిని  మాట్లాడు కుంటాను. నీ వంట నువ్వు విడిగా, మడిగా నువ్వు వండుకో' ఇంక తన నిర్ణయం మారదన్నట్లు చెప్పేశాడు సత్యం.
    అలాంటి వ్యక్తితో ఇక వాదించదలుచు కోలేదు సీత -- అయినా, ఏదో నలుగురితో సరదాకి హోటలు కి వెళ్ళినప్పుడు అలా చేశాడే కాని ఇంటిలో కూడా ఆ వంట వండించుకుని తింటాడని నమ్మకం కలగటం లేదు-- అతనన్న మాటలన్నీ కేవలం వాదన కోసమనీ తన మాటకి మాట సమాధానం చెప్పటం కోసమనీ అన్నాడేమో అనే ఆశని పూర్తిగా చంపుకోనూ లేక, ఒకవేళ భర్త నిజంగా అన్నంత పని చేస్తే ఇక ఆ యింట్లో తను కాపురం చెయ్యటం ఎలాగా అనే భయాన్నీ వదుల్చు కోలేక ఆ తెల్లవార్లూ నిద్దర కూడా పోలేదు సీత -- ఏ తెల్లవారగట్లో వో కునుకు పట్టి కాస్త ఆలశ్యంగా మెళుకువ వచ్చిన ఆమెకి సత్యం ఎవరితోనొ మాట్లాడుతున్నట్లు అనిపించి ఒక్క క్షణం చెవులు రిక్కించుకుని వింది ఆమాటల సారాంశం అర్ధం అయేసరికి సీత ఒంటి నిండా తేళ్ళూ జేర్రులూ పాకినట్లయింది. ఇంక ప్రపంచం మొహం చూడకుండా ఆ గుక్కెడు ప్రాణం తీసేసుకుంటే తీరిపోతుంది అన్నంత దుఖమూ, కసీ కలిగాయి. సత్యాన్నీ గదిలోకి పిలిచి మళ్లీ నిన్నటి లా పోట్లాట పెట్టుకోవాలని, ఆ పనిపిల్ల కనక వంట చెయ్యటం మొదలు పెడితే ఆ యింట్లో తను ఒక్క క్షణం అయినా వుండననీ చెప్పాలనిపించింది -- కాని , చివరికి ఏమీ చెయ్యలేని బలహీనత ఏదో అవరించినట్లయి కాస్సేపు కళ్ళు మూసుకు పడుకుని ఆ తరువాత మెల్లిగా లేచి బాత్ రూమ్ వైపు వెళ్లి మొహం కడుక్కుని వచ్చింది -- మామూలుగా కాఫీ కలిపి భర్తకో కప్పు అందించి తనూ త్రాగింది. తరువాత స్నానం చేసి వచ్చి వంట ప్రయత్నం చేస్తుంటే వో అనుమానం వచ్చింది, వంట ఇద్దరికీ చెయ్యటమా, తన ఒక్క దానికీ చేసుకోవటమా అని. సీత సంశయం గ్రహించినట్లే అన్నాడు సత్యం.
    'సాయంకాలం నుంచి అంబుజం నాకు కూరలూ అవీ చేసి పెడుతుంది.' అని.
    అణుచుకోలేని అసహ్యాన్నంతటినీ కళ్ళల్లోనే నింపుకుని వోసారి భర్త వంక చూసి చూపులు తిప్పెసుకుంది సీత, ఆ పూట గడిచి పోయింది.
    ఆ తరువాత నుంచీ రోజూ రెండు పూటలా అంబుజం సత్యానికి మంసాహరపు కూరలూ పులుసు -- తయారు చేసి టేబిలు మీద పెట్టి వెళ్లి పోయేది. సీత తను వండిన వంటలో అన్నం , అతను కావాలంటే ఏవైనా ఆధరవులూ వడ్డిస్తుండేది-- వంటగది అంబుజం ఉపయోగిస్తోందని సీత వరండా లో వంట చేసుకోటం మొదలు పెట్టింది-- ఈ విధంగా ఈ సంసారం ఎన్నాళ్ళు గడుస్తుంది. అనే ఆలోచన అప్పుడప్పుడు వచ్చినా పైకి ఏమీ అనకుండానే రోజులు గడిపేయటం నేర్చుకుంది.
    సీతకి నెలలు నిండుతున్నాయి.
    'ఈ సమయంలో నీకు మనిషి సాయం వుంటే బాగుంటుంది కదూ' అన్నాడు వో రోజు సత్యం.
    'జరిగే వాళ్ళకి ఎన్ని చేసుకున్నా బాగనే వుంటుంది. నాకు అలాంటివన్నీ ఎలా కుదురుతాయి-- పై పనులు చూడటానికి అంబుజం వుండనే వుంది పురుడు ఎలాగూ ఆస్పత్రి లోనే పోసుకుంటాను కదా -- ఆ పది రోజులూ బ్రెడ్డూ పాలూ తీసుకుని గడిపేస్తాను. ఆ తరువాత ఇప్పటిలాగే నా వంట నేను వండు కుంటాను.' అంది సీత పొడి పొడిగా.
    సత్యం ఏమీ అనలేదు.
    వో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం లో పండంటి పాపాయిని కంది సీత ఆస్పత్రి లో. రోజూ రెండు పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు సత్యం. రెండో రోజు సాయంకాలం వెంట వచ్చిన వాళ్ళని చూసి గతుక్కు మంది సీత-- వాళ్ళు అతని తల్లి తండ్రీ ను.
    సత్యం మద్రాసు వచ్చేశాక వాళ్ళ వాళ్ళకి వుత్తరాలు వ్రాయటం మానలేదు. సీతని కూడా వాళ్ళ వాళ్ళకి వుత్తరం వ్రాయమంటే నాతొ వాళ్ళ కేవ్వరికీ సంబంధం లేదని నాన్నగారు అప్పుడే చెప్పేశారు అందర్నీ వదులుకునే వచ్చాను నేను అని సమాధానం చెప్పేది.
    సత్యం తల్లిదండ్రులయినా మొన్న మొన్నటి దాకా అతని వుత్తరాలకి సమాధానం కూడా వ్రాసేవారు కాదు. తరువాత  క్రమంగా కోపాలూ తాపాలు అన్ని మరిచి పోయారు. తమకి మనవడు పుట్టబోతున్నాడని తెలిసి కొడుకునీ, కోడల్నీ చూడాలని వాళ్ళు వచ్చేసరికి నిజంగా మనవడే పుట్టటం రెండు రోజులు గడిచి పోవటం జరిగి పోయింది.
    సీతతో ఏవేవో ఖబుర్లు చెప్తూ వాళ్ళంతా ఆస్పత్రి లో అరగంట పైనే వున్నారు-- అత్తగారి మాటల వల్ల సీతకి తెలిసిందేమిటంటే సీత తండ్రి కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడో దూరంగా ఏమాత్రం సౌకర్యం లేని మరో చిన్న యింటికి మారిపోయారని-- చిదంబరాన్ని ఎవరైనా అతని పిల్లల విషయం అడిగితె మాకు ఒక్కతే అమ్మాయి దానికి చాలా రోజుల క్రిందటే పెళ్లి అయిపొయింది. అది అత్తవారింట్లో సుఖంగా కాపురం చేసుకుంటోంది అని స్పష్టంగా చెప్తున్నాడనీ.' వింటున్న సీత కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నవనీతం లాంటి తండ్రి మనస్సు పాషణం గా మారిపోవటానికి తన ప్రవర్తనే కారణం.......ఆ చుట్టూ ప్రక్కల వాళ్ళకీ, సత్యం కుటుంబానికీ తమ మొహాలు చూపించలేక ఉన్న యిల్లు వదులుకుని దూరంగా ఎక్కడికో పారిపోయేలా చేసింది తనే.........ఆనాడు సత్యం, 'నీకోసం ఏం చెయ్యమన్నా చెయ్యటానికి నేను సిద్దంగా ఉన్నాను. అలాంటిది కాస్తంత ఆహారపు అలవాట్లు మార్చుకోలేనా' అంటూ సున్నితంగా తన గడ్డం ఎత్తి పట్టుకుని అనురాగంతో తన కళ్ళల్లో కి చూస్తుంటే తను ఈ ప్రపంచమే మరిచిపోయింది. కాని అదే సత్యం కొన్ని నెలలయినా గడిచి గడవక ముందే తన భోజనానికీ వంటకీ కావలసిన ఏర్పాట్లు విడిగా చేయించు కుంటాడు అని, తను కాస్తయినా వూహించగలిగి వుంటే తల్లితండ్రులకి అంతటి మనస్తాపం కలిగించేది కాదేమో-- ఏదైనా , జరిగిపోయిన దాని కిప్పుడు విచారించి ప్రయోజనం లేదు--' అనుకుంది.
    మర్నాడు అన్నం తినవచ్చునని డాక్టరు చెప్పినా బ్రెడ్డూ పాలతో సరిపెట్టుకుందా మనుకుంది సీత -- కాని అత్తగారు ఇంటికి వెళ్ళిపోతూ, 'రేపు ప్రొద్దున్న పదకొండు గంటలకి చారూ అన్నం తెస్తాను-- రేపటికి కూరలేం వద్దులే కాస్తంత కారప్పొడి మాత్రం తెస్తాను.' అని అంటుంటే మరేమీ అనలేక వూరుకుంది.
    మర్నాడు ఆవిడ తెచ్చిన అన్నం తింటున్నంత సేపూ సీత కళ్ళల్లో అంబుజమే మెదల సాగింది.
    'ఈ అన్నం అంబుజం వండినది. ఈ చారు అంబుజం కాచినది-- వాళ్ళ కోసం వండుకున్న మాంసం కూరల్లో పెట్టిన గరిటలు ఈ అన్నం లోనూ చారులోనూ పెట్టిందేమో' అన్న ఆలోచనతో అసలు అన్నం నోటికే పోలేదు-- కాని అత్తగారు ఏమైనా అనుకుంటుందని రెండు ముద్దలు ఎలాగో మింగి చెయ్యి కడుక్కుంది. ఏదో వెలపరంగా వున్నట్లు, కడుపులో దేవుతున్నట్లు అనిపించినా విధి లేక అక్కడున్న పదిరోజులూ ఎలాగో గడుపుకుంది. ఇంటికి వచ్చాక మాత్రం ఎవరెంత చెప్పినా వినకుందా తన వంట తను చేసుకోటం మొదలు పెట్టింది. మరో పదిరోజులు ఉండి అత్తగారూ వాళ్ళూ వెళ్ళిపోయారు.
    రోజులు ఎలాగో గడిచి పోతున్నాయి -- ఓరోజు సత్యం ఓ కొత్త ప్రతిపాదన చేశాడు. బాబుకి పాలతో కలిపి కోడిగ్రుడ్డు ఇవ్వాలని. మొదట వినగానే సీతకి అసహ్యం వేసింది కాని తరువాత డాక్టరు చెప్తే మందులా త్రాగటం లేదా ఏమిటి, ఇదీ అంతే అని సరిపెట్టుకుంది-- సత్యం అంతటితో వదిలి పెట్టలేదు. భోజనాల వేళ బాబుని తన ప్రక్కన కూర్చో పెట్టుకోటం తన కూరలూ అవీ కాస్త కాస్త రుచి చూపించటం మొదలు పెట్టాడు. సీతకి ఒళ్ళు భగ్గుమని మందిపోయినట్లయింది.
    'బాబుకి అచ్చంగా అన్నీ నా అలవాట్లే రావాలి-- ఇంకోసారి మీరిలా చేస్తే బాగుండదు' అంటూ బాబు ముందు ప్లేటు విసురుగా లాగేయ బోయింది. సత్యం ఆ ప్లేటు గట్టిగా పట్టుకొని తెచ్చిపెట్టుకున్న శాంతంతో సమాధానం చెప్పాడు.
    'బాబు నా కొడుకు- వాడికి అన్ని నా అలవాట్లు రావాలి. దీనికిఅభ్యంతర పెట్టటానికి నీకేం అధికారం లేదు.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS