"మరి ...మరి నీ పెళ్ళి ఎలాగమ్మా?"
"ఆరోజు వస్తే జరుగుతుంది లే నాన్నా! అర్ధం లేని ఆశలు పెట్టుకుని ఇప్పటికే కాల యాపన చేశాం. మరో రెండేళ్ళు పొతే నువ్వు రిటైరై పోతావు. ఆ వచ్చే పెన్షన్ తో ....ఇల్లూ పిల్లలూ...."
వెన్నముక విరిగి , హటాత్తుగా శరీరం కూల బడి పోయినట్ట యింది మాస్టారికి. తను....తను మరిచే పోయాడు. రిటైరై పొతే ....ఒక్క రెండేళ్ళ లో ....ఎలా? సూరీ....రుక్కూ....
"అందుకే నేనిలా నిర్ణయించుకున్నాను , నాన్నా! సూర్యం పసితనం లోనే సంసార తాపత్రయాలు పడటం నా కిష్టం లేదు. రుక్కుకి ఎంత మేనరికమైనా దాని అన్ని విధాల సంతోష పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి ఓ అన్నయ్యే ఉంటే ఇవేమీ సమస్యలే కావు. అందరి కన్నా పెద్ద దాన్ని నేనే ఆ పని చేస్తాను. ఆ కష్టమేదో నేనే భరిస్తాను. నన్నే ఓ కొడుకనుకో, నాన్నా! మన పరువు మర్యాదల కేమీ లోపం రానివ్వకుండా ...." పార్వతి కంఠం భారమై పోయింది. మాట్లాడ కుండా ఊరుకుంది.
భారంగా నిట్టూర్చాడు తండ్రి. "ఉ! బావుందమ్మా , బావుంది. కలవారి కోడలి వై ఎంతో సుఖపడతా వనుకున్న నువ్వు....."
"సుఖాల కన్నా బాధ్యతలే గొప్పవి కదా, నాన్నా! వాటిని తప్పించుకు తిరగడం మానవత్వమంటావా? నువ్వేమీ బాధపడకు నాన్నా! మనం ఆత్మాభిమానం గల దారిని పోతున్నాం."
"పారూ! అమ్మా! నాకు మతి పోతోంది. అంతా అయోమయంగా ఉంది."
"క్షమించునాన్నా , నీ మనస్సు కష్ట పెడుతున్నాను . నీ మాట తోసి వేశానని బాధపడక నిదానంగా ఆలోచిస్తే అంతా నీకే అర్ధమవుతుంది. ఇంతగా మనం దిగులు పడాల్సిందేమీ లేదు."
మాస్టారు మరి మాట్లాడలేదు. పదకొండు గంటల రాత్రి నిశ్శబ్దం లో ఎదర మేడ కాంపౌండు లోకి కారు దూసుకు పోతున్న చప్పుడు అయన స్వయంగా విన్నారు.
* * * *
ఎదర మేడ పెళ్ళి సందడితో, హడావిడి తో నిండి ఉంది. వచ్చే పోయే కార్లతో రోడ్డు మూసుకు పోయింది.మేడ ముందు కాంపౌండు లోనే గాక రోడ్డు వెడల్పునా వేసిన పెళ్ళి పందిరి ఎదరింటి చూరుకు తగిలి వెలుగు పడకుండా చీకటి చేసింది. బాండువాళ్ళు వాయిస్తున్నా సినిమా పాటలు గందరగోళంగా విన్పిస్తున్నాయి. స్పీకర్ దగ్గర చేరిన పిల్లల అల్లరి వీధి నంతా ఆక్రమించుకొంటుంది. బడి కూడా ఎగ్గొట్టి రుక్కు పెళ్ళి పందిట్లో పిల్లల దగ్గరికి పోయి కూర్చుంది.
కత్తిపీట వాల్చుకు కూర తరుక్కుంటున్న పార్వతి కి కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి.
"పార్వతీ!"
ఉలికి పడింది పార్వతీ. చటుక్కున కళ్ళు తుడుచుకుని లేచింది. అపర లక్ష్మీ దేవిలా అన్నపూర్ణమ్మ మరి నాలుగురైదుగురు పెరంటాళ్ళతో.....
కంగారుగా చాప వాల్చ బోయింది పార్వతి.
"వద్దులే పార్వతీ! తొందరగా వెళ్ళాలి. అబ్బాయికి సాయంత్రం మంగళ స్నానం చేయిస్తాము ఒక్కసారి వచ్చి వెళ్ళు. ఇంకా చాలామందిని పిలవాలి వస్తాను." అంటూ గబగబా పార్వతి నుదుట కుంకం అంటించి వెనక్కు తిరిగింది . అంతా ఒక్క క్షణంలో చిత్రం లాగే జరిగింది.
స్థాణువు లా నిలబడిపోయింది పార్వతి. ఆ రోజంతా ఎంత కాదనుకున్నా ఏమిటో వెర్రి దానిలా అయింది మనస్సు. ఏపనీ చెయ్య బుద్ది కాలేదు. స్థిరంగా కూర్చో బుద్ది కాలేదు. ఎవరి తోనూ మాట్లాడ బుద్ది కాలేదు. తన మీద తనకే జాలి వేసి పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది.
సాయంత్రం దీపాలు పెట్టె వేళకు ఎదర మేడ దాదాపు నిర్మానుష్యమై పోయింది. ఒక్కసారిగా వీధిలో సందడంతా తగ్గిపోయింది. రోడ్డు నిండా నిలబడ్డ కార్లన్నీ గాజు పుసల్లా దొర్లుకు పోయాయి. మగ పెళ్ళివారు మర్నాటి లగ్నానికి తరలి వెళ్ళిపోయారు.
దొడ్డి గడప మీద శూన్యంగా చూస్తూ కూర్చుంది పార్వతి. ఇల్లంతా చీకటిగా ఉంది. దీపం వెలిగించలేదు. పిల్లలు ఖాళీ పెళ్ళి పందిట్లో ఆడుకొంటున్నారు. తండ్రి స్కూలు నుంచి ఇంటికే రాలేదు. దిగులు దిగులుగా కూర్చుంది పార్వతి ఎండి పోతున్న సన్నజాజి మొక్క కేసి చూస్తూ. ఎన్ని నీళ్ళు పోసినా, ఎంత ఆకూ దూసినా ఎండి చచ్చిపోతుంది సన్నజాజి.
"పారూ!"
అ పిలుపే వినిపించలేదు పార్వతికి.
"పారూ! అసలు ఉన్నావా ఇంట్లో?"
"ఎవరూ? ఎవరది?" అంత పరధ్యానం లోనూ పరిచిత కంఠన్ని పోల్చగలిగింది పార్వతి. "పద్మా!"
"ఎక్కడున్నావ్, పారూ? అబ్బా! ఏమిటిలా ఇల్లంతా ఇంత చీకటి గా ఉంది?"
సంతోషంతో చటుక్కున లేచి రాబోతూ గడపను తన్నుకుని తూలింది పార్వతి. "పద్మా! ఉండు, ఉండు దీపం వెలిగిస్తున్నాను." గూట్లో నుంచి అగ్గిపెట్టె తీసి కిటికీ కిందుగా ఉండే దీపాన్ని తడిమి అందుకుని వెలిగించి లేచింది పార్వతి.
"ఏమిటి, పారూ, నువ్వొక్కదానివే ఉన్నావా?"
"నువ్వెప్పుడోచ్చావ్, పద్మా? ఉత్తరమైనా వ్రాయలేదే!" పద్మ చెయ్యి పట్టుకుని బల్ల మీద కూర్చోబెట్టి తనూ దగ్గరగా కూర్చుంది పార్వతి. ఒకర్ని చూస్తుంటే ఒకరికి అంతులేనంత ఆనందంగానూ ఉంది. అర్ధం కానంత వేదన గానూ ఉంది. పద్మజ మరీ అందంగా ఉన్నట్టు కన్పించింది. మెడ మీదకు జారుగా ముడీ, చేతికి తళుకు లీనే రిస్టు వాచీ, పల్చటి తెల్లటి వాయిల్ చీరా, గులాబీ రేకులా అతి సున్నితంగా ఉంది. పార్వతి చీటీ పరికిణీ, క్రిందటి రోజు దువ్వి అల్లుకున్న వాలు జడా, చేతుల నిండా నల్లటి మట్టి గాజులూ తన రూపాన్ని పద్మజ ఎంతమాత్రం పట్టించుకోదని తెలిసినా ఎందుకో సిగ్గు వేసింది పార్వతికి.
"నువ్వు చాలా చిక్కిపోయావు పారూ! ఒంట్లో బావుండటం లేదా?" ఆప్యాయంగా చేయి నిమురుతూ అడిగింది పద్మజ.
పార్వతి నిస్పృహగా నవ్వింది. "బావుండకేం? నిక్షేపం లా ఉన్నాను. నీ చదువూ అదీ బాగా సాగుతోంది కదూ? నువ్వు వస్తున్నట్టు ఇంటికి కూడా ఉత్తరం వ్రాయలేదా?"
"లేదు, పారూ! సుజా వ్రాసిన విషయం నేనసలు నమ్మలేక పోయాను. నమ్మినా, మానినా ఓసారి రావటం లో నష్టమేమీ లేదని బయల్దేరి వచ్చేశాను. ఇంటికి వచ్చి ఓ గంట అయిందంతే.అమ్మా వాళ్ళూ కూడా చెప్తే నమ్మక తప్పలేదు. నిజంగా నాకెంత కోపం వచ్చిందనుకున్నావ్, పారూ? మీఇంటికి తగిలేలా పెళ్ళి పందిరి కూడా వేశారు , చూడు."
"రఘూ, సంగతా నువ్వు మాట్లాడుతున్నది. మీఇంట్లో ఏమైనా జరిగిందేమో ననుకుంటున్నాను...."
"ఇది మరీ బావుంది. నువ్వింత పట్టించుకోకుండా కూర్చుంటావని నేననుకోలేదు సుమా!"
"ఏం చెయ్యాలంటావు పద్మా?"
"ఏమైనా చెయ్యాలి. ఇన్నాళ్ళూ నిన్నింత ఆశ పెట్టి మోసం చేస్తే చేతకాని దానిలా ఊరుకున్నావా?"
"ఆ చెయ్యాల్సిందేలాగో నాకు చేత కాలేదు, పద్మా!"
"చాల్లే! నీ గొప్పదనం నువ్వూనూ. పెళ్ళి మాటల సమయంలో నాకు వ్రాయలేక పోయావ్. రఘుపతి నిన్నెలా కాదన గలిగేవాడో చూసే వాళ్ళం."
"ఆవేశంగా మాట్లాడుతున్నావు. పద్మా! అతనేం నాకు మేనత్త కొడుకు కాదు. సిగ్గు విడిచి అర్ధించడానికి. చెప్పు చేతలలో మసిలే వ్యక్తీ కాదు ఇష్టమైనట్టు ఆజ్ఞాపించటానికి. ఇంకే ఆధారం చూసి అతన్ని అడగలేదంటావు?"
"అది కాదు , పారూ! అతన్ని నిలదియ్యాల్సిందని నేననటం లేదు. రఘూ మనస్సు నీకు తెలుసు. కొంచెం ధైర్యం చెప్తే ఏమైనా ప్రయోజనం ఉండేది కాదూ?"
"నా కిష్టం లేదు. పద్మా! నామీద అతని కెంతో అభిమానం ఉందన్న సంగతి నాకు తెలుసు. అది అతని ద్వారానే వెల్లడి కావాలి గానీ దాన్ని ఆసరా చేసుకొని నాకై నేను ప్రయత్నించాలనటం సమంజసం కాదు. ఏదో విధంగా అతని మనస్సుకి నచ్చ జెప్పి , ఆకట్టి, తాత్కాలికంగా అతనికి ధైర్యం నూరి పోసి నా కోరిక తీర్చు కోటానికి ప్రయత్నించటం ఎంత అభిమానం లేని పనో ఆలోచించావా? నువ్వే నాకీ సలహా యిస్తున్నా వంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తన ఇష్టాన్ని వెల్లడించుకోలేని వ్యక్తిని కట్టుకుని అశాంతి పాలయ్యే కన్నా ఇదే బావుంది నాకు."
"రఘూ మీద నీకేమీ కోపం లేదా, పారూ?" విస్మయంగా అడిగింది పద్మజా.
"ఎందుకూ? అతని మీద కోపగించుకొనే హక్కు నాకేముంది?"
"హక్కుల మాట అలా ఉంచు. నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పనే లేదా?"
"అంత నిస్సంకోచంగా తేల్చి చెప్పకపోయినా ఆ ఉద్దేశం రఘు లో బాగా ఉన్నట్టు మాత్రం నేను గ్రహించాను. తల్లిదండ్రులు ఇష్టపడి చేస్తారనే తనూ అనుకున్నాడు. తీరా వాళ్ళ కబుర్లన్నీ అబద్దాలు కావటం తో ఓ బీద బడి పంతులి కూతురి కోసం ఇంత సాహసం చెయ్యటం అతని వశం కాలేదు. ప్రతి వ్యక్తీ లోనూ ఎందుకో ఎక్కడో బలహీనత ఉంటూనే ఉంటుంది. రఘూ తత్వం మనకి కొత్త కాదు గదా?"
"రఘూ పిరికి వాడని నే నెప్పుడో చెప్పాను. ఛ! నిండు జీవితాల నింత నిర్లక్ష్యం చేసుకునే వాళ్ళని చూస్తె నాకు మహా ఆశ్చర్యంగా ఉంటుంది."
"అది వాళ్ళ తప్పు కాదేమో పద్మా! భగవంతుడి దృష్టి లోనే రకరకాల మనస్తత్వాలు యేర్పడతాయి."
"బావుంది వేదాంతం. అయితే రఘుని నువ్వు మనస్పూర్తిగా సమర్దిస్తున్నావా?"
"అర్ధం చేసుకోవాడనికి ప్రయత్నించటం సమర్ధించటం కాదు. ఎదుటి వ్యక్తీ బలహీనత అర్ధం చేసుకున్నా సమయం వస్తే నాలో ఆ బలహీనత ఉండనివ్వను."
"ఏమో పారూ! మనం ఒకలా అనుకుంటే మరోలా జరిగింది. మీ ఇద్దరికీ తప్పకుండా పెళ్ళవుతుందని నేనెంతో ఎదురు చూశాను." విరక్తి గా అంది పద్మజ.
"పోనీ, పద్మా! అదంతా మరిచి పోదాం, జరిగి పోయింది తలుచుకుంటూ కూర్చుంటే ప్రయో జన మేమిటి? కాని నువ్వు నా కో సాయం చేసి పెట్టాలి." "నేనా? నీకు సాయమేమిటి?"
"మరేం లేదు. మా పరిస్థితి నీకు తెలుసు. ఇప్పట్లో నా పెళ్ళి ప్రసక్తి లేదు. నాన్నకి కూడా సవివరంగా చెప్పి ఒప్పించాను. ఎక్కడైనా దొరికితే ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను."
"నువ్వా? ఉద్యోగం చేస్తావా? నిజం?" సంభ్రమంగా చూస్తున్న పద్మజ కు తన మనస్సంతా విప్పి చెప్పేసింది పార్వతి.
"మీ ఇంటికోసారి వెళ్ళి మీ నాన్నగారితో ఈ సంగతి మాట్లాడుదామనుకున్నాను. ఈ నెల్లాళ్ళుగా శ్రద్ధ చెయ్యలేక పోయాను. నువ్వే లాగూ వచ్చావు. నాన్నగారికి అంతా చెప్పు. రేపు నేను వస్తాను. నాకేదైనా ఉద్యోగం దొరికేలా చూడు, పద్మా!"
"ఛ! నువ్వింతగా చెప్పాలా, పారూ? నిన్ను ఉద్యోగంలో చేర్పించాకే నేను మద్రాసు వెళ్తాను. పరిస్థితంతా వింటే నాన్న తప్పకుండా ప్రయత్నిస్తారు. నీకా భయం అక్కర్లేదు. ఏ ఆఫీసులో నైనా నువ్వు గుమస్తాగా చేరవచ్చును."
"ఆ! అదే, అదే నే ననుకుంటున్నాను , పద్మా! ఇక ఆలస్యం చెయ్యకూడదు , మా నాన్న ఆరోగ్యం బొత్తిగా బావుండడం లేదు."
తర్వాత చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు స్నేహితురాళ్ళు. పద్మజ మద్రాసు నగరం గురించీ తను చదువుకుంటున్న కాలేజీ గురించీ ఎన్నో చెప్పింది.
అనుకోని విధంగా పద్మజ రాక పార్వతి కెంతో ధైర్యం కలిగించింది.ఆ మాటే అంది. "నిన్ను చూస్తూనే నా మనస్సు తేలికయినట్లయింది పద్మా!" అంది నెమ్మదిగా నవ్వుతూ.
