Previous Page Next Page 
చదరంగం పేజి 17


    అంతెత్తు విగ్రహం బూట్లు టకటకలాడించుకొంటూ లోపలికి రాగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది. "వచ్చావా!" అప్రయత్నంగా అని లేచి కూర్చుంది. స్టూలు మంచానికి దగ్గరగా జరుపుకొని విష్ణును తనివితీరా పదే పదే చూడసాగాడు. ప్రతి అణువు విష్ణును ఆప్యాయంగా దగ్గరకు తీసుకోమని హెచ్చరిస్తూంది. ఒకసారి భ్రాత్రుప్రేమ పొంగి పొర్లిపోతూంది. తలమీద చేయివేసి మాట్లాడకుండా ఉండిపోయాడు.
    తలమీద వేసిన చేతిని కదిపితే ఊహ చెదిరిపోతుందేమోనన్నంత బాధతో పదిలంగా దాచుకోవాలని ప్రయాస పడుతూంది విష్ణుప్రియ.
    విష్ణు ఎటువంటిదైనా తన తండ్రి రక్తాన్ని పంచుకొని మరీ పుట్టింది. అసలే అందగత్తె. అందులో భగవంతుడు ఏవిధంగా ముద్ర వేస్తే ఏం? మాతృమూర్తి కాబోతున్నది. అందుకే మరంత అందంగా ఉంది.
    ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన కళ్ళు వేయికాంతుల్ని విరజిమ్ముతున్నాయి.
    "బావా! కోపం వచ్చిందా?" ప్రయత్నంమీద విష్ణు అడిగింది.
    "విష్ణూ, నిన్నొకటి అడగనా?" జేబులో చేయివేసుకుని లేచి నిలబడ్డాడు.
    "అడుగు, బావా! నీకు అభ్యంతరం ఏముంది?"
    "నన్ను పేరుపెట్టి పిలుస్తే ఏం?"
    తెల్లబోయినట్టు చూసింది విష్ణు. గుండె వేగంగా కొట్టుకొంటూంటే క్షీణస్వరంతో "నీకు అవమానం అయితే అలాగే పిలుస్తాను. కనీసం ఆ పిలుపులో నిన్ను దూరం చేసుకోలేదనుకొన్నాను. అయినా నాలాంటి దురదృష్టవంతులు బంగారాన్ని ముట్టుకోబోతే మట్టిగా మారిపోయి వెక్కిరిస్తుంది. తెలిసీ ఎండమావుల వెంట పరిగెత్తడం ఎంత పిచ్చిపని!" అన్నది.
    విష్ణు బాధ రాముకు పూర్తిగా అర్ధం అయింది. పచార్లు చేస్తున్నవాడల్లా ఆగి విష్ణు కళ్ళలోకి చూశాడు. "చూడు, విష్ణూ ఈ ప్రపంచంలో నువ్వే కాదు, నీలా పొంగే యౌవనంలో తప్పటడుగువేసే దురదృష్టవంతులు చాలామందే ఉన్నారు. వాళ్ళను ఏమంటావు?"
    దుఃఖాన్ని దిగమింగుతూ నిదానంగా అన్నది: "నాలో ఏమైనా పవిత్రత ఉంటే మరొకళ్ళ విషయంలో వ్యాఖ్యానాలు చేసేదాన్ని. ముందు నాదగ్గరే అది లోపమైపోయింది. ఇప్పుడనిపిస్తోంది కణిక సుఖాలకోసం ఎంత నష్టపోయానా అని!
    "తన కళ్ళలో కాపురం ఉండాలనీ, తన జీవితంతో నా జీవితాన్ని ముడిపెట్టుకోవాలనీ కోటి కలలు కన్నాను. తనతోటిదే లోకం అనుకొన్నాను. నేనూ ఎంతో చదివాను. తప్పటడుగు వేయడం అసంభవం అంటుంది ప్రపంచం. లోకానికేం తెలుసు, కార్చిచ్చుల్లా దహించే ఈ కోర్కెల్ని అరికట్టడం అసంభవం అనీ, ఉప్పెనలా వచ్చే ఈ ప్రవాహంలో గడ్డిపోచలా కొట్టుకుపోకతప్పదనీ?
    "ఇంతకీ నా నుదుటి వ్రాత అనుకొంటే అదో తృప్తి." ఆయాసంతో కాస్సేపు ఆగి అంది: "దేవుడు చేసిన దానికీ నేనిలా ఆయాననుకొంటే అదో ఆనందం. నేను పూర్తిగా తప్పు చేయలేదనే భావం మనసుని కాస్త ఊరటపరుస్తుంది."
    చేతిగడియారం చూసుకొంటూ, "నేనలా వెళ్ళి వస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వంటే నాకు జాలి ఉంది. ప్రేమ ఉంది" అన్నాడు రాము.
    
                                                  *    *    *

    కొండరాళ్ళను ముక్కలు ముక్కలు చేసే లంబాడీల జీవితమే ఎన్నోరెట్ల హాయి. తను పుట్టడం ఎలా పుట్టినా కాలు క్రింద పెట్టని ఐశ్వర్యవంతుల ఇంట్లో అంతులేని విద్య నార్జిస్తూ పెరిగాడు. కానీ, ఏం లాభం? కరుకుదేరిన చేతులతో గుండెల్ని బద్దలు చేసే కాఠిన్యంతో కొర్రల జావా తాగుతూ జీవితాన్ని వడ్డించిన విస్తరిలా గడిపివేసే ఈ లంబాడీల కన్న తనేమీ ముఖ్యుడు కాదు. తన కసలు వాళ్ళతో పోలిస్తే తూగే శక్తి లేదు. హాయిగా గడిచిన కాలేజీ జీవితమే బాగుంది. అమ్మా, నాన్నగారూ వ్రాసే ఉత్తరాలతో, తమ్ముడి స్నేహంతో క్షణాల్లా దొర్లిపోయాయి ఆ రోజులు. కానీ ఇప్పుడా సుఖం కనుచూపుమేరలో ఎక్కడా కనిపించడంలేదు. తను వీటికి అతీతంగా పారిపోలేడు. తనకా శక్తి ధైర్యమూ రెండూ లేవు.
    ఉంటే ఇంత చిత్రవధ అనుభవించేవాడే కాదు. జయలక్ష్మిని స్వంతం చేసుకొని నిశ్చింతగా ఉండేవాడు. కాళ్ళకు కట్టిన రకరకాల మంజీరాలతో, ఒళ్ళు నిండిన ఆభరణాలతో తన ముందునుంచి దిక్కులు ప్రతిధ్వని చేసే శబ్దంతో కదిలి వెడుతూంటే మరీ మరీ వల్లనే చూడాలనిపిస్తూంది. దూరంగా డామ్ లో దీపాలు తోరణాల్లా వెలిగాయి. రవి ఇంటికి వెళ్ళాడని ఆఫీసరు చెప్పారు.
    కొండరాళ్ళు బద్దలు చేసే శబ్దం ఆగిపోయింది. గుడిసెల్లో కలకలం బయలుదేరింది. జొన్నరొట్టెలు, కొర్రలజావే ఎంతో తృప్తిగా తాగుతున్నారు.
    తనకు పంచభక్ష్యపరమాన్నాలతో డైనింగ్ టేబిల్ మీద వడ్డించినా ఈ శాంతి రాద్. చలిగాలి మెల్లగా వచ్చి శరీరానికి తాకుతూంటే హాయిగా ఉంది.
    తిరిగి విష్ణుదగ్గరకు వెళ్ళాలంటే ఏదో బాధ, భయం. అయినా తప్పదు. తన తండ్రి చేసిన నేరానికి ఇద్దరూ చెరోవిధంగా నరకం అనుభవిస్తున్నారు.
    అడుగులో అడుగు వేసుకొంటూ లోపలికి ప్రవేశించాడు. స్పెషల్ వార్డులో నిశ్చింతగా నిద్రపోతూంది విష్ణుప్రియ. పక్కనే పరుపుమీద కూర్చుని విష్ణు వైపు దృష్టిని తిప్పాడు.
    పరిశీలనగా చూస్తూంటే బాధతో నిండిపోయాయి రాము కళ్ళు. ఒంటిమీద చేయి వేశాడు. ఏదో తృప్తి, ఆనందం ఇన్నాళ్ళూ తనూ, రవే అనుకొన్నాడు. కానీ ఇప్పుడు విష్ణుకూడా ఉంది.
    నిద్రలో విష్ణు నవ్వుతూంది. కలలు గంటున్నదేమో? తన అవివేకానికి తనకే అసహ్యంవేసింది.
    ఏమని కలలు గంటుంది? ప్రేమించిన వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఆశ్రయం ఇచ్చాడనా? చేసుకొంటానని వాగ్ధానం చేసిన తను నిలువునా ముంచేశాడనా?    
    ఏదీ కాదు. ఎదురుతిరిగింది మను. తనబిడ్డ, తన రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణం గుండెలో కదులుతూంటే ఏ తల్లి నవ్వదు?    
    కళ్ళు మెల్లగా తెరిచి చూసింది. "ఎప్పుడు వచ్చావు?" ఆత్రుతగా అడిగింది.
    విష్ణు తన అభ్యర్ధన తోసివేయలేదు. నిదానంగా చూస్తూ అన్నాడు: "అలా డామ్ వరకూ వెళ్ళొచ్చాను. రవి ఇంటికి వెళ్ళాడట. ఏమిటో మనసు బాగులేదు, విష్ణూ."
    నవ్వింది విష్ణు. "ఇప్పుడు చింత దేనికి? సమస్య పరిష్కారం అయిపోయింది కదా?"
    "నిన్ను చేసుకోనంతమాత్రాన నిశ్చింతగా ఉండగలననుకోకు, విష్ణూ. అంతకు మించిన సమస్యలు నా నెత్తిన ఉన్నాయని నువ్వెందుకు గ్రహించావు?" కాస్సేపాగి, "నిన్నిక్కడ ఎవరు చేర్పించారు?" అన్నాడు.
    "కన్న నేరానికి మా నాన్నే!"
    ఉలిక్కిపడ్డాడు రాము. "తరుచు వస్తూంటారా?"
    "ఉహుఁ! ఎంత కూతుర్నైనా అందరికీ ఉన్నట్లే నాన్నకి కూడా ఒక డిగ్నిటీ ఉంది...అసలు అత్త ఎందుకు పోయిందో అర్ధం కావడంలేదు."
    తల దించుకొని నేలమీద చేత్తో గీతలుగీస్తూ అన్నాడు రాము: "నీలాగే అత్త మోసపోయిందనీ, నన్ను మీ నాన్న దయవల్ల కనందనీ అంటే నువ్వు నమ్ముతావా?"
    స్థాణువైపోయింది విష్ణు. మంచంమీద లేచి కూర్చుని రాము భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అంది: "నిజంగా? నిజంగా?" రెట్టిస్తూ అపనమ్మకంతో అడిగింది.
    విరక్తిగా కళ్ళు మూసుకొన్నాడు. "నిజమే, విష్ణూ!"
    నిలువెల్లా పరిశీలిస్తూ చూస్తూంది. "రామూ, రామూ!"
    విష్ణు ఇక మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ రాత్రంతా నిద్ర రానూలేదు. తను పోవాలని ప్రయత్నించనూ లేదు. కడుపులో విపరీతమైన బాధగా ఉంది. ఎవరితోనూ చెప్పుకోలేని అగ్నిజ్వాలలు బయలుదేరుతున్నాయి.
    నువ్వు చేసిన నేరానికి ప్రతీకారం ఈ జన్మలో నీ కళ్ళముందు నువ్వే అనుభవించు అంటే ఎంత దారుణంగా ఉంటుందో క్రమేపీ అర్ధం గాసాగింది. తన తండ్రి చేసిన అన్యాయం ఇలా తనను పట్టుకు పీడిస్తున్నదా?
    ఏమో? ఎవరి కర్మలు వారివే నేమో? తుచ్చమైన కోర్కెలకు అతీతురాలు కాలేకపోయింది. అనామకుడై పోయే రాముకు అండగా వేణుగోపాల్ నిలిస్తే, తన బిడ్డకు ఎవరు ఉంటారు? రాము మగవాడు.
    తన దురదృష్టం ఇంకా పడగవిప్పి నాట్యంచేసి తను ఆడపిల్లనే కంటే? ఈ ప్రపంచంలో తనకున్న విలువ కూడా ఉండదా బిడ్డకు. తన బిడ్డను ఎవరు చూస్తారు? కణతలు బద్దలుచేసే తలనొప్పి. కడుపులో రకరకాల శబ్దంలో కదులుతున్న బిడ్డను ఇప్పుడే తఃను అదుపులో పెట్టలేక పోతూంది. పెద్దదయితే, అదిమాత్రం ఎవర్ని లక్ష్యపెడుతుంది?

                                   
    రాము ఎంత బుద్దిమంతుడు! చిన్నప్పుడు తను హిందీలో 'కీచడ్ కీ కమల్' చదివి ఏమిటో అనుకొనేది. బురదలోనే పుట్టి బురధలోనే పెరుగుతున్న స్వచ్చమైన కమలాని కెంత విలువ! రాము ఎటువంటి మనిషో ఎవరికీ తెలియదు? మెరుపులా ఆలోచన రాగానే నవ్వుకొంది. ఇంత గాఢంగా ప్రేమిస్తూ, ఆరాధిస్తున్న వ్యక్తి తనకు అన్నయ్య. తన కన్నీటిని అర్ధం చేసుకోగల వ్యక్తి తన తోబుట్టువు. ఈ తృప్తి తన కెన్ని జన్మలకు సరిపోతుంది? విశన్ మెల్లగా కళ్ళు మూసుకొంది.
    
                                    *    *    *

    "ఏం, విష్ణూ, కళ్ళు అలా ఉన్నాయేం? నిద్ర పోలేదూ? "పొద్దున్నేవచ్చి ఫ్లాస్కులో కాఫీ అందించాడు రాము. "లేదన్నయ్య, నిద్ర రాలేదు." విష్ణు రాత్రంతా కంఠస్తం చేస్తూనే ఉంది.
    పరిశీలనగా చూశాడు విష్ణువంక. ఆ కళ్ళలో ఏదో కాంతి. ఏదో చైతన్యం. మెల్లగా కళ్ళు దించుకొంది. "నా కివాళేం బాగులేదన్నయ్య. నా అనుమానం 'కరెక్టు' అవుతుంది."
    "అదే అయితే అదృష్టమే మరి!" విష్ణు మోస్తున్న బరువు రాము శరీరం మీద పని చేస్తూంది.
    రాము చేయి పట్టుకొని కూర్చోబెడుతూ అంది: "చూడన్నయ్యా నాకు ఆడపిల్ల పుడితే ఎంత కష్టమో ఆలోచించు!"
    విష్ణు చెదిరిన వెంట్రుకల్ని సరిచేస్తూ ఉండిపోయాడు రాము.
    "చెప్పన్నయ్యా, నాకే ఆడపిల్ల పుడితే?"
    "అప్పటి సంగతి దేనికి, విష్ణూ? నువ్వు అనవసర విషయాలు కూడా ఆలోచిస్తున్నావు." మందలించాడు రాము. పగలంతా అక్కడే గడిపి గెస్ట్ హౌస్ వైపు దారితీశాడు ఆరున్నరకు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS