Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 17

 

                                  22
    కామేశ్వరరావు గారింటికి వెళ్ళేందుకు రెడీ అయి క్రిందకు వచ్చేసరికి ఆమె కోసమే ఎదురుచూస్తూ నిలుచుని వున్నాడు ప్రభాకర్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆమె ముఖం చూస్తూ ఎంతసేపయినా గడపగల ప్రభాకర్ ఎప్పుడూ బలవంతంగా చూపులు మరల్చు కోవాల్సిందే! ఎంత సింపుల్ గా తయారయినా , కుసుమ శరీర వర్ణానికి , ప్రతి రంగు చీర ఓ కొత్త అందాన్ని యినుమడింప చేస్తుంది.
    ప్రభాకర్ కు ఎదురు చెప్పడానికి యిష్టం లేక అతనితో బయలు దేరింది కాని, ఆరోజు కుసుమ మనసుమనసులో లేదు. ఆ ఉదయం పోస్టాఫీసు నుంచి తెచ్చుకున్న వుత్తరం అంతులేని ఆందోళన కలగజేసింది కుసుమలో.
    కుసుమ తల్లి, తనకు ఒంట్లో బాగలేదని ఒక్కసారి వచ్చి వెళ్ళమని రాసింది. కాని, ఎలా వెళ్ళడం? వూరు దాటి పై వూరు వెళ్ళాలంటే ప్రభాకర్ కు తెలియకుండా ఎలా? యిప్పుడే నెలనెలా డబ్బు పంపుతూ వుంటే తెలియకో, తెలిసి పట్టించు కోకో. ప్రభాకర్ ఎప్పుడూ అడగలేదు. కాని యిప్పుడు..? ఏనాడు బయట ప్రపంచం లో అడుగు పెట్టని అమ్మ ...యిప్పుడు ప్రభాకర్ కు తెలిస్తే ....అయినా అమ్మ అంతదూరంగా, ప్రపంచంతో సంబంధం లేనట్లు ఎందుకు వుండాలనుకుంటుంది? చిన్నప్పటి నుంచి ఈ అనుమానం తనలో పెరుగుతూనే వుంటుంది. ఎప్పుడు అమ్మను అడగబోయినా , ఏదో విధంగా మాట దాటేసేది కాని, ఒక్కసారి కూడా తనకు సరయిన జవాబు చెప్పేది కాదు. యిప్పుడు ప్రభాకర్ ద్వారా తను చేసిన పనులు అమ్మకు తెలిస్తే .....ఆ డబ్బు సంగతి అమ్మకు తెలిస్తే యింకేమయినా వుందా? తనని ఎంతో కట్టుదిట్టాలతో పెంచి, నీతి నిజాయితీలకు తను మారు పేరు అనుకునే అమ్మకు, తనింత కాలం చెప్పిన అబద్దాలని తెలిసిపోతే ....యింకేమయినా వుందా? తన మీద వున్న ఆశలతో పాటు, తను కూడా కుప్పలా కూలిపోతుంది.
    పోనీ ఏ స్నేహితురాలినో కలవాలని చెప్తే..... అతనికి మాత్రం తెలియదూ? తనకు చెప్పుకునేందుకు మాత్రం తెలియదూ? తనకు చెప్పుకునేందుకు ఒక్క స్నేహితురాలు కూడా లేదని..... నమ్మడు. ఒకవేళ నమ్మినా స్వయంగా తీసుకేడతానంటాడు. లేదా కారులో తప్ప పోనివ్వడు.....
    పోనీ ప్రభాకర్ కు చేప్పేస్తే , తన సమస్య లన్నీ అర్ధం చేసుకోగలిగిన వాడు యీ విషయం మాత్రం....? వూహూ యిప్పటికే ఎలాగయినా తన చిన్నతనం తెలుసుకోవాలను కుంటున్నాడు యీ అవకాశం వస్తే వదిలి పెట్టడు. ఒక్కసారి ప్రభాకర్ మీద అంతులేని కోపం వచ్చింది. కుసుమకు. ఛ.... తను ఏ పని చెయ్యడానికి వీలు లేనంతగా కట్టి వేశాడు. మంచితనం -- స్నేహం  అంటూ తన స్వాతంత్యాన్నంతా పోగొట్టాడు. ఛీ...ఛీ.... అసలితని దగ్గర యింతకాలం ఉండటమే తను చేసిన మొదటి పొరపాటు.
    కుసుమ ఆలోచనలు ఒకచోటకు చేరకుండానే కారు కామేశ్వరరావు గారి యిల్లు చేరింది.
    ఆ రాత్రి ప్లేటు నిండుగా రుచికరమయిన పదార్ధాలతో ఎదురుగా వున్నా ఏమీ తినలేక పోయింది కుసుమ పళ్ళెం నిండుగా వాటిని చూస్తూ వుంటే కళ్ళలో నీరు గిర్రున తిరిగాయి. ఎదురుగా ప్రభాకర్ వాళ్ళంతా గమనించకుండా వుండేందుకు తల బాగా వంచుకుని ప్లేటులో వేలు పెట్టి రాస్తూ వుండిపోయింది.
    అంతకు ముందు నుంచి ఎన్నోసార్లు వచ్చి పోతుండటం తో బాగా అలవాటయిన కుసుమ వంక నిశింతగా చూస్తూ గమనించసాగింది కామేశ్వరరావు గారి భార్య.
    "ఏవమ్మా . యివాళ ఏమీ తినలేదు..... ఏదయినా విశేషం వుంటే మాకూ చెప్పు. విని సంతోషిస్తాం" అంది చనువుగా నవ్వుతూ.
    చటుక్కున తల ఎత్తింది అదిరి పడ్డట్టు ఒక్క క్షణం ఆవిడ వంక చూచి, ప్రభాకర్ వంక చూచింది. క్షణం సేపు మధురమయిన భావం అతని కళ్ళలోకి తొంగి చూసింది. కుసుమ వంక ఒక్కసారి చూసి ఆమె ముఖంలో భావాలు చదవడం యిష్టం లేనట్లు గబగబా భోజనం చేయడం లో నిమగ్మమయ్యాడు తలవంచుకుని.
    'అబ్బెబ్బే అదేం లేదండి. యివాళెందుకో ఆకలి అనిపించడం లేదు" అంది కుసుమ కంగారుగా.
    వెన్నెల్లో ఓపిన్ టాపు కారులో వెడుతున్న కుసుమకు చల్లని గాలి, చక్కని వాతావరణం హాయిని కలిగిస్తున్నా అవి గమనించే స్థితిలో లేదు కుసుమ.
    ఆమె మనసు పరిపరి విధాల సాగుతోంది. ఇది వరకు ఎప్పుడు స్పురించని విషయాలు ఎవరో ఎరుడుగా నిలబెడుతున్నారనిపించింది. "తామిద్దరిని గురించి అందరూ అలోచిస్తున్నారన్న మాట ఎదురుగా ఏ సంబంధం లేని వ్యక్తుల్ని చూచినా ఏదో ఒకటి అనుకోకుండా వుండరు. ఒకరి రెండేళ్ళ లో ప్రభాకర్ కి పుట్టే పిల్లల మీద వుంటుంది కాబోలు అందరి దృష్టి. బ్రతుకంతా పిల్లలే లేకపోతె ప్రభాకర్ లక్షలకు వారసులే లేరని ప్రతి వారు సానుభూతి , జాలి.....సలహాలు.... సంప్రదింపులు.....వళ్ళంతా చీమలు పాకినట్లనిపించింది కుసుమకు.
    పక్కన తీరికగా మధ్య మధ్య కుసుమ వంక పరికిస్తూ డ్రైవ్ చేస్తున్న ప్రభాకర్. చాలాసేపు కుసుమను పలకరిద్దామనుకుంటూనే గడిపాడు. ఎందుకో తెలియకుండా అతన్ని ఒక విధమయిన సంకోచం ఆపివేసింది. ఇందాక వాళ్ళింట్లో కుసుమ ముఖంలో కంగారు, భయం కలగాపులగంగా మారిన రంగులు ఎంత వద్దనుకున్నా తలపుకు వస్తూనే ఉన్నాయి. అతనికి మొట్ట మొదటి సారిగా ప్రత్యక్షంగా . కుసుమ త్వరలో ఎడుర్కొనబోయే సమస్య కొండలా కనిపించింది.
    మౌనం రాక్యం చేస్తుంటే కారు యిల్లు చేరింది. ఆ సాయంత్రం నుండి కుసుమతో మాట్లాడాలను కుంటూనే వాయిదా వేస్తూ వచ్చిన ప్రభాకర్ కుసుమ మౌనం చూచి, ఆరోజుకు మానేద్దామా అనుకున్నాడు.
    బట్టలు మార్చుకుని కిటికీ దగ్గర నుంచుని బయటకు చూస్తోంది కుసుమ. చంద్ర వంకలో చక్కదనం పక్కన మెరిసే తారల్ని పరిహాసిస్తోంది. నిర్మల మయిన నీలాకాశం నిస్చాలత్వానికి కొత్త అర్ధం చెప్తోంది అక్కడక్కడ చెదురు మదురుగా వున్న మేఘాలు స్థాన బలం లేనట్లు ఎక్కడికో పరిగెడుతున్నాయి.
    "కుసుమా!"
    వెనక్కి తిరిగి చూసింది.
    "నీతో ఒక ముఖ్యమయిన  విషయం చెప్పాలి. అందుకు నీ అంగీకారం కావాలి."
    తలెఎత్తి అతని ముఖంలోకి చూసింది అతని కంఠంలో ఎక్కడా అర్దింపు కనిపించలేదు. ఏదో ఒక విధమయిన అధికారం వుంది. ప్రభాకర్ ఎప్పడు అంతే ! సంపూర్తిగా కుసుమ అభిప్రాయం తీసుకో దలుచుకానప్పుడు ఏ విషయాన్ని ఆమెను అడగడు చెప్తాడు! ఆ రెండింటి కి తేడా బాగా తెలిసిన కుసుమ అతని వంక అయిష్టంగా చూసింది.
    "నేనిది వరకు చెప్పాను గుర్తిందా! బాంబే లో డాక్టర్ ని గురించి...." ఆగిపోయాడు.
    కుసుమ ముఖం ఎర్రగా కంది పోయింది.
    "అయన చాలా బిజీగా వుంటాడు. వచ్చేవారం నిన్ను కలవ వీలు అవుతుందని రాశాడు. మనం వెడుతున్నాం." అన్నాడు. మౌనంగా వుండిపోయింది కుసుమ . నీకు అభ్యంతరం లేదుగా అని మాట మాత్రమయినా అడగని ప్రభాకర్ కు ఏం చెప్తుంది?
    ప్రభాకర్ కి తెలుసు. తనే మాత్రం సందిచ్చినా రావడానికి అంగీకరించదు. పైగా ఆ విషయం నిర్మొహమాటంగా మొహం మీదే చెప్తుంది.
    నిశ్శబ్దంగా , నిర్లిప్తంగా వున్న కుసుమను చూస్తుంటే తెలియకుండానే జాలి అనిపించింది ప్రభాకర్ కు.
    ఛ ఆమె తీసుకోవలసిన ప్రతి విషయం లోనూ నిర్ణయం తనదే! అదీ తన బలవంతం మీద తప్ప యిష్టంగా మనస్పూర్తిగా ఆమె చేసిన పని ఏ ఒక్కటి లేదు! వద్దనుకున్నా అడగకుండా వుండలేక పోయాడు.
    "నీ కిష్టమే కదూ?"
    "నా కిష్టమో కాదో మీకు తెలుసు."
    "తెలుసు. అందుకే బాధనిపించింది. ప్రతిదీ బలవంతం మీద చేయాల్సి వస్తోంది."
    "........."
    "యీ ఒక్కసారి మనస్పూర్తిగా సహకరించు కనీసం ....నాకోసం" అన్నాడు.
    "ఫలితం లేదని తెలిసి కూడా మీరీ ప్రయత్నాలు మానరేం?"
    "ప్రయత్నం చేయ్యనిదే ఫలితం వుండేది లేనిదీ ఎలా తెలుస్తుంది?"
    "నాకు డాక్టర్లు చెయ్యగలిగే సహాయం ఏమీ లేదు. మీకా విషయం యిదివరకే చెప్పాను." పోనీ నా తృప్తి కోసం చెయ్యి. ఫలితం వున్నా లేకపోయినా ప్రయత్నించలేదన్న భావన నా కుండటం యిష్టం లేదు.
    కొద్ది నిముషాలు మౌనాన్ని ఆశ్రయించాయి . పైన తిరిగే ఫాను, పక్కన పాడే రేడియో వారి నిశ్శబ్ధతను భంగం చేయలేకపోయాయి.
    చాలాసేపు ఏదో ఆలోచిస్తూనే గడిపాడు ప్రభాకర్. ఏదో విషయంలో ఔనూ కాదు అన్న సందిగ్ధం అతన్ని వదలలేదు. చివరకు ఏదో నిశ్చయించుకున్నట్లు..
    "యిన్ని నెలలయినా నువ్వు మీ అమ్మను చూడటానికి వెళ్ళలేదెం?' ఆగి కుసుమాలో కదిలే ప్రతి మార్పును గమనిస్తూ.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS