Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 17


    హరి నవ్వి ఊరుకున్నాడు.
    "ఏమిటీ విశేషాలు?' అన్నాడు ప్రసాద్ మళ్ళీ.
    హరి కాఫీ పూర్తీ చేసి "పైన రూమ్ లో ఉంటున్నాను. అక్కడికి పోయి మాట్లాడుకుందాం పద."ఈ గందర గోళం లో ఎందుకూ?" అన్నాడు. హరి హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నందుకు ప్రసాద్ ఏంతో ఆశ్చర్య పోయాడు. రూమ్ లో వెళ్లి కూర్చున్నాక ఆ మాటే అడిగాడు.
    "ఇదేమిటి హరీ! స్వంత చెల్లెలు ఊళ్ళో ఉండగా , నువ్వు హోటల్లో దిగట మేమిటి?"
    "పరిస్తితులలా వచ్చాయి. ఏం చెయ్యమంటావు?' "నేను వినకూడనిది, కాకపొతే, నాకు తెలిసి కోవాలనుంది హరీ!"
    "అంత పెద్ద రహస్యం కాదు-- దుర్గ సంసారం లో ఏవో చికాకులు వచ్చాయి. అవి సర్దడానికి నేను ప్రయత్నిస్తే శంకర్ కు కోపమొచ్చింది. అస్పర్దల వల్ల నేను అక్కడ దిగలేదు."
    "బాగుంది. ఏవో కలత లోస్తే, సర్దుకోవాలి, కానీ, అది పెంచుకు కూర్చుంటారా?"
    "అది కాదు ప్రసాద్! శంకర్ స్పష్టంగా నన్ను తమ ఇంటికి రావద్దని చెప్పాడు. ఏం చెయ్యాలి మరి!"
    "నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మరి....." అంటూ సందిగ్ధంగా ఆగిపోయాడు.
    హరి ఆత్రుతగా "ఏమిటి?' అన్నాడు.
    ప్రసాద్ సందేహిస్తున్నట్లుగా "మీ కుటుంబ విషయాల్లో కలుగ జేసికోవటం మంచిది కాదులే క్షమించు." అన్నాడు.
    హరిలో కుతూహలం పెరిగింది. ప్రసాద్ చెయ్యి పట్టుకుని , "నువ్వు నేనూ చిన్నతనం నుంచీ స్నేహితులం. మన మధ్య ఇంతటి సంకోచ మెందుకూ ప్రసాద్! నాకు చెప్పవూ?' అన్నాడు.
    "నాకు తమాషాగా ఉంది హరీ! స్వంత అన్నవు నువ్వక్కడికి వెళ్ళటానికి వీల్లేక పొవటమేమిటి? ఆ గిరికి అక్కడ స్వతంత్రమేమిటి? అన్నవైన నీకంటే, గురి ఆ కుటుంబానికి కావలసిన వాడన్న మాట."
    హరి తల వంచుకున్నాడు. ఈ విషయం అంతకు ముందే అతని మనస్సులో అనేక సార్లు మెదిలింది. దుర్గ తన చికాకులన్నీ తనకు వ్రాయకుండా గిరి కి వ్రాయటం, తాను ఆ ఇంటికి కూడా వెళ్లకూడని స్థితిలో, గిరి వాళ్ళకు ఆత్మీయుడు కావటం, అతని మనసులో ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. అన్నింటి కంటే గిరి దుర్గను ప్రేమించాడనే హరి నమ్మకం. దుర్గే అతనిని కాదని శంకర్ ని చేసుకుందని హరి భ్రమ. ప్రస్తుత సంసార పరిస్థితులలోని అల్లకల్లోలానికి తట్టుకోలేక, దుర్గ తనను ప్రేమించిన గిరి మీద ఆధారపడిందా? అని హరి అంతరాంతరాలలో ఒక అనుమానం కలుగ జేస్తుంది. అయినా దుర్గ క్లిష్టమైన పరిస్థితి ఆధారంగా ఆమె జీవితాన్ని నాశనం చేసేటంత నీచుడు గిరి కాడనే విశ్వాసమే అతని ధైర్యం. హరి ముఖంలో తనకు కావాల్సిన మార్పులు కనిపించిన ప్రసాద్, సంతృప్తి గా ఊపిరి పీల్చాడు. సమిధలు వేయడానికి ఇదే సందని కూడా ఆలోచించాడు.
    "ఇంకొక సంగతి హరీ ! నువ్వేమీ అనుకోనంటే చెపుతాను" ఏమిటన్నట్లు చూశాడు హరి.
    "దుర్గ నాకు కూడా స్నేహితురాలు . నేను కూడా ఆమె క్షేమం కోరే వాడిని. అన్నవైన నీకీ విషయం తెలిస్తే దీనికి పరిష్కార మార్గం అలోచిస్తావని చెపుతున్నాను. అంతేకాని ఎవరి మీద ద్వేషంతో కాదు."
    "సంగతి చెప్పు! ఇంత నానుస్తా వేం" అన్నాడు విసుగ్గా.
    "ఇది విసుగ్గా వినవలసిన సంగతి కాదు. శాంతంగా ఆలోచించవలసిన విషయం -- నీకు విసుగ్గా ఉంటె చెప్పక పోవడమే మంచిది."
    ప్రసాద్ ఊరించే పద్దతి చూస్తె హరికి ఒళ్ళు మండుతుంది.
    నాకేం చెప్పోద్దులే. పో! అందామని కూడా అనిపించింది. కానీ, తన కుతూహలాన్ని అణచు కోలేక, "నేనేం అనుకోను అసలు విషయం చెప్పు" అన్నాడు.
    ప్రసాద్ బాధ పడ్తున్న వాడిలాగా ముఖం పెట్టి "ఏంలేదు, చుట్టూ ప్రక్కల వాళ్ళంతా, దుర్గా గిరీ లను గురించి రకరకాలుగా అనుకుంటున్నారుట అసలైన రక్త సంబంధీకు లెవరూ , రాకపోగా, శంకర్ కేదో దూరపు చుట్టమైన ఈ గిరి ఇంత తరచూ రావటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది మరీ. అంతేగాక, గిరి సాధారణంగా శంకర్ లేని సమయాల్లో వస్తాడట. అందుకని చుట్టూ పక్కల అందరూ చెవులు కొరుక్కుంటూన్నారు. వెధవ సంఘం! మంచి చెడ్డలక్కర్లేదు దానికి." అన్నాడు.
    హరి మనసు మండి పోతుంది. తనకీ వార్తను చెప్పిన ప్రసాద్ ను చాచి లెంపకాయలు కొట్టాలన్న ఉద్రేకాన్ని అతి ప్రయత్నం మీద అణచు కుని "ఎవరు చెప్పారు నీకీ సంగతులన్నీ? కష్టపడి సేకరిస్తున్నావా?' అన్నాడు నిరసనగా.
    ప్రసాద్ కంగారు పడి "ఛీ! ఛీ! నేనసలదేంట్లోనూ కలిపించు కొను. మొన్న ఏదో మాటల మీద జానకి ఎంతో బాధపడుతూ చెప్పింది. నాకు కూడా చాలా కష్ట మనిపించింది. నువ్వేదైనా ఉపాయం అలోచించి ఆ పుకార్లను అణచి వేస్తావని నీతో చెపుతున్నాను." అన్నాడు.
    జానకి చెప్పిందనగానే హరి కృంగి పోయాడు. జానకి అంటే హరి కెంతో గౌరవము. ఎప్పుడూ ముక్కుకు సూటిగా పోతుంది. మనసులో మాట కచ్చితంగా చెపుతుంది. అబద్ధాలూ, తప్పుడు ప్రచారాలు చెయ్యదు. సరికదా, ఎవరైనా చేసిన వాళ్ళను అసహ్యించు కుంటుంది. ఎన్నడూ, ఎవ్వరినీ దోషిగా నిరూపించి మట్లాడదు. తనకేవరి ప్రవర్తనైనా నచ్చకపోతే వాళ్ళను గురించి ప్రస్తావించదు. అట్లాంటి జానకి ఈ వార్తా చెప్పిందంటే అందులో తప్పక  సత్యముండాలి. అంతేకాక జానకీ, దుర్గా ఆత్మీయులైన స్నేహితులు. దుర్గ పరిస్థితి జానకికి చక్కగా తెలుస్తుంది. లేని మాటలామే ఎందుకు చెప్తుంది?
    ఎంతో ఉత్తముడూ, ఉన్నతమైన ఆదర్శాలు కలవాడూ అని భావించిన గిరి , చివరకు ఇలా దిగజారాడా?
    ప్రసాద్ తనమనసులోని మంట చల్లార్చు కుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మంటలు ద్విగుణీకృతమైన జ్వాలలతో హరి హృదయంలో ప్రజ్వరిల్లాయి.

                                       19
    అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి బట్టలు మార్చుకుని, కాఫీ త్రాగుతున్న గిరి, హరి రాగానే సాదరంగా ఆహ్వానించి అతనికి కూడా కాఫీ అందించాడు.
    హరి విసుగ్గా "నాకు కాఫీ, గీఫీ , ఏం అక్కర్లేదు." అని కప్పులను వెనక్కు తోసేసాడు. గిరి ఆశ్చర్యంగా హరి ముఖం లోకి పరీక్షగా చూశాడు. అతని ముఖం లో ఇటీవల కలిగిన మార్పును గమనించే సరికి గిరి గుండె ద్రవించి పోయింది. ఏదో జబ్బు పడి లేచినట్లున్నాడు. అతని హృదయం లోని ఆవేదన అతని కళ్ళలో ప్రతి ఫలిస్తుంది . గిరి అతని దగ్గరగా వచ్చి, అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా నొక్కుతూ, "ఏదీ సీరియస్ గా తీసుకోకు హరీ! జీవితంలో ముందుకు తోసుకు పోవటం నేర్చుకో!" అన్నాడు.
    హరి గిరి చేయ్యి విదిలించి "ఇక మీదట మంచీ మర్యాద కూడా, సీరియస్ గా తీసుకోకపోవటం నీ దగ్గర నేర్చుకుంటానులే!" అన్నాడు.
    గిరి ఆశ్చర్యంగా అతని వంక చూసి "నీ ధోరణి ఇవాళ తమాషాగా ఉంది హరీ!" అన్నాడు.
    "అవును ముఖం ఎదురుగా ఆప్యాయత నటించి, వెనకాల గోతులు తవ్వటం నాకు చేత కాదు."
    ఈ మాటలతో గిరి ముఖం గంబీరంగా మారిపోయింది. నిదానంగా అన్నాడు.
    "ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ హరీ! విషయమేమిటి?"
    "నాకత్యంత ఆత్మీయులనుకున్న వాళ్ళే నాకంతు లేని క్షోభను కలిగిస్తుంటే , నేనెవరితో చెప్పుకోను?"
    హరి కంఠం గద్గదికమయింది. గిరి గుండెలు కలుక్కుమన్నాయి. తన అంతరాంతరాలలోని రహస్యం హరికి తెలిసిపోయిందా?
    హరి కుర్చీలో వెనక్కు జేర్లగిల బడ్డాడు. అలసటతో , ఆవేదనతో , రోషంతో అవమానంతో అతని కళ్ళు మండుతున్నాయి.
    "కానీ, గిరి , నేను నమ్మలేక పోతున్నాను. ఇదంతా నీకు తెలిసే చేస్తున్నావా? తెలియక చేస్తున్నావా?"
    విపరీతమైన వేగంతో స్పందించే గుండెలను అణచి పెట్టి , సమాధానం చెప్పక, ఇంకా హరి చెప్పే మాటలు కోసరం ఎదురు చూడసాగాడు గిరి--  అతని ముఖం పాలి పోయింది . అపరాధి లా కళ్ళు వాల్చు కున్నాడు. వణికే పెదిమలను బలవంతంగా పళ్ళతో నొక్కి ఉంచాడు. తీవ్రతరమైన ఒకానొక ఉద్రేకాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటున్న లక్షణాలతనిలో స్పష్టంగా కన్పిస్తున్నాయి.
    అప్పటి గిరి ముఖమూ, అతని మౌనమూ హరిలోని అసహనాన్ని ఉచ్చ స్థాయిని చేర్చాయి. ప్రసాద్ చెప్పిన మాటలు అతని మనసును పుండు లాగ బాధించినా, గిరి మీద గల విశ్వాసం, ఆ మాటలను నమ్మనియ్య లేదు. "ఇందులో ఏదో అసత్యం ఉండాలి. ఎవరో పొరపడి ఉండాలి" అని తనను తాను ఓదార్చు కోవటానికి ప్రయత్నించాడు. గిరి ద్వారా , అంతా అబద్దమని తెలిసికొని సంతృప్తి పడాలనే ఆశ అతని మనసులో ఏ మూలనో ఉంది.
    కానీ ఇప్పటి గిరి మౌనమూ, తన మాటలను వింటూ అతడానుభవిస్తున్నసంక్షోభమూ, హరి అనుమానాలను దృడం చేసింది. అణచి ఉంచుకున్న అతని ఆవేశం కట్టలు తెగింది. విపరీతమైన రోషంతో వణికిపోతూ లేచి నుంచున్నాడు -----
    "నువ్వు దుర్గను ప్రేమిస్తే అందులో తప్పు లేదు కానీ, నీ ప్రేమ కోసం దాని జీవితం నాశనం చేద్దామను కుంతున్నావా? నీ ప్రేమ నిజమయినదయితే నువ్వు ప్రేమించిన వాళ్ళ నైచ్యాన్ని కోరుకుంటావు. అంతేకాని, నీ స్వార్ధాన్ని చూసుకోవు. దుర్గ ప్రస్తుత సంసార పరిస్థితి ని చక్క దిద్దడానికి ప్రయత్నించటానికి మారుగా, నీ స్వప్రయోజనానికి వాడుకుంటూన్నావా? చుట్టు ప్రక్కల అందరూ, మిమ్మల్ని గురించే అనుకుంటున్నారనీ అది దుర్గ కు అవమాన కరమనీ , అయినా ఆలోచించ లేదేం? ఛీ! ఛీ! ఇంత నీచుడివనుకోలేదు. ఇంక మీదటైనా నా మీద దయ తలచి, అక్కడకు వెళ్ళకు. నా ప్రార్ధన ను మన్నించు."
    ఈ మాటలు పూర్తీ చేయటమూ, హరి గబగబ బయటకు నడవటమూ, ఒక్కసారే జరిగినాయి. గిరి తన దిగ్భ్రాంతి లోంచి తేరుకునే సరికి, హరి అక్కడ లేదు------
    గిరి తన మనసులో నైనా , హరికి గానీ, ఉమకు గానీ ద్రోహం తలపెట్టక పోయినా హరి తనదిగా భావించిన ఉమనే తనూ ఆరాధించటం, ఒక దోషంగానే భావించాడు-- దీనికి తోడు, ఉమ కూడా తన పట్ల అనురాగాన్ని చూపాటం, హరిణి తిరస్కరించడం , అతనికి మరింత బాధ కలిగించింది. ఉమ తనను నిర్లక్ష్యం చేసి హరిణి చేసుకుని ఉంటేనే హాయిగా ఆనందించే వాడు గిరి-- ఉమ తిరస్కారానికి హరి అనుభవిస్తున్న వ్యధకు తానే బాధ్యుడయినట్లు అతని అంతరాత్మ అల్లరి పెడుతుంది. తన ప్రాణ మిత్రుడయిన హరి ఆవేదనకు, అందులో తన కారణంగా కలిగిన, ఈ నిరాశ ను నిర్మూలించవలసిన బాధ్యత తనదే నని కూడా అనుకున్నాడు గిరి----
    దుర్గ విషయం లో హరి వేరొక విధంగా భావించ గలడనే అనుమానం, గిరికి ఏ కోశానా లేదు. అందుకనే, హరి, ఉద్రేకంగా సంభాషణ ప్రారంభించగానే అతడు ఉమ విషయమని భావించాడు. అతని అపరాదిత హృదయం హరి ముందు సంకోచం తో ముడుచుకు పోయింది. మాట్లాడటానికి నోరు రాలేదు -- తల ఎత్తి మిత్రుని చూసే ధైర్యం కూడా లేకపోయింది గిరికి.
    ఒక్కసారిగా దుర్గ ప్రస్తావన వినగానే దిగ్భ్రమ చెందాడు గిరి-- అంటే హరి మనసులో ఈ అభిప్రాయం ఎప్పటి నుంచో ఉందన్న మాట! తన పెళ్లి గురించి హరి ప్రశ్నించి నప్పుడు తానిచ్చిన సమాధానం ఈ ఊహను బలపరచి ఉండాలి-- అయ్యో హరి!
    తన ప్రాణ మిత్రుడైన హరి మనః సంక్షోభం గిరికి కూడా చాలా బాధ కలిగించింది. ఎలాగైనా హరి దిగులు నంతా కడిగి వెయ్యాలి. దుర్గ సంసారం చక్కబడాలి. దుర్గను తన చెల్లెలి లాగా అభిమానిస్తున్నానని హరి అర్ధం చేసుకోవాలి. ఈ పనులు తన వల్ల అవుతాయా? అన్నింటి కంటే తనకూ, హరీకి మధ్య ఎంతటి స్వల్ప విభేదాలయినా రావటం గిరి సహించ లేకపోయాడు. వెంటనే వెళ్లి అసలు సంగతి వివరించి , హరితో మనస్పర్ధలు లేకుండా చేసుకోవాలని అతని మనసు అత్ర పడ సాగింది. ఆ సమయంలో హరి క్లబ్బు లో ఉంటాడని ఊహించి అక్కడకు వెళ్ళాడు. కేరమ్స్ ఆడుతున్న హరి గిరిని చూడగానే , బోర్డు వదిలేసి అక్కడి నుండి లేచి గిరి ముఖమైనా చూడకుండా తన మోటారు సైకిలు మీద వెళ్ళిపోయాడు. గిరి శూన్యమైన మనసుతో తనూ వెనుదిరిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS