అనంతలక్షి వివాహం జరిపించినప్పటినుండీ హెడ్ మిస్ట్రెస్ కు, పారిజాతం, సత్యలంటే చాలా గౌరవం ఏర్పడింది. తాత్కాలికంగా ఏదైనా అల్పబుద్ది పొడ చూపినా, వారు చేసిన పనులలోని గొప్పతనాన్ని ఆమె గుర్తించింది. ఒక స్త్రీని ఉద్దరించడం అంటే మాటలా! తన వెనకటి ప్రవర్తనకు మనస్పూర్తిగా ఆమె పశ్చాత్తాపం చెందింది.
పారిజాతం తండ్రీ, తల్లీ చనిపోయినప్పుడు, హెడ్ మిస్ట్రెస్ నిజంగా ఎంతో దుఃఖించింది. పారిజాతం బడికి రానవసరం లేకుండా తాను చేయగలిగిన సాయ మంతా చేసింది. వీలయినప్పుడంతా వచ్చి పారిజాతాన్ని ఓదార్చేది! కాని, తల్లిదండ్రులను పోగొట్టుకొన్న నాటి నుండీ పారిజాతం పిచ్చిదానివలె అయింది. ప్రాణ స్నేహితురాలయిన సత్యతోకూడా మాటా మంతీ లేదు. నిరంతరం కన్నీరు కారుస్తూ ఉంటుంది. సంగీతకు తల్లిదండ్రులు పోయిన దుఃఖం కంటే, పారిజాతం ఇట్లా పిచ్చిగా కావడం ఎక్కువ దుఃఖం కలిగించింది, ప్రస్తుతం సంగీత ఆలనా పాలనా సత్యవతే చూచుకొంటున్నది.
ఒకనాడు హెడ్ మిస్ట్రెస్ కన్నీరు కారుస్తూ, "సత్యవతమ్మా! పారిజాతమ్మ ఇట్లాగే ఉంటే మనకు దక్కదు! ఆమె కా ఇంట్లో ఉంటే అన్నీ జ్ఞాపకాలు వస్తాయి, పాపం! ఆమెని ఇక్కడి నుండి మార్చమని చెబుతాను. మీరుకూడా కొన్నాళ్ళు సెలవు పెట్టి ఆమె వెంట ఉండండి. ఆమె మళ్ళీ మామూలు మనిషయితే మాకు చాలు!" అని అంది.
సత్యవతికీ స్నేహితురాలి స్థితి చూస్తే గాభరాగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కొంటెగా తిరిగే పారిజాతం ఎంత స్తబ్దుగా మారింది? మామూలు మనిషిగా ఎట్లా అవుతుంది? హెడ్ మిస్ట్రెస్ చెప్పి నట్లు ఊరుమారితే? కాని, ఊరు మారినంత మాత్రాన దిగులు మానుతుందని నమ్మకం ఏమిటి? తిండి సరిగా తినదు! కొద్ది రోజులకే చిక్కి శల్యమయింది. పారిజాత కుసుమంలాగే కోమలవైన పారిజాతం మనసు ఈ మానసికాఘాతాన్ని తట్టుకోలేకపోయింది!
కాని, కొన్నాళ్ళపాటు ఈ వాతవరణానికి దూరంగా ఉంటే పారిజాతం కాస్త కోలుకోవచ్చేమో! అంతేకాదు, తనకు కూడా అనంతలక్ష్మి బెడద కొంతవరకు తప్పుతుంది!
అనంతలక్ష్మికి తన అన్నతో పెండ్లయినప్పటి నుండీ సత్యవతికి కొత్త బెడద వచ్చిపడింది. ఈ కొద్ది కాలానికే సత్యకు విసుగు కలిగింది. అనంతలక్ష్మి తల్లి పనిగట్టుకొని, ఇల్లిల్లు తిరిగి, తన కుమార్తె డిప్యూటీ కలెక్టర్ భార్య అనీ, సత్యవతి తమకు చుట్ట మయిందనీ చెప్పి వస్తున్నది. ప్రతి దినమూ డబ్బు కావాలనో, బియ్యం కావాలనో, ఏదో ఒక వస్తువు కోసం సత్య ఇంటికి సుబ్బారావు వస్తాడు. ప్రాణేశ్వరరావు గారిని కొట్టి, జైలులో మూసు రోజులు ప్రభుత్వం వారి ఆతిథ్యం పొందినప్పటినుండీ, సుబ్బారావు తన్నొక హీరోగా చిత్రించుకొన్నాడు. తానొక మన్మథుడననీ, తనను చూస్తే చాలు-ఆడవాళ్ళు వలచి ఒళ్ళో పడతారనీ వాడి ఊహ! వాడి పిచ్చివేషాలు చూసి ఇంతకు ముందు సత్య, పారిజాతం, మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తూ అన్న మాటలు ఆ మూర్ఖుడికి తెలియవు! అవి వింటే వాడు ఆత్మహత్య చేసుకొనేవాడు! పనిగట్టుకొని సత్య ఇంటికి వచ్చి, ముసిలాయనతో బాతాఖానీ వేస్తాడు. మధ్యలో ఇంగ్లీషు మాటలు! ఎంతసేపటికీ కదలడు. తన ప్రతాపమంతా చూసి సత్య ముగ్ధురాలవుతున్నదని వాడి నమ్మకం!
పారిజాతం ఇంటి మీద 'పిడుగు' పడినప్పటినుండీ సంగీత సంరక్షణ సత్యవతే చూస్తున్నది. సంగీతను చూస్తే సుబ్బారావు మరీ రెచ్చిపోతాడు! ఈలలేనా, పాటలేనా.....ఒకటేమిటి? హద్దూ పద్దూ లేకుండా రెచ్చిపోతున్నాడు. వాడికి తోడు స్వరాజ్యలక్ష్మి నిరంతరం, "వదినా! అది ఇవ్వు, వదినా! ఇది ఇవ్వు!" అంటూ ఇంటా, బడిలో కూడా వెంటపడి వేధిస్తున్నది.
వివాహమై నప్పటినుండి అనంతలక్ష్మి తన పూర్వ స్థితిని మరిచిపోయింది. తన 'లైసెన్స్ బిళ్ళ' వీలైనన్ని మార్లు అందరికీ ప్రదర్శిస్తుంది. ముదిపేరక్కలాగా, ఎప్పుడూ టీచర్లతో తన వేవిళ్ళను గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. ఆవిడతో వాగించి, టీచర్లంతా నవ్వుకొంటుంటారు. పారిజాతం, సత్య పట్టుబట్టి తన వివాహం జరిపించకపోతే తన గతి ఏమయ్యేదో అని ఆలోచించదు. వాళ్ళేదో తనకు చెయ్యవలసి ఉండి చేశారనీ, తన ఖర్మకొద్దీ రెండవ భార్య అయ్యాననీ, లేకపోతే, నేరుగా కలెక్టర్ హోదాలో ఉండేవాడికి భార్య అయ్యే యోగ్యత తన కున్నదనీ గొప్పలు చెప్పుకొంటుంది. స్టాఫ్ రూమ్ లో పనిగట్టుకొని, "ఆడ బిడ్డ అర్ధమొగుడంటారుగా! ఓ ఆడబిడ్డా! నా అర్ధ భారాన్ని కాస్సేపు మోయి!" అంటూ వెకిలిగా సత్యవతి మీద పడుతుంది. "ఏమమ్మోవ్! కడుపులో నీ మేనల్లుడికి ఆకలయిందట! నాలుగిడ్డెన్లు తెప్పించు!" అంటుంది పెద్దగా నవ్వుతూ. సత్యవతికి తల కొట్టి నట్లవుతున్నది. హద్దులేని అనంతలక్ష్మి మూర్ఖత్వానికి హెడ్ మిస్ట్రెస్ కూడా అసహ్యపడుతున్నది. మునుపటి పారిజాతం ఉంటే, ఈవిడ కథ తేల్చి ఉండేది, నవ్వులాట గానే! కాని ఈవేళ పారిజాతం జీవితంతో విధి చెలగాటమాడింది.
ఈ గొడవలన్నీ తప్పించుకు పోవాలంటే, తానూ, పారిజాతం కొంత కాలంపాటు ఎక్కడికయినా పోవాలి. అందుకే సత్యవతి పారిజాతంతోపాటు తననుకూడా అదే ఊరికి ట్రాన్స్ ఫర్ చేయించమని హెడ్ మిస్ట్రెస్ ను ప్రార్ధించింది.
రత్నాల్లాంటి ఈ ఇద్దరినీ విడవడం ఇష్టం లేకపోయినా, వాళ్ళ మేలు కోసం హెడ్ మిస్ట్రెస్ మరునాడు స్వయంగా జిల్లా పరిషత్ డెప్యూటీ సెక్రటరీ గారితో వారిద్దరి సంగతీ వివరించి, ఇద్ధరినీ ఒకే ఊరికి ట్రాన్స్ ఫర్ చేయమని కోరింది. సహృదయుడైన డిప్యూటీ సెక్రటరీ కూడా విషయమంతా అర్ధం చేసుకొని, తప్పక వారం రోజుల్లో ఆర్డర్లు పంపడానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చారు.
* * *
రెండు రోజుల తరవాత, పొద్దున్నే సంగీత హడావిడిగా, గాభరాగా సత్యవతి దగ్గరకు పరుగెత్తుకు వచ్చి, "సత్యవతక్కా! అక్క కనిపించటం లేదు. ఎక్కడికి పోయిందో, ఏమో?" అని గట్టిగా ఏడ్చింది.
సత్య పారిజాతం ఇంటికి పరుగెత్తిపోయింది. విధి కాకపోతే, రోజూ పారిజాతం దగ్గరే నిద్ర పోయేది. నిన్నటినుండి తండ్రికి మరీ ఆయాసంగా ఉంటే ఇంట్లోనే పడుకొన్నది. ఒక్క రాత్రికే ఈ దుర్ఘటన!
సంగీతను ఓదార్చడానికి మారు, సత్యవతే కన్నీరు కారుస్తున్నది. ఇల్లంతా స్నేహితురాలికోసం తిరుగు తున్నది. పారిజాతం చెట్టుకిందికి పోయి, కింద రాలిన పూవులను చేతిలోకి తీసుకొని, స్నేహితురాలికోసం విలపించింది, "పారిజాతం! నన్నిక్కడే వదిలి పారిపోయావా?" అంటూ. ఈ పారిజాతం చెట్టు పారిజాతాని కెంతో ఇష్టం! ఎప్పుడూ దానికింద మంచం వేసుకొని కూర్చుండేది. పారిజాతం చెట్టు దగ్గర కూర్చుని సత్య, చెట్టు కాండానికి తల చేర్చి ఏడ్చింది.
హఠాత్తుగా సత్య దృష్టి ఒక కాగితం మీద పడింది. ఆ కాగితం గాలి కెగిరిపోకుండా, దానిమీద ఒక రాయి ఉంది. సత్య దృష్టి నాకర్షించడాని కన్నట్లుగా రాతి కివతలగా ఉన్న భాగం రెపరెప లాడుతున్నది.
కాగితం తీసి చూచింది సత్య. అది పారిజాతం సత్యవతికి వ్రాసిన లేఖ.
"సత్యా! ప్రాణానికి ప్రాణమైన నిన్నూ, సంగీతనూ విడిచి, దూరంగా కొంత కాలంపాటు పారిపోతున్నాను! జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనలేని పికిరిపందను.
నేను ఇంకో కొత్త చోట ఉద్యోగానికి అప్లై చేశాను. మొన్ననే ఆర్డర్స్ వచ్చాయి, వెంటనే వచ్చి చేరమని. అక్కడ చేరితే ఇక్కడి నా సర్వీసంతా వృథా అవుతుంది! కానీ ఆలోచించిన మీదట, కొంత కాలందూరంగా ఉంటే నా మనసులోని పుండు మానవచ్చునని అనిపించింది. అందుకే పోతున్నాను.
