Previous Page Next Page 
పారిజాతం పేజి 17

                            
    "ఒకనాడు మా అమ్మతో, నాకు తన ఏకైక పుత్రిక పార్వతి నిచ్చి వివాహం చెయ్యాలని తనకు కోరికగా ఉందని చెప్పాడట. నాకు ఇష్టమయితే, పిల్ల నచ్చితే, వివాహం జరిపించుదా మన్నారట.
    "మా నాన్నగారు చనిపోయినప్పటినుండీ అమ్మ ఎక్కడికీ కదిలేది కాదు. అందుకని, నన్నొక్కడినే వెళ్ళి పిల్లను చూసి రమ్మంది.
    "ఆ నాడు వెళ్ళాను వారి ఇంటికి. బాగా ఉన్న వాళ్ళని చూస్తేనే తెలుస్తున్నది. అయితే, అన్నిటికన్నా ఎక్కువగా ఆకర్షించింది పార్వతి! చూసీచూడగానే ఒప్పుకొన్నాను. పెండ్లయిన ఆరు నెలలకే మా అమ్మ చనిపోయింది.
    "పార్వతి ఎప్పుడూ ముభావంగా, మితభాషిణిగా ఉండేది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, దిగులుగా ఉండేది. నేను ఎంత సరదాగా ఉండాలనుకొన్నావో అంత మూతి ముడుచుకొని ఉండేది. యాంత్రికంగా చేసేది అన్ని పనులూ! కొన్నిసార్లు నాకు కోపం, విసుగు కలిగేది. అయితే, ఈ విషయాలన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గర నేను ఎన్నడూ వెల్లడించలేదు.
    "తరవాత నీవు పుట్టావు. నిన్ను చూచుకొని పార్వతి ప్రవర్తనను మరిచిపోయేవాడిని. స్కూల్ నుండి రాగానే నిన్ను ఆడిస్తూ కూర్చొనేవాడిని అయితే, నీవు పుట్టిన తరవాత కూడా మీ అను ప్రవర్తనలో మార్పు రాలేదు!
    "నీకు మూడో ఏడు వచ్చింది. ఒకనాడు సాయంత్రం నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటి వీధివాకిలి తలుపు దగ్గరగా వేసి ఉంది. సాధారణంగా నేను వచ్చే సమయానికి తలుపు లెప్పుడూ తెరిచి ఉంటాయి! కొంచెం ఆశ్చర్యపడినా, అప్పుడా విషయం మీద అంత శ్రద్ధ చూపలేదు. తలుపులు నెట్టుకొని లోపలికి పోయాను. నీవు ఉయ్యాలలో నిద్ర పోతున్నావు పక్కనే పాలు కలిపి పెట్టిన పాలసీసా ఉంది.  పక్కగా ప్లాస్క్ లో కాఫీ పెట్టి ఉంది. మీ అమ్మ జాడ మాత్రం లేదు! సాధారణంగా మీ అమ్మ ఎక్కడికీ కదలదు. ఎప్పుడయినా మీ తాతగారి ఇంటికి పోయినా, నిన్ను తీసుకొని వెళ్ళేది. ఏదైనా పనిమీద, ఎక్కడి కైనా పోయి ఉంటుందని అనుకొని, కాఫీ త్రాగి, నీవు ఎప్పుడు లేస్తావా అని కూర్చున్నాను. సాయంత్రం ఏడు గంటలయింది. అయినా మీ అమ్మ జాడ లేదు! అప్పుడు పక్కింటివాళ్ళ నడిగాను 'మీకేమన్నా తెలుసా?' అని. వాళ్ళు మొదట కొంత అనుమానించి. తరవాత మీ అమ్మ ఎవరో మగాడితో బండి ఎక్కి పోతుండగా చూశామని చెప్పారు. అంతేకాదు, బండిలో ఉన్న అతను దాదాపు పది రోజుల నుండి ప్రతి దినం మన ఇంటికి వచ్చేవాడట. నేను వచ్చేవేళకు ముందుగా వెళ్ళిపోయేవాడట. మహాపట్నం కాబట్టి ఎవరి సంగతి ఎవరికి కావాలి?
    "నాకేం తోచలేదు. నిన్ను తీసుకుని మీ తాతగారి ఇంటికి పోయాను. మీ అమ్మ ఏదో పనిమీద అక్కడికే పోయి ఉంటుందని అనుకొన్నాను. కాని అక్కడ ముందుగా మీ తాతగారే ఎదురు వచ్చి 'అమ్మాయేదీ? మీ ఇద్దరే వచ్చారు?' అంటూ నిన్ను ఎత్తుకొన్నారు. జరిగింది, విన్నది నేను చెప్పాను. సంగతి విని ఆయన కుప్పకూలిపోయారు.
    "ఆ దుఃఖంలో అసలు సంగతి బయటపెట్టారు. మీ అమ్మకు పెండ్లికాకముందు నుండీ, ఇంటి పక్కనే కాలేజీలో చదువుతున్న ప్రసాద్ అనే యువకుడితో పరిచయం ఉండేదట. తండ్రి ఎన్నోసార్లు తిట్టి, మందలించి ఎన్నో విధాల బుద్ది చెప్పినా, వినేది కాదట. ఈ ఒక్క విషయం తప్ప, మిగతా ఏ విషయంలో నైనా ఆమె కామే సాటిగా ఉండేదిట. మీ తాతగారా యువకుడిని కూడా మందలించి, పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించేవారట. పోనీ, మీ అమ్మ ఇష్టప్రకారమే ఆ కుర్రాడికిచ్చి చేద్దామనుకొన్నా, ఆ అబ్బాయి బ్రాహ్మణుల అబ్బాయిట. పాపం, మీ తాతగారు పాతకాలం మనిషి! తెగించలేకపోయాడు. పెండ్లి చేసిన తరవాతైనా కూతురి మనస్సు మారకపోతుందా అన్న ఆశతో నా కిచ్చి పెండ్లి చేశారు.
    "నేను పార్వతి ప్రవర్తన గురించి ఆయన కేమీ చెప్పలేదు కాబట్టి అంతా సవ్యంగానే ఉందని మీ తాతగారు అనుకొన్నారు.
    "పది రోజుల క్రితం నేను ప్రసాద్ ను మద్రాసులో చూచా'నని ఆయన చెప్పారు. 'అనవసరంగా నన్ను పలకరించి,వాళ్ళ నాన్న పోయాడనీ, తాను స్వతంత్రుడనయ్యాననీ, తండ్రి సంపదకు తానే వారసుడయ్యాననీ నాతో చెప్పాడు. తండ్రి బ్రతికున్నప్పుడు చెయ్యలేని పనులు ఇప్పుడు చేస్తాననికూడా అన్నాడు.' ఆ మాటల కర్ధం ఏమిటో ఇప్పుడు తెలుస్తున్నదని అన్నారు మీ తాతగారు.
    "పుట్టినప్పుడే చచ్చినా బాగుండేది. లేదా, ఈ సాహసం పెళ్ళికాకముందే చేసినా సరిపోయేది! ఒక ఏడు పేడ్చి ఊరకుండేవాడిని. ఒక బిడ్డతల్లి అయిన తరవాత ఈ పాడుపని చేస్తుందా? ఈ ఆలోచన కడుపులో పెట్టుకొనే కాబోలు, మొన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు పిల్ల ఫోటో తీసుకోని, "మళ్ళీ పంపిస్తాలే, నాన్నా!" అని అంది. నాయనా! అభం శుభం తెలియని నీకు అన్యాయం చేశాము. ఇక అది నాకు చచ్చినట్లే లెక్క! కనపడితే నరికేస్తాను! కాని, తెగించింది ఇంకెందుకు కనబడుతుంది? కడుపులో ఇంత విషం పెట్టుకొని పైకి ఎంత గుంభనగా ఇంత ఉండేది! నే నిక ఎట్లా లోకం ముఖం చూడను? నలుగురికీ ఈ పాడుముఖాన్ని ఎట్లా చూపించేది?' అంటూ ఆయన బిగ్గరగా ఏడ్చారు. నేనే ఆయన్ని ఓదార్చవలసి వచ్చింది!
    "వద్దని చెబుతున్నా వినకుండా, చచ్చిపోయిన వాళ్ళకి చేసే తతంగమంతా పార్వతికి చేశాడు. అయితే, పార్వతి ఈ ప్రవర్తనకు కారణం తన మూర్ఖపు పట్టేనని మాత్రం గ్రహించలే దాయన! ఆ దుఃఖంతోనే మూడు నెలలు తిరగకుండానే మరణించాడు.
    "నా కక్కడ ఉండబుద్ది కాలేదు. తప్పు ఎవరిదైనా, పసిపాపను వదిలి వెళ్ళిన కాముకిని నేను క్షమించలేక పోయాను! ఆ స్థలాన్ని వదిలి రాయలసీమలోకి వచ్చాను. స్నేహితుల బలవంతం మీద మళ్ళీ భాగ్యను పెండ్లి చేసుకున్నాను. నిన్ను చులకనగా చూస్తూందేమో నన్న భయంతో, ఈ సంగతి దానికి కానీ, మరి ఎవరికి కానీ చెప్పలేదు.
    "పారిజాతం! నువ్వు ఎవరైతే అచ్చం సతీదేవిలాగే ఉందని చెప్పి మురిశావో, ఆమె మీ తల్లి పార్వతి! ప్రసాద్ అంటే భద్రీ ప్రసాద్ కాబోలు!
    "మీ వాళ్ళంతా నీకూ, ఆవిడకూ పోలికలు ఉన్నాయని చెప్పేటప్పటికి, ఆవిడకు తన పాపం స్పురించి ఉంటుంది. అందుకే ఏడ్చి ఉంటుంది."
    ఆయాసంగా ఆగారు నాయుడుగారు. డాక్టర్ మరో ఇంజక్షన్ ఇచ్చింది, ఏమీ పలకకుండా.
    పారిజాతం ముఖంలో జీవకళ లేదు! సౌభాగ్యమ్మ గారు కండ్లలో ధారాపాతంగా కారే నీరు తుడుచుకొంటూ పారిజాతాన్ని పొదుపుకొంది.
    సత్యవతి అనుమానాలు స్థిరపడినాయి. మెల్లగా, "పారిజాతం! నీతో చెప్పకుండా దాచిన సంగతి ఒకటి ఉంది. సతీదేవిగారి గదిలో నేను నీ ఫోటో-అదుగో అదే, చూచాను. ఆశ్చర్యపడి 'పారిజాతం ఫోటో ఇక్కడి కెట్లా వచ్చిం'దని అడిగాను. ఆమె ఎవరో స్నేహితుల పిల్లదని చెప్పారు. కాని, నమ్మశక్యం కాలేదు! ఆమె పడిన దుఃఖం చూస్తేనే నాకు అనుమానం కలిగింది" అని అంది.
    'అయితే నేను ఎంతో ప్రేమతో గౌరవించిన సతీదేవి నిజంగా నా తల్లేనా? క్షణిక సుఖం కోసం కన్నబిడ్డను వదిలిపోయిన కఠినాత్మురాలి కూతురినా నేను! కృష్ణ నిజంగా నా తమ్ముడా? ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళమా మేము! నేను ఏం పాపం చేశానని ఈ శిక్ష! ఎందుకు నా కీ చిత్రహింస? ఈ రహస్యాన్ని ఇన్నాళ్ళూ అమ్మకుకూడా తెలియకుండా దాచిన ఈ నాన్నగారు ఏ పుణ్యంచేత లభించారు! స్వంత తల్లిలాగా నన్ను పెంచిన ఈ తల్లిని పొందడానికి, నేను చేసిన తప మేమిటి? నేను ఏం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి? ముందు నా తండ్రి దక్కితే చాలు! భగవంతుడా! నా ఈ ఒక్క కోరికా తీర్చు!' పారిజాతం మనసులో సుడిగుండా లేర్పడి, కండ్ల ద్వారా బయటికి ప్రవహించుతున్నాయి.
    "ఎందుకు, నాన్నగారూ, ఇప్పుడిది చెప్పాలి?" అంటూ నిశ్శబ్దంగా రోదించింది పారిజాతం.
    సత్యవతి కన్నీరు కారుస్తూ, "దోషి ఎవరో మనం నిర్ణయించగలమా, పారిజాతం! కన్నకూతురిని, కూతురని పైకి చెప్పుకోలేక, ప్రేమ దాచుకోలేక, సతీదేవి పడిన బాధ నా కళ్ళకు కట్టినట్లుంది! నీ పరిస్థితికి లొంగి ఆమె అట్లా చేయవలసి వచ్చిందో?" అని నెమ్మదిగా అంది.
    సౌభాగ్యమ్మ గారు ఏడుస్తూ, "పసిదానికి పని గట్టుకొని ఎందుకండీ ఇవన్నీ చెప్పారు? నా తల్లి ఏమవుతుంది!" అని అన్నారు.
    "ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకొని నేను చావలేను! ఇది బయటపడాలని దైవ సంకల్పం కాబట్టే, హోస్పేటలో పారిజాతం తన తల్లిని కలుసుకుంది!" ఆయాసంగా అన్నారు నాయుడుగారు.
    డాక్టర్ వాణీ శారద-"నాయుడుగారూ! స్త్రీలలో కూడా మీ అంత ఓర్పు కలవారు ఉండరు! మీకు డాక్టర్ గా రావడం నా పుణ్యం. మీరు తండ్రి కావడం పారిజాతం చేసిన పుణ్యం! తల్లి చేసిన తప్పు బిడ్డకు తెలియకుండా, ప్రాణసమంగా పెంచారు! చెప్పవలసినది చెప్పారుగా? ఇక విశ్రాంతి తీసుకోండి. అమ్మా! మీ పిల్లలతో బాటు ఈ వేళ నేనూ ఇక్కడే ఉంటాను. ఒక మంచి మనిషి ప్రాణాలను కాపాడటానికి శాయ శక్తులా ప్రయత్నిస్తాను. మీకేమన్నా అభ్యంతరమా?" అని అడిగారు.
    "ఎంత మాటమ్మా! మా పారిజాతం లాంటి దానవు! చేతులు పట్టుకొని బతిమాలుతాను. మీ రిక్కడే ఉండి నా నొసటి కుంకుమ నిలపండి!" అంది దుఃఖంతో.
    "సత్యవతి గారూ! మీరుకూడా ఇక్కడే ఉండండి. నాన్నగారికి అన్నం వండి వచ్చారుగా! తొందరేం లేదు కదా?" అంది డాక్టర్, సత్యతో.
    "తొందరేం లేదండీ! అన్నం చేసే వచ్చాను. మీరు పొమ్మన్నా, నా పారిజాతాన్ని విడిచి నేను పోను!" అంది కన్నీరు కారుస్తూ సత్య.
    "తల్లీ! పారిజాతం! నీవు నీ తల్లి పార్వతిని గురించి నీవు ఏ నిర్ణయం తీసుకొన్నా సరే! నీ నిర్ణయం మీద నాకు మంచి నమ్మక ముంటుంది. ఒకరిని సంతోషపెట్టడానికి నిర్ణయం తీసుకోకు. నీ మనస్సు ఏది చెబితే అది విను!"-ఇవీ నాయుడుగారు చివరిసారిగా అన్న మాటలు.
    ఎవరికీ తిండి లేదు. నాయుడుగారికి ఉండి ఉండి స్పృహ తప్పుతున్నది. డాక్టర్ వాణీ శారద ఆయన వేయి కళ్ళతో చూస్తున్నారు.
    సాయంత్రం అయిదు గంటలకు-ఒక మంచి మనిషిని బ్రతికించాలన్న, ఒక స్త్రీ నొసటి కుంకుమ నిలపాలన్న మానవ ప్రయత్నాన్ని పరిహసించినట్లు నాయుడి గారి జీవన లీల సమాప్త మయింది.
    భర్త మరణం కళ్ళారా చూచిన సౌభాగ్యమ్మగారు స్మృతి తప్పి పడిపోయారు. రెండు రోజులు అపస్మారక స్థితిలో మృత్యువుతో కొట్లాడి, మూడో రోజు ఉదయం దానికి లొంగిపోయారు.

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS