సతీదేవి నా తల్లి అంటే ఎందుకో నా మనస్సు ఒప్పుకోలేకుండా ఉంది. నన్ను నిశ్చింతగా వదిలి వెళ్ళి పోయిన ఆమె, ఈవేళ యాదృచ్చికంగా కనబడిననన్ను చూసి మాతృప్రేమతో కన్నీరు కారుస్తున్న దంటే, నాకు ఎందుకో భరింపరానిదిగా ఉంది! నాన్న గారి గొప్పతనం ముందు, నా తల్లి సౌభాగ్యమ్మ అమృత హృదయం ముందు నన్ను కన్నతల్లి సతీదేవి అల్పత్వం కొట్టవచ్చినట్లు కనుపిస్తున్నాది నాకు!
నేను ఉండగా, నాన్నను వదిలి వేలొకనితో పోయిన సతీదేవి నా దృష్టిలో కాముకురాలే! తను పిల్లలు పెరిగి, పెద్దయిన తరవాత, తను కళంకిని అన్న విషయం పిల్లలకి తెలిస్తే ఆ పిల్లలు ఎంత సిగ్గుపడతారో, తనను ఎంత అసహ్యించుకొంటారో, అటువంటివాళ్ళ కడుపున పుట్టినందుకు ఎంత దుఃఖిస్తారో సతీదేవిలాంటి వాళ్ళు ఊహించుకోరు! చేతులు కాలిన తరవాత ఆకులు కావాలని కోరుతారు.
సతీదేవిపట్ల నేను ఏర్పరచుకొన్న ఈ భావం తప్పే కావచ్చు. ప్రేమ కోసం రాధ సర్వస్వాన్నీ త్యజించి గోపీవల్లభుని చేరితే, 'అమర ప్రేమ' అని కీర్తిస్తాము. రాధ ప్రణయం లోకాతీత మయిందని పొగుడుతాము.
కాని, అలాంటి రాధలు నిజ జీవితంలో తారసిల్లితే ఓర్చుకోలేని అల్పులం మనం! నా ఊహలో రాధ ప్రణయం కల్పన! సతీదేవి ప్రణయం వాస్తవం! కల్పనను మెచ్చుకొని ఆరాధించిన మనం, నిజాన్ని చేదుగా భావించి, దానినుండి పారిపోతున్నాము!
సతీదేవిని తల్లిగా అంగీకరించలేను! ఆమెను పూజ్యభావంతో చూడటానికి కూడా నాకు గడువు కావాలి. నేను తప్పక మారుతాను. మామూలు పారిజాతాన్ని అవుతాను. కాని, దానికి వ్యవధి కావాలి. అందుకే మీ నుండి కొంత కాలంపాటు దూరంగా పోతున్నాను. సంగీత ఇక నీ చెల్లెలే! నీ చల్లని నీడలో దానికి ఏ కొరతా రాదని నాకు తెలుసు. నేను మోయవలసిన బాధ్యతను నీ మెడకు కట్టుతున్నానని తెలుసును కాని, నేను తిరిగి వచ్చేంతవరకూ ఇంతకంటే గత్యంతరం లేదు. నన్ను క్షమించు! సంగీత కోసమైనా నేను తిరిగి వస్తాను!
మరో మాట! సతీదేవిగారిపట్ల నాకుగల భావాన్ని ఆధారంగా తీసుకొని, నీవుకృష్ణ మోహన్ ను నిరాకరించకు. కృష్ణ నీకు అన్ని విధాలా తగినవాడు; యోగ్యుడు; అమాయకుడు. నీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడినవాడు. నీకు కూడా అతనంటే ఇష్టమేనని నాకు తెలుసులే! సతీదేవిని తల్లిగా స్వీకరించలేను కాని, బురదలో పుట్టిన పద్మంలాంటి కృష్ణను మనస్ఫూర్తిగా, నా తమ్ముడుగా స్వీకరించాను! నా తమ్ముని వివాహమాడ టానికి సంశయించకు! ప్రశాంతంగా ఆలోచించి, కృష్ణను వివాహం చేసుకో! అతనితో నీ భవిష్యత్తు అతి సుఖంగా ఉంటుంది.
నేను తప్పక తిరిగి వస్తాను! నీ కోసం! సంగీత కోసం!
ఇట్లు,
నిన్నూ, సంగీతనూ మరువలేని,
పారిజాతం."
* * *
సత్యవతి ఇంటిముందు కారు ఆగింది. దానిలో నుండి కృష్ణ దిగాడు. ముఖం వాడిపోయి ఉంది. సంగీత అతనిని చూడగానే గుర్తించి, "లోపలకు రండి, అన్నా!" అంటూ మర్యాదగా ఆహ్వానించి, "అక్కా! కృష్ణ మోహన్ గారు వచ్చారు!" అంటూ కేకవేసింది. ఆ కేక వింటూనే, మంచంమీద నీరసంగా పడుకొని ఉన్న బ్రహ్మయ్యగారూ, లోపల నుండి సత్యవతీ హడావిడిగా వచ్చారు.
'కూర్చోండి!" అంటూ కుర్చీ చూపింది సత్య. కృష్ణను చూసేటప్పటికి, పారిజాతం కళ్ళెదుట నిలబడి నట్లయింది! సత్యకు కన్నుల్లో నీరు కమ్మింది.
కృష్ణ మారేమీ మాట్లాడకుండా, ఒక జాబు సత్యవతి చేతికి ఇచ్చాడు. అది పారిజాతం జాబు అని సులభంగా సత్య గ్రహించగలిగింది. ఇతరుల జాబును తాను చదవకూడదన్న సభ్యతను ఆ నిమిషాన మరిచి, ఆత్రంగా జాబు చదివింది.
"తమ్ముడూ! కృష్ణా! నీవు నిజంగా దేవుడిచ్చిన తమ్ముడినే! ఏ నాడు నీవు నన్ను 'అక్కా!' అని అన్నావో, ఆ నాడే నిన్ను నా స్వంత తమ్ముడుగా భావించుకొన్నాను. ఆ భావన తోటే ఈ జాబు వ్రాస్తున్నాను.
మా నాన్నగారు హఠాత్తుగా హృద్రోగంవల్లనే మరణించరు. నాన్నగారు చనిపోయిన మూడవ రోజునే అమ్మకూడా నాన్నగారి ననుసరించి నన్నూ, సంగీతనూ ఈ ప్రపంచంలో దిక్కులేని వాళ్ళను చేసింది!
పైకి ఎన్నో కబుర్లు సరదాగా చెప్పిన నేను, ఈ దెబ్బ భరించలేకపోతున్నాను. ధీరురాలిని, నాకు మనో నిగ్రహం చాలా ఎక్కువ అన్న గర్వం నాకు ఉండేది కాని, దీనితో నేను జీవితాన్ని ఎదుర్కొనలేని పిరికిపందనని తేలిపోయింది! అందుకనే నా మనసు కుదుట పడేంతవరకూ నేను వేరొక ప్రశాంత వాతావరణానికి పోతున్నాను. కాని, తప్పక తిరిగి వస్తాను. చెల్లెలు సంగీత భారాన్ని సత్యవతిమీద పెట్టి పోతున్నాను. నీవు సత్య భారాన్ని స్వీకరించినవాడు, సత్యతో బాటు మన చెల్లెలు సంగీత భారాన్నికూడా స్వీకరించమని నిన్ను కోరుతున్నాను. నా కోరిక మన్నించు!
నా ప్రాణానికి ప్రాణమైన సత్యవతిని నీ కప్పగించు తున్నాను. ఆమె కెటువంటి కష్టమూ రాకూడదు. ఇక్కడ అనంతలక్ష్మి, ఆమె కుటుంబం వల్ల సత్యకు మనశ్శాంతి లేదు! మానసికంగా చిత్రహింస పడుతున్నది, సత్య నా విషవలయంనుండి తప్పించు. వీలయినంత త్వరలో తప్పించు. వేయి కండ్లతో నీ, నా ప్రాణమైన సత్యనూ, చెల్లెలు సంగీతనూ కాపాడు.
నేను తప్పక తిరిగి వస్తాను. సంగీత కోసం తిరిగి వస్తాను. జీవితమంటే మోహం నా కింకా పోలేదు! కనకనే తప్పక తిరిగి వస్తాను!
ఇట్లు,
అక్క
-పారిజాతం."
సత్య కన్నులు వర్షించుతున్నాయి. పారిజాతం మనసు ఎంత గొప్పది! సతీదేవి తనకుకూడా తల్లి అని కృష్ణకు వ్రాయలేదు! తన తండ్రి గుండె ఆగతానికి కారణం సతీదేవే అని వ్రాయలేదు. అసలు హాయిగా, ప్రశాంతంగా ఉన్న తన ఇల్లు కూలటానికి కారణం ఆ ఫోటో అనీ, తన కుటుంబ పరిచయం అనీ, అసలు హంపీ ప్రయాణమంటూ లేకపోతే తన కొంపే కూలేది కాదనీ వ్రాయలేదు! కృష్ణ దృష్టిలో సతీదేవి గౌరవం తగ్గించలేదు. రహస్యాన్ని జాగ్రత్తగా దాచింది పారిజాతం. ఎంత నిశితదృష్టి! ఎంత త్యాగశీలత! విషయం తెలిసినప్పుడు తను ఎంత హింస పడుతున్నదో, కృష్ణ కూడా అంతే బాధ పడతాడు! అనవసరంగా ఇంకొకరి కుటుంబంలో కల్లోలం రేపకూడదు. ఈ దృష్టితోటే పారిజాతం కృష్ణకు సతీదేవి గాథ వ్రాయలేదని సత్య గ్రహించింది.
కృష్ణ కన్నులు కృష్ణా నదిలా ఉన్నవి!
కన్నులు తుడుచుకొని సత్య- "మీ అమ్మా, నాన్నగారూ బాగున్నారా?" అని కృష్ణను అడిగింది.
రుద్ధ కంఠంతో-"సత్యవతీ! అక్క జాబు చూచిన వెంటనే అమ్మ పడిపోయింది. నాన్నగారు చాలా దుఃఖంగా ఉన్నరు. డాక్టర్ గారు ఎంతో ప్రయత్నించిన మీదట అమ్మకు స్మృతి వచ్చింది. నిన్ను తీసుకొని రమ్మని పట్టుపట్టింది. అమ్మ బ్రతకడం చాలా అనుమానం!" అని చెప్పలేక ఆగాడు.
కన్నీరు తుడుచుకొని, సత్య చేయి పట్టుకొని, "సత్యా! దొరకక దొరకక చిక్కిన అక్క, హఠాత్తుగా నన్ను ఏకాకిని చేసి ఎక్కడికో పోయింది! ప్రేమగా పెంచిన అమ్మకూడా నన్ను విడిచి పోతున్నది! నీవు మాత్రం నన్ను విడిచిపోనని వాగ్ధానం చేయి! కష్ణమో, సుఖమో నాతోపాటు పంచుకొంటానని మాట ఇవ్వు!" అన్నాడు, చిన్న పిల్లవాడిలా రోదిస్తూ.
దుఃఖం, ప్రేమ, స్నేహం-ఎన్నో భావాలు ప్రతి బింబించుతున్న సత్యవతి కళ్ళే అతనికి సమాధానం చెప్పాయి.
:-సమాప్తం:-
