Previous Page Next Page 

 

    తర్వాత సుచరిత నా దగ్గిర కొచ్చి, "అతడిని వెళ్ళి పొమ్మని చెప్పండి' అంది.
    నేను ఆశ్చర్యపోయాను.
    "అదేం? నీకు బాగా తెలిసిన అతణ్ణి నేను పోమ్మనటం బాగుంటుందా?"
    "చాలా బాగుంటుంది. పైన భగవంతుడు, ఈ లోకంలో మీరూ తప్ప నాకింకేవరూ లేరు. పోమ్మనండి."
    "ఇంటికొచ్చిన అతిధిని పోమ్మనటం ఎలా సుచరితా? నువ్వెందు కంత గాభరా పడతావ్?"
    సుచరిత ఏడ్చింది.
    "నేను చెప్తే అర్ధంచేసికోరు. వాడు దుర్మార్గుడు పోమ్మనండి."
    "ఫో! పిచ్చిదానా! అతని దుర్మార్గం మనల నేం చేస్తుందీ?' అంటూనే నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాను.
    ఒక రాత్రి వేళ మెలకువ వచ్చింది. నా ప్రక్కన సుచరిత లేదు. కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళి ఉండవచ్చు ననుకోన్నాను. కానీ ఇంచుమించు అరగంటయినా, రాకపోయేసరికి , ఆత్రుతతో పడకగది బయటకు వచ్చాను. హల్లో, సుచరితా, మోహనరావు ఏదో మాట్లాడు కొంటున్నాను. నిద్రమత్తులో అదృశ్యం చూసేసరికి నాకు మతిపోయింది.
    "సుచరితా!" అని గర్జించాను.
    నేను ఉచ్చరించింది నాలుగక్షరాలే, అయినా, అందులో అనంతమైన నింద, హేళన, తిరస్కారమూ నిండి ఉన్నాయి.
    సుచరిత భయంతో పిండి బొమ్మయి పోయింది. చేష్టలు దక్కి నావంక చూస్తూ నిలబడి పోయింది. నేనామెను చీదరింపుగా చూసి, నాపక్క మీదకు వచ్చేసాను. నాకెప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలియదు.
    సుచరితా, నేనూ కలిసి తీయించుకొన్న ఫోటో మా పడక గదిలో నాపక్క ఎదురుగానే పెట్టుకొన్నాను. లేవగానే దానిని చూడటం నాకలవాటైపోయింది. ఆరోజు లేవగానే , నాకా ఫోటో కనపడలేదు. నాకాశ్చర్యమయింది. సుచరిత దాని స్థానం మార్చిందా? క్రమంగా రాత్రి జరిగిన సంగతులన్నీ గుర్తు కొచ్చాయి.
    మన సంస్కారం ఎంత ఉన్నతమైనదైనా కొన్ని సార్లు తాత్కాలికోద్రేకాలు అసంస్కారాన్నీ అధిగమించి మనసును వశపరుచు కొంటాయి. కాని ఆ ఉద్రేకం చల్లారి మన సంస్కారం మేల్కొన్నప్పుడు మన పనిలోని క్షుద్రత్వం మననే వెక్కిరిస్తుంది.
    ముసలి వాళ్ళూ, అంగవైకల్యంతో బాధపడేవాళ్ళూ, అయిన ముష్టి వాళ్ళను సాధారణంగా సంతృప్తి పరచటానికే ప్రయత్నిస్తాను. అయినా, కొన్నిసార్లు నేనేదో చిరాకు లో ఉన్నప్పుడు, వాళ్ళు రావటం, నేనేం చేస్తున్నానో నాకు తెలియకుండా , నేను వాళ్ళ మీద విసుక్కోవటం వాళ్ళు బిక్కచచ్చి పోయి వెళ్ళిపోవటం కొద్ది సేపట్లో నే వెళ్ళి ఒకటికి పదింతలు ధర్మం చేసి రావటం, తక్కువసార్లు జరుగలేదు.
    రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి లేచిన తరువాత జరిగిన సంఘటన తల్చుకొన్న కొద్ది, నేను చాలా అనుచితంగా ప్రవర్తించాననిపించింది. సుచరిత మనసేలాంటిదో నాకు తెలుసు! ఆమె సంస్కారం ఎంత ఉన్నతమైనదో నాకు తెలుసు! దొంగలయిన తనవారితో బాంధవ్యం తెంచు కోవడానికి జీవిత సౌభాగ్యాన్ని నాశనం చేసుకొని, నన్స్ లో చేరిపోవటానికి నిశ్చయించు కొన్న ఆమె, వారితోనే చేతులు కలుపుతుందా? నేనంత తేలికగా అమెనేలా అవమానించగలిగానూ? పెళ్ళయిన నాటి నుండి, హస్యానికయినా ఆమె మనసు కష్ట పెట్టలేదే? ఎంత కుములి పోతుందో? ముందు సుచరితను ఒడార్చాలి. ఇల్లంతా వెతికినా, సుచరిత కనపడలేదు. ఆందోళన గా పడక గదిలోకి వచ్చిన నాకు పక్క మీద సుచరిత దస్తూరితో మడత పెట్టిన లేఖ కనపడటం తో ఆమె వెళ్ళిపోయిందని నిర్ధారణ అయి, కుప్పకూలి పోయాను. కొద్ది క్షణాల వరకూ నాలో చైతన్యమే నశించింది. తర్వాత వణుకు తున్న చేతులతో ఆమె లేఖ విప్పాను.
    "నా దేవతా!
     మిమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నా ఈ సమయంలో మిమ్మల్నిలానే సంభోధించాలని పిస్తుంది. మీరు నన్నవమానించారని నేను వెళ్ళిపోవటం లేదు. నేనే లేననే ఆవేదనతో మిమ్మల్ని మీరు దోషిగా నిందించుకోకండి. మీ మనసు నాకు తెలుసు! జరిగిందంతా నేను మీకు చెప్పినప్పుడు నన్ను మీరు తప్పక నమ్ముతారు.
    మొహనరావుతో నాకు జ్ఞానం సరిగ్గా తెలియనప్పుడు కొంత చనువుగానే ఉండేదాన్ని కానీ, పరిస్థితులు అర్ధమయ్యాక, ఎన్నడూ అతనితో చనువుగా మాట్లాడలేదు. కానీ,ఆ దౌర్భాగ్యుడు మాత్రం నన్నొదిలి పెట్టక ఎప్పుడూ నా వెంట పడుతూనే ఉండేవాడు. చివరకు ఈనాడు నా ఆనంద సామ్రాజ్యం లోకి కూడా అడుగు పెట్టి దానిని కూల్చి వేసాడు. ఒకరాత్రి వేళ మీ సరసన పడుకొన్న నన్ను, ఆ నీచుడు తట్టి మేల్కొలపటానికి సాహసించాడు. కళ్ళు తెరిచి వాడిని చూసిన నేను హడలి పోయాను. మీకెక్కడ నిద్రా భంగమవుతుందో నని వెంటనే బయటకు వచ్చాను. నేను ఒక అయినింటి ఇల్లాలి నయ్యాననీ, ఇంక నా జీవితం లోకి వచ్చి, అల్లరి పెట్టవద్దని అతడిని ప్రాధేయ పడుతున్నాను. ఆ సమయానికే మీరు వచ్చారు.
    ఇవాళ నా వారిలో ఒకడు, నా భర్త ప్రక్క నున్న నన్ను రాత్రి వేళ మేల్కొలపటానికి సాహసించాడు. రేపు వేరొకడు నా భర్త ఇంటికే కన్నం వేస్తాడు. మరొకడు, నా భర్తను ఖూనీ చేసినా ఆశ్చర్యమేముంది?
    మురికిలోని ఈగను నేను. నన్ను చేరదీయటం వలన, స్వచ్చమయిన మీ జీవితం కూడా మలినమవుతుంది. మీరు నాపట్ల చూపించిన దయకు నేను మీకిచ్చే ప్రతిఫలమిదా? అమృత హృదయులైన మీ జీవితాన్ని విషపూరితం చేయగలిగే శక్తి నాకుందా? నా జీవితం ఎలాగో బురద లోంచి వచ్చింది. అది ఎలా పాడయినా ఫరవాలేదు. నాకారణంగా మీ బ్రతుకులో అనవసరపు చికాకులు నేను భరించలేను. మిమ్మల్ని ఆపదల పాలు చేసే, సౌభాగ్యం నాకు అక్కర్లేదు. అందుకే మిమ్మల్ని విడిచి జీవచ్చవంలా అన్నయ్య దగ్గిరకు వెళ్ళిపోతున్నాను.
    రేపట్నించి , మీకు స్వయంగా కాఫీ అందించే అదృష్టం నాకుండదు. ఏం తింటున్నారో కూడా తెలియకుండా భోజనం ముగించే మీకు ఏది కావాలో చూసుకునే భాగ్యం పట్టదు. దీక్షగా అర్ధరాత్రి వరకూ, యేవో పుస్తకాలు చదువుకునే మీ అందమయిన ముఖం కలలో తప్ప నాకు కనిపించదు- పసిపిల్లాడి లా స్విమ్మింగ్ పూల్ లో ఈదులాడే మిమ్మల్ని చూసి మురిసే కమ్మని రోజులు అయిపోయాయి. మనిద్దరమూ కలిసి కూర్చునే సోఫాలూ, చల్లని సాయంత్రాలు హాయిగా గడిపిన మన తోటా, నా మనోదారడ్యాన్ని చెదరగొట్టి నన్ను వెనుక కీడుస్తున్నాయి. చివరి సారి, ఒక్కసారి మీపాదాలు మనసారా హృదయానికి హత్తుకోవాలనే కోరికను కూడా తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నాను.
    ఈ దౌర్భాగ్య జీవితంలో మెరుపుల్లా మెరిసిన ఈ కాంతి కిరణాలకు మురిసిపోవాలో , వీటికి శాశ్వతంగా దూరమవుతున్నందుకు కుమిలి పోవాలో నాకే అర్ధం కావటం లేదు.
    నేను వెళ్ళిపోవటానికి కారణం మీరు కాదని అర్ధమయింది కదూ! ఇందుకు మిమ్మల్ని మీరు నిందించుకొంటే , నామీద ఒట్టే! నన్ను మరిచిపోయి , అన్ని విధాలా మీ కనుకూలురాలైన యువతిని వివాహం చేసికోండి.'

                                                                                    మీ
                                                                               సుచరిత......"
    జగత్తంతా, ఒక్కసారి గాడాంధకారమయినట్లు అనుభూతి కలిగింది. నా సంకుచిత హృదయంతో , వెర్రి ఉద్రేకంతో , ఉద్దరిస్తానని తీసుకు వచ్చిన ఆమెను, ఎవరి బారినుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి విధికి, ఎదురీదిందో , వారి మధ్యకు తోసేసాను.
    పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. ఎన్నో రాత్రులు నిద్రపట్టక ఏడ్చాను. తర్వాత సుచరిత పేరు కూడా పోలీసు రికార్డు లలో ఎక్కిందని విని విలవిలలాడి పోయాను. కానీ, నాకు గట్టి నమ్మకం. సుచరిత సంస్కారం గొప్పది. ఆమె అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపలా నిర్మల మైనది. మహా తపస్వి లా దృడ మైనది. ఆమె శీలానికి ఎన్నడూ, ఏ కళంకమూ రాదు. శరీరం లో ప్రాణముండగా అధర్మ మార్గంలో ఆమె ఒక్కడుగు కూడా వెయ్యదు.
    ఆమెకోసం ఎంత వెతికినా, ఆమె జాడ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశానో లెక్కలేదు. కానీ, ఏమాత్రం లాభం లేకపోయింది. కానీ, నా సుచరిత నాకు దక్కుతుందని నాకేదో దృడమైన విశ్వాసం! ఆ నిరీక్షణ నా జీవిత ధ్యేయం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS