నీరజ ఎవరి మాటలకూ సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి నీలకాంత్ దిగాడు. నీరజ దెయ్యాన్ని చూసినట్లు బెదిరింది. నీలకాంత్ నీరజను చూసి కనపడీ కనపడనట్లు నవ్వీ, "ఇదేమిటి? ఇంత రాత్రి వేళ అందరూ ఇలా కూర్చున్నారేం?" అన్నాడు.
"మీరు ఎలా వచ్చారు ఈ సమయంలో -----" ఆశ్చర్యంగా అడిగింది యశోధర.
"రెండో అట సినిమా చూసి వస్తున్నాను. ఇంట్లో లైట్లు వెలుగుతోంటే మెలకువగా ఎందుకున్నారోనని ఆశ్చర్యపోతూ కనుక్కుందామని వచ్చాను."
నీలకాంత్ మాటలకూ వేణు సమాధానం చెప్పాడు.
"నీరజ అర్ధరాత్రి ఇంట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. దొంగలు పడతారని అత్తయ్యగారు ఆందోళన పడుతోంటే .... నీరజ ఉండగా ఆ భయం లేదని నేను చెప్తున్నాను...."
నీలకాంత్ వేణు వంక చురుగ్గా చూసాడు. వేణు కళ్ళల్లో నీలకాంత్ కేదో కనిపించింది.
"వేణూ మీరు నీరజ పైన లేనిపోనీ అభాండాలు వేస్తున్నారు. నీరజ నాకు బాగా తెలుసు. పోనీ, మీరన్న మాటలు నిజమయితే, ఇంత రాత్రివేళ ఎక్కడికో వెళ్ళి వచ్చిన నీరజ దగ్గిర డబ్బో, దస్కమో ఏదో ఒకటి ఉండాలి గదా ...."
నీరజ చేతిలో ఉన్న చిన్న బేగ్ వైపు వేణు సైగ చేస్తూ అన్నాడు నీలకాంత్.
వేణు పులిలా ముందుకు దూకి నీరజ చేతిలో బేగ్ లాక్కుని తెరచి చూశాడు.
అందులో బేంక్ బుక్ ఉంది. ఆ బుక్ లో అంతకు ముందు రోజే నీరజ పేర యాభైవేలు డిపాజిట్ చెయ్యబదినట్లుగా ఉంది.
ఆ బుక్ అందరికీ చూపిస్తూ విరగబడి నవ్వాడు వేణు.
నీలకాంత్ ఆశ్చర్యం నటిస్తూ "నేను ఏదో యధాలాపంగా అంటే నిజంగా జరుగుతుందని అనుకోలేదు. అయాం సారీ నీరజ!" అన్నాడు.
నిస్సహాయంగా ఉన్న వ్యక్తిని నిష్కారణంగా గుండెల్లో పొడుస్తుంటే ఆ వ్యక్తీ ముఖం ఎలా ఉంటుందో అలా ఉంది నీరజ ముఖం.
"ఛీ! ఛీ! ఇంక ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను ....." అని యశోధర చెయ్యి పట్టుకుని బరబర ఈడ్చుకుపోయాడు వేణు. లక్ష్మీదేవి వంటింట్లోకి పోయి దేముడి ముందు కూలబడిపోయింది.
"డోంట్ వర్రీ ప్రభూ! ఇప్పటికీ నాకు నీరజలో తప్పు ఉందని అనిపించటం లేదు. అనవసరంగా నీరజను కష్టపెట్టకు. ఇద్దరూ అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకుని అపార్దాలన్నీ తొలగించుకుని అన్యోన్యంగా ఉండండి...." అని ప్రభు భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు నీలకాంత్.
తలెత్తి నీరజ ముఖంలోకి చూసిన ప్రభు మనసు కరిగిపోయింది. అంత దీనంగా ఎవరి ముఖమూ అతనెప్పుడూ చూడలేదు.
నీరజా! నీకు నా దగ్గర భయమెందుకు? ఏం జరిగిందో ....." ప్రభు మాటలు పూర్తి కాకుండానే అడ్డు తగిలింది నీరజ.
"నన్ను క్షమించు ప్రభూ! నీకేమీ చెప్పలేను. కానీ నావల్ల నీకు ఇబ్బంది రానియ్యను. వెళ్ళిపోతాను...."
గుమ్మం దాకా వెళ్లిన నీరజను చెయ్యి పుట్టుకుని బలవంతంగా లోపలకు లాగి తలుపులు డభాలున మూసాడు ప్రభు.
* * *
ప్రభు కాలుకాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతున్నాడు. వెతికినవే మళ్ళీ మళ్ళీ డ్రాయర్లన్నీ వెతుకుతున్నాడు. లక్ష్మీదేవి ఎన్నోసార్లు..... "ఏం జరిగింది?" అని అడిగింది . నీరజ కూడా "ఏమిటి ప్రభూ!" అంది.
కంపెనీ డబ్బు అయిదువేల రూపాయలు బేంక్ లో జమ చెయ్యాలి. కొంచెం అశ్రద్ధ చేసి ఆ మరునాడు వేద్దామని డ్రాయరు లో పెట్టి తాళం వేసాను. ఇప్పుడది పోయింది. ఆ డబ్బు జమకట్టక పొతే ఉద్యోగం పోతుంది. పైగా బ్లాక్ మార్క్...."
నీరజ ముఖం పాలిపోయింది.
"జాగ్రత్తగా చూసావా?"
"ఆ! అన్ని విధాలా అన్ని చోట్లా వెతికి నిరాశ చేసుకున్నాకే నీకు చెపుతున్నాను...."
నీరజ ఇంకేమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు నీరజ సమాధానం కోసం ఎదురు చూసి, రాకపోవటంతో తల్లి దగ్గిరకు వెళ్ళి సంగతంతా చెప్పి "ఎలా అయినా ఆ ఐదువేలు పుట్టించగలమా అమ్మా!" అన్నాడు.
"అయిదు వేలు? ఎక్కడ్నించి వస్తాయి? యశో పెళ్ళి ఈ మధ్యనేగా చేసాము! ఇంకా ఆ అప్పు తీరనే లేదు.... పోనీ ఎక్కడైనా అప్పుగా దొరుకుతుందేమో చూడు.
"ఎవరిస్తారమ్మా!"
"ఛ! ఛ! అన్నీ శనిరోజులే! ఆ నీరజది మొదటి నుండీ శని జాతకమే? తల్లిని మింగింది. పోనీ ఎలాగో బ్రతుకుతుందనుకుంటే ఎప్పటికప్పుడే ఉపద్రవాలు. దాన్ని ఈ ఇంటికి తెచ్చావు. ఇక్కడా శని పట్టుకుంది ...."
"అమ్మా!" బిగ్గరగా , కోపంగా మందలించాడు ప్రభు.
"అన్నట్లు నీరజ దగ్గర యాభై వేలు ఉండాలి కదా, అడిగి తీసుకో"
ప్రభు మాట్లాడలేదు. లక్ష్మి దేవికి చికాకులేసింది. తనే నీరజను కేకేసింది.
"ప్రభుకు అర్జంట్ గా అయిదు వేలు కావాలి. లేకపోతే వాడి ఉద్యోగమే పోతుంది...."
"చెప్పాడు అత్తయ్యా! అది తలచుకునే బాధపడుతున్నాను."
"బాధపడటం దేనికి? నీ దగ్గిర యాభై వేలున్నాయిగా? అయిదువేలియ్యి....."
"అత్తయ్యా? అది నా డబ్బు అయితే నువ్వు చెప్పేవరకూ అగేదానినా?"
"ఏం నంగనాచివే? నీ డబ్బు కాకపొతే నీ పేరు మీద బేంక్ లో ఎందుకుందీ?"
"ఆ సంగతులేవీ నేను చెప్పలేను ?"
"పోనీ , నీ పేరు మీద ఉందిగా! ప్రస్తుతం తీసియ్యి. తరువాత చూసుకోవచ్చును...."
"ఆపని నేను చెయ్యలేనత్తయ్య! ఏ పరిస్థితుల్లోనూ ఆ డబ్బు నేను వాదననే నమ్మకంతోనే దానిని నా పేరుమీద ఉంచారు."
"ఛీ ఛీ! అందరి కందరూ స్వార్ధపరులు. డబ్బుదగ్గిర ఎవరి మటుకు వాళ్ళే గట్టివాళ్ళు! వంకలకేం ..... కావలసినన్ని."
"అమ్మా........." ప్రభు ఏదో అనబోయాడు.
"ప్రభూ! అమ్మా అమ్మా' అంటూ నా నోరు మయ్యడానికి ప్రయత్నించకు. నీకోసం ......నీ క్షేమం కోసం..... నా మనసు అల్లాడి పోతోంది. దీని కోసం నువ్వెంత చేసావు? ముష్టి అయిదు వేలు ఇవ్వలేదూ? అంత కాపీనమా? దాని కర్మాన దాన్ని వదిలి లక్షణంగా మరో మంచి పిల్లను చూసుకుంటే కట్నంగా అయిదు కాదు, పదివేలు వస్తాయి....."
"ఇదంతా జరిగేపని కాదులే అమ్మా!...."
