రాముడు అప్పల్సామి జోరుకి భయపడినట్టున్నాడు. అంచేత తనజేబులోంచి పదినోటు (అప్పట్లో అది నేటి వందనోటుతోసమానం) తీసి అప్పల్సామి చేతిలో పెట్టబోయేడు. రాముడి చేతిలో నోటు చూడగానే అప్పల్సామి అడ్వాన్సుగా సెల్యూట్ చేసి ఆనోటు అందుకోబోయేడు.
ఇద్దరి ప్రయత్నాలకు అడ్డంపడి ఆ నోటు నేను లాక్కున్నాను. నా చొరవకి రాముడితోపాటు పోలీసప్పల్సామి కూడా షాకు తిన్నాడు. మంచీ మర్యాదా లేకుండా ఒక పోలీసు కానిస్టేబుల్ నన్ను 'ఒరే గిరే' అని అంటూ క్లాసు పీకి అవమానిస్తే నాకు కోపంరాదా? వచ్చింది. గట్టిగానే వచ్చింది. అందుకే అప్పల్సామి మీద అరిచేను.
"లంచం గించం జాన్తానై! నీ రూలు ప్రకారం ఏం చేసుకుంటావో చేసుకో!" అప్పల్సామి ధోరణి మార్చి అట్నుంచి నరుక్కొచ్చేడు -
"నా పేరిని ఆఫ్టరాల్ అప్పల్సామి అనుకుంటున్నారల్లె వుంది. పేరు మరిసిపోండి మా ఇంటిపేరు నిప్పు! ఇది గేపకం ఎట్టుకోండి. నాతో గొడవెట్టుకుంటే - నిప్పు గదా.. కాల్తాను! అచ్చూనుకోండి!" అని కావాలని అప్పల్సామి ముందుకెళ్ళి స్టడీగా నిలబడి స్టడీగానే అన్నాను-
"అవునా? ఏది కాల్చు! కాల్చు చూద్దాం!"
అప్పల్సామి నన్ను ఎగాదిగా చూసి అన్నాడు - "ముందు ముందు అట్టాంటి పోగ్రాం ఎట్లాగో వుంటది లేంది. ఉప్పుడు ఈ సైకిలు నాతోపాటు టేషను కొస్తాది!"
"అలాగలాగే! తీసుకెళ్ళు! తప్పకుండా తీసుకెళ్ళు!" అన్నాను వ్యంగ్యంగా.
"మీ ఇళ్ళకి కాయితాలొస్తాయి. అందులో వున్న ఇదంతా నడుసుకోండి! పదిరూపాయల్తో పోయేదానికి పదొందలు కర్సు.. ఎవుడుతిన్నట్టు? ఎల్లిరండి బాబో! కోర్టులో కలుసుకుందాం!" అన్నాడు అప్పల్సామి సైకిలు తీసుకెడుతూ.
'మేం కూడా అదే అనుకుంటున్నాం. కోర్టులోనే కల్సుకుందాం!"అన్నాను.
రాముడు బాగా కలత చెందేడు కాబోలు. అందుకే అన్నాడు - "అప్పల్సామి అన్నది కూడా ఆలోచించు. పది రూపాయిల్లో పరిష్కారమయ్యే సమస్యని కోర్టుకెక్కించి ఆ పద్దుని వందలూ వేలకు పెంచడం సమంజసమా? ఖర్చుమాట అట్లా వుంచు. కోర్టు చుట్టూ ఓపిగ్గా తిరగడం మన వల్ల అవుతుందా?"
"మనం తిరగక్కర్లేదు గురూ! మనం కోర్టుకి ఒకే ఒక్కసారి వెడతాం. మిగతా కథ మన సోంబాబే నడిపిస్తాడు. విడ్డూరంగా చూడకు. సోంబాబు కొత్తగా ప్రాక్టీసు పెట్టిన లాయరు. నాఎరికలో ఏదైనా కేసుంటే చూడమని నా ప్రాణం తింటున్నాడు. ఎవరికేసో ఎందుకు? మనకేసే తీసుకోమంటాను. జరిగిన భాగోతం మొత్తం అక్షరం దాచకుండా సోంబాబుకి మనం చెబుతాం. కోర్టులో తాను ఏమి అడిగితే ఏం చెప్పాలో అతను మనకి చెబుతాడు. దాంతో నిప్పుగాడు ఫినిష్ పూర్తిగా ఆరిపోతాడు!" అన్నాను కసిగా.
ఆ తర్వాత జరగవలసిన తతంగం మొత్తం రొటీన్ గా జరిగిపోయింది. కోర్టులో మేజిస్ట్రేటు ముందు నేనూ, రాముడూ ముద్దాయిలమల్లె చేతులు కట్టుకుని నిలబడినందుకు సిగ్గుపడలేదు.
సోంబాబు తయారుచేసిన స్క్రిప్టు ప్రకారం రిహార్సలు చేసి, అన్నీ అబద్దాలే చెబుతున్నందుకు బాధకూడా పడలేదు. చిన్నదో పెద్దదో నిప్పు అప్పల్సామికి శిక్షపడాలనే ధ్యేయంతో బోనెక్కాం గదా! అంచేత సిగ్గు లజ్జల్నీ, భయం బాధల్నీ మేము అనబడే నేను పట్టించుకోవడంలేదు.
మేజిస్ట్రేట్ సమక్షంలో సోంబాబు శాస్త్రప్రకారం అడుగుతుండగా - రిహార్సల్లో ప్రాక్టీసు చేసిన అన్ని వివరాలూ పూసగుచ్చినట్టు చెప్పగలిగేం. ఫిబ్రవరి ఇరవై రాత్రి ఏడుగంటలకు మంగినిపూడి సముద్రతీరంలో దేవుడు బావిమీద కూచుని సినిమా కథ చర్చించేమని చెప్పేం. అర్ధరాత్రి దాటింతర్వాత సుమారు ఒంటిగంటకి - చర్చ ముగిసిన కారణంగా ఇళ్ళకు వెళ్ళేందుకు నిలబడగా - అక్కడ వుండవలసిన మా సైకిలు లేదని చెప్పాం.
ఆ సైకిల్ను పోలీసు స్టేషన్లో ఎవరు ఎందుకు అప్పగించేరో మాకు తెలీదన్నాం. కోర్టువారు దయతో మా సైకిలు మాకు ఇప్పించవలసిందిగా ప్రార్ధిస్తున్నామని మనవి చేసుకున్నాం. మా స్టేటు మెంటును కోర్టువారు మా ముఖమంతా ఒకసారి కాదు - మూడుసార్లు కోరి మరీ విన్నారు. రిహార్సలు పకడ్బందీగా చేసి వున్నాం గనక - ఎక్కడా తప్పుల్లేకుండా ఆ మూడుసార్లూ విజయవంతంగా చెప్పగలిగేం. అప్పుడు కోర్టువారు స్థానిక దినపత్రిక తాలూకు కటింగులు (జిరాక్సు కాపీలు) మా చేతుల్లో పెట్టే ఏర్పాటు చేసేరు. 'దేవుడిబావి' లో శవం అనే శీర్షిక కింద ప్రచురితమైన ఆ వార్త ఇలా ఉంది.
"పడుపువృత్తిలో లక్షలార్జించిన కుమారి లైలా మృతదేహాన్ని మంగినపూడి దేవుడి బావిలో పోలీసులు కనుగొన్నారు. ఈ హత్య ఫిబ్రవరి ఇరవై రాత్రి జరిగివుండవచ్చని వైద్యపరీక్షలో తేలింది. హత్యాప్రదేశంలో పోలీసులకు ముఖ్యమైన ఆధారాలు దొరికాయనీ - వాటి ఆధారంతో చురుకుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది".
ఆ వార్త చదవగానే కీడు శంకించేను. గుండెల్లో దడ ప్రారంభమైంది. కోర్టులో వున్న పోలీసప్పల్సామి నన్ను గుర్రుగా చూస్తున్నాడు. అతని వాలకం చూస్తుంటే - నాకు ఉరిశిక్ష పడాలని మొక్కుకున్నట్టుంది. రాముడ్ని మాత్రం అప్పల్సామి జాలిగా చూస్తున్నాడు. నాలాంటి రవుడీతో స్నేహం చేయడం వల్ల కీడు రాముడ్ని కూడా అంటుకుందని వర్రీ అవుతున్నాడు కాబోలు.
ఏతావాతా - మమ్మల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ పరిణామం సోంబాబుని బాగా కృంగదీసింది. తన ప్రయోజకత్వం వల్లనే మాసైకిలు మాకు దక్కకపోగా మేము జైలుపాలు కావలసి వచ్చిందనే చింత తొలిరోజుల్లో ఇల్లాంటి 'అపకీర్తి' సోంబాబుకి లభించడం అతని వృత్తికి మంచిది కాదు గదా!
సోంబాబుకి మిగిలిన ఆ కాస్త పరపతిని ఖర్చుపెట్టి - తాను హామీగా వుండి మమ్మల్ని జామీనుమీద బయటకు తీసుకురాగలిగేడు. బయటి ప్రపంచంలో మాకు సుఖసంతోషాలు పూర్తిగా నశించేయి. నిందలూ నిజాలూ పక్కన పెట్టి లైలాతో మాకున్న అక్రమ సంబంధం గురించి తలో మాటా సాయం చేస్తో సరికొత్త కథలు ప్రచారంలో పెట్టేరు జనం. ఇంట్లో పరిస్థితి కూడా అతి దారుణంగా వుంది. మునుపు నా పట్ల మావాళ్ళకున్న గురీ గౌరవాలు - ఈ కేసు పుణ్యమాని -పూర్తిగా తగలబడిపోయాయి! నన్ను చూస్తే చాలు .... పరుగులు తీసి దాక్కుంటున్నారు. ఇంక పలకరింపులేముంటాయి - నా బొంద.
ఇరుగుపొరుగు నా మీద జాలిపడుతున్నారో ... రోత పడుతున్నారో అర్ధం కాకుండా వుంది. రాముడి సంగతి సరేసరి, నాతో మాటాడడం మానుకున్నాడు.
పోలీసుతో తగూపెట్టుకోడం వల్లనే కదా. ఇంత అల్లరికి మూలకారణ మైందని తెలుసుకున్నాను.
ఆఫ్టరాల్ పదినోటు కోసం పోలీసు అప్పల్సామి సెల్యూట్ కూడా కొట్టేడు పాపం. అతనిమీద సవాలు చేయకుండా మౌనం వహించివుంటే, అప్పుడే నా సైకిలు నా చేతికి వచ్చేది కదా? లైలా మర్డర్ కేసు మీదపడేది కాదు! కదా? అంచేత - అప్పట్నుంచి -పోలీసు మీద భయంతో -నేను పోలీసులకు దూరంగా వుంటున్నాను.
అన్నట్టు చెప్పడం మరిచేను. లైలాను ఆమె డాన్సు మేస్టరే హత్య చేశాడని పోలీసులు జరిపిన పరిశోధనలో తేలింది. అందుచేత నిర్దోషులుగా మమ్మల్ని విడుదల చేసి డాన్స్ మేస్టర్ని జైల్లో పెట్టేరు.
* * *
