Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 17


                                          అమ్మో! పోలీసు!
    
    దెయ్యాలున్నాయో లేవో నాకు తెలీదు! దెయ్యం కథ చదువుతున్నా, ఆ బ్రాండు సినిమా చూస్తున్నా... గుండెల్లో దడగా వుంటుంది. నిలువెల్లా వణికిపోతుంటాను. సదరు రోగం చిన్నప్పట్నుంచీ తగులుకుని ఇప్పటివరకు ఉంది.
    దెయ్యం కంటే ఎవరెక్కువో తక్కువో తెలీదు గానీ-దెయ్యంతో పాటు, పోలీసన్నా నాకు భయంగానే వుంటుంది. నాలుగు దశాబ్దాల క్రితం -తొలిసారి ఈ పోలీసు భయం నన్ను అంటుకుంది. నాటినుంచి నేటివరకు ఆ భయాన్ని భద్రంగా పోషిస్తూ బతుకుతున్నాను.
    యూనిఫాంలో వున్న పోలీసు కనిపిస్తే చాలు-అతను నా పనిమీదే వచ్చి వుంటాడని అదిరిపోతాను. యూ ఆర్ అండర్ అరెస్టంటాడని వణికి చస్తాను. ఈ నేపథ్యంలో మొన్నాదివారం నాడు హైదరాబాదునుంచి ఆంజనేయులు నాకు ఫోన్ చేసేడు. వచ్చే ఆదివారం హైదరాబాదులో వాళ్ళబ్బాయి పెళ్ళిట. ఆ పెళ్ళికి సకుటుంబ సపరివారసమేతంగా హాజరు కావాలని అన్నాడు.
    ఆంజనేయులు మామూలు మనిషైతే ఆల్ రైటలాగే అనేద్దును. నా ఖర్మకొద్దీ అతను ఆషామాషీ మనిషి కాదు. పోలీసు ఆర్డినరీ పోలీసు కాదు. పోలీసు అధికారి.
    అంచేత పోలీసధికారింట్లో పెళ్ళికి - రూలు ప్రకారం చిన్నా పెద్దా పోలీసులనేకమంది వస్తారు. వచ్చే పోలీసులంతా సివిల్ డ్రస్సులో వస్తే ఫర్లేదు. ధైర్యంగా నేను కూడా వాళ్ళకి ఎదురెళ్ళి స్వాగతం పలకగలను! పోలీసు అధికారింట్లో పెళ్ళి కదా! ఆ పెళ్ళికొచ్చే జనాభా లాల్చీ పైజమాల్తో అడ్డుకట్ట పంచెల్తో చేతులూపుకుంటూ వస్తే వాళ్ళగతేంగాను?
    పుట్టగతులుండవు గదా? అంచేత -డిసిప్లిన్ పాటిస్తూ యూనిఫారంలోనే వస్తారు. ఆ పెళ్ళిపందిట్లో అంతమంది పోలీసుల్ని చూసి తట్టుకోగలనా? ఆ దమ్ములు నాకున్నాయా? లేవు! అలాంటప్పుడు పోలీసుల మధ్య జరిగే పెళ్ళికి ఎట్లా వెళ్ళగలను?
    వెళ్ళకపోతే చిన్ననాటి మిత్రుడు ఆంజనేయులు సైలెంటైపోయాడు గదా! గన్ను తీసుకుని నన్ను వెతుక్కుంటూ వస్తాడు. అసలు ఈ దిక్కుమాలిన పోలీసు భయం ఎప్పుడు ఏ విధంగా ప్ర్రారంభమైందో చెప్పాలి గదా?
    అప్పుడు నా వయస్సు పాతికేళ్ళు. అప్పటికే కథలనీ జోరుగా రాస్తూ పాపులర్ రైటరుగా పేరు తెచ్చుకున్నాను. మా బందర్లో కథా రచయితలు అప్పట్లో ఎక్కువమంది లేరు. నా స్థాయి రచయితలు అస్సలు లేరు. అంచేత మా ఊళ్ళో నా పలుకుబడి విరివిగా వెలుగుతుండేది.
    ఏ వీధికి వెళ్ళినా... అక్కడివాళ్ళు నన్ను ఎంతో మర్యాదగా పలకరించేవాళ్ళు. మేలైన వాళ్ళ పలకరింపుతో నా మేను పులకరించేది. (భాష వాడేను కాబోలు! క్షమించాలి!)
    అతనో ప్రముఖ రచయిత, సినిమాకు రచన చేసే ఛాన్సు కూడా రావడంతో, కథకు మంచి ఐడియా కోసమని ఓ మాంచి లొకేషన్లో సెటిలైపోయాడు. అర్ధరాత్రప్పుడు ఇంటికి తిరిగొస్తుంటే ఓ పోలీసతను పట్టుకుని ముప్పుతిప్పలు పెట్టాడు. అదే ఓ మాంచి సినిమా కత అయింది. ఆ కథాకమామీషు ఏమిటంటే......
    ఆ రోజుల్లో మంచి మంచి అయిడాలు కోసం మా ఊళ్ళో మంచి మంచి లోకేషన్లు వెతుక్కునేవాడిని.
    అందులో ఒకటి - రైలు స్టేషన్ కు దూరంగా ఉండే బందరుకోట ప్రాంతం. ఆ స్థలం నాకు బాగా సూటయ్యింది. వెన్నెలరోజుల్లో అక్కడ ఏ వంతెనమీద కూచున్నా మహత్తరమైన ఐడియాలు ఆటోమేటిగ్గా వచ్చేవి.
    అప్పట్లోనే సినీమాకి కథా, మాటలు రాసే ఛాన్సు కూడా నాకు తగిలింది మా ఊళ్ళోఅప్పటికి సినిమా రచయితలు మొత్తం ఎంతమంది వున్నారో, ఆ సమాచారం నా దగ్గిర లేదు. నాకుతెలసినంతవరకు అప్పటికే ఆ ఫీల్డులో బాగా పండిపోయి చేయి తిరిగిన రచయితలు త్రిమూర్తుల్లాగా ముగ్గురంటే ముగ్గురే వుండేవారు. పింగళి... మల్లాది... రావూరి.
    చెప్పద్దూ - బందరు పట్టణచరిత్రలో సినీ రచయితగా ఆ మహనీయుల సరసన నా పేరు కూడా అతి త్వరలో చేరుతుందనే ఆశతో ఆనందంగా వున్న సీజను అది. నాకు సహాయకుడిగా వుండి సహకరించవలసిందిగా రాముడ్ని కోరి ఒప్పించేను.
    రాముడు నా పాలిట దేవుడులాటివాడు. నాకంటే పెద్దవాడు. నాకంటే బుద్ధిమంతుడు. అంచేత అతన్ని దేవుడిగా భావించి గురువుగా ఎంచుకునేవాడ్ని.
    రాముడు నేనూ బందరుకోట వంతెన్ల మీద కూచుని కథా చర్చ జరిపేవాళ్ళం. ఆ నిశ్శబ్దవాతావరణంలో మా డిస్కషను భేషుగ్గానూ... చురుకుగానూ సాగుతుండేది.
    ఒకనాడు అర్దరాత్రి దాకా కథా చర్చ ముగించి, ఇద్దరం సైకిలెక్కి ఇళ్ళకు వస్తున్నాం. ఆ సైలెంట్ వాతావరణంలో పోలీసు విజిల్ మాకు స్పష్టంగా వినిపించింది.
    ఆ రోజుల్లో - సైకిల్ కి రాత్రిళ్ళు లైటు లేకపోయినా సైకిలు మీద ఇద్దరెక్కి వెళుతున్నా పోలీసులు కేసు రాసుకునేవారు. ఆ భయంతో పోలీసు విజిల్ వినికూడా ఆగలేదు. పైగా వేగం కూడా పెంచేసేను.
    "పెద్ద తప్పు చేస్తున్నావ్! ఆగిపో!" అని రాముడు నన్ను ఎంత హెచ్చరిస్తున్నా, విన్పించుకోక సైకిలు తొక్కుతున్నాను. మా దురదృష్టం కొద్దీ రైలు గేటు పడడం వల్ల పోలీసుకి దొరికిపోయేం. ఆ రక్షకభటుడు యమభటుడల్లే పొడుగాటి మీసాల్తో భయంకరంగా యముడిమాదిరే వున్నాడు.
    అతని బొంగురు గొంతు అతని పర్సనాలిటీకి బాగా సూటయ్యింది. అతను ఒక మురికినోటు పుస్తకం తీసి మా పేర్లూ, అడ్రస్సులూ గబగబా రాసుకున్నాడు.
    "ఉప్పుడు సెప్పండి. ఇంతరేత్రప్పుడు ఎక్కడ్నించి వొస్తున్నారు? ఎక్కడికి ఎల్తన్నారు?" గొప్ప గంభీరంగా ప్రశ్నించేడు పోలీసు.
    "అదిగదిగో అక్కడ వంతెన మీద కూచుని ఇంత సేపూ కథ గురించి మాటాడుకున్నాం. ఆ పనయ్యాక ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం" వినయంగా చెప్పకపోయినా గీరగా మాత్రం చెప్పలేదు నేను.
    'ఏంటేంటీ? కతా? ఏం కత? అరికతా?" ఎగతాళిగా అడిగేడు. నాకు ఒళ్ళు మండింది. అంచేత అతన్ని అనుకరిస్తూ అన్నాను- "అరికత కాదు! సినిమాకత!"
    నా సమాధానం విని చిందులు తొక్కుతూ అన్నాడు పోలీసు - "మరి సెప్పవే? ఒరే బాబూ... బాబొరే! ఆడినరీ కతలకే ఈ అప్పల్సామి అగ్గిరావుడవుతాడు. అట్టాంటిది సీప్ గా సినేమా కత ఇనిపించేవంటే సెట్ పట్ లాడిస్తాడు. నైట్టైమ్లో లైటు లేకుండా సైకిల్తొక్కడం క్రయిం నెంబరొన్. సైకిల్మీద డబల్సెక్కెల్లడం క్రయింనెంబర్టూ! ఏం టర్ధమవుతుందా? పోలీసోడి ఇజిల్ ఇని కూడా డోంట్ కేరని పారిపోడం క్రయింనెంర్త్రీ! అడిగిందానికి అడ్డగోలుగా ఆన్సర్లు సెప్పడం క్రయింనెంబర్ఫోర్! ఇట్టా సెప్పుకుంటూ పోవాలంటే నాలుక్కాదు - వీజీగా నలభైనేరాలు సెబుతా! సెప్పమంటావా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS