రావ్ అక్కడున్న మనుషులందర్ని టకటకా చూచి తల దించుకున్నాడు.
"వీళ్ళంతా మనవాళ్ళే. ఏం కావాలో చెప్పు."
"మా వాళ్ళంతా వెళ్ళిపోయేరు."
"ఎక్కడికి?"
"విశాఖపట్నం."
"ఎందుకు? నాటకాలకేనా?"
"కాదు , చదువు....."
"మరి చెప్పవే . అయితే యిప్పుడేమంటావ్?"
"నేనూ వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది."
"వెళ్ళు. ఎవరు వద్దన్నారు? ఇదేమిటోయ్ తలాతోకా లేని మాటలు? అసలు నువ్వు చెప్పదలచుకున్నదంతా ఒక్క ముక్కలో చెప్పు. ఇక్కడ గూడా నటిస్తావెం? నాకు ఒళ్ళు మంట!"
(ఏమిటి నాన్న యింత దారుణంగా మరిపోయడెం? అంత శాంతమూర్తికి యింత కోపం ఎక్కడనుంచి వచ్చింది? రాజకీయాల్లో మునిగిన మనిషికి మరో ధ్యేసే ఉండదా? నన్నెత్తుకుని పెంచి, నేనేం అడిగితె అది యిచ్చి అయన ప్రాణంగా ఎంచుకున్న నాన్న ఈనాడెందుకు పరాయి మనిషిగా కనిపిస్తున్నాడు నాకు? నాన్నకేదో జబ్బు చేసింది. ఇది మనిషి బాగుచేసే జబ్బు కాదు. దేవుడొక్కడే నాన్నని రక్షించాలి)
"నీకే చెబుతుంట. నాకు నీ సణుగుడు వినేటైం లేదు. విషయం పూర్తిగా చెప్పు" అన్నారాయన మళ్ళా.
"నాకు డబ్బిస్తే నేనూ విశాఖపట్నం వెళ్ళిపోతాను. ఆలస్యంగా క్లాసుల కెళ్ళడం మంచిది కాదు. ఇవాళే మా ఫ్రెండోకడు ఉత్తరం కూడా రాసేడు . తొందరగా వచ్చేయమని. నేను రేపే వెళ్ళాలనుకుంటున్నాను. అమ్మకి చెబుతే -"
"ఆవిడగారేమో నాతోనే చెప్పమన్నారు. ఒరేయ్ శ్రీనూ! నువ్వేం తొందరపడక్కర్లేదు. వారం రోజులాగి వెడితే అక్కడ కొంపలేం మునిగిపోవు. వెధవది మ నేనూ చదువుకున్నావాడినేరా . పాతకాలంలోనే లా డిగ్రీ పుచ్చుకున్నాను. నీ విషయం నాకు పూర్తిగా తెలుసు గాని వెళ్ళేళ్ళు. ఇప్పటినించే వెళ్ళి అక్కడ నాటకాల్లో తిరిగేదాని కంటే వారం రోజులాగి బుద్దిగా క్లాసులకి వెళ్ళడమే మంచిది. నన్ను మాటాడించకు వెళ్ళింక"
రావ్ ఆ గది నుంచి బిక్కమోహంతో తిరిగి వచ్చేశాడు . అతనా గది విడిచిన తరవాత, తెగిపోయిన రాజకీయం తిరిగి విజ్రుంభించింది.
నీరసంగా తిరిగి వస్తున్న కొడుకుని తల్లి చూచి , ఏం జరిగి వుంటుందో పసిగట్టింది. అంచేత ఆ తల్లీ నోరెత్తలేదు."
* * *
ఎన్నికల ఫలితాలు తెలిసే రోజు ఉదయం నించే నాన్న యింట్లో కనిపించడం లేదు.
ఆ ఉదయం అమ్మ పూజగదిలో రెండు గంటలు కచ్చితంగా కూర్చుంది. రావ్ కాలుకాలిన పిల్లిలా యిల్లంతా తిరుగుతూనే వున్నాడు. ఆ సాయంత్రం మూడు గంటలకి కాబోలు వార్త తెలిసింది ఫోన్ ద్వారా.
"లోకనాధం గారు అరుచోట్ల మోజారిటితో తిరిగి చైర్మన్ గా ఎన్నికయ్యేరు!"
ఫోన్ లో వార్త విని తల్లి కుప్పలా కూలిపోతుండగా రావ్ తొందరగా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. మెల్లిగా తీసుకువచ్చి పక్క గదిలో పడుకోబెట్టాడు.
ఆవిడ మెల్లిగా కళ్ళు విప్పి కొడుకుని చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.
"ఏడవకే అమ్మా....ఏం జరిగిందో చెప్పు."
"నాన్న ఓడిపోయారు శ్రీనూ."
రావ్ చాలాసేపటి వరకూ మాటాడలేకపోయేడు. చివరికి అతనే అన్నాడు.
"దరిద్రం తోలిగిపోయిందే అమ్మా! మళ్ళా నాన్న మునుపటిలా ఈ యింట్లో తిరుగుతాడు నిశ్చింతగా . నీతో , నాతొ మనసారా మాటాడగలరు. నిజమే. అమ్మా, ఈనాటితో మనకి శని దూరమయింది పో!"
ఆ తల్లి రావ్ మాటని నమ్మలేకపోయింది. అందుచేతనే తెగించి అనేసింది.
శని దూరం కాలేదురా శ్రీనూ! ఇవాల్టినుంచే శని ఈ యింట్లో తిరుగుతుంది."
రావ్ అక్కడ నించి లేచి వచ్చి తన గదిలో కూచున్నాడు. దూరంగా ఏదో కోలాహలం వినిపిస్తుండగా లేచి బయటికొచ్చి నించున్నాడు.
ఒక జీపు దాన్లో లోకనాధం గారెంతో వినయంగా, మెడనిండా పూలదండలతో బరువుగా నిలబడి ఉన్నారు. వారి వెనకగా అయిదారు లారీల నిండా జనం. ఆ జనం తాలూకు జైజై నినాదాలు!
రావ్ కి వాళ్ళ నాన్న కౌన్సిలర్ గా గెలిచినా రోజు గుర్తుకి వచ్చింది. వెంటనే -- లిప్తపాటు కాలంలో - చెరిగిపోయింది.
ఆ సమూహం సరిగ్గా రావ్ యింటి ,ముందుకు వచ్చి ఆగింది. జీప్ లోనుండి లోకనాధం గారు దిగుతుండగా జైజైలు ఎక్కువయ్యాయి. అయన చుట్టూతా ఒక తడవ చూచి తన రెండు చేతుల్ని జోడించి - ఇంకా జేజేలు చాలన్నట్టు సైగ చేసేరు. మంత్రించినట్టు క్షణంలో నినాదాలు ఆగిపోయేయి.
రావ్ దగ్గరికి వచ్చేరు లోకనాధం గారు. రావ్ అన్నాడు.
"కంగ్రాచ్యులేషన్స్ సార్!"
"థాంక్స్ నాయనా! నాన్నగారున్నారా? వారిని ఓ తడవ పలకరించి పోదామని వచ్చెను."
"లేరండి. ఉదయమనగా ఇల్లు విడిచి వెళ్ళేరు. ఇప్పటికి యింకా రాలేదు."
"అదేమిటి నాయనా? రిజల్టు తెలిసింతర్వాత కారెక్కి తిన్నగా యింటికే బయలుదేరారు గదూ?"
"రాలేదండి"
"అయితే నేను రేపు తీరుబడిగా వచ్చి ఆయన్ని కలుసుకుంటానని చెప్పు వస్తానాయనా!"
"మంచిదండి. నమస్కారం"
లోకనాధం ఏంతో ఠీవిగా జీపు ఎక్కేరు. ఆ జీపు కదిలింది. మళ్ళా జనంగాళ్ళు జైజైలు అందుకున్నారు. కాసేపట్లో ఆ ఉత్సవం యింటికి దూరమై పోయింది.
రావ్ తల్లి దగ్గిరికి వెళ్ళేడు.
"చైర్మన్ గారు వచ్చేరా?" అన్నది నవ్వుతూ.
"నాన్నకోసం వచ్చేరుట. నాన్న యింటికి బయలుదేరడం అయన చుసేరుట కూడాను."
"పిచ్చి శ్రీనూ! అయన అంత తొందరగా యీ యింటికి రారు నాయనా. ఆయన్ని పట్టుకున్న గ్రహాలు అంత తొందరగా విడిచి పెట్టవు'
. ఎన్ని వుపదేశాలు వినాలయన"
అమ్మ చెప్పింది అక్షరాల నిజం.
రాత్రి పది గంటల ప్రాంతాన కారులో బసవయ్య గారు నాన్నని యింటి దగ్గిర దిగబెట్టి వెళ్ళేరు. జానకిరామయ్య గారు తిన్నగా తన గదిలోకి వెళ్ళి పోయేరు.
కాసేపటికి రావ్ అయన గదిలోకి వెళ్ళేడు.
అయన పడక కుర్చీలో నడుం వాల్చి సిగరెట్టూ కాలుస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబడి వున్నాయి. మనిషి మొత్తం అలసిపోయి భయంకరంగా కనిపిస్తున్నారు.
ఆ స్థితిలో -- ఆయన్ని పలకరించడమా, మానడమా అని సందిగ్ధంలో పడిపోయేడు రావ్.
రావ్ ని చూచీ చూడటంతోనే ఆయనన్నారు.
"రా నాన్నా! వచ్చి, ఆ మంచం మీద కూర్చో!"
రావ్ కూచున్నాడు.
