కానీ ఇది చాలా పాత వాచి. పైగా నా పెళ్ళికి మా మామగారు ఇచ్చింది. ఆయన ప్రేమని అమ్ముకోలేకపోయాను మీ డబ్బు జీతం రాగానే యిస్తాను!" అన్నాడు కన్నీళ్ళతో.
నారాయణ చప్పున ఆ గడియారాన్ని తీసి ఆయన చేతికి పెట్టేసి బావగారూ! మనది స్నేహబంధుత్వం, మీ నిజాయితీ నాకు తెలుసు. ఇప్పటి చిక్కు తెలుసు. దీనికంత బాధపడి నాతో గడియారం ఉంచేసి వెళ్ళాలా? అక్కర్లేదు బాడుగ గురించి మీరు దిగులు పడకండి. ఆ మాటకి వస్తే మేం మొదటినుంచి బాడుగలకి ఇస్తున్నామా? మీరు మీ వీలుని బట్టి బాడుగ దఫాల వారీగా పంపేయండి. అసలు దాన్ని గురించి అట్టే ఆలోచన పెట్టుకోకండి!" అన్నాడు.
నారాయణ మాటలకి ఆయన పొంగిపోయాడు.
"నారాయణ బావగారూ! నా జీవితంలో ఒక్క స్నేహితుడిని సంపాదించుకోలేకపోయాను. ఒక బంధువునీ నిలుపుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు ఆ దిగులు లేదు. మీరు చాలు!" అన్నాడు నిండిన గుండెతో.
నారాయణ నవ్వేసి వాళ్ళని సాగనంపాడు.
అదంతా చూస్తోన్న నందకి చప్పున తన బావ గుర్తుకు వచ్చాడు.
"ఈ ఇంటిని అమ్మేసి డబ్బు ఇవ్వమని అడిగాడు మామయ్య. నాన్న అంగీకరించలేదు. తండ్రితో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు విక్రాంత్.
అయితే ఓ వారం తర్వాత ఉత్తరం వచ్చింది నందకి
నందా!
నన్ను క్షమించు. నేను మామయ్యతో ఎంతో చెప్పాను. లాభం లేకపోయింది. జయంతి పెళ్ళికోసం నేను త్యాగం చెయ్యాల్సి వచ్చింది. నా పెళ్ళి యిక్కడ మెడికల్ కాలేజీ ఆంత్రోపాలజీ ప్రొఫెసరు కూతురితో ఫిక్స్ అయింది. ఆమె నా క్లాస్ మేట్. నాన్న అడిగిన పాతికకి బదులుగా ఆయన నలభయ్ వేలిచ్చాడు. మా కోర్స్ పూర్తి కాగానే పెళ్లి చేద్దాం అని నిశ్చయించుకున్నారు. నందా! అయాం సోల్డ్ అవుట్! సారీ!
నీ బావ మాత్రమే అయిన విక్రాంత్.
ఆ రోజు తన మనసు క్షోభించింది. ఇల్లు అమ్మేసి ఆ డబ్బు యిచ్చేసి వుండవలసింది అనిపించింది.
కానీ-
తనూ, నాన్నా, అమ్మా ఎవరూ ఒప్పుకోలేదు.
ఈ ఇంటిపై ఏదో ఆశ పెట్టుకున్నారు.
ఆ ఆశ ఇలా అవుతోంది!
ఇలాంటి పరిణామాలు ఆశించా బాడుగకి యిచ్చింది అనిపించింది.
అమ్మా, నాన్నా త్యాగం చేస్తున్నారనిపించింది నందకి.
సరిగ్గా ఆ వారంలోనే రవికాంత్ కి ఏక్సిడెంట్ అయింది .
స్కూలుకు వెడుతూంటే-
ఒక్కడూ పేవ్ మెంట్ కి యివతల ఏదో ఆలోచిస్తూ వెళుతున్నాడట!
ఎదురుగా బస్సు, వెనుకగా లారీ పోటీపడ్డట్టుగా దూసుకుని వస్తున్నాయి.
ఆలోచనల్లో వున్న రవికాంత్ గమనించలేదు.
అకస్మాత్తుగా రెండింటి మధ్యా వోకోటి ప్రవేశించింది.
దాన్ని రక్షించేందుకు లారీని పక్కకి కోశాడు డ్రైవరు.
అది రవికాంత్ ని ఓ వారగా కొట్టింది.
అదృష్టవశాత్తూ అతను లారీ క్రింద పడలేదు.
కానయితే వాడికి పెద్ద ప్రమాదమే జరిగింది.
తలకి పెద్ద గాయం అయింది.
ఎవరో హాస్పిటల్లో చేర్చి తర్వాత ఇంటికివచ్చి విషయం చెప్పారు.
నారాయణ, సుందరమ్మ హాస్పిటల్ కి పరుగెత్తారు.
నంద, విమల ఇంట్లోనే వున్నారు.
దెబ్బ చాలా పెద్దాది!
తలకి చాలా కుట్లు పడ్డాయి.
కొద్దిగా ఆపరేషన్ కూడా చేయవలసి వచ్చింది.
అప్పుడు నారాయణ చేతిలో బొత్తిగా డబ్బుల్లేవు.
నానా యాతన పడి డబ్బు సంపాదించాడు.
అయినా ఫలితం లేకపోయింది.
దాదాపు రెండునెలలు హాస్పిటల్లో గడిపాడు రవికాంత్.
సుందరమ్మ అహోరాత్రులు కొడుక్కి సేవ చేసింది.
డబ్బు నీళ్ళలా ఖర్చయింది.
కుటుంబం బాగా చితికిపోయింది.
అయితేనేం రవికాంత్ శారీరకంగా రెన్నెళ్ళ తర్వాత బాగయి తిరిగి వచ్చినా అతను మానసికంగా పనికిరాని వాడయిపోయాడు.
మెదడులో నరాలు దెబ్బతిన్నాయి.
జీవచ్చవంలా తయారయిన కొడుకుని చూసి అంతా గొల్లుమన్నారు!
10
కామాక్షమ్మ భర్తపేరు సింహాచలం.
అయితే ఆయన మనఃప్రవృత్తి అచలం.
ప్రవృత్తి చలం.
మాట చంచలం.
అయినా ఆ కాంపౌండ్ లో కామాక్షమ్మ గారి సామ్రాజ్యంలో ఆయన్ని కామాక్షయ్యగారనే అంటారు.
దానికి ఆయన చిద్విలాసంగా నవ్వుతారు. అదేమీ పట్టించుకోనట్టుగా హాయిగా చిదానందంగా తలూపుతారు. అందులో వున్న విమర్శనీ, ఎత్తిపొడుపునీ హేళననీ కూడా చిదాత్మ స్వరూపుడిలా స్వీకరిస్తారు! ఏమీ అనరు! మీ మాటలు వట్టి మాటే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అయితే అదంతా ఆయన గొప్పతనం అనుకుంటే పొరపాటే.
అందరిలానే బాగా చదువుకున్నా రాయన.
కాశీ విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఏ. పట్టాకూడా పుచ్చుకున్నారు.
చక్కగా లెక్చరర్ ఉద్యోగం కూడా వచ్చింది అక్కడెక్కడో.
అదో అంతవరకూ బాగానే వున్నా ఆ తరువాత వచ్చింది. కష్టమల్లా అది కామాక్షమ్మని పెళ్ళిచేసుకోవటం ఇల్లరికం రావటం.
ఆయన భార్య చెప్పినట్టు వినాలన్న దానికి తొలి ఉదాహరణ. ఆమె చెప్పినట్టుగా ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం.
రాజీనామా పత్రాన్ని పంపడానికి ముందు కామాక్షమ్మకి తెలియకపోయినా చాణక్య సూత్రాలూ, కార్ల్ మార్క్స్ సిద్దాంతాలూ అన్నీ ఎకరువు పెట్టింది.
ఆఖరికి "మనకింత ఆస్తి, ఐశ్వర్యం వుంది. మీరు మూడొందల చిల్లర ఉద్యోగానికి అన్నేసి మైళ్ళదూరం వెళ్ళటం ఎందుకు? నేనూ మీ వెంటరావటం ఎందుకు? ఇంకోటి కూడా వుంది. మీరు మానేస్తే ఆ ఉద్యోగం ఇంకొకరికి దక్కుతుంది కదా? అది ఆలోచించండి!" అంది.
