Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 16


    "నాన్నగారు పైకి రమ్మనగానే అవన్నీ గుర్తుకు వచ్చాయి" అన్నాడు.

    సిద్దార్ధ బాగా గుర్తు! పైకి ఎవరన్నా రాగానే క్రింద తల్లి ముఖం మాడిపోయేది. తనను దగ్గరగా తీసుకుని ఏడ్చేది. 
    "ఎందుకమ్మా!" అమాయకంగా సిద్దార్ధ అడిగేవాడు.

    "మీ నాన్న.......మీనాన్న మరొక స్త్రీతో స్నేహంగా ఉన్నాడురా."

    "ఉంటే నీకేం భయం! నేను నీకున్నాను." అనేవాడు.

    "సిద్ధూ!" కొడుకుని కౌగిలించుకుని బావురు మనేది.
 
    "ఏడ్వకమ్మా......" చిన్నారి చేతులతో ఆమె కళ్ళు తుడిచేవాడు. ఏనుగు ఎక్కినంత సంబర పడేది.

    "సిగ్గులేక పోతే సరి. పసివాడి ముందు ఏడుస్తావు. రెండవ సంబంధం అంటే నెత్తిన ఎక్కుతారు, అమాయకురాలివి. చేతగాని దానవు" అన్నది కోపంగా యశోద తల్లి. 

    "నిజంగా నేను చేతకాని దాన్నేనమ్మా. నాకే గనుక తెలివి తేటులంటే నువ్వు రెండవ సంబంధం చూస్తే ఊరుకుంటానా!"        

    "ఏడ్చావ్ కుంటివాడికిచ్చానా, గుడ్డివాడికా!" అనేది.

    అవన్నీ తలుచుకుంటూ పైకి వెళ్ళాడు సిద్దార్ధ. అప్పటికే పడక కుర్చీలో కూర్చుని విలాసంగా కాళ్ళు తిప్పుతున్నాడు తండ్రి. తాంబూలం నములుతూనే కొడుకుని పిలిచాడు.

    "ఏమిట్రా డల్ గా వున్నావ్! నీ వయసు కుర్రాళ్ళు హుషారుగా ఉండాలి" అన్నాడు.

    "ఉండాలి........కాని..." ఏం చెప్పాలో తెలియలేదు.
 
    "నాకు తెలుసు నీ బాధ!" ఆయన నవ్వారు, ఆ నవ్వులో ఎన్నో అర్ధాలు స్ఫురించాయి.
 
    "నీకు మీ అమ్మ పోలిక చాతకానితనం" అన్నట్టుంది.

    అతను వెళ్ళి ఎదురుగా ఉన్న పేము కుర్చీలో కూర్చున్నాడు.

    "మీ అమ్మ ఏమయినా చెప్పిందా!"

    "లేదండి"

    "ఈ కాలం ఆడపిల్లలు బరితెగించారు......." అన్నాడు.

    "పోనివ్వండి పుడుతూనే బరితెగించిన పురుషులను ఎదిరించనయినా. ఎదిరిస్తారు......" అన్నాడు.

    "నువ్వేదో తమాషా అనుకుంటున్నావు. మన సాంప్రదాయం ఏమిటి! మన స్థితి గతులేమిటి! రాధిక బరితెగించింది" అన్నాడు.

    "రాధిక ఏం చేసింది!"

    "మన దగ్గర పాలేరుగా వుండేవాడు గోపయ్య. వాడి కొడుకును ప్రేమించిందట..ప్రేమలేఖలు, ఆవేశాలు, ఆ విరహం చెబితేతీరదు" అన్నాడు.

    "అలాగా - " అన్నాడు. అంతా రాధిక నోట విన్నాడు.

    "అవున్రా! అందుకే వెంటనే సంబంధం చూచి పెళ్ళి చేసేద్దాం అనుకుంటున్నాను."

    "మీరు అనుకుంటున్నారు. రాధికను ఒప్పించారా!"

    "రాధిక చిన్నపిల్ల తనకేం తెలుసు! రెండు మూడురోజులు ఏడ్చినా సర్దుకుపోతుంది. ఆడపిల్లలు మొక్కల వంటివారురా. ముదిరిపోక ముందే ఎక్కడ నాటినా, నాటుకుంటారు" అన్నాడు.

    కొన్ని మొక్కలు ఎండిపోతాయి.

    "లేతగా వుండగా నాటితే ఏం కాదుగాని, రాధికకు సంబంధం నిశ్చయించాను. ఆ పిచ్చిపిల్లకు నచ్చ చెప్పవలసిన బాధ్యత నీపై వున్నది.

    "నేను నచ్చ చెబుతాను నాన్నగారూ. ప్రేమలేఖలు రాసుకున్నారని చెబుతున్నారు కదా! పెళ్ళిలో ఆ కుర్రాడు అవి తెస్తే-"     "ఇక వాడి గురించి నిశ్చింతగా వుండు. మన జోలికి రాడు. నువ్వు చేయవలసిందల్లా మన అమ్మాయిని ఒప్పించటమే"

    "మనమ్మాయిని ఒప్పించేకంటే ముందు అతనికి అతని స్థితి చెప్పాలి. చదువుకున్నవాడు. "నువ్వు నిజంగా రాధికను అభిమానిస్తే" ఆమెను మరిచిపోవాలని చెబుతాను -"

    "అంత అవసరం లేదు. అతని బెడద మనకులేదు" అన్నాడు అతిశయంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS