'నేను చేస్తున్న పనిలో తప్పు లేదని నేను నమ్మినప్పుడు నేనింకోకరికి ఎందుకు భయపడాలి? ఈ కులాలూ గోత్రాలూ అన్నీ మనం ఏర్పరచు కొన్నవి. వాటిని లెక్క చెయ్యకుండా నేను బ్రతక దలుచు కున్నప్పుడు, ఇందులో మరొకరు వేలెత్తి చూపించటానికి నవ్వటానికి ఆస్కారం లేదు. ఒకవేళ అలా ఎవ్వరైనా చేసినా నేను లక్ష్య పెట్టను -- నాకు నచ్చిన విధంగా బ్రతక గలిగే హక్కు నాకు వుంది.'
'హు-- హక్కు-- సరే వెళ్ళు -- కాని మళ్లీ జన్మలో నీ మొహం మాకేవ్వరికి చూపించటానికి వీల్లేదు. ఊ ' అంటూ చిదంబరం కూతుర్ని బైటి గుమ్మం వైపుకి నెట్ట బోతుంటే ,--
'ఏమిటండీ, మీరు కూడా చిన్న పిల్లతో సమంగా ఇదవుతున్నారు. అజ్ఞానంతో అది ఏదో అంటే నచ్చ చెప్పాలి కాని...' అంటూ ఏదో చెప్పబోయింది సుందరమ్మ గారు.
'పరిస్థితి ఇంతవరకూ వచ్చాక, ఇంకా ఇంకా నచ్చ చెప్పటం నా తరం కాదు- సరే సీతా , నీకు మరొక్క అవకాశం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. తెల్లవారే సరికి నీ మనస్సు మార్చుకుంటే మామూలుగా ఇంట్లో వుండు-- తెల్లవాతింతరువాత నీకు ఈ ఇంట్లో స్థానం వుండదు.' అనేసి గబగబ అడుగులు వేసుకుంటూ తన గదిలో కి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రంతా ఆ ముగ్గురూ జాగారం చేశారు.
తను ఊహించని ఎదురు దెబ్బ , పరాభవం నిలువునా దహించి వేస్తుంటే బాధతో కోపంతో కుమిలి పోయాడు చిదంబరం.
కన్నీళ్ళతో కూతుర్ని బ్రతిమాలుకుంటూ , చివాట్లు వేస్తూ కాలం గడిపిండి సుందరమ్మ గారు.
దేనికీ చలించలేదు సీత -- అందుకు కొంత కారణం -- సత్యానికి మద్రాసు లో వుద్యోగం దొరికిందని వారం క్రిందటే తెలిసింది. ఆ మరునాడు ఇద్దరూ మద్రాసు వెళ్లి పోవటానికీ అక్కడే పెళ్లి చేసుకోటానికీ పధకం అంతా వేసుకున్నారు--'
ఆ రాత్రి అక్కడ సత్యం వాళ్ళ ఇంట్లో -- బట్టలు సర్దుకోతం పూర్తీ చేసి సత్యం మెల్లిగా తన పెళ్లి వార్త తల్లి తండ్రుల చెవిని వేశాడు. వాళ్ళు మొదట అయోమయంగా అతని వంక చూశారు-- అక్కడి వాళ్ళ వూళ్ళో సత్యం మేనమామ కూతురు అతని కోసమే పుట్టినది వుంది-- పాతిక వేల రూపాయల కట్నం ఇస్తారు-- అదంతా కాలదన్నుకుని చివరికి ఈ సీతలో ఏం చూసి కొడుకు ఈ నిర్ణయానికి వచ్చాడో వాళ్ళకి అంతు పట్టలేదు........కొడుక్కి, నచ్చ చెప్పాలని చూశారు. చిదంబరాన్ని, అతని కుటుంబాన్ని నోటికి వచ్చినట్లు తిట్టుకున్నారు. దేనికీ సత్యం చలించలేదు -- చివరికి అహంకారం ఆగక, 'అది నీతో ఊరికి ఎలా వస్తుందో నేను చూస్తాను.' స్టేషను లో అది కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను.' అన్నాడు సత్యం తండ్రి.
"సీత నేమైనా పల్లెత్తు మాటయిన అన్నారంటే నేను మీకు దక్కను. అన్నాడు సత్యం సీత పట్ల ప్రగాడమైన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.
ఇటు సత్యం, అటు సీతా కూడ ఇంట్లో వాళ్లతో యుద్ధం చేసినంత పనిచేసి, రైలు ఎక్కి మద్రాసు వచ్చి కాపురం పెట్టారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.
అతనికి వచ్చే జీతంతో వాళ్ళకి బాగనే గడిచి పోతోంది-- ఇంతలో సీత రిజల్ట్స్ వచ్చాయి.
'నేను కూడ ఉద్యోగం చేస్తాను' అంది సీత.
'ఇప్పుడు మనకేం తక్కువయిందని నువ్వు ఉద్యోగం చెయ్యటం ? అంతగా కాలక్షేపం కావటం లేదనుకుంటే ఎమ్మే లో చేరు.' అన్నాడు సత్యం.
'ఇంకా నాకు చదువేందుకులెండి. ఈ ఇల్లు దిద్దుకుంటూ, వేల్టికి మీకు అన్నీ అమర్చి పెడుతుంటే కాలం కావలసినంత సరదాగా గడిచి పోతోంది. నాకింక డిగ్రీలు అక్కర్లేదు.' అంది సీత.
అలా అలా కొద్ది నెలల కాలం శరవేగం తో పరుగెత్తుకు పోయింది. తల్లుదండ్రుల బంధువులనీ వదులుకుని వచ్చాననే దిగులు కాని, తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నాననే బాధ గాని ఏమీ లేకుండా విషయాల గురించి ఆలోచించడానికే తీరిక లేనంత సరదాగా సంతోషంగా కాలం దోర్లిపోతోంది.
వో సాయంత్రం, ఆఫీసు నుండి వచ్చిన భర్తకి చిరునవ్వుతో ఫలహారం ప్లేటు అందించినది సీత . ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటున్నారు.
"ఈ పూట వంట ఏం చెయ్యమన్నారు' మధ్యలో అడిగింది సీత.
'నీ ఇష్టం.'
ప్రతి రోజూ, రెండు పూటలా సీత అతడ్ని ఆ ప్రశ్న వెయ్యటం, అతని దగ్గర నుండి అదే సమాధానం రావటం మామూలే -- అయినా సీతకి అలా అడగటం అదొక సరదా -- ఆ తరువాత తన కిష్టమైన దేదో చేసి, చివరికి భోజనానికి కూర్చోబోయే ముందు, 'నేనేం కూరలు చేశానొ చెప్పు కొండి.' అంటూ అరగంట సెపు అతన్ని వూరించి అప్పుడు వడ్డన కి ఉపక్రమిస్తుంది-- అలాగే ఇవాళ కూడా ఏవేవో వంటకాలు చెయ్యాలని ప్లాను వేస్తూ చిలిపిగా గర్వంగా ; అతని వంక చూసి నవ్వింది.
'వో-- చెప్పటం మరిచిపోయాను. నా కోసం ఈ పూట వంట చెయ్యకు. వో స్నేహితుడు డిన్నర్ పార్టీ ఇస్తున్నాడు.' అన్నాడు సత్యం ఖాళీ టిఫిన్ ప్లేటు బల్ల మీద పెడుతూ.
'ఆహా-- సరీ అయితే -- ప్రొద్దుటిది కాస్త అన్నం వుంది-- ఏ ఊరగాయ ముక్కో వేసుకు తింటాను -- ఈ పూటకి మరేం చేసుకోలేను.' అంటూ కాఫీ కలపటానికి లోపలికి వెళ్ళిపోయింది సీత.
ఇద్దరూ కాఫీ తాగి కాస్సేపు ఆ ఖబురూ ఈ ఖబురూ చెప్పుకున్నాక సత్యం బట్టలు మార్చుకుని వెళ్ళిపోయాడు.
ఎనిమిది గంటల వేళ- ఒక్కదానికీ సయించి సయించక ఏదో కాస్త తిన్నానని పించి వంట గది సర్దేసి గదిలోకి వచ్చి పుస్తకం చదువు కుంటూ కూర్చుంది సీత.
ఇంకా రాలేదేమిటి అనుకుంటూ ఉండి ఉండి గడియారం వంకే చూస్తూ బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్న సీతకి గడియారం ముళ్ళు రాత్రి పది గంటలని చూపిస్తుండగా వీధి తలుపులు తడుతున్న చప్పుడు వినిపించింది.
'ఇప్పటికి తెమిలింది బాబూ వీళ్ళ పార్టీ .' అనుకుంటూ లేచి వెళ్ళింది.
'పార్టీ బాగా జరిగిందా? చాలామంది వచ్చారా?' అంది అతను బట్టలు మార్చుకుంటుంటే.
'వో- చాలా సరదాగా జరిగింది. ఆసలు టైమే తెలియలేదు. నీకు ఒక్కదానికీ భయం వెయ్యలేదు కదా.'
'భయం ఏం లేదు-- మేడ మీది వాళ్ళ కబుర్లు -- ఇప్పటి దాకా వినిపిస్తూనే వున్నాయి .' అని 'ఇంతకీ పార్టీ ఎక్కడ ? మీ ఫ్రెండు ఇంట్లో నా లేకపోతె హోటల్లో ఏర్పాటు చేశారా.' అని అడిగింది సీత.
'హోటలే.' అంటూ హోటలు పేరు చెప్పాడు సత్యం.
అది వింటూనే సీత అనుమానంగా మొహం చిట్లించి, 'అది నాన్ వెజిటేరియన్ హోటలు కదూ.' అంది.
అదేం కాదు. రెండు రకాలూ దొరుకుతాయి. మనకేది కావలిస్తే అదే తీసుకోవచ్చు-- వాళ్ళంతా నాన్ వెజిటేరియన్ కావాలన్నారు. ఇక నా ఒక్కడి కోసం వాళ్ళందర్నీ మానుకోమనటం ఏం బాగుంటుంది. అందుకే ఆ హోటల్ ప్రిఫర్ చేశాం.'-- గబగబ ఎవరో తరుముకు వస్తున్నట్లు అతను చెప్తున్న మాటల్లో నిజం ఎంత వుందో అనే అనుమానం సీతని పట్టుకుని పీడించ సాగింది.
'మీరొక్కరూ వెజిటేరియన్ మీల్స్ తీసుకున్నారా' అని అడగాలని పించినా ఆ ప్రశ్న తనకే ఎలాగో తోచి అడగకుండా వూరుకుంది. పుట్టినప్పటి నుంచీ మొన్న మొన్నటి దాకా అలాటి భోజనానికి అలవాటు పడిన వాడే తన భర్త.
'ఇంక నుంచీ నీతో పాటే నేనూ -- నీకిష్టం లేని మత్స్య మాంసాలని నేను నీ కోసం సంతోషంగా విడిచి పెట్టేస్తాను.' అని తనకి పెళ్ళికి ముందు మాట యిచ్చి, ఈనాటి వరకూ ఆ మాట ప్రకారమే నడచుకుంటూ వచ్చాడు-- ఇంట్లో ఎలా వున్నా అతను బయట ఏమైనా తింటున్నా డెమో అన్న అనుమానం అయినా రాలేదు ఇన్నాళ్ళూ -- కాని ఇవాళ పదిమంది స్నేహితులతో అలాంటి హోటలు కి వెళ్లి, వాళ్ళంతా భోజనం చేస్తుంటే తను ఒక్కడూ ఏదో మడి గట్టుకున్నట్లు కూర్చుంటాడా అనే అనుమానం వదలటం లేదు. పైగా భర్త మాట్లాడుతుంటే ఏమిటో మసాలా వాసన గుప్పుమని వస్తోంది. అసలే వేవిళ్ళ తో వాంతులతో సతమత మయిపోతున్న సీతకి ఆ వాసన ఆ పదార్ధాలు తలుచుకుంటుంటేనే కడుపులో దేవినట్లయింది. అయినా మరేం మాట్లాడకుండా ఏమీ అడగకుండానే పడుకుంది కళ్ళు మూసుకుని.
