Previous Page Next Page 
స్రీ పేజి 16

 

                                  

    రఘు మొహం చూస్తుంటే జరిగిన సంగతంతా రఘుకు తెలుసో, తెలీదో అంతు పట్టలేదు పార్వతికి. రఘు ఎప్పుడూ అలా ముభావంగానే ఉంటాడు. ఎప్పుడూ అంత నిశ్శబ్దం గానే కూర్చుంటాడు. ఎప్పుడూ అదే నిర్లిప్తత తో చూస్తుంటాడు. అలాగే మాములుగా గడప లో కాలు పెట్టి గదిలోకి వచ్చాడు.
    పార్వతి క్షణం సేపు ఏమీ పాలుపోని దానిలా ద్వారం పట్టుకు నించుంది. పిల్లలూ, తండ్రీ బడికి వెళ్ళారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆశగా ఎదురుచూస్తున్న చూపులకు రఘుపతి కన్పించనే కన్పించాడు. "కూర్చో రఘూ!' అతి కష్టం మీద కంఠం పెగల్చుకోగలిగింది.
    రఘుపతి కూర్చోలేదు. పార్వతి మొహం లోకి తదేకంగా చూస్తూనే ఉన్నాడు.
    ఎలా మాటలు పెంచాలో, అసలా ప్రసక్తి ఎలా తీసుకు రావాలో బొత్తిగా పాలుపోలేదు పార్వతికి. తనూ నిశ్శబ్దంగానే గుమ్మాన్ని అనుకుని నిలబడింది.
    "పారూ!"
    "ఏమిటి రఘూ" ఆసక్తిగా చూసింది పార్వతి.
    "మాస్టారు నీతో ఏమైనా చెప్పారా, పారూ?"
    "ఎవరూ? మా నాన్నా? నాతోనా? ఏ విషయం గురించి?"
    రఘూ చూపుల్లో ఆందోళన తొణికిసలాడింది. "అదే.....అదే , పారూ ! రాత్రి మా నాన్నదగ్గరికి వచ్చి ఏదో మాట్లాడారుగా? నీకేమీ చెప్పనే లేదా?"
    "రఘూ!" విస్మయంగా చూసింది పార్వతి. "ఈ సంగతి నీకూ తెలుసా?"
    కొంతసేపు ఊరుకుని అన్నాడు రఘు" తెలిసింది , పారూ!"
    పార్వతి రఘూ మొహం కేసే చూస్తూ అంది. "నిన్న నాన్న చెప్తే నేను పూర్తిగా నమ్మనే లేదు. రఘూ! మామయ్య.....వేరే సంబంధం.....నిజమే నన్న మాట?"
    పార్వతి చూపులు తప్పించుకుంటూ దోషిలా తల తిప్పుకున్నాడు రఘుపతి. "వాళ్ళ ఉద్దేశాలేమిటో నాకు అర్ధం కావటం లేదు, పారూ? మొత్తంగా అమ్మా, నాన్న ఇది వరకు చెప్పిన మాటలు మరిచి పోయినట్టే ఉంది."
    "మరిచి పోవటం కాదులే, రఘూ! మరిచి పోయినట్టు నటిస్తున్నారను. కానీ, ఇన్నాళ్ళూ అలా మాట్లాడిందంతా హస్యమేనా?"
    హాస్యానికీ, వాస్తవానికి సంబంధం ఏమీటంటుంది అమ్మ. అత్తయ్య పోవడంతో తన ఉద్దేశం మార్చేసుకున్నట్టుంది. నాన్న మొన్న ఊరు వెళ్తే, బంధువు లెవరో బలవంతం చేశారని, మాట యిచ్చి వచ్చానని అమ్మతో చెప్తున్నాడు."
    పార్వతికి చిరాకు వేసింది. "ఇంతకీ నీ ఉద్దేశ్యం ఏమిటి?" అని తేల్చి అడిగేయాలనిపించింది. అంతలోనే అమాయకంగా ఇంటి విషయాలు తనతో చెబుతున్న రఘును చూస్తె అభిమానం పొంగి వచ్చింది. "రఘూ! అత్తయ్యా , మామయ్య ఆనాడు వాళ్ళ కై వాళ్ళే ఈ ఆశ కలిగించారు. ఈనాడు వాళ్ళే దాన్ని చెదర గొడుతున్నారు. వాళ్ళని విమర్శించే హక్కు మా కెందుకుంటుంది? కాని, రఘూ! నిండు జీవితాలతో ఇలా చేలగాటాలాడగలరని నాన్న కూడా అనుకోలేక పోయాడు. ఆయనీ నిరాశలకి తట్టుకోలేకుండా ఉన్నాడు."
    రఘు నసుగుతూనే అన్నాడు."మాష్టారేదో పొలం మాట.....
    "రఘూ! మీ సిరిసంపదల ముందు ఈ దరిద్రులు యివ్వబోయే కట్న కానుకలు ఏ పాటివి? నాన్న భ్రమే కాని దానికి మామయ్య అంగీకరిస్తాడని నేను అనుకొనే లేదు."
    "ఎక్కువా? తక్కువా? అన్న ప్రశ్న కాదు, పార్వతీ! అదో ఆచారం. కట్నం తీసుకున్నామంటే పెద్ద వాళ్ళతో తృప్తి!"
    విస్మయంగా చూసింది పార్వతి. రఘేనా మాట్లాడుతున్నది? తనను ఓదార్చి అక్కున జేర్చుకుంటాడని పుట్టెడు ఆశ పెట్టుకున్న రఘేనా?
    "నాన్న ఒప్పుకుంటాడను కుంటాను పారూ."
    "ఎలా/ పొలం అమ్మి డబ్బు యిస్తేనా? ఇంత తక్కువ డబ్బుకేనా? నా దారి నేను చూసుకుంటే .... అసలే తల్లి లేని వాళ్ళు..... పసివాళ్ళు..... రుక్మిణి, సూర్యం...."
    "వాళ్ళు మనకి పరాయి వాళ్ళా, పారూ? ఎలాగైనా ఈ పెళ్ళి జరిగిపోతే."
    హేళనగానే నవ్వింది పార్వతి. "ఎలా జరుగుతుంది? జరగాలనే కోరిక ఉండవలసిన వాళ్ళకే లేనప్పుడి పెళ్ళి ఇంకెలా జరుగుతుంది?"
    "నన్ను క్షమించు, పారూ! పెద్ద వాళ్ళ వ్యవహారంలో ఎలా జోక్యం కలుగజేసుకోవడమో అర్ధం కావడం లేదు. నాన్న బొత్తిగా పట్టూ విడుపు లేని మనిషి. అమ్మ అయినా నా మాట వింటుందని నమ్మకం లేదు. నేను వాళ్ళిద్దర్నీ ధిక్కరిస్తే ఏమైనా బావుంటుందా?"
    "ఏమీ బావుండదన్న మాట నిజమే! బొత్తిగా బావుండదు. నువ్వు మాత్రం ఎలా చెయ్యగలవు? నువ్వు మాత్రం ఏం చెయ్యగలవు? నీ చేతిలో ఏమీ లేదు. నీ వివాహం, నీ జీవితం నువ్వు నిర్ణయించుకోలేవు. నిన్ను కనీ పెంచిన పెద్దలకే అలాంటి హక్కులన్నీ ఉన్నాయి. అవును, నువ్వు నీ పెళ్ళి వ్యవహారంలో కలుగజేసుకోకూడదులే , రఘూ!"
    "నీకు కోపం వచ్చిందా, పారూ?"
    "కోపం! నాకా? ఎవరి మీదా/ దేవుడి మీదా? తాహతు కి తగని కోరికలు కోరుకుని అవి తీర్చలేదని భగవంతుడి మీద కోపం?"
    "నువ్విలా మాట్లాడుతుంటే నేనేమీ చెప్పలేను. ఆ పొలం అమ్మి..... మరి కొంత అప్పుచేసైనా ఈ పెళ్ళి జరిగేలా చూడు, పారూ! తర్వాత అవసరాలన్నీ మనం చూసుకుందాం. నువ్వెంత నిష్టూరంగా మాట్లాడినా ఇప్పుడు నా చేతిలో ఏముంది?"
    పార్వతి శరీరం ఆపాదమస్తకం భగ్గుమంది. పిచ్చి ఆవేశం కట్టలు తెంచుకుంది. "వీల్లేదు రఘూ, వీల్లేదు. ఈ పెళ్ళి జరగనే జరగదు. నేను గర్భ దరిద్రురాల్ని. నీ సాహచర్యానికి ఎంత మాత్రం తగను."
    "పార్వతీ!"
    దుఃఖం పెల్లుబికి వచ్చింది పార్వతికి. "అందని పళ్ళకి అర్రులు చాచటం అవివేకం అని ఇప్పటికి పూర్తిగా అర్ధమైంది."
    "క్షమించు పారూ! నన్ను పూర్తిగా అపార్ధం చేసుకుంటున్నావు."
    "నేనే నీ క్షమాబిక్ష అర్ధిస్తున్నాను. మీ ఇంటి కోడలిగా మీ భోగ భాగ్యాలకి వారసురాలిగా ఐ దౌర్భాగ్యురాలు తగదు , రఘూ! తగదు. నీ తల్లి దండ్రుల కోరిక తీర్చాల్సిన ధర్మం నీ మీదఉంది: అన్ని విధాల నీకు తగిన పిల్లని నిర్ణయించుకో."
    "పారూ! ఆవేశ పడుతున్నావు., నాకు తగిన పిల్ల మరెవరో అయితే ఈ ఆరాటం నాకు లేకనే పోయేది. నన్ను నమ్ము. మీ నాన్న ఉద్దేశ్యానికి అడ్డు చెప్పకు. ఈ పెళ్ళి ఎలాగో జరిగి పోనీ!"
    "రఘూ, ఒక్క రూపాయి కట్నం తీసుకుని నువ్వు ఔదార్యం ప్రకటిస్తానంటే అది కూడా ఇవ్వనివ్వను. నా తల్లి రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళకి నేను అన్యాయం చెయ్యలేను. వాళ్లకి లేని ఏ భోగ భాగ్యాలు నాకు అవసరం లేదు. ఎవరి దయా ధర్మాల మీదో ఆధారపడి ఉండే ఖర్మ వాళ్ళకి రానివ్వను. క్షమించు రఘూ! ఇక నువ్వు వెళ్ళిపో."
    రఘు పార్వతికి దగ్గరగా వచ్చి నిలబడి ఆవేదనగా మొహంలోకి చూశాడు. "వెళ్ళి పొమ్మని ఎంత తేలికగా చేప్పగలిగావు పారూ! ఈ మాట నువ్వు మనస్పూర్తిగానే అన్నావా? ఏదీ? ఒక్కసారి నా మొహంలోకి చూసి మళ్ళీ చెప్పు. నా స్థితి అర్ధం చేసుకోగలిగితే ఇంత నిర్దయగా మాట్లాడుతావా? నాన్న గొప్ప నాన్నకి కావాలి. అమ్మ వేడుక అమ్మకి జరగాలి. నా మీద ఆ యిద్దరికీ సర్వాదికారాలూ ఉన్నాయి. నేనేమీ చెయ్యలేక పోతున్నాను. ఏదీ నిర్ణయించుకోలేక పోతున్నాను. మాస్టారు మరొక్కసారి అమ్మనైనా అడిగితె ఏమైనా ప్రయోజనం ఉంటుంది. నన్ను నమ్మలేవా, పారూ?"
    "రఘూ! నీకు కోటి నమస్కారాలు! నీ అనురాగాన్ని నేనెన్నడూ శంకించ లేదు. మనిషి సుఖించటానికీ, అనుభవించటానికీ అనురాగం ఒక్కటే చాలదు. ఈ దౌర్భాగ్యురాల్ని ఇంతమాత్రమైనా జాలి పటుతున్న నీకు జన్మజన్మలా కృతజ్ఞతతో ఉంటాను. ఇక మన పెళ్ళి ప్రసక్తి తేకు. అది జరగని పని. నీ ఉద్దేశ్యం మార్చుకో రఘూ!"
    "పా....ర్వ....తీ!" నిర్జీవంగా నించుండి పోయాడు రఘుపతి ఎంతో సేపు. పార్వతి ద్వారా ద్వారానికి తల అన్చుకోంది.
    
                                  *    *    *    *
    సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన దగ్గర నుంచి తండ్రి బయటకు వెళ్తాడేమోనని కనిపెట్టుకొనే ఉంది పార్వతి. కను చీకటి పడుతుంటే రెండు మూడు సార్లు రోడ్డు మీదికి వెళ్ళి తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ మళ్ళా ఇంట్లోకి వచ్చారు మాస్టారు. అయన భుజం మీద తువ్వాలు వేసుకోకుండానే తిరగటంతో రోడ్డు మీదికే తప్ప ఎవరింటికి వెళ్ళే ప్రయత్నం లేదని ఊరుకుంది.
    అన్నం తిని లేస్తూనే మళ్ళా వీధిలోకి తొంగి చూశాడు మాస్టారు. "మామయ్య ఇంకా వచ్చినట్టు లేదమ్మా! షెడ్డులో కారు లేదు."
    పార్వతి అనుమానం నిజమే అయింది. క్రిందటి రాత్రి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, చలపతి రావు ఏమన్నాడో ఆ కబుర్లెం తండ్రి చెప్పనూ లేదు. పార్వతీ అడగనూ లేదు. తండ్రి మళ్ళా ఎందుకు ఎదురు చూస్తున్నాడో కూడా అర్ధం కాలేదు. కాస్సేపు ఊరుకుని తండ్రే అన్నాడు. "మామయ్యా ఒప్పుకుంటాడనే అనుకుంటున్నా నమ్మా! నిన్న చెప్పిందంతా వింటూ ఊరుకున్నాడు. మళ్ళా ఒక్కసారి అడిగి వస్తాను. రేపు ఆ పొలానికి బేరం పెట్టేయ్యమని రైతుకి వ్రాస్తాను. అవును. అమ్మకపోతే ఎలా అవుతుంది?" కంగారు కంగారుగా మాట్లాడుతున్న తండ్రిని చూస్తుంటే పార్వతి హృదయం ద్రవించినట్టయి పోయింది. నెమ్మదిగా దృడంగా అంది: "ఇక ఈ ప్రసక్తి మానుకో నాన్న! మామయ్య ఎలాగూ ఒప్పుకోడు. వాళ్ళు ముష్టి వేసినంత లేని ఈ కట్నం పుచ్చుకోటానికి చిన్న బుచ్చుకుంటారు కూడాను. వాళ్ళ అంతస్తూ, వాళ్ళ మర్యాదలూ వాళ్ళకి ఉంటాయి కదా, నాన్నా! ఈ మాట నేను రఘూ తో కూడా చెప్పేశాను."
    విస్మయంగా చూశాడు తండ్రి. "రఘూ తోనా? ఎప్పుడోచ్చాడు? పెళ్ళి మాటలేమైనా ఎత్తాడా? ఏం మాట్లాడాడు?" ఆత్రుతగా మాట మీద మాట అడుగుతుంటే పార్వతి నిదానంగానే చెప్పింది. "మొదటి నుంచీ రఘూ తత్వం మనకు తెలుసు నాన్నా! ఇవ్వాళేం కొత్త కాదు. తన ఇష్టాఇష్టాలు తీర్చుకునే సమర్ధత కూడా రఘుకి లేదు. అతని ఉద్దేశం తెలుసుకున్నాక నా భ్రమ పూర్తిగా పోగొట్టుకున్నాను. ఇక ఈ పెళ్ళి జరగదు. అనవసరంగా నువ్వు ప్రయాస పడకు నాన్నా!
    పార్వతీ! ఏమిటమ్మా నువ్వు అంటున్నది? రఘు పతేమన్నాడసలు? అతనికి....నువ్వంటే ఇష్టమే ననుకుంటాను."
    "ఇష్టం లేకపోలేదు. అంతమాత్రాన అతనేం చెయ్యలేడు. అతన్ని అనుకోని కూడా ప్రయోజనం లేదు. మొత్తంగా బ్రహ్మ వ్రాత మరోలా ఉందను కుంటే సరిపోతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టనూ వద్దు. మనం అవమానాల పాలు కానూ వద్దు. ఇక ఈ పెళ్ళి మాటే మరచి పోదాం. నాన్నా! నేనేదైనా ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను."
    బొత్తిగా అర్ధం కానట్టు చూశారు మాష్టారు.
    "ఇందులో ఆశ్చర్యం ఏముంది , నాన్నా? నేను ఉద్యోగం చేస్తూ సూరిని చదివిస్తాను. రుక్కు కి పెళ్ళి చేస్తాను. నీకు సాయంగా ఉంటాను. ఇవ్వాళ్ళంతా ఇదే ఆలోచించాను నాన్నా!"
    "పార్వతీ! నీకేం పిచ్చి గాని పట్టిందా?"
    "ఏం నాన్నా? నేనేం తప్పుగా మాట్లాడుతున్నానా? మన అవసరాల కోసం కష్టపడి డబ్బు సంపాదించడం చిన్నతనమా? ఈ కాలంలో ఎంతమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చెయ్యటం లేదు?"
    "వద్దు, పారూ , వద్దు. నీకా ఖర్మే వద్దు. మామయ్య కాళ్ళా వెళ్ళా పడి నిన్ను రఘు బాబు కిచ్చి పెళ్ళి చేస్తాను. తర్వాత పిల్లలిద్దర్నీ నేనే చూసుకుంటాను."
    పార్వతి మొహం కోపంతో ఎర్రబడింది. "నాన్నా! నువ్వే కాదు. సాక్షాత్తూ భగవంతుడు దిగివచ్చి ఆదేశించినా ఈ పెళ్ళి చేసుకోను. నేను కావాలని పట్టుదల లేని మనిషితో జీవితం గడప లేను. తండ్రి ప్రేమతో నా కలాంటి అన్యాయం చెయ్యకు. ఎవరి దయాదాక్షిణ్యాలు మనకి అక్కర్లేదు. ఏ అయ్యా కాళ్ళూ పట్టుకుని దేవుళ్ళాడవద్దు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS