"నా శాపం వృథా కాలేదు. ఈ తృప్తి నాకు ఉంటుంది. నేనూ మనిషినే. నాలోనూ ప్రతీకారం పరవళ్ళు తొక్కుతున్నది. ప్రేమించడం ఎంత చేస్తామో ద్వేషించడం అంతకు రెట్టింపు చేస్తాం. విష్ణును నువ్వు చేసుకుంటానంటే నిండు మనసుతో అభినందించాను. ఆయనకు మారు పేరుగా నిన్ను ఆకాశానికెత్తుకున్నాను. ఇటువంటివి భరించడం ఎంతటివారికి సాధ్యం? నిన్ను కని అక్కదగ్గర వదిలేసి వచ్చాను. తిరిగి అన్నేళ్ళకు అక్క దగ్గరకు వచ్చాను. నీ ప్రతి కదలికా నన్ను చిత్రహింస చేసేది. నువ్వు నవ్వుతున్నా, నీకు మార్కులు ఎక్కువ వచ్చినా నా మనసు చిందులు తొక్కేది. ఈ సంఘర్షణలో రవిబాబుకు అన్యాయం జరుగుతుందేమోనని భయపడేదాన్ని. నిజంగా అమ్యకుడు వాడే. వాడికి కావలసింది అమ్మ. అంతే. అందుకే వాడిని దూరంగా ఉంచ ప్రయత్నించలేదు.
"చిన్నప్పటినుంచీ దురదృష్టవంతురాల్నే నేను. కన్నకొడుకును కౌగిట్లో బంధించేఅదృష్టం నాకు లేదు. నీ అమాయకత్వాన్ని చూస్తూంటే ఆనాడే ఎందుకు చనిపోలేదా అనిపించేది. నిన్ను నా పాపానికి ప్రతిఫలంగా ఊహించుకొంటే ఈ బాధ ఎలా వర్ణించగలను?
"ఆయన పొద్దస్తమానూ మీ ఇద్దరిలోనూ ఐక్యం అయిపోయి రాత్రి నన్ను నిష్కల్మషంగా కౌగిట్లోకి చేర్చుకొంటూ ఉంటే ఆ పవిత్ర హస్తాలకు నా తాలూకు కళంకం ఎంత ముట్టజెప్పుతున్నానో అని కుమిలిపోయేదాన్ని. అప్రయత్నంగా 'భగవాన్! నన్ను క్షమించు' అనుకొనేదాన్ని. ఎప్పుడో చేయవలసిన పని ఇన్నేళ్ళకు చేస్తున్నాను. ఈ విషయం రవికి తెలియనీయకు. వాడు వాడి తల్లి కన్నా కవలల్లో ఒకడుగా ఊహించుకొంటున్నాడు. ఎన్నేళ్ళు అయినా వాడిది పసి హృదయమే. లేత హృదయాన్ని గాయపరచకు.
"ఈ పరిస్థితిలో ఇంకా ఈ భూమిమీద చేసిన తప్పు ఒప్పుకొంటూ బ్రతకలేను. విష్ణును నువ్వెలా చేసుకోగలవు? నీ జన్మకారకుడైన ఆ శ్రీధర్ కు కూతురవడం విష్ణు దురదృష్టం. మీ నాన్నగారి సన్నిధిలో ఇంకా ఎన్ని పాపాలు చేయగలను! నా పాపాలకు ప్రాయ శ్చిత్తం కావాలి. చాలు, నేను జీవితంలో అలిసిపోయాను. నాకు ఇప్పుడిప్పుడే మైకం వస్తు....న్నా....ది.
అ....మ్మ..."
"అమ్మ!" నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. తను....తను. ఎంత దురదృష్టం! ప్రపంచంలో తండ్రిపేరు తెలియకుండా పుట్టడం ఎంత నీచం! తనిప్పుడు లాయర్ వేణుగోపాల్ కొడుకు. సంఘంలో పుష్కలంగా డబ్బూ, హోదా, పరువూ, ప్రతిష్టా ఉన్నమనిషి. కానీ నిజం ఆలోచిస్తే? కాలుజారిన అమాయికురాలి మహాపాపం తను.
భగవాన్ కర్ణుడంతటి వాడికే లభ్యం కాలేదు ప్రతిష్ట తనో లెక్కా? నాన్నగారు ఇంకా అమాయకత్వం లోనే ఉన్నారు. కాకపోతే తనను అవధానిగారి కొడుకన్న విశ్వాసంతో పెంచి పెద్ధజేశారు. కానీ ఇప్పుడు - అనేక యాదృచ్చిక సంఘటనలలో తన చెల్లెలి భర్తకూ తన భార్యకూ....నాన్నగారు భరించగలరా?....ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.
తను చదివిన ట్రాజెడీస్ అన్నిటిలో ఒకే కథ తనను కుదిపేసింది. ఆ రోజంతా బాధలోనే ఉండిపోయాడు.
దేశాంతరాలు తరలివెళ్ళిన కొడుకు స్వయంవరంలో మిగతా రాజులతోబాటు ఆహ్వానాన్ని అందుకొని వస్తాడు. ఏ దుష్టశక్తో తల్లిచేత ఎన్నుకొనేట్లు చేస్తుంది. కొన్నాళ్ళ తరవాత ఆ విషయం బయటపడుతుంది.
తను ఇంత పతనమైపోవడనికి కారణం ఉర్రూత లూగించే ఆ అందం అని గ్రహిస్తాడు కొడుకు. తను వేటి ఆధారంగా తనకు తాను నాశనమై తల్లిని కామవాంఛలకు బలిచేస్తాడో ఆ అపూర్వ జ్యోతుల్ని కాలేకాలే సూదులతో ఆర్పేసి అంధుడైపోతాడు.
అటువంటివి నిజమా?! అని ఆశ్చర్యపోయాడు. మరి ఇప్పుడో?
లోకంలో అనేకమైన తప్పులు ఎంతోమందిచేత చేయబడుతూ ఉంటాయి. కాని మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అయితే ఈ విషయం తనకు అంతర్గతంగా ముందే తెలుసు.
పుస్తకాలలో చదివినట్లు విష్ణు తనను ముట్టు కొన్నప్పుడుకానీ, పలకరించినపుడుకానీ తన రక్తం విజ్రుంభించుకొని కట్టలు తెంచుకోలేదు. విష్ణు స్పర్శలో తనేమీ తీయదానాన్ని పొందలేదు. అసలు విష్ణు తన చేతిని తీసుకొన్నప్పుడు మృదువుగా రవి స్పర్శించినట్లే అనిపిస్తే తను చలనరహితంగా ఉంటున్నట్లు అనుమాన పడ్డాడు. నిజం ఆలోచిస్తే విష్ణులో పొంగిపోయే ఆ రక్తం తనలో ఉన్నదని ఎలా తెలుస్తుంది?
అమ్మ ఆనాడు బావిదగ్గర విపరీతంగా దుఃఖిస్తూ ఉంటే కారణాన్ని నొక్కినొక్కి అడగలేని విచిత్రావస్థలో ఉండిపోయాడు. రవి పూజగదిలో తల్లిని ఓదారుస్తూంటే అది తెలుసుకొని తన తల్లి మాతృప్రేమ కోసం తహతహలాడుతూందనుకొన్నాడేగానీ, నిశ్చలంగా సాగిపోయే ఆవిడ జీవితంలో తన ప్రతి కదలికా విషసర్పంలా కాటేస్తూ ఆలోచించలేదు.
విష్ణును అమ్మ చేసుకోమన్నప్పుడు ఆవిడ కృతజ్ఞతకు తను అభినందించాడే గానీ ఆవిడ అంతరార్ధపు లోతుల్ని కొలవలేకపోయాడు. తన భర్త, సవతికొడుకు పట్ల చూపుతున్న త్యాగానికి పరిహారంగా తననే ఆజ్ఞాపించిందని అనుకోలేదు. అసలు తను ఏదీ ఆలోచించలేదు. మామూలుగా, అమాయకంగా అందరిలాగే తనూ పెరిగాడనుకొన్నాడు. అదే తను చేసిన పొరబాట్లలోకల్లా పెద్దది.
"ఏమిటి, బావా, వట్టి నేలమీద కూర్చున్నారు?" భారతీదేవి గదులన్నీ సర్దుతూ ఆ గదిలోకి వచ్చి రామును ఆ విధంగా చూసి ఆశ్చర్యంలో ప్రశ్న వేసింది.
నిట్టూర్చాడు రాము. తల దించుకొని కాగితాల్ని చేతిలో పట్టుకొని వరండాలోకి వెళ్ళిపోయాడు.
తను కనిపిస్తే సంతోషంగా పలకరించే రామును చూసి మరింత ఆశ్చర్యపోయింది భారతీదేవి.
పుస్తకాలన్నీ సర్ది, బట్టలు మడతలు పెట్టి పని కానిచ్చుకొని, పిల్లవాడిని రాముకు ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
"బాబా, నానమ్మ ఏదీ?" రాము చేతులమీద ఉన్న బాబు షర్టు గుండీలను తీస్తూ పెడుతూ అడిగాడు.
"ఆఁపోయింది బాబూ!" రాము సమాధానం ఇచ్చాడు.
"నాన్నగారు కూడా ఆఁపోయారు!" బాబు చేతులు చాపి దూరంగా చూపించాడు.
"ఛ! తప్పు బాబూ నాన్నగారు ఆఫీసుకు వెళ్ళారు. మళ్ళీ వస్తే మనం అందరం కలిసి రైలెక్కి 'కూ' పోదాం." రాము పిల్లవాడితో ఆటల్లో మునిగిపోయాడు.

* * *
పొగాకు పైపులో దట్టంగా కూరుకొని నిప్పు వెలిగించాడు వేణుగోపాల్. అది ఎంతకూ అంటూకోవడం లేదు. నెమ్ముకున్నట్లుంది.. వెలిగించి, వెలిగించి విసిగిపోయాడు. పక్కనే కూజాలో నీళ్ళు అయిపోయాయి. భారతీదేవి తెచ్చిన నీళ్ళన్నీ ఇంచుమించు వేణుగోపాల్ తాగడానికే సరిపోవడం లేదు. భారతి బలవంతాన చచ్చిపోయి ఎంత పిచ్చిపని చేసింది!
తండ్రికి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు రాము. రవి కాంప్ కు వెళ్ళినప్పటినుంచీ ఇల్లు మరీ చిన్న బోయింది. భారతీదేవి పిల్లవాడిని పడుకోబెట్టి సన్నగా జోలపాట పాడుతున్నది. పదేళ్ళపిల్లల్ని మంచంమీద పడుకోబెట్టి ఎప్పుడూ ఆ పాటే పాడేది. ఇప్పుడు భారతీదేవికూడా అదే పాడుతూంది. "దిన దినము పాపణి దీవించిపొండి......" దేవలోకంలో ఉన్న దేవతలు నిజంగానే దీవించారు.
"మీ అమ్మ వట్టి పిరికిదిరా, రామా బ్రతకలేక చచ్చిపోయింది."
నవ్వాడు రాము. "మీరెంత అమాయకులు, నాన్నగారూ' అన్నట్లు ధ్వనిస్తూందా నవ్వు.
"ఇంటి ఆడపిల్లను సహృదయతతో క్షమించ గలిగే శక్తి అవధానిగారికి ఉంది. ఆయన విషయాన్ని దాచారు. ఎవరైనా అదే చేస్తారు ఆ స్థితిలో. నా స్నేహితులు ఎంతోమంది విషయం చెప్పి వద్దని వారించారు.
"ఇటువంటి కేసులెన్నో చూశాను నేను. ఆనాడు నువ్వన్నట్లే నేనూ అనుకొన్నాను. స్త్రీ పురుషుణ్ణి సహించినపుడు స్త్రీని ఎందుకు క్షమించకూడదూ అనుకొన్నాను. అయినా మీ అమ్మను చూసిన ఎవరైనా వట్టి చేతులతో తిరిగివస్తార్రా?"
"నాన్నగారూ!" రాము స్వరంలో ఆశ్చర్యం.
"ఎందుకురా ఆశ్చర్యం? మనిషై పుట్టాక ఏదైనా ఒక సత్కార్యం చేస్తే జన్మ సార్ధకం కాదూ? నేను చేసిన పొరబాటల్లా ఒకటే- ఈ విషయాలన్నీ నాకు తెలుసనే సంగతి మీ అమ్మకు చెప్పకపోవడం. ఈ విషయాలు నాకు తెలుసు అని చెప్పేస్తే దాన్ని ఏదో కించపరిచానని అనుకొంటుందని బాధపడ్డాను. లేకపోతే నాతో చివరి మజిలీవరకూ ప్రయాణం చేసేదేమో......
"మీ అమ్మ నీకు ఉత్తరం రాసినప్పటినుంచీ తప్పుకు తిరుగుతూనే ఉన్నావు. నీ బాధ నాకు అర్ధం అయింది. మరి నా బాధ ఎవరికి చెప్పుకోను? ఇది చూడు!" నలిగిన కోటులో చిన్న భరిణెలో ముడుచుకుపోయిన ఉత్తరం తీసి అందించాడు.
"వద్దు, నాన్నగారూ!" సంశయంగా చూశాడు రాము.
"ఫరవాలేదు. తీసుకో." అందిస్తూ చూశాడు కొడుకువైపు వేణుగోపాల్ రాముకు తనతోబాటు వ్రాసే ఉంటుందని అలా అన్నాడు.
"పూజ్యులు మీకు,
నమస్కారాలతో భారతి వ్రాయడం.
భగవంతుడు నా నొసట వ్రాసిన ఆ లిఖితాన్ని అనుభవించాను, అడుగడుగునా మిమ్మల్ని మోసం చేస్తూ. రాము, కన్యగా ఉన్న రోజుల్లో నేను కన్నబిడ్డ. మీరు న్యాయామూర్తులు మీ భార్య తప్పును మన్నించి ఆమె చిహ్నంగా రామును ఏం చేస్తారో నా ఊహ కందనిది. విష్ణును రాముకిచ్చి వివహం చేయకండి. కారణం గ్రహిస్తారని తెలుసు నాకు. ఇక నాకు జీవించాలని లేదు. మిమ్మల్ని క్షమించమని అడిగి నాటకం ఆడలేను. అమాయకులైన మిమ్మల్ని మోసం చేశానని చిత్రవధ అనుభవించాను. ఉంటాను.
-భారతి."
"మీరు ఇన్నాళ్ళూ ఇంత రహస్యం ఎలా దాచుకొన్నారు?" చిత్రంగా చూస్తూ అడిగాడు రాము.
వేణుగోపాల్ మాట్లాడలేదు.
రాము మనస్సు తండ్రిమీద పూజ్యభావంతో నిండిపోయింది.
* * *
"బావకు,
నమస్కారాలతో విష్ణు నువ్వు ముందే ఎందుకు గ్రహించలేదు? నీకు తెలియదా, బావా, ఇటువంటి విషయాల్లో ఎంతో ధైర్యం వహించాలని? నిన్ను మొదటినుంచీ దగ్గరరగా వచ్చి దూరం చేసుకొంటున్న దురదృష్టవంతురాలను.
ఎమ్.బి.బి.ఎస్, చదివాను పేరుకే. నాకు శక్యం కాలేదు నాలోని అసమర్ధతను పోగొట్టుకోవడం. గాజుపెంకును వజ్రం అనుకోని భ్రమించి మోసపోయాను. ఫలితం అనుభవిస్తున్నాను. నాకు లేని ఆశలు కల్పించావు. బ్రతుకుమీద మమత పెంచావు. నిద్రపోతున్న మాతృ ప్రేమను రెచ్చగొట్టావు. ఇన్ని విధాల నన్ను నలుగురిలో హేళన చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నావా, బావా?
ఒకసారి నీ పురుషహృదయాన్ని తెరిచి చూడు. నాలో మీ అమ్మ, భారతీదేవి మొదలైన నీ ఆప్తులు కనిపించకపోరు. ప్రతి పురుషుడూ మరో స్త్రీకి తన స్వంత సోదరికి ఇచ్చిన విలువా గౌరవమూ ఎందుకు ఇవ్వడు, బావా? నా దురదృష్టపు ఘడియలు అంత కంతకు దగ్గర అయిపోతున్నాయి. గుక్కెడు ప్రాణం తీసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తున్నది. నీకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను.
-విష్ణుప్రియ."
ఈ విడివడని సమస్యకు దూరంగా పారిపోవాలనిపిస్తూంది రాముకి. అమ్మ ప్రతిష్ట కాపాడాలంటే తను నిజం దాచాలి. నిజందాస్తే పిరికివాడంటుంది. మోసగాడంటుంది. ఏదోవిధంగా తప్పించుకొంటున్నానని నిందవేస్తుంది. చేదునిజంకన్న ఈ విధంగా నిన్దనే భరిస్తే ఏం? మనసు ఎదురు తిరిగింది. అదే నిజమైతే భర్తగా ఆరాధించే విష్ణుహృదయంలో శాశ్వతంగా తన ముద్ర పడిపోతుంది.
* * *
"శ్రీధర్ పిరికివాడు కనకనే అలా చేశాడు. నిజం తెలియక విష్ణు ఎంత బాధపడుతుంది! తను చేసిన పనికి నలుగురినీ పిలిచి అయినవాళ్ళం మనమే తనను హేళన చేస్తున్నాం అనుకొంటుంది. తనమీద తను అసహ్యం పెంచుకుంటుంది. జరిగింది చెప్పేయి. నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలికోసం ఏమైనా చేయక తప్పదు. నా మేనకోడలు, నిజమే. కానీ నేను ప్రస్తుతం చేయగలిగేది లేదు. విష్ణుని చెల్లెలుగా గౌరవించి, పెంచిన తండ్రి అవధానిగారిని నీలోనూ చూపించు." వేణుగోపాల్ కొడుకు సమస్య పరిష్కారం చేశాడు.
* * *
బట్టలు సర్ది ప్రయాణమయ్యాడు రాము. రెండు గంటల ప్రాంతంలో నాగార్జునసాగర్ చేరుకొన్నాడు. హాస్పిటల్లో ఒంటరిగా ఓ మూల పడుకొని దూరంగా కొండల నీడల్లోకి విషాదంగా చూస్తూంది విష్ణుప్రియ. బ్రతుకంతా నిస్సారమై తను కట్టిన గాలి గోపురాలు పైపైకి తేలిపోతూంటే, తను నిర్మించిన ఆశాసౌధాలు భూమిలో కూరుకుపోతూంటే, తన ప్రణాళికలు బద్ధలౌతూంటే కళ్ళప్పగించి చూడడం తప్ప మరేం చేయలేని అసహాయస్థితిలో నిర్జీవంగా ఉండిపోయింది విష్ణుప్రియ.
