ఆమె కళ్ళల్లో కలవరపాటును గమనిస్తూ "పసితనం లో బాగా దగ్గరగా, చనువుగా వుండే కొడుకు పడుచు వయసులో దూరమవుతాడు. కాని మళ్ళీ ఆ వయసు దాటి మధ్య వయసులో అడుగు పెడుతుంటే తెలియకుండానే దగ్గిరవుతాడు, కారణం పిల్లలు కూడా జీవిత సత్యాలు చాలా గ్రహించి ఒక మార్గంలో ఆలోచించగలగడమే!....
ఆ తరువాత ప్రభాకర్ ఎంత ప్రయత్నించినా సంభాషణ ముందుకు సాగాలేదు. కుసుమ మౌనం మూలంగా ...కాని ప్రభాకర్ కు ఆ సాయంత్రం చెప్పలేనంత సంతోషం కలిగింది. స్త్రీగా ఎన్నింటికి దూరమవుతున్నా, కుసుమలో సంపూర్ణ స్త్రీత్వం వుంది.... స్త్రీ మనస్తత్వం వుంది..... కేవలం పరదాల లాంటి భయం ఏదో ముసుగు వేస్తోంది. అవి తను తొలగించగలుగుతే ....తను కోరే ఆ స్త్రీ త్వానికి చేరువ కౌగలిగితే..... తేలికగా నిట్టూర్చాడు.
కుసుమ మాత్రం తన ఆలోచనలకూ అర్ధం వెతుక్కోకుండా ఉండలేక పోయింది. ఏమయింది తనకు. తనలో యీ మార్పు ఎలా వస్తోంది? యిదివరకు తనేప్పుడయినా యిలాంటివి ఆలోచించేదా? ప్రభాకర్ తో కలిసి వున్న దగ్గర నుండి తన మనసు ఏదో అశాంతి పాలవుతోంది. ప్రభాకర్ తో మాట్లాడుతుంటే ఎందుకో తనకు అతను భర్తన్న భావం కలగదు. ఆటను చూపే ఆప్యాయత, కేవలం స్నేహితుడి లా ఎప్పుడూ వెంటే వుండే అతన్ని చూస్తుంటే కొన్నేళ్ళు గా తనకి దొరకని దేదో దొరికినట్లని పిస్తుంది. చిన్నతనం నుండి చెప్పుకునేందుకు ఒక్క స్నేహితుడయినా లేని తనకు..... తన జీవితం లో తను దగ్గరగా లేని తనకు...... తన జీవితంలో తను దగ్గరగా వచ్చిన ఎవరైనా వుంటే ప్రభాకర్ ఒక్కడే, అమ్మ మాత్రం ... ఏదో హద్దులో.... మోచేతి దూరంలో ....ప్రభాకర్ చెప్పినట్లు ఒక బాధ్యతగా పెంచింది.
ప్రభాకర్ దగ్గర తనకింత చనువేలా వచ్చింది. తన సమస్యలన్నీ అర్ధం చేసుకుని సహకరించడం మూలంగానా.... అతని దగ్గర నుండి తను వెళ్ళిపోలేదేం?.... తన ఆరోగ్యం కోసం ఎంతో వేచి వున్నాడు. తానాలో అదే రాక పొతే....? తను ప్రయత్నిస్తున్నానని అతనికి ఎలా తెలుస్తుంది? ఏ పనైనా చెయ్యగలదు. వూహ లో కూడా భరించలేని బాంధవ్యాలకు తను ఎలా వప్పుకోగలదు? ఎంతయినా మగవాడు..... ఎంతకాలం యిలా.... ఏనాడయినా తన్ని బలవంతంగా.....
తనకి కూడా జీవితం కావాలి.... పక్షిలా ఎగిరి పోనీ శాశ్వత బంధాలు కావాలి. కాని తన చేతిలో ఏమీ లేదు. తను దేనికి అంగీకరించలేదు. ఏ సుఖాలను అందుకోలేదు. తన జీవితమంతా మోడులా.....తనతో పాటు ప్రభాకర్! బలవంతాన కళ్ళు మూసుకుంది కుసుమ. యింక ఆలోచించడానికి భయం వేసి.
ఆ రాత్రి మంచం మీద వాలిన ప్రభాకర్ ని రకరకాల ఆలోచనలు అతన్ని వదలలేదు.తనకి యిన్నాళ్ళు యీ మాత్రం ఆలోచన రాలేదేం..... కుసుమ ఎవరికైనా వుత్తరాలు రాసి వుంటుందని..... ఆమె యివాళ డబ్బు పంపి వుంటే నాలుగయిదు రోజులలో రిసీట్ వస్తుంది. ఆమె తల్లో..... ఆ డబ్బు అందుకుంది మరెవరైనా తెలుసుకోవచ్చు. కాని తరువాత?.....
కుసుమలో తానాశించే ఆరోగ్యం చేకూరక బ్రతుకంతా ఆమె స్వేచ్చను తను బంధించలేడు. తను బలవంతంగా కుసుమను దగ్గరకు తీసుకొని తిరిగి దూరం చేసుకోగలడా.
యీ కొద్ది నెలల్లో కుసుమ లో ఏంతో మార్పు వచ్చింది. తెలియకుండానే ఒకరి కొకరు దగ్గరయ్యారు. తిరిగి దూరమవడం అంటే అంత తేలికయిన పనా?... అసలు సాధ్యమవుతుందా తను ఎండుకిలాంటి పని చేశాడు? ఎందుకింత బలవంతం మీద ఆమె జీవితంలో కి ప్రవేశించాడు? ఆమె బ్రతుకంతా తను శాసించగలడా?"
అరికట్టలేని ఆలోచనలు దరి చేర్చకుండానే సతమతమవుతున్న నిద్రపోవడానికి వుపక్రమించాడు.
20
ఉదయమే మాములుగా ఆఫీసులో వచ్చిన వుత్తరాలు చూసుకుంటున్న ప్రభాకర్ అప్పుడే గుర్తుకు వచ్చినట్లు తలఎత్తి కాలెండరు వంక చూశాడు. ఆరోజు తారీఖు చూచి, చేతి వాచీ వంక టైము చూసుకున్నాడు. వెంటనే లేచి తలుపు దగ్గర వేసి బయటకు వెళ్ళాడు.
కారెక్కి సరాసరి పోస్టాఫీసు కు వెళ్ళాడు.
"మాధవి , కేరాఫ్ పోస్టు మాస్టర్ - వుత్తరాలే మయినా వచ్చాయా?" అడిగాడు ఎదురుగా వున్న క్లర్క్ ను . "ఎప్పుడూ ఆవిడే వచ్చి తీసుకు వెళ్ళే వారండి?' నసిగాడు కర్క్..
"అవును, యివాళ ఆమెకు వీలు కాలేదు," యింతలో పోస్టు మాస్టర్ బయటకు వచ్చాడు. ప్రభాకర్ ని చూడం గానే నమస్కారం చేస్తూ "ఏమిటి స్వయంగా వచ్చారు?" పలకరించాడు. సమాధానం కోసమయినా ఎదురు చూడకుండా పక్కనే వున్న క్లర్క్ వైపు తిరిగి "ఎమిటాలస్యం?" ఆయన్ని నిలబెట్టి పనులు చూసుకుంటున్నావు? ముందు ఆయనకు కావలసినవి చూసి పంపు" కోపంగా చూశాడు.

"యస్...సర్" అంటూ గబగబా వుత్తరాలు తీసి ప్రభాకర్ కు అందించాడు.
"థాంక్స్" అంటూ మరొక్కక్షణం వృధా చేయకుండా కారులోకి వెళ్ళాడు. ఆతృతగా వాటి వంక చూశాడు. అతనికి కావలసిన రిసీట్ కనిపించగానే గబగబా అటూ యిటూ తిప్పి చూశాడు. జేబులోంచి కాగితం తీసి ఎడ్రసు రాసుకుని మళ్ళీ అవన్నీ పోస్టు చేసి ఆఫీసుకు వెళ్ళాడు.
ఆరోజు అతని మనసంతా ఒకే విషయం మీద లగ్నమయి వుంది, ఆలోచనలను తప్పించి మరే పని మీద లగ్నం చేయలేక పోయాడు.
జేబులోంచి ఎడ్రసు తీసి దాని వంక చూస్తూ చాలాసేపు గడిపాడు.... "ఏమిటి చేయడం తను సరాసరి వెళ్ళి కలుస్తే ..? కలసి ఏం మాట్లాడతాడు. మొదలు చివర ఏమీ తెలియకుండా ఏం అడుగుతాడు?.... ఆవిడ మాత్రం ముక్కు మొహం తెలీకుండా తనను చూచి ఏం మాట్లాడుతుంది?.... ఆవిడని వెళ్ళి కలిసే లోపల కొన్ని విషయాలయినా తెలుసుకోవాలి? డాక్టర్ చెప్పినట్లు ఏ సంఘటన అయినా కుసుమ పరిస్థితి కి కారణం అయి వుంటే అది ఆవిడ ద్వారానే తెలియాలి? కాని ఎలా....." చాలా సేపు ఎటూ తేల్చుకోకుండా గడిపాడు. 'వూహూ ..... అంతకంటే తనేం చేయలేడు. ఏ ఒక్కరికీ తెలియకుండా యీ పనులన్నీ తన ఒక్కడి వల్ల జరగడం కష్టం. తను ఒకరి సహాయం తీసుకోకుండా జరిగే పని కాదు....' ఏదో నిర్ణయించుకుని వెంటనే యింటికి ఫోను చేశాడు.
"కుసుమా?"
"....."
"నేను"......యివాళ ఇంటి కొచ్చేటప్పటికి కొంచెం ఆలస్యమవుతుంది."
"కామేశ్వరరావు గారింటికి వెళ్ళాలనుకున్నాం."
"అరె!.... ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు ఫోను చేసి చెప్పు, రావడం కొంచెం ఆలస్యమవుతుందని. యివాళ ఒకళ్ళను కలుసుకోవాలి. చాలా ముఖ్యమయిన పని మీద."
"సరే?"అంది కుసుమ.
"నేవచ్చేటప్పటికి సిద్దంగా వుండు. రాగానే వెడదాం " ఫోను మూసేశాడు ప్రభాకర్. వెంటనే వస్తున్నట్లు యింకో స్నేహితుడికి ఫోను చేశాడు.
21
తను బయటకు వెడుతున్నానని రామకృష్ణ తో చెప్పి సరాసరి గోపాల్ ఆఫీసుకు వెళ్ళాడు ప్రభాకర్. గోపాల్ తండ్రి ఆ వూళ్ళో బాగా పేరున్న లాయరు. గోపాల్ కూడా అదే మొదలు పెట్టాడు.
వాకిట్లో ప్రభాకర్ ని చూడం గానే "వూరక రారు మహాత్ములు. ఏదో పనుంటే గాని చస్తే కనుపించవు." నవ్వుతూ స్వాగతం పలికాడు గోపాల్.
ప్రభాకర్ కూడా నవ్వుతూ "నీకు తెలియని దేముంది చెప్పు వూపిరాడనంతగా ఉంది నా పని" అన్నాడు.
"అవునవును ఇంట్లో శ్రీమతి గారితో -- బయట బిజినెస్ పనులు.... మీపార్టీకి తప్పకుండా రావాలనుకున్నాను. ఆరోజేదో అర్జంటు పని తగిలి తప్పించు కోవడానికి వీలు కాలేదు. దాంతో రాలేకపోయాను." అన్నాడు.
"చాలా నెలలకే సంజాయిషీ యిస్తున్నావు. కాని, నాకో ముఖ్యమయిన పని వుంది నీతో."
"ఆ విషయం తెలుసులే! ఫోను చేసినప్పుడే అనుకున్నాను. ఏమిటో చెప్పు." అన్నాడు సాలోచనగా.
ఎదురు గుండా వున్న పెద్ద కుషన్ చైర్ లో జారగిలబడి పైన సీలింగ్ వైపు చూస్తూ కొద్ది క్షణాలు గడిపాడు. ఉన్నట్టుండి లేచి నిలబడి జేబులోంచి ఓ కాగితం తీసుకుని గోపాల్ కు అందించాడు.
కాగితం అందుకుంటూ ప్రశ్నార్ధకంగా చూచాడు గోపాల్.
"ఆవిడ విషయాలన్నీ సేకరించాలి." అన్నాడు ప్రభాకర్.
ఒక్క క్షణం గోపాల్ కను బొమలు ముడుచుకున్నాయి. అంతలోనే ప్రభాకర్ వంక చూసి నవ్వుతూ "ఉన్న బిజినెస్ అంతా చాల్లే! డిటెక్టివ్ ఏజెన్సీ కూడా పెడతావా కొంపతీసి అన్నాడు.

"నా ఏజెన్సీ కి నువ్వే హెడ్. ముందా పని మాత్రం చేయించి పెట్టు." నవ్వుతూ సమాధాన మిచ్చాడు.
"ఎన్నాళ్ళ లో కావాలి.
"వీలయినంత త్వరగా?"
ఆశ్చర్యంగా చూచాడు గోపాల్. "కారణం అడగోచ్చా?"
"తప్పకుండా ? కాని ప్రస్తుతం నేను చెప్పగలిగేది మాత్రం కాదు. ఒకరోజు సావకాశంగా తెలియ పరుస్తాను. " ఒక్క క్షణం నిశితంగా చూచాడు. "నీకే మేం వివరాలు కావాలో చెప్పు?"
చెప్పాడు ప్రభాకర్.
"ఏమిటో ఏదీ సరిగ్గా చెప్పకుండా యిలా చేయమంటే అంతా మిస్టీరియస్ గా వుంది.
"ఇందులో మిస్టరీ ఏమీ లేదు. నువ్వీ వివరాలు తెలుసుకోగలిగితే ఒక మెంటల్ పేషంటు కు సహాయపడుతుందని నమ్మకం? అంత కంటే ఏమీ లేదు." అన్నాడు అతిసామాన్యంగా.
కాసేపు అదీ యిదీ మాట్లాడి యింక వెళ్ళాలి" అంటూ లేచాడు ప్రభాకర్.
"నువ్వు మీ శ్రీమతి తప్పకుండా మా యింటికి రావాలి. ప్రత్యేకంగా ఆహ్వానం పంపుతాను."
ప్రత్యేకమయినా ఆహ్వానలేమీ అక్కర్లేదు. తప్పకుండా వస్తాం. "ఏ విషయమయినా తెలుస్తే వెంటనే కబురు చెయ్యి" అంటూ సెలవు తీసుకున్నాడు.
