Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 16


    "నువ్వు కోరుకోవు గానీ, నేను కోరుకుంటున్నాను. దుర్గ ను అదే నయం."
    "వద్దు గిరీ! అలా మాట్లాడకు-- ఆ భావనేనా మనసుకు కష్టం కలిగిస్తుంది. నేను దుర్గను ఎంత అభిమానిస్తానో మీకెవ్వరికీ తెలియదు. దుర్గ లేకుండా నేను క్షణం కూడా ఉండలేను. తనకోసం ఏం చేయ్యమన్నా చేస్తాను-- కానీ నన్ను చులకన చేస్తే సహించ లేను."    
    గిరి శంకర్ ముఖం లోకి తేరిపారా చూశాడు. శంకర్ ముఖం లోనూ ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. గిరికి కొంత సంతృప్తి ని కలిగింది.
    శంకర్ చేతిని తన చేతిలోకి తీసికొని మృదువుగా నొక్కుతూ "నువ్వు ఉత్త అమాయకుడివి! శంకర్' అన్నాడు. శంకర్ కు గిరి ధోరణి అంతా తమాషాగా ఉంది. గిరి ముఖం లోకి ఒకసారి చూచి వూరుకున్నాడు.
    "లేకపోతె ఏమిటి చెప్పు. నువ్వు దుర్గ నింత ప్రేమిస్తూ కూడా, మీ జీవితంలో ఇంత కలతలు రేగుతున్నాయంటే . ఏమనాలి? పోనీ. ఇట్లాంటి పరిస్థితి నీకు సుఖంగా ఉందా? ఈ గొడవలూ, చికాకులూ, నీ మనసు కేమీ కష్టం కలిగించటం లేదా?"
    "ఎందుకు కష్టం కలిగించటం లేదూ? నువ్వు దుర్గను చేసుకోమనం గానే నేనెంతో సంతోషించాను. అప్పట్లో దుర్గ వినయమూ, అణకువా నన్నెంతో ఆకర్షించేవి. ఒక్క నీతో తప్ప నాతోనైనా ఎక్కువ మాట్లాడేది కాదు. నా సంసారం స్వర్గమే అవుతుందని ఆశ పడే వాణ్ణి. ఇప్పుడు ఇంచుమించు నాకు పిచ్చెక్కినట్లు ఉంటుంది."'    
    "ఉండదూ మరి?" ఎవరైనా భార్యతో సరదాగా గడపాలని ఆశ పడతారు కానీ, గొడవ పెట్టుకు కూర్చోవాలను కుంటారా? కానీ, శంకర్ ఇంకొక్క విషయం గూడా అర్ధం చేసికోవటానికి ప్రయత్నించు కాస్త -- మనం పెళ్లి చేసుకునే సజీవమైన మనుష్యులము కానీ, యంత్రాలము కాము గదా! ప్రతి ఒక్కరికీ , వారి వారి ఆలోచనలూ వారి వారి కోరికలూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు భార్య భర్తల మధ్య ఈ భావాలలో వైరుద్యం కూడా కన్పించవచ్చు-- అట్లాంటప్పుడు పరస్పర సహకారంతో ఇద్దరూ, ఒకదారికి రావాలి. కానీ ఇద్దరిలో ఒకరు బలవంతాన తను అభిప్రాయాలు ఇంకొకరి నెత్తి మీద రుద్దటం ఎలా సాధ్య మవుతుంది చెప్పు? దుర్గ విధి లేక నువ్వు చెప్పినట్లు పడి ఉండటం నీకు ఇష్టమా? లేకపోతె, తానై సంతోషంతో నిన్ననుసరించటం నీకు ఇష్టమా? దుర్గ మనసును చిత్ర వధ చేసాక, ఆ శరీరాన్నుండి నువ్వేం పొందగలవూ? జీవం లేని యంత్రంగా దుర్గ మారిపోయిందంటే, నువ్వా పరిస్థితి ని ఒక్క క్షణం కూడా భరించలేవు. మానవుడేవడూ ఏకాంతాన్ని భరించ లేడు. నువ్వు నీకు తెలియకుండానే దుర్గ ను , నీ కనుగుణ మైన యంత్రంగా మార్చు కుంటున్నావు.  అప్పుడు చివరకు మానసికంగా నీకే కాంత వాసం లభిస్తుంది. హృదయాన్నే నాశనం చేసిన తరువాత స్పందన నశించిన ఆ హృదయం శరీరాన్ని ఎలా ఉత్తేజ పరుస్తుందీ? ఉద్రేకరహితమైన ఆ శరీరాన్ని నువ్వేం చేసుకుంటావూ?"
    శంకర్ ఆశ్చర్యంగా వింటున్నాడు. అతని అంతరాంతరాలలో ఆ మాటలన్నీ అక్షరాల నిజమేననిపించింది. "ఇంకొక సంగతి శంకర్ -- నువ్వు దుర్గ నెంతో ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమను ఆమె గుర్తించేలా చెయ్యి. స్త్రీ పురుషునికి తన సర్వస్వమూ ధారపోస్తుంది. ప్రతిఫలంగా, ఆమె   కోరుకునేది లాలనా, అనునయమూ మాత్రమే! నీ అధికారం లో ఎదురు తిరిగే ఆమె హృదయం నీ లాలన లో సర్వమూ, మర్చిపోతుంది. తన వ్యక్తిత్వాన్ని కూదామరిచి, నీ వ్యక్తిత్వం లో తానుగా లీనమవుతుంది. ఆనాడు నీ కోరిక సఫలమౌతుంది. ఇంకొక విధంగా నీ కోరిక నెరవేరదు సరికదా , నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నవాడవౌతావు.
    "మనుష్యులంతా ఒకవిధంగా ఉండరు. ఇనుప స్థంభమూ, వీణ తీగెలూ, ఇనుము నుండే చేయబడ్డాయి -- మొదటిది ఎంత దేబ్బకైన తట్టుకోగలదు. దాని నుండి " డండం' ధ్వనులు తప్ప ఇంకేమీ పొందలేవు. ఏ కాస్త చిన్న దెబ్బ కైనా తెగిపోయే వీణ తీగెలను సున్నితంగా మీటినపుడు లోకాన్నే మరపించేసే మంజుల మధుర నాదాన్ని అందిస్తాయి. మనుష్యుల స్వభావాల్లో కూడా ఇంతటి వైవిధ్యం ఉంది. అర్ధం చేసికోగలిగితే, ఆనందాన్ని అనుభవించగలం. గుడ్డిగా ప్రవర్తిస్తే సృష్టి కర్త మన కందించిన ఎన్నో వరాలను వ్యర్ధం చేసుకున్నవాళ్ళమవుతాము. నేను దుర్గను సమర్ధిస్తూ , ఈ మాటలన్నీ చెపుతున్నానని కానీ, నీకు నీతులు చెప్పుతున్నానని కానీ, అనుకోకు-- నీ సుఖం కోరి మాత్రమే ఇలా చెపుతున్నాను. నువ్వే ఆలోచించుకో! నేను వెడుతున్నాను."
    శంకర్ సమాధానానికి కూడా ఎదురు చూడకుండా గిరి వెళ్ళిపోయాడు.

                                        18

            
    మానవ స్వభావం కన్న విచిత్రమైనది ఇంకొకటి లేదు. ప్రసాద్ మనసు దుర్గా గిరి ల మధ్య స్నేహ నికి ఈర్ష్య తో మండి పోతుందంటే , అందుకు తగిన ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ప్రసాద్ కు దుర్గ మీద వ్యామోహామా, అంటే అదీ లేదు.
    ఒక సున్నితమైన ఆవేదన -- అంటే!
    శంకర్ స్వభావాన్ని అర్ధం చేసుకున్న దుర్గ , ప్రసాద్ తమ ఇంటికి వచ్చినప్పుడు , అతనితో చాలా ముభావంగా ప్రవర్తించ సాగింది. అది గమనించి ప్రసాద్ కూడా దుర్గ ఇంటికి రాకపోకలు తగ్గించాడు. దుర్గ స్వభావమే అంత అనుకున్నాడు. కానీ, ఒకనాడు అనుకోకుండా ప్రసాద్ ఉన్నప్పుడే గిరి కూడా రావటం తటస్థించింది. ఆనాడు గిరి పట్ల దుర్గ చూపే, అభిమానమూ, ఆప్యాయత అతని దగ్గర దుర్గ కు ఉన్న చనువూ, ప్రసాద్, అంతరాంతరాలలో ఈర్ష్యను లేపింది. తనూ, గిరీ, ఇద్దరూ దుర్గకు బాల్య స్నేహితులే! తననంత దులిపి వేయటానికి , గిరి నంత నెత్తిన పెట్టుకోవటానికీ , ప్రసాద్ హృదయం మండింది. ఆనాటి నుంచీ అతను దుర్గా, గిరి లను ప్రత్యెక మైన దృష్టి తో గమనించసాగాడు. మన మనసులోకి ఏదైనా అభిప్రాయం రాకుండా ఉండాలే కాని, ఒక అభిప్రాయం వచ్చిన తరువాత రంగు కళ్ళద్దాలకు లోకమంతా రంగుగానే కన్పించినట్లు ప్రతి సంఘటనా , ఆ అభిప్రాయాన్ని బలపరచేది గానే కన్పిస్తుంది. మనసులో మండే ఈర్ష్యా జ్వాలలను చల్లార్చు కోవటానికి, దుర్గా గిరిలా మధ్య అక్రమైన సంబంధముండి ఉండవచ్చనే ఊహ తరునోపాయమైంది ప్రసాద్ కు. ఈ రకమైన భావనలు చాలా చిత్రమైనవి. అవి కలిగిన వ్యక్తులు తమలో తాము అలా భావించటం వల్ల తృప్తి పడలేరు. ఇంకో పది మందైనా తమతో ఏకీభవించాలి. అలా జరుగక పొతే , తను భావనలో తమకే నమ్మకం ఉండదు మరి!--
    ఒకసారి జానకి దగ్గిర ఈ విషయం కదిపాడు-- "జానకీ!దుర్గకు గిరి అంటే ప్రాణం కదూ!" స్వెట్టరు అల్లుతున్న జానకి తలెత్తకుండానే "అవును-- నాకు కూడా అయన అంటే చాలా ఇష్టం. చాలా సరదా. అయినా మనిషి-- తను నవ్వుతూ ఎదుటి వాళ్ళను నవ్విస్తూ ఉంటాడు. అంది.
    ఈ సమాధానంతో ప్రసాద్ కు మరింత మండింది. కసిగా "నీ ఇష్టానికి , దుర్గ ఇష్టానికీ , చాలా తేడా ఉందిలే!" అన్నాడు ---
    "ఉండచ్చు! అతని దగ్గిర చిన్నప్పటి నుంచీ దుర్గకు చాలా చనువు ఉంది. హరి, గిరి , దుర్గా చిన్నతనం నుంచీ ఒక్క ప్రాణం లా ఉండేవారట!'
    "అందుకే పాపం ! ఇప్పటికీ దుర్గను వదలలేక అస్తమానూ వస్తూ ఉంటాడు."    
    ఇంతసేపటికి ప్రసాద్ మాటలలో ఏదో వ్యంగ్యం ధ్వనించింది జానకికి-- తలెత్తి చూసి "బాగుంది! నువ్వూ నేను వెళ్ళటం లా? ఇందులో పెద్ద అనుకోవలసిందేముంది?" అంది--
    "నువ్వూ, నేనూ వెళ్ళటమూ గిరి వెళ్ళటమూ ఒకటే నంటావా? అసలు నేననుకోవటం......"
    ప్రసాద్ ఏం చెప్పదలచు కున్నాడో ఊహించిన జానకి అతని వాక్యం పూర్తీ కాకుండానే కయ్యిమంది. "ఊరుకో అన్నయ్యా! మీ చదువులూ, సంస్కారాలూ, ఏ గంగలో కలుస్తాయో అర్ధం కాదు. నువ్వను కునేదేమిటో నాకు తెలుసులే! నీకు పుణ్య ముంటుంది. నువ్వనుకునే దానిని ఎన్నడూ మాటలలో పెట్టకు. అలా అనుకోగలిగినందుకు సిగ్గుపడు -- దుర్గా గిరి ల మధ్య ఉండే సంబంధం నాకు తెలుసు -- నువ్వనుకునే దానిలో వెయ్యి వంతులు నిజం ఉన్నా, దుర్గ గిరికి భార్య అయి ఉండేది. అనవసరంగా వాళ్ళను అనుమానించి నిన్ను నువ్వు అవమానం చేసుకోకు."
    జానకి ఇలా విరుచుకు పడటం తో ప్రసాద్ అక్కడి నుండి వెళ్లి పోయాడు. జానకి మాటల వల్ల అతని ఊహలో ఏం మార్పు రాలేదు.
    ప్రసాద్ ఈర్ధ్యను ఇనుమడింప చేసే సంఘటన మరొకటి జరిగింది. ఒకనాడు కాకతాళీయంగా శంకర్ ఇంట్లో లేని సమయంలో ప్రసాద్ దుర్గ ఇంటికి వెళ్ళటం జరిగింది. ప్రసాద్ రాకపోకల వల్ల శంకర్ పడే చిరాకును భరించలేని దుర్గ ప్రసాద్ ను తమ ఇంటికి రాకుండా చేయటమే మంచి మార్గమని నిశ్చయించింది.
    "ప్రసాద్ ! నీతో ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా కష్టంగా ఉంది. నిస్సహాయురాలినై ఇలా చెప్తున్నాను. నీ రాకపోకల వల్ల నా సంసారిక జీవిత ప్రశాంతత కు భంగం కలుగుతుంది. నన్ను క్షమించి నువ్వు ఇక్కడకు రావటం తగ్గిస్తే నాకు మేలు చేసిన వాడవుతావు. నువ్వు అర్ధం చేసికోగలవని ఇలా చెపుతున్నాను. ఏమీ అనుకోకు." అంది. ప్రసాద్ తెల్లబోయాడు. వెంటనే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. కానీ, అవమానంతో అతని మనసు కుతకుత ఉడికి పోతోంది. "పెద్ద పతివ్రత లాగ వేషాలు! ఆ గిరి గాడితో ఇష్టం వచ్చినట్లు కులుకుతూ !...." ఇదీ అతని కచ్చి------
    ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని అతని ఈర్ష్యా పూరిత హృదయం వ్యాకుల పడుతుంది----
    హోటల్లో కాఫీ త్రాగుతున్న ప్రసాద్ తన ఎదురుగా కాఫీ తాగుతున్న హరిని చూసి సంభ్రమం తో అతని దగ్గరకు వెళ్లి పలుకరించాడు.
    "హరీ! ఎప్పుడొచ్చావ్! బొత్తిగా కనబడటం లేదేం? దుర్గను చూడటానికి వచ్చినప్పుడైనా మా ఇంటికి రాకూడదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS