"మిస్టర్ రామనాథం! అట్టే ఉపోద్ఘాత మక్కర లేదు. మీరు అనంతలక్ష్మి ని వివాహం చేసుకోవాలి!" నిశ్చలంగా అంది పారిజాతం.
పిడుగు పడ్డట్లు అదిరిపోయాడు రామనాథం మరుక్షణమే తమాయించుకొని నవ్వాడు.
"ఏమిటీ పరిహాసం! నేను ఆవి డెవ్వరినో ఎందుకు వివాహ మాడాలి? నేను వివాహితుణ్ణి అని నీకు తెలియదా?" అన్నాడు.
" 'వివాహితుడిని' అన్న జ్ఞానం ఈ వేళ కలిగిన ట్లుందే మీకు! అనంతలక్ష్మి ని ఎందుకు పెండ్లి చేసుకోవూ? ఆనాడు మీ రిద్దరూ చేసిన తప్పుకు ఈ నాడు అనంతలక్ష్మి ఫలితం అనుభవిస్తున్నది! పాపఫలాన్ని గర్భంలో పెంచుతున్నది! అందుకు!" పారిజాతం స్వరంలో నిబ్బరం స్పష్టమౌతున్నది.
"నాన్సెన్స్! ఆవిడకు నేను ఎన్నోవాడినో! అలాంటి దానితో పెండ్లా!" చాలా తిరస్కారంగా అన్నాడు రామనాథం.
"తప్పుచేసిన ప్రతి మగాడూ తనకు లోబడిన ఆడదాన్ని గురించి ఇట్లాగే అంటాడు లెండి! అనంత లక్ష్మికి మీరు మొదటివారే లెండి!" అంది పారిజాతం, ఇంత అసభ్యంగా మాట్లాడవలసి వచ్చినందుకు చింతిస్తూ.
"నీ కెట్లా తెలుసు? ఆవిడ శీలానికి నీ హామీ ఏమిటి? ఎవత్తో దారిని పోయేదాన్ని నేను వివాహం చేసుకోవాలా? నా హోదా ఏమిటో మరిచిపోయిన ట్లున్నావు! ఇంకా నయం! 'నన్నే పెండ్లిచేసుకో' అన్నావు కాదు! ఒళ్ళు తెలిసి మాట్లాడు!" అన్నాడు కోపంగా.
"నన్నే పెండ్లిచేసుకో' అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారేమో మీరు! మీలాంటి వెధవలకు దొంగడానకి నేను అమాయకురాలైన అనంతలక్ష్మిని కాను. ఒళ్ళు తెలియవలసింది మీకు! సౌమ్యంగా చెబితే మీకు అర్ధం కాదు. సరే! మర్యాదగా అనంత లక్ష్మిని వివాహం చేసుకుంటే సరి! లేకపోతే ఆమె కోర్టు కెక్కుతుంది? అప్పుడు మీ హోదా గతి ఏమిటో చూచుకొందురుగాని!"
"కోర్టు కెక్కుతుందా? ఎవరి మద్ధతుతోటి? ఆవిడ గర్భానికి నేనే కారణమని ఋజువేమిటటా?" అన్నాడు కోపంగా.
"మా ప్రోత్సాహమే! మా మహిళా మండలి సభ్యులంతా కోపంగా ఉన్నారు, అనంతలక్ష్మి కి ఇట్లా జరిగిందని! అఫ్ కోర్స్, ఏ కొద్ది మంది మూర్ఖులో తప్ప, సాటి ఆడదానికి అవమానం జరిగితే ఎవరోర్చు కొంటారు? మా సభ్యురాలొకామె భర్త పేరు పొందిన లాయర్! ఆయన అనంతలక్ష్మి తరఫున వాదిస్తాడు. ఫీజ్ తీసుకోడు. ఇతర ఖర్చులు మా మహిళా మండలి భరిస్తుంది! ఇది అంతు తేలేదాకా వదలము." దృఢంగా అంది పారిజాతం.
వ్యవహారం ముదిరిందని రామనాథం గ్రహించాడు. కోర్టు కెక్కితే తన పరువు, ఉద్యోగం ఏం కావాలి? ఆడవాళ్ళింత పట్టుబట్టితే ప్రమాదమే! ఉద్యోగాని కేదయినా మొప్పం జరిగితే, లలితకు మరీ లోకు వవుతాడు! మళ్ళీ అత్తవారిల్లు! నరకం! స్వార్ధపరుడికి తెలివి ఎక్కువ!
లలితవైపు చూడకుండా అన్నాడు: "వివాహానికి ఒప్పుకొంటాననుకో! ఆ అమ్మాయిని నేను సరిగా చూడలేకపోతే ఏం చేస్తారు? సరిగా చూడడం లేదని మళ్ళీ కోర్టు కెక్కుతారా? బలవంతాన కట్టబెట్టడం కాదు! తరవాతి సంగతి ఆలోచించాలి!"
పారిజాతం నవ్వి, "ఆ భయం మీ కక్కర్లేదు! మా బాధ్యత వివాహం జరిపించటంవరకే! తరవాత అనంతలక్ష్మి ఖర్మ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది! కాని, ఒక చిన్న సలహా! ఎన్నడో ఒక నాడు అంతా చస్తాము. మీబోటి దుర్మార్గులు కొట్టుకొని కొట్టుకొని చావచ్చును! అట్లా చేసిన తప్పులన్నీ కళ్ళెదుట కనబడుతూ, ప్రాణం పోకుండా కొట్టుకొనేటప్పుడు తన సంతన మంటూ, తన రక్తాన్ని పంచుకుని పుట్టిన సంతాన మంటూ నోట్లో నీళ్ళు పోస్తే, తృప్తిగా చచ్చి పోవచ్చును. అనంతలక్ష్మీ ని హింసిస్తే ఆ తృప్తికి మీరు నోచుకోలేరేమో? అయినా, అవన్నీ నా కనవసరం! వివాహానికి మీరు ఒప్పుకున్నట్లేనా?" అని అడిగింది.
గత్యంతరం లేకపోయింది రామనాథానికి. లోపల భగ్గున మండిపడుతూ, పైకి పోక్కలేక బలవంతంగా వివాహానికి అంగీకరించాడు. అయితే, ఒక షరతు పెట్టాడు. వివాహం రహస్యంగా జరగాలి.
"లలితగారు కోర్టు కెక్కుతారా?" పారిజాతం సందేహంగా అడిగింది.
"ఎక్కను! ఈయన కీ శాస్తి కావలసిందే! ఆ అందవికారి ఈయన రెండో భార్య కావడం ఎంతో మంచిది! నేను ఆమెను పనిగట్టుకొని, వీలైన చోటి కంతా తీసుకుపోయి - 'ఇదుగో, మా వారి రెండవ భార్య! రూపసంపద, గుణసంపద చూచి, మావా రీ అప్సరాసాను స్వయంవరం చేసుకున్నారు! పెండ్లయిన ఆరు నెల్లకే పండంటి బిడ్డను మా వారి కందిస్తున్నది! మమ్మల్ని పున్నామనరకం నుండి కాపాడటానికి వచ్చిన దేవత!' అని ఇంటింటా చాటుతాను!" అని వలవల ఏడుస్తూ లోనికి వెళ్ళిపోయింది లలిత.
నిట్టూర్పు విడిచి భద్రీ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళిపోయింది పారిజాతం.
మంచి ముహూర్తాన హోస్పేటలోనే రామనాథానికి, అనంతలక్ష్మి కి పెళ్ళి జరిగింది. పారిజాతం, సత్యవతి, అనంతలక్ష్మి కుటుంబం, లాయర్ జగన్మోహన రెడ్డిగారూ, భద్రీ ప్రసాద్ గారి కుటుంబమూ సాక్షులుగా వచ్చారు.
పెండ్లిలో అనంతలక్ష్మి కుటుంబం చేసిన అల్లరికి అందరికీ తల బొప్పికట్టింది! వాళ్ళ కుసంస్కారాన్ని చక్కగా గమనించిన లలిత, రామనాథానికి తగిన శాస్తి జరిగిందని ఎంతో సంతోషపడింది.
తన మనసు సమాధానపడేదాకా అనంతలక్ష్మి తన ఇంటికి రాకూడదనీ, ఆవిడ పుట్టింటివాళ్ళు తన గడపలో కాలు పెట్టకూడదనీ రామనాథం షరతు పెట్టాడు. దూరాలోచనగల లాయర్ జగన్మోహనరెడ్డి గారు ఇవన్నీ సహజమేననీ, కాలక్రమేణా సర్దుకో వచ్చనీ, అనంతలక్ష్మి ఉద్యోగం చేస్తూ విడిగా ఉండడమే మంచిదనీ, ఆవిడ భవిష్యత్తు కేమీ భయంలేదనీ అందరికీ నచ్చచెప్పారు.
* * *

"నాన్నగారూ! ఏమిటిది? ఏమయింది? ఎందుకిలా వణికిపోతున్నారు?" పారిజాతం గొంతు దుఃఖంతో పూడుకుపోతున్నది. "అమ్మా! అమ్మా! తొందరగా రా, అమ్మా! నాన్నగారి కేమయిందో చూడు!" అని గట్టిగా అరిచింది పారిజాతం.
సౌభాగ్యమ్మ గారు గాభరాగా పరుగెత్తి వచ్చారు. భర్త స్థితి చూసేసరికి ఆమె గుండె పగిలినట్లయింది!
భద్రగిరి నాయుడుగారు స్పృహ లేకుండా పడి ఉన్నారు. ఆయన చేతిలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూస్తూ ఉండగానే ఆయన ఆ విధంగా పడిపోయారు.
"ఏమండీ! పలకండీ. కన్ను తెరిచి చూడండీ! పారిజాతం! డాక్టరును పిలిచిరావే, తల్లీ! పరుగెత్తవే!" అంటూ ఆమె ఏడ్చింది.
పారిజాతం దిక్కు తెలియని దానిలాగా డాక్టర్ వాణీ శారదను పిలుచుకురావటానికి పరుగెత్తింది.
ఇంతలో ఏదో పుస్తకం కోసం సత్యవతి ఇంటికి పోయిన సంగీత వచ్చింది. స్పృహ లేకుండా పడి ఉన్న తండ్రివీ, ఏడుస్తున్న తల్లినీ చూసేటప్పటికి, ఆ చిన్నపిల్ల గాభరా పడింది. "ఏమయిందమ్మా, నాన్న గారికి?" అని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది.
"ముందుపోయి సత్యవతక్కను పిలిచి రా, అమ్మా!" అంటూ సౌభాగ్యమ్మ గారు సంగీతను మళ్ళీ సత్యవతి కోపం పంపారు.
కన్నీరు తుడుచుకుని, వంగి భర్త మీద చెయ్యి వేసి, మంచంనుండి కిందికి వేలాడుతున్న చేతిని పైకి పెట్టాలని నాయుడుగారి చేతిని పైకి ఎత్తారు సౌభాగ్యమ్మగారు.
చేతిలోనుండి ఫోటో క్రింద పడింది.
సౌభాగ్యమ్మగారు దానిని పైకి తీసి చూశారు. పారిజాతం వల్ల భద్రీ ప్రసాద్, సతీదేవి, కృష్ణమోహన్ లను గురించి విన్నది కాబట్టి, ఆ ఫోటోలో ఉన్న ముగ్గురూ వాళ్ళేవని ఆమెకు తెలిసిపోయింది. అనంత లక్ష్మి పెండ్లి జరిపిన తరవాత హోస్పేటనుండి వచ్చేటప్పుడు ఆ ఫోటో తెచ్చి ఉంటుంది. తండ్రికి చూపించబోయి ఉంటుంది. ఇంతలోనే ఆయనకు మునుపటిలాగా గుండెనొప్పి వచ్చి ఉంటుంది!
మరోమారు ఆ ఫోటో వంక తదేకంగా చూసింది.
ఆమెకు సతీదేవిని ఎక్కడో చూసినట్లుంది!
ఇంతలో సత్యవతి గాభరాగా పరుగెత్తుకొంటూ వచ్చింది-"ఏమయిందమ్మా, నాన్నగారికి?" అంటూ.
సౌభాగ్యమ్మ గారు- "ఏమోనమ్మా! ఉన్నట్లుండి పారిజాతం కేకలు వేసేటప్పటికి, వంటింటినుండి పరుగెత్తుకు వచ్చాను. చూసేటప్పటికి ఈయన ఇట్లా పడి ఉన్నారు! ఆ మధ్య ఇట్లాగే గుండెనొప్పి వచ్చిందని అన్నారు కాని, స్పృహ తప్పిపోలే దమ్మా! నా కేమిటో భయంగా ఉందమ్మా! ఇదుగో, ఈ ఫోటో చేతిలో పెట్టుకొనే పడిపోయారు!" అన్నారు భయంతో, దుఃఖంతో వణుకుతూ.
ఫోటో అందుకొని చూసింది సత్య. ఆ ఫోటోకు, నాయుడుగారు స్పృహ తప్పడానికి ఏమన్నా సంబంధం ఉందా ఏవో సందేహాలు సత్య మనసులో నీడల్లాగా కదిలాయి!
ఇంతలో పారిజాతం డాక్టర్ వాణీ శారదను వెంట బెట్టుకొని వచ్చింది.
డాక్టర్ వాణీ శారద నాయుడుగారి గుండెను పరీక్షించింది. చూస్తూ ఉండగానే ఆవిడ ముఖం గంభీరంగా మారి, మళ్ళీ మామూలుగా అయింది.
"ఏం భయపడకండమ్మా! ఇంతకు ముందొకసారి గుండెనొప్పి వచ్చిందటగా! అబ్బే! గాభరా పడవలసిన దేమున్నది? తగ్గిపోతుంది!" అని ధైర్యం చెబుతూ ఒక ఇంజక్షన్ ఇచ్చింది.
మరో అయిదు నిమిషాలకు నాయుడుగారు కళ్ళు తెరిచారు.
చుట్టూ తన వైపే ఎంతో ప్రేమతో, వేదనతో చూస్తున్న కళ్ళు! పారిజాతం కళ్ళలో నీరు ఉబుకు తున్నది. సౌభాగ్యమ్మ గారు సరేసరి! చిన్నపిల్ల సంగీత వెక్కిళ్ళు పెడుతున్నది. సత్యవతి దీనవదనంతో కన్నీళ్ళు కారుస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని ఉంది. ఎటుతిరిగీ డాక్టర్ వాణీ శారదగారే నిశ్చలంగా ఉంది.
ఎంతో తృప్తితో కళ్ళు మూసుకొన్నారు నాయుడుగారు! మనిషికి ఆఖరి క్షణంలో ఇంతకంటే ఇంకేమి కావాలి? 'మృత్యుముఖంలో తన కోసం కన్నీరు కార్చేవారు ఒకరైనా ఉండాలని జీవి కోరుకొంటుంది. తన కోసం ఇంతమంది కన్నీరు కారుస్తున్నారు. ఇంకేం కావాలి తనకు!
కాని, ఈ ఆఖరి క్షణంలో పారిజాతానికి నిజం చెప్పాలి. తన బిడ్డ ప్రాజ్ఞురాలు! సంగతంతా విన్న తరవాత ఆమె ఏ నిర్ణయం తీసుకొన్నా సరే, నిర్ణయాధికారం పారిజాతానిదే! ఆమె స్వభావాన్ని బట్టి సరియైన నిర్ణయమే తీసుకోగలదు. అసలు పారిజాతం నిర్ణయం మంచిదో, కాదో నిర్ణయించడానికి తాను ఉండకపోవచ్చును!'
"చిట్టి తల్లీ! సంగీతా! నీవు కాస్త బయటకు పో, తల్లీ! ఏడవకు. నా కేం భయం లేదు. వెళ్ళు, తల్లీ!" అన్నారు నాయుడుగారు, ఆయాసంగా.
భర్త మాట్లాడగలిగినందుకు సౌభాగ్యమ్మగారు పొంగిపోయారు. డాక్టర్ వైపు చూచిన చూపుల్లో కృతజ్ఞత వెల్లివిరిసింది!
"ఇష్! మీ రిప్పుడు మాట్లాడకూడదు. కాస్త రెస్ట్ తీసుకోవాలి. తరవాత ఎంతైనా మాట్లాడవచ్చు" అంటూ డాక్టర్ ఆయనను వారించబోయింది.
"డాక్టర్ గారూ! మీ రింకా చిన్నపిల్లలు! నా బిడ్డలాంటివారు. మీరుకూడా ఇక్కడే ఉండండి. నేను చెప్పబోయే సంగతి పూర్తిగా చెప్పాలంటే, మీ రిక్కడే ఉండాలి, మధ్యలో ఆగిపోకుండా నన్ను చూడడానికి విశ్రాంతి ఏమిటమ్మా! శాశ్వతమైన విశ్రాంతి చిక్కుతుందిక! విను, పారిజాతం!
"దాదాపు ముఫ్ఫై రెండేళ్ళ నాటి సంగతి. నాది మద్రాస్ నా మొదటి భార్య పార్వతి, అంటే మీ తల్లి, ఆవిడదీ మద్రాసే. వివాహానికి ముందునుండీ పార్వతి నాన్నగారు నాకు బాగా తెలుసు. నే నంటే ఆయనకు చాలా అభిమానం ఉంది. తరుచూ మా ఇంటికి వచ్చేవారు. నేను మాత్రం ఆయన ఇంటికి ఎన్నడూ పోయినవాడిని కాను. ఆయనా పిలిచేవాడు కాదు. నేను టీచర్ ట్రెయినింగ్ పాసయినప్పుడూ, ఉద్యోగం చిక్కినప్పుడూ ఆయన తన స్వంత కొడుక్కే జరిగినట్లు సంతోషపడ్డారు!
