Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 16

 

    'అక్షరాల నిజం."
    "అప్పుడే మీకంట విరక్తి కలిగిందా?"
    సుచరిత మాట్లాడక తల వంచుకోండి.
    "చూడండి! ఏసు ప్రభువైనా, ధర్మ మార్గంలో జీవన మాధుర్యాన్ని అనుభవించవద్దని చెప్పాడా? జీవితంతమూ, కఠినమైన నియమనిష్టలతో గడపగలననే విశ్వాసం మీకుందా?"
    "ఏ కార్యమైనా సాధన వల్లనే సమకూరుతుంది. సాధన వల్లనే, మనో నిగ్రహాన్ని సాధించగల ననుకొంటున్నాను. ఈ మార్గమే నాకు శరణ్యం డాక్టరు గారూ! దీని కనుగుణం గానే, నన్ను నేను మలుచుకోవాలి."
    "ఎందుకూ?"
    "క్షమించండి!"
    "నన్నొక మిత్రునిగా భావించి సమాధాన మీయండి. పోనీ, ఇది చెప్పండి. మీ నిర్ణయం మారే అవకాశం లేదా?' నాకోసమైనా మర్చుకోలేరా?"
    "మీ కోసమా?"
    "అవును, సుచరితా! ఏకవచనం లో పిలుస్తున్నందుకు క్షమించు. ఎందుకనో నిన్ను పరాయి దానిలా మన్నించలేక పోతున్నాను. నువ్వంగీకరిస్తే నిన్ను వివాహం చేసికొంటాను."
    "ఇదెక్కడి పరిహాసం డాక్టరు గారూ?"
    "నీతో హాస పరిహాసాలు సల్పే రోజు కోసం తహతహతో ఎదురు చూస్తున్న మాట నిజమే, కాని, ఇది మాత్రం పరిహాసం కాదు."
    "అన్నీ తెలిసి, ఇలా మాట్లాడే మీకు నేనేమని సమాధాన మీయగలను? నక్క ఎక్కడ? నాగ లోకమెక్కడ?"
    "అవి రెండూ ఎక్కడో నాకు తెలియవు కానీ నువ్వు మాత్రం నా హృదయంలో ఉన్నావు."
    "నన్ను చేసికొంటే, సంఘంలో, మీ స్థానం నశిస్తుంది."
    "పిచ్చి సుచరితా! సంఘం లో నా స్థానం నీకూ, నాకూ కూడా సరిపోయేటంత పెద్దది."
    "మీ తల్లిదండ్రులు........"
    "ఆ విషయాలన్నీ నే నాలోచించుకావలసినవి నీ సమాధానం చెప్పు."
    సుచరిత మాట్లాడ లేకపోయింది.
    "చెప్పు సుచరితా! నీవాడిని కాగలిగే అర్హత నాకు లేదా?"
    "అంతంత మాట లనకండి. కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చో పెడుతున్నారని భయంగా ఉంది."
    'అంత తెలివి తక్కువ వాడిని కాను సుచరితా! ఎవరికి సింహాసనాదికారం ఉందొ, వాళ్ళనే, నా హృదయ సింహాసనం మీద కూర్చోపెట్టుకొన్నాను. నిన్ను సుందర్రావు గారింట్లో చూసినప్పటి నుండి నిన్ను మరచి పోలేకపోతున్నాను. ఎంతో ఆలోచించిన మీదట నే, ఈ నిర్ణయానికి వచ్చాను. నీకు అంగీకారమయితే, మిగిలిన ఎన్ని అభ్యంతరాలనైనా , నేను జయించగలను."
    'సుందరరావు గారి ఇంటి దగ్గిర, నిస్సహాయురాలినై ఉన్న నా మీద సానుభూతి ని వర్షించిన ,మీరు ఆనాడే నా హృదయమంతా ఆక్రమించు కొన్నారు. మీరెవరో తెలిసిన నేను, ఒట్టి అడియాస అని వదిలేసుకొన్నాను. ఇప్పుడు కూడా ఏమిటో, నాకంతా కలలా ఉంది. కానీ, డాక్టర్ గారూ...." కన్నీటి తెరలు చూపును క్రమ్మి వేయగా గొంతు వణుకుతుండగా ఆగిపోయింది. సుచరిత, చాలాసేపటికి తమాయించుకొని, "నన్ను క్షమించండి డాక్టరు గారూ? మీకు నా పరిస్థితి తెలియదు. మీ దయకు నేను అర్హురాలిని కాను. సంసారంలో ప్రవేశించటానికి తగను నేను. నాకున్న ఇహలోక బంధాలన్నీ దొంగలతోనే! గజదొంగలతో! మా అన్న దొంగ! మా మామ దొంగ! మా చిన్నాన్న దొంగ! ఈ బంధాల నుండి , నన్ను నేను ఎలా విముక్తు రాలీని చేసికోగలను? ఎప్పుడూ, మా వాళ్ళలో ఎవరో ఒకరు నన్ను చూడటానికి వస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రేమ నన్ను యమపాశం లా చుట్టి విడవటం లేదు. సంఘం లో నేనున్నంత వరకూ, సాంఘిక మైన ఈ బంధాల నుండి తప్పించుకోలేను. అందుకనే, సంఘం నుండే తప్పించు కొంటున్నాను. నన్స్ లో చేరిపోతున్నాను." అంది.
    నేను తేలిగ్గా నవ్వేసాను.
    "ఓస్! ఇంతేనా! నన్ను నమ్ము సుచరితా! నాకు నువ్వు కావాలి. నీకోసం , మిగిలిన ఎన్ని చికాకుల నైనా, భరించగలను. నువ్వు చెప్తున్న అభ్యంతరాలన్నీ అర్ధరహితమైనవి గా కనుపిస్తున్నాయి నాకు. నీ సౌందర్యం ఎంత హృదయాహ్లాదకరమైనదో, నీ హృదయం అంత ఉన్నతమైనది. అదొక్కటి , అదొక్కటే చాలు నాకు! మిగిలిన విషయాలన్నీ వదిలేయి. పరిస్థితులను బట్టి ఎవరితో, ఎప్పుడెలా వ్యవహరించాలో, నాకు తెలుసు! అందువల్ల మన సంసారిక జీవితానికి భంగపాటు ఉండదు. ఇంతకూ, నీ కంగీరమేనా , చెప్పు!"
    సంతోషంతో మెరిసే కళ్ళను క్రిందకు వాల్చుకుంది సుచరిత. మృదువుగా అంది.
    "స్త్రీ జీవితానికి, ఇంతకంటే సార్ధక్యమేముంటుంది డాక్టర్ గారూ?"

                               *    *    *    *
    ఎంతమంది గుండెలు బాదుకొన్నా , ఎంతమంది నోళ్ళు నొక్కుకొన్నా, ఎంతమంది కళ్ళలో నిప్పులు పోసుకున్నా, లెక్కచెయ్యక , నేను సుచరితను వివాహం చేసికున్నాను. సంతోషంతోనూ, కృతజ్ఞతతోనూ, మెరిసిపోయే , ఆమె ముఖం చూస్తె, నా మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. నాతోటి ప్రాణి కింతటి ఆనందాన్ని కలుగజేసే అదృష్టాన్ని పొందినందుకు , నన్ను నేనే అభినందించుకొన్నాను. సుచరితను గాక, వేరేవరిని చేసికొని ఉన్నా, ఆ కళ్ళలో అంతటి సంతోషాన్ని చూడగలిగే భాగ్యం లభించేది కాదు.
    సుచరిత పక్కా క్రిస్టియన్.
    "ప్రభువు మన పాపముల నుండి మనకు రక్షణ కలిగించును."
    "నీ పాపములన్నియు , అయన భరించి, నీకు విముక్తి కలిగించును." లాంటి వాక్యాలు ప్రత్యెక మైన పూనికతో మాట్లాడేది.
    నేను ఎన్నడూ మతాల గురించి ఆలోచించను. "దేవుడు చర్చి లోనూ లేడు, దేవాలయం లోనూ లేడు. మసీదు లోనూ లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. చూసుకోగలిగే శక్తి నీకుండాలంతే!" అని సుచరిత తో అనేవాడిని. ఈ మాటలకు సుచరిత , కటకట లాడిపోయేది.
    ప్రభువు దగ్గిర నేను మోకరించి క్షమాపణ చెప్పుకోనేవరకూ ఆమె స్థిమిత పడేది కాదు.
    ఏసు ప్రభువు సంగతేలా ఉన్నా, కాన్వెంట్ నుండి వచ్చినందుకు , సుచరిత కు చక్కని క్రమశిక్షణ అలవడింది. కాలం విలువ అర్ధం చేసికోవటం నేర్చుకొంది. పనులన్నీ ఏ వేళ కవి టైం టేబుల్ వేసుకొన్నట్లుగా చేసేది ఒక్క క్షణం వృధా పోనిచ్చేది కాదు. మా ఇంట్లోని పూలతోట ఆమె పెంచిందే! ఆమె కుట్టిన దిండు గలీబులు , దుప్పట్లు ఇప్పటికీ నేను వాడుతూనే ఉన్నాను. ఎప్పుడూ ఏదో పని కల్పించుకొని అందులో నిమగ్న మయ్యేది.
    ఆమెకు నవలలు చదవటం బొత్తిగా ఇష్ట ముండేది కాదు. ఎంతెంత మంచి పుస్తకాలయినా సరే, నేనెంత బ్రతిమాలినా చదివేది కాదు. ఆమె దృష్టి లో అట్లాంటి పుస్తకాలు చదవటం , కాలాన్ని వృధా చేయటం. "మంచి బాలుని' లక్షణం కాదు. బైబిల్ మాత్రం శ్రద్దగా రోజూ చదివేది.
    అయితే, నేనెప్పుడయినా, నేను చదివిన పుస్తకాలలో విషయాలు మాట్లాడినప్పుడు మాత్రం శ్రద్దగా వినేది. అర్ధం చేసికోవడానికి ప్రయత్నించేది.
    నా ప్రతి మాటకూ గౌరవమిచ్చేది. తన  కిష్టమయినా కాకపోయినా, నాకు అనుకూలంగా నడుచుకోటానికే ప్రయత్నించేది. అలాగని నేనామె కిష్టం లెని పనులు చేయమని ఎన్నడూ శాసించేవాడిని కాను.
    భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి కావలసింది, అభిరుచులొకటి కావటం కాదు. సానుభూతితో కూడిన సహకారమని అప్పుడు నాకనిపించింది.
    ఒకనాడు ఉదయం మేం కాఫీలు త్రాగుతుండగా ఒక అందమైన యువకుడు మా దగ్గిరకు వచ్చాడు. అతనిని చూస్తూనే, సుచరిత ముఖం తెల్లగా పాలిపోయింది. చేతిలో కాఫీ కప్పు వణికింది. ఆమెలో ఈ మార్పుకు ఆశ్చర్యపోతూ అతడిని కూర్చోమన్నాను.
    "మా సుచరిత ద్వారా, మీరు మాకు బంధువు లయ్యారు." నవ్వుతూ అన్నాడు. సుచరిత పెదిమలు వణికాయి. నేనతనితో కరచాలనం చేసి, అతడి రాక నాకు సంతోషాన్ని కలిగించిందని చెప్పాను.
    "నా పేరు మోహనరావు. సుచరిత అన్నయ్యా, నేనూ ప్రాణ స్నేహితులం! సుచితో కూడా నాకు పరిచయముండేది. ఎలా ఉందొ చూసిపోదామని వచ్చాను."
    అతడు నా భార్య నంత స్వతంత్యంగా 'సుచి" అని అనడం నా మనసులో ఏమూలనో కొంచెం చిరచిర కలిగించింది. అయినా, అతనిని సదరంగానే సంభావించాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS