సరిగ్గా మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్ళేందుకు తిరుగు ప్రయాణానికి రైలు టిక్కెట్టు కొనుక్కున్నాడు. జగన్నాథం ఎక్కింది ఎక్స్ ప్రెస్ రైలైనా అన్ని స్టేషన్లలో ఆగుతూ గూడ్సు రైలు మాదిరి వెడుతున్నందుకు చిరాకుపడి 'డర్టీ ట్రెయిన్సని' తిట్టుకుంటున్నాడు. కాషాయ రంగు దుస్తులతో చిరాకుపడటం భావ్యం కాదని ఎవరో బైరాగి మందలించగా ఒళ్ళు మండి ఏదో స్టేషన్లో దిగిపోయాడు.
తాను దిగిన ఊళ్ళో అదొక వీధి. ఆ వీధిలో అన్నీ మాసిపోయిన ఇళ్ళే వున్నా అవి కళగానే కనిపిస్తున్నాయి. ఆ వీధిలో కనిపించిన జగన్నాథాన్ని వింతగా చూస్తున్న కిళ్ళీబడ్డీ ఆసామి అన్నాడు.
"తమరు ఈ వీధికి కొత్త కాబోలు! ఇది మెరక వీధండి. ఈ వీధిలో వున్న మెజారిటీ ఇళ్ళకు మర్యాదస్తులెవరూ వెళ్ళరండి. అర్ధమైంది కదండీ! తమలోని స్వామీజీలు అస్సలు ఈ వీధిలోకి అడుగే పెట్టరు. అర్ధమైంది కదండీ! అదండీ విషయం! ఆ తర్వాత మీ ఇష్టమండీ!
అతని ఉచిత సలహాకి ఒళ్ళు మండింది. అంచేత కావాలని ఒక ఇంటి అరుగుమీద తిష్టవేసేడు.
అయిదు నిమిషాల తర్వాత ఒక ఆడగొంతు లోపలికి దయచేయండి స్వామీ! అని ఆహ్వానించింది.
జగన్నాథం కిళ్ళీబడ్డీ మనిషివేపు కసిగా చూస్తూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టేడు. అందమైన ఆడమనిషి ఎంతో అణుకువగా పాలూ పళ్ళూ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి చేతులుజోడించి ఎంతో ఆదరంగా అన్నది....
"దూర ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు! తీసుకోండి స్వామీ! రెండో తడవ కూడా ఆమె తనని 'స్వామీ' అని పిలుస్తున్నందుకు కోపం వచ్చినా దాచుకున్నాడు. యాపిల్ ముక్కని గట్టిగా కొరికి ఆ కోపమంతా ఆ యాపిల్ ముక్క మీద తీర్చుకున్నాడు.
"నా పేరు నీలవేణి! ఊళ్ళోకి ఏ స్వాములొచ్చినా మా ఇంటికి పిలుచుకుని పాదపూజ చేసుకుంటాను. దయగల స్వాములు దయచేస్తారు. నా మీద రోత కలిగినవారు నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారు. నా అదృష్టం కొద్దీ మా ఇంటి అరుగుమీద కనిపించేరు" అన్నది నీలవేణి.
సరిగ్గా అప్పుడే వీధిలో డప్పుల మోత విని నీలవేణి అన్నది - "క్షమించండి స్వామీ! ఎవరో కాలం చేసినట్టున్నారు. వీధిలోకి వెళ్ళి ఆ మనిషి వెళ్ళేది స్వర్గానికో - నరకానికో చూసి వస్తా" అని వీధిలోకి వెళ్ళింది. నీలవేణి మాటలకు గట్టిగా షాక్ తిన్నాడు జగన్నాథం.
"మరణించిన మనిషి స్వర్గ నరకాల్లో ఎక్కడికి వెడతాడో ఎవరు చెప్పగలరు? ఏళ్ల తరబడి... ఒంటికాలు మీద నిలబడి.. ఘోరతపస్సు చేసిన మహర్షులకు సైతం తెలియని రహస్యం... నీలవేణికి ఎట్లా తెలుస్తుంది? పైగా నీలవేణి వేశ్య! ఆ వృత్తిలో పాపం మూట కట్టుకుంటున్న మనిషి ఇలాంటి మనిషికి దివ్యదృష్టి భాగ్యం ఎలా లభించిందో" అని జగన్నాథం ఆశ్చర్యపోతుండగా నీలవేణి రానే వచ్చింది, వస్తూనే అన్నది.
"పోయింది అప్పల్సామి. తిన్నగా స్వర్గానికే వెడుతున్నాడు స్వామీ!" ఆ మాట వినగానే తత్తరపాటుతో లేచి నిలబడ్డాడు జగన్నాథం.
ఎంతో కుతూహలంగా నీలవేణిని అడిగాడు.
"అతడు వెళ్ళేది స్వర్గానికేనని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? శాస్త్రాలు చదివిన జ్ఞానంతో చెబుతున్నావా? లేక ఆభగవంతుడే చెప్పాడా?"
"అయ్యో స్వామీ! ఈమాత్రం చెప్పడానికి దేవుడే దిగి రావాలా? ఆ మాటకొస్తే అప్పల్సామి అంతిమ యాత్రకు వీడ్కోలు చెప్పడానికి ఊరు ఊరంతా కదిలి వచ్చింది కదా స్వామీ! ఇంక దేవుడెందుకు?"
"అప్పల్సామి కలిగినవాడా?"
"లేదు స్వామీ మానవత్వం వున్నవాడు!" ఆ మాటతో జ్ఞానోపదేశం లభించినట్టు భావించాడు జగన్నాథం. అందుకే ఆమెకు తలవంచి నమస్కరించేడు!
కోపతాపాలకు అహంకారానికీ స్వస్తి పలికి పొరుగువాడికి సాయపడు. ఈ శేష జీవితంలోనైనా నువ్వు కోరుకుంటున్న ప్రశాంతమైన జీవితం నీకు సొంతమవుతుందనే చిదానందతత్త్వాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి అగ్గిరాముడు ఆనాడే హైదరాబాదుకి రైలెక్కేడు.