అనుకోకూడదూ గానీ, జనకిరామయ్యగై ఆశ సంగతి విన్న అయన జనం తాలుకూ నోళ్ళూరేయి. ఈ తడవ చైర్మన్ ఎన్నికల్లో తలో రెండు మూడు వేలు కళ్ళచూడవచ్చనీ , ఆ రకంగా ఈ వ్యాపారంలో వాళ్ళ పెట్టుబడిని కొంచెమో గొప్పో భర్తీ చేసుకోవచ్చనీ వాళ్ళనుకున్నారు.
రోజుకున్న యిరవై నాలుగు గంటలు జానకిరామయ్యగారికి చాలేవి కావు అంతరంగిక సమావేశాలు, ఉపాయలూ, ఎత్తుకి పై ఎత్తులూ , మనిషిని పట్టుకు బతిమిలాడటాలతో అయన పూర్తిగా యింటి విషయం మరచిపోయేరు.
ఆ యింట్లో అయన అర్ధాంగి యిదంతా ఏదో ప్రమాదానికి వచ్చిపడినట్టు కనిపించింది. ఆవిడ ఒక్కర్తీ ఓ మూల కూర్చుని అనుకునేది.
"ఈ యింటికేదో శని పట్టింది. ఈ మనిషికేదో కీడు ఆవహించింది. ఈ ప్రమాదం నించి బయటపడటం కష్టం నా మాట వినిపించుకునే మనిషి కాదీయన. సేవ సేవని దొంగ మాటలతో చుట్టూ బతికే మనుషుల్ని మాయచేయడం సుళువుకాదు. ఇది తెలిసి కూడా అయన వలలో పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఉన్న ఆస్తి చాలు. ఇద్దరి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేస్తే ఆ కాడికి ప్రజల్ని ఉద్దరించినట్టే లెక్క! ఇంటి సంగతి వారికక్కర్లేదు గాని ఎక్కడో బయట రాజకీయాలు ఆయనకి కావాలి. భగవంతుడా , మమ్మల్నేం చేస్తావు? మాకేమిటి దారి?
ఆవిడ ఒకటీ రెండు తడవలు జానకిరామయ్యగారిని హెచ్చరించేందుకు చేసిన ప్రయత్నం అయన కేకలతో ఫలితానికి రాదు.
"నోరు మూయవే! మగవాడనాకేం చేస్తాడు. వాడికి నీలాగా నాలుగు గోడల మధ్య బతికేయడం కుదరదు. అయినా ఈ విషయాల్లో ఆడది జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నోరుమూసుకు పడి వుండు" నా డబ్బుని నా యిష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను. తగలేడతాను. ఈ ఆస్తికి నాకు మా నాన్నాగానీ, మీ నాన్నగానీ దానం చేయలేదు. ఈ రెక్కలు - ఈ రెక్కలతో సంపాదించెను నేను. కనక నా యిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. మళ్ళా ఈ విషయం నాతొ మాట్లాడితే , నేను మనిషిగా జవాబు చెప్పేది లేదు."
ఈ ఉపదేశం జరిగిననాడు , సరిగ్గా అదే రోజున ముకుందం విశాఖపట్నం నించి ఉత్తరం రాసేడు రావ్ కి. రావ్ మంచం మీద పడుకుని ఆ వుత్తరాన్ని పదే పదే చదివేడు .
"డియర్ గురూ! ఆ ఇక్కడ క్షేమం. నువ్వు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేవనుకుంటాను. నీతోపాటు నాకు కూడా ఎమ్మే ఎకనామిక్స్ లో సీటు దొరికింది. సీటు దొరికిన మరుక్షణమే నాన్నగారు నన్నీ వూరు తోలేసేరు. నేనీ వూళ్ళో ప్రస్తుతం డాబా గార్డెన్లో మా బందువులింట్లో ఉంటున్నాను. ఇక్కడ వాతావరణం నువ్వు లేకపోవడంతో చప్పగానే ఉందని చెప్పాలి.
తొందరగా వచ్చేయ్ రావ్! మజా చెద్దాం. మొన్న రవీంద్ర భారతిలో నీ నాటకం గురించి పేపర్లో చదివి ఉత్సాహపడ్డాను. నేనూ నీతో పాటు ఆ నాటకంలో ఉంటే యెంత బాగుండిపోననిపించింది. అయినా నీలాటి మహానటుడికి నా బోటి చవకరకం నటుడెం నచ్చుతాడు? మరేమీ అనుకోకు గురూ! మనసులో ఉన్నది రాసేను.
నువ్వు యిక్కడికి వాలిన మరుక్షణం నుంచీ మళ్ళీ నాటకాలలో మునిగి పోదామని తొందరగా ఉంది. చదువు సంగతి దేవుడెరుగు - మనకీ చదువులు ఒక లెక్కలోవి గావు . ఎలా చదివినా పాసైపోతాం. నటన.....దీని అంతేమిటో చూడాలి.
పైగా మన యూనివర్సిటిలో యీ మోజున్న వాళ్ళు అనేకమందిట! తొందరగా రా! నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటాను.
మీ ముకుందం"
ఉత్తరం మడిచి నాన్నగారి గడివేపు చూసేడు రావ్. అక్కడాయన గదిలో చాలామంది మనుషులు చేరి ఎన్నికల గురించి ధారాళంగా మాట్లాడుతున్నారు. మంచం దిగి , అమ్మ దగ్గిరికి వెళ్ళేడు. ఆవిడ చాపమీద వెల్లకిలా పడుకుని వుంది. కొడుకు తన దగ్గిరికి రావడంతోనే తన దగ్గిరున్న ఉత్తరాన్ని కొడుక్కి యిచ్చింది.
రావ్ ఆ ఉత్తరాన్ని చూసేడు. అన్నయ్య రాసింది. పూనా నుంచి వచ్చిందది. అతనా ఉత్తారం చదవకుండానే , తల్లి దానిలో వివరాలన్నీ చెప్పింది.
"వీడింత ప్రయోజకుడవుతాడని తెలిస్తే నేనంత మమకారం పెంచుకునేదాన్ని కాదు శ్రీనూ! ఉద్దరించేడు మిలట్రీలో చేరేడుట. ఇంతలో తల్లి మొహం చూచేందుకు వీలు కాదుట. ఎవర్ని ఉద్దరించనూ ఈ తిక్క పనులు? ఇంటి పట్టునుంటే గడవదా?చదువు మాని, జులాయిగా తిరిగి, చేతికందిన డబ్బంతా వాడి సరదాలకి తగలెట్టి చివరికీ స్థితి కేదిగాడు. వాడు చూస్తే అలా అఘోరిస్తూన్నాడు. ఈ యింటాయనకి మతిపోయి ఎన్నికలంటున్నాడు. ఎవర్నని ఏం ప్రయోజనం రా శ్రీనూ! నేనేనాడు పాపం చేసుకున్నానో అనుభవిస్తున్నాను."
"నేను విశాఖపట్నం వెళ్ళాలమ్మా! అప్పుడే మా వాళ్ళంతా వెళ్ళిపోయేరు."
"నన్నడిగి ఏం ప్రయోజనం నాయనా? ఈ యింట్లో నా స్థానమేమిటో గ్రహించనేలేదా?"
"నాన్నమో అస్తమానం హడావుడిగా వున్నడాయే"
"మరే మాయదారి ఎన్నికలు మనకోసమే వచ్చేయిరా!"
"ఇవాళ.....ఎలాగైనా ఆయనతో మాట్లాడాలి."
"దేన్నీ గురించి?"
"నా చదువే, నా చదువు గురించి."
"నాతొ చెప్పాలిట్రా శ్రీనూ! నువ్వేం పసిపిల్లాడివి కాదు! ఇప్పుడే వెళ్ళి మాట్లాడు"
రావ్ ఇప్పటికి కూడా తచ్చాడేడు గాని చివరికి తెగించి నాన్న గదివేపు నడిచాడు. ఆ గదిలో జానకిరామయ్య గారు ఎవరితోనో ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నారు -
"వేరి గుడ్ -- బసవయ్యా , నువ్వు నీ మాట మీదే నిలబడు. లోకనాధం గాడి గర్వాన్ని యీ దెబ్బతో అణగదోక్కాలి ఆరు నూరైనా , నూరు ఆరైనా ఫరవాలేదు. ఏమిటయ్యా జంకేది? - వెయ్యి మంది ఓటర్లని పదివేలకి కొన్నాం. అప్పుడే భయపడలేదు నేను. ఆరుగుర్ని .....ఒక్క ఆరుగుర్ని మనవేపు కట్టుకోలెం? ఓటరు ఖరీదు పదైతే - ఇక్కడి పెద్ద మనుషుల రేటు వేలతో పలుకుతుంది. అంతేగా . మరేం ఫరవాలేదు. అవన్నీ నే చూసుకుంటాను. నా తరపున నువ్వు పని చెయ్ చాలు. గుర్తుంచుకో నువ్వు నా కుడి భుజంవి. అలాగే.....ఇప్పుడే వస్తావా......రైట్.....తొరగా రా. ఆ.....మనవాళ్ళంతా యిక్కడే వున్నారు. ఆ .....ఉన్నాడు నువ్వు వచ్చేయ్."
ఫోన్ లో మాట్టాడిన తరవాత అయన తీరుబడిగా కూర్చుని తాపీగా అన్నారు.
"ఈ బసవయ్య ఒకడు. ఒట్టి చాదస్తపు మనిషి. చెప్పింది చెప్పవయ్యా అంటే తత్సర్యాలడిగి మనిషిని విసిగించి పారేస్తాడు. డబ్బు ఖర్చు పెట్టేది నేను. అతనేం గాదుగా. ఏమిటో అతని డబ్బే తగలబడిపోతున్నట్టు వెధవేడుపూ అతనూను."
రావ్ గదిలోకి వెళ్ళి నుంచున్నాడు. జానకిరామయ్య గారు కొడుకుని తీక్షణంగా చూస్తూ అడిగేరు."
"ఏమిటోయ్ ....ఏం కావాలి నీకు?"
