Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 15


    "యశోధా! మీ అమ్మాయికి మైనారిటీ తీరగానే లేవదీసుకు పోతాడట........" పురుషోత్తమరావు వెక్కిరించాడు.

    "రాధికా! అసలేమిటే ఇదంతా! నీవెంత, నీ వయసెంత! మమ్మల్ని చంపుతున్నావు కదే......" యశోద ఏడ్చింది. కూతుర్ని వంగదీసి నాల్గు గుద్దింది. రాధిక మౌనంగా అన్నీ సహించింది.
 
    "యశోదా! మైనారిటీ తీరకముందే అమ్మాయి పెళ్ళిచేయాలి." అన్నాడాయన.

    "ఇదెక్కడి విడ్డూరమండీ! దీని వయసంతని ప్రేమ, దోమ అంటుంది."

    "ఎంతయినా, ఆ పంధాలో ఆలోచిస్తుందంటే, మనము త్వరపడాలి" అన్నాడు.

    "ఏమిటండీ!" అప్పుడే మధుమూర్తి వచ్చాడు.

    మధుమూర్తి గురించి ఎవరికి మంచి అభిప్రాయంలేదు. అతను అమ్మాయిలను పాడుచేయడం, వదిలించుకోవడం చేస్తుంటాడు. తలలే మార్చాడని అంటుంటారు.

    "ఆ ఇంట్లో యశోద కర్మకాలి అడుగుపెట్టింది" అంటారు.

    అలాంటి మధుమూర్తికి తన ప్రేమ విషయం తెలిస్తే ఇంకేమయినా వుందా.

    "మనమ్మాయి చాలా ఘనకార్యాలు చేస్తోంది" విషయం టూకీగా చెప్పాడు పురుషోత్తమరావు.

    "అబ్బ! ఇంత చిన్న విషయానికి వర్రీ అవుతావేంనాన్నా! నువ్వు నిశ్చింతగా ఉండు. నిప్పుమీద కన్నేసిన వాడి కన్ను కాలిపోతుంది" అన్నాడు.
 
    "ఆ పార్వతమ్మను పిలిపించి చెప్పు."

    "ఊర పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, ఎందుకు నాన్నా" అని తమాషాగా నవ్వి మీసం మెలివేసాడు.
                *    *    *
    "అదన్నయ్యా! అదీ జరిగిన సంగతి. నేనో ఉత్తరం కూడా రాసాను. మా అన్నతో జాగ్రత్త అంటూ" రాధిక కళ్ళనిండుగా నీరుంది. 

    "ఛ......ఛ......ఏడ్వకు...... అతన్ని భయపెట్టి, ఊరు విడిచిపెట్టేలా చేసి ఉంటారు." అన్నాడు సిద్దార్ధ.
 
    "వాళ్ళమ్మ ఏడుస్తూ నాన్న దగ్గరకు వచ్చింది. పెద్దన్నయ్య పెళ్ళి జరిపిస్తానని తీసుకు వెళ్ళాడని అంటోంది" అన్నది.

    "ఆమె అదే ధ్యాసలో ఉండి ఆ మాట అని ఉంటుంది. నువ్వేం దిగులుపడకు........." అని ఓదార్చాడు.

    "నేను చేసింది పొరపాటా -"

    "మనకు అమ్మ, నాన్నకు ఒక తరం, అంతరం ఉందమ్మా! ఏని హౌ అయివిల్ ట్రయి టు ట్రేస్ హిమ్" అన్నాడు.

    అతను ఆలోచిస్తూ పచార్లు చేసాడు.  "అన్నయ్యా! నేను ప్రేమించిన శ్రీనివాస్ ను పేదవాడని చంపించాడు నాన్న" అంటూ రాధిక రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు.


                                      4


    "సిద్దూ! నీతో కొన్ని విషయాలు మాట్లాడాలిరా" భోజనాల సమయంలో పురుషోత్తమరావు చెప్పాడు.

    "చెప్పండి నాన్నా!"

    "పైకిరా........." అన్నాడు. సిద్దార్ధ తలాడించాడు. మేడమీద ప్రత్యేకంగా పురుషోత్తమరావు కోసం ఓగది ఉంది. బయటినుండి మెట్లున్నాయి. అతని కోసం వచ్చే స్త్రీలు బయటినుంచే వచ్చి వెళ్ళిపోతారు అతను పచ్చి శృంగార పురుషుడంటారు.

    వాళ్ళు. వీళ్ళు అనగా విన్నాడు. తనకు పెద్దగా ఆ విషయాలు తెలియవు మొన్నటివరకు.

    "ఏమిట్రా కంచంలో ఆ రాతలు......."

    తల్లి ప్రశ్నకు చెయ్యి కడుక్కుని లేచాడు.

    "ఏమిట్రా! అప్పుడే పెద్దవాడినయినట్టు........" యశోద అడిగింది.
 
    "అది కాదమ్మా! బయటి దారిగుండా ఇంకా స్త్రీలు వస్తారా!"

    "అదా నీ సందేహం......." ఆమె నవ్వేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS