ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని దానిలా, 'ఎలా వున్నాను ,' అని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది ఆవిడ.
వాళ్ళ భోజనాలు అయిపోయాయి. 'సీత వచ్చాక అదీ నేనూ కలిసి తింటాము.' అంటూ గిన్నెలు సర్ది మూతలు పెట్టి వచ్చేసింది.
గదిలో కూర్చుని మాట్లాడుతున్నా ఆవిడ దృష్టి కిటికీ లోంచి కనిపిస్తున్న బయటి రోడ్డు మీదే వుంది. ఇవాళ ఏమైనా సరే సీత ని నిలదీసి అడగాలి-- అసలు అది ఎలా వస్తుందో చూడాలి. ఇదే ఆవిడ ధ్యాస.
తొమ్మిది అవుతూనే పిల్లలూ చిదంబరం నిద్రాలకి వుపక్రమించారు. చిదంబరం తెల్లవార గట్ల నాలుగు గంటలకే నిద్ర లేచిపోతాడు అందుకు అతను సాధారణం గా త్వరగానే నిద్రపోతాడు -- పిల్లలూ అంతే.
తోమ్మిదిన్నర దాటింది -- సుందరమ్మ గారు ఊపిరి పీల్చటం, రెప్ప వెయ్యటం కూడా మరిచి పోయినట్లు రోడ్డు వైపుకే కళ్ళు చిట్లించి చూస్తోంది -- అలా చూస్తున్న ఆవిడికి దూరంగా రెండు ఆకారాలు మెల్లిగా నడుచుకుంటూ రావటం కనిపించింది. ఆవిడ గుర్తు పట్టింది. సందేహం లేదు-- వాళ్ళు సీతా , సత్యనారయణా ' హు ఎంత సిగ్గుమాలిన పని' అనుకుంది బుసలు కొడుతున్న ఆవేశంతో. వాళ్ళు గేటు తెరుచుకుని లోపలికి వచ్చేదాకా అలాగే నిలబడి తరువాత మెల్లిగా తలుపు తియ్యటానికి వెళ్ళింది -- తలుపు తెరవగానే ఎదురుగా నిలబడి వున్న కూతుర్ని చూస్తుంటే ఆవిడికి ఒంటి నిండా తేళ్ళూ, జేర్రులూ పాకినట్లయింది -- ఆగ్రహం, ఆవేశం జుగుప్స లాంటి భావాలు ఎన్నో ఒకదానితో ఒకటి పోటీపడి మరీ ఆవిడ కంఠం నోక్కోస్తున్నా ఎలాగో గొంతు పెగుల్చు కుని,
'సాయంకాలం మోహిని నీకోసం వచ్చింది' అంది కూతుర్ని లోపలికి రానిచ్చి మళ్లీ తలుపులు గడియ వేస్తూ.
సీత కళ్ళల్లో ఒక్క క్షణం తొట్రు పాటు కనిపించినా మళ్లీ అంతలోనే నిలదొక్కు కుంది కాని సమాధానం ఏమీ చెప్పలేదు. ఆ మౌనం చూస్తుంటే సుందరమ్మ గారికి మరీ తిక్క రేగుకు వచ్చింది.
'నువ్వూ మోహినీ కలిసి సినీమాకి వెళ్తున్నాం అని చెప్పావ్ ' అంది.
'మోహినీ తో వెళ్ళలేదు-- నేనూ సత్యం గారూ కలిసి వెళ్ళాం.'
కూతురు అలా నిర్బయంగా ఏమాత్రం తొణకకుండా అలా సమాధానం చెప్పటం చూస్తూ సుందరమ్మ గారే ఒక్క క్షణం తెల్లబోయింది. అంతలోనే సర్ద్జుకుని ---
'నేను అదివరకో సారి చెప్పాను-- ఆ అబ్బాయితో మితిమీరిన స్నేహమూ, షికార్లూ కూడదని-- నా మాటలంటే నే నీకేం లక్ష్యం లేనట్లుంది -- చూసిన వాళ్లు నలుగురూ ఏమైనా అనుకుంటారనే జ్ఞానమైనా లేదేమే నీకు? ఈ విషయం నాన్నగారి దాకా వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు?...తల్లి కళ్ళెర్ర జేస్తూ కోపంగా మందలిస్తుంటే సీత బిక్క మొగం వెయ్యలేదు సరికదా కాస్తయినా బెదిరినట్లూ కూడా కనిపించలేదు -- పై నుంచి తెగేసి సమాధానం కూడా చెప్పేసింది.
'ఇంక ఇప్పుడు ఎవరికి తెలిసినా, మాకేం భయం లేదు -- మేమిద్దరం పెళ్లి చేసుకో బోతున్నాం ...'
వింటున్న సుందరమ్మ గారు నోటంట మాట పెగల్లేదు ఒక్క క్షణం -- నాగరికత ప్రబలి ఆడా మగా వివక్షత లేకుండా స్నేహాలు కలుపుకుని సరదాగా తిరగటం అన్నది కొన్ని కొన్ని చోట్ల అతి సామాన్యం అయిపోయిందనీ, తన కూతురు కూడ అలాంటి నాగరికతా వ్యామోహం లోనే పడి కొట్టుకుంటోందని , ఇంక అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు తనకి నచ్చవని నయానో' భయానో చెప్పి బుద్దిగా యింట్లో కూర్చో పెట్టాలనీ ఎన్నో అనుకుంటున్న సుందరమ్మ గారికి సీత చెప్పినది వింటూంటే తల తిరిగి పోయినట్లయింది.....చివరికి గొంతు పెగల్చుకుని కాస్త గట్టిగానే అంది.
'ఏమిటే నువ్వనేది?'
'నేను సత్యంగారిని పెళ్లి చేసుకుంటాను ' మళ్లీ అదే సమాధానం.
'నోరు ముయ్యి-- అట్టే, ఇష్టం వచ్చినట్లు వాగవంటే కాళ్ళూ చేతులూ కట్టి గదిలో పడిసి తలుపులు తాళాలు వేసేస్తాను.... పెళ్లి చేసుకుంటుందిట, పెళ్లి-- వాడి కులం ఏమిటో తెలుసునా? ఎన్ని చదువులు చదివినా, ఎన్ని ఊళ్ళూ తిరిగినా మన ఆచార వ్యవహారాల నీ మన సాంప్రదాయాన్నీ ప్రాణ ప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాం-- మందు తాగినట్లే కోడి గుడ్డు తీసుకోండి అని డాక్టర్ ఎన్నిసార్లు చెప్పినా ససేమిరా వల్ల కాదనుకున్నాం. అంత అసహ్యం ఆ పదార్ధాల పేరు చెప్తేనే ....అలాంటిది వాడితో ఎలా కాపరం చేయాలను కుంటున్నావు? అసలు నీకు వంటి మీద స్పృహ వుండే ఆ మాటా అన్నావా...'
ఆ సరికే నిద్రా భంగమైన చిందంబరం కాస్సేపు అలా మంచం మీద పడుకుని వుండే భార్య మాటలు విని విషయం అర్ధం చేసుకుని తారా మండలానికి ఎగురు తున్నట్లు లేచి వచ్చాడు.
తండ్రి అడుగుల చప్పుడు వింటూనే సీత కొద్దిగా జంకి నట్లయింది. ఎర్రగా చింత నిప్పుల్లా వున్న అతని కళ్ళూ, జేవురించి వున్న మొహం చూస్తూ బిక్క చచ్చిపోయింది-- తల్లితో చెప్పినట్లు నిర్భయంగా తండ్రి ఎదుట మాట్లాడటం సాధ్యం కాదేమో ననిపించింది. అయినా వెనక్కి తగ్గకుండా నిలదొక్కుకోటానికే ప్రయత్నించింది--
భర్త వాలకం చూసి సుందరమ్మ గారు కాళ్ళూ చేతులూ వణుకు తుంటే ఇంక ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో తోచక అలాగే నిలబడి పోయింది.
చిదంబరం కూతురుకి కాస్త దగ్గరగా వచ్చి చెయ్యి జాచి గబుక్కున ఆ పిల్ల జబ్బ పుచ్చుకుని ఆమె ని తన వేపుకి తిప్పుకుంటూ 'ఏమిటే అంటున్నావు?' అన్నాడు.
సీత వెంటనే సమాధానం చెప్పలేదు.
'ఊ -- మాట్లాడవేం? ఇప్పటి దాకా అమ్మతో నువ్వు చెప్తున్నదేమిటే.' అన్నాడు. మనిషి ఆపాద మస్తకం ఒక విధమైన ఆవేశంతో వూగి పోతున్నాడు. కూతురు చేతిని పట్టుకున్న అయన చెయ్యి అంతకంత కీ బిగుసుకు పోతూ ఆయనలో ఉదృతం అవుతున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
ఇంక మౌనంగా వుంటే లాభం లేదని, 'నేను-- నేను నిర్ణయించు కున్నాను. అదే చెప్పాను.' అంది చెయ్యి విదిపించుకోతానికి ప్రయత్నిస్తూ.
'పెళ్లి చేసుకుంటున్నావా?'
'ఔను.' అన్నట్లు గబగబ తల ఊగించింది సీత.
'ఎవర్ని ?'
'సత్యం గారిని.'
'ఛీ-- సిగ్గు మాలిన డానా,' - ఒక్క ఊపున ఆయన తోసిన తోపుకి సీత వెళ్లి గుమ్మం మీద పడి తల చిట్లి పోవలసిందే -- కాని, అక్కడే వున్న సుందరమ్మ గారు అడ్డు వచ్చి తన చేతులలోకి కూతుర్ని తీసుకుని ఏడుపు గొంతుతో అంది.
'చూడమ్మా' అన్నీ తెలిసిన దానివి చదువు కున్న దానివి -- మరొక్కసారి బాగా ఆలోచించు-- వంశానికింత అప్రతిష్ట తెచ్చే పని చెయ్యకు ....ఇరవై ఏళ్ళు నిండినా ఇంతవరకూ పెళ్లి ప్రయత్నాలే చెయ్యటం లేదనీ బొత్తిగా మొగరాయుడి లా పెంచుతున్నా మనీ ఇప్పటికే మన వాళ్ళంతా దెప్పి పొడుస్తున్నారు....ఇంక నువ్వీ పెళ్లి చేసుకుంటే మేం మళ్లీ వాళ్ళందరి మొహం చూడగలమా.......అక్కయ్య లా నీకూ అనువైన సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనీ, మీరంతా సుఖంగా సంతోషంగా వుంటే చూసి ఆనందించాలనీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం........'
'ఇప్పుడు మాత్రం నేను సుఖంగా ఉండనని ఎందు కనుకోవాలి? నిజంగా నా సుఖం ఒక్కతే మీకు కావాల్సిందయితే ఈ పెళ్ళికి ఒప్పుకోండి--'
'హు-- సుఖంట సుఖం -- నువ్వు చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోతూ నీ సుఖం చూసి సంబరపడ మంటావా? ఎంత డబ్బు వున్నా ఎన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నా, ఇంత అప్రతిష్ట పని చేసిన నిన్ను చూస్తూ శాంతిగా ఎలా బ్రతక గల మను కుంటున్నావే -- ఇదేనా ఇన్నాళ్ళూ పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులకి నువ్వు చెప్పే సమాధానం? చూడు సీతా, నీకూ తెలుసు నాకు మిగిలిన పిల్లలంతా ఒక ఎత్తూ నువ్వు ఒక్క దానివీ ఒక ఎత్తూనూ-- మా అమ్మ పేరు పెత్తుకుని నిన్ను పసితనం నుంచీ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాను. నువ్వు అడిగిన దేదీ కాదనలేదు. ఒక విధంగా చెప్పా లంటే నా మితిమీరిన వాత్సల్యమే నువ్వు కాస్త సరదాగా తిరుగుతున్నా చూసీ వుంటే నువ్వు ఇంతకీ తెగించే దానివి కాదు-- కాని ఒక్కటి ఆలోచించు. తల్లితండ్రులు బిడ్డల యెడల చూపించే వాత్సల్యాన్నీ వారికిచ్చే స్వేచ్చనీ ఇలా దుర్వినియోగం చేసుకుని వాళ్ళ గుండె లలోనే కుంపటి రగిలిస్తాననటం నీకేమైనా న్యాయంగా వుందా? నేను బ్రతిమాలుకుంటున్నాను . నీ మనస్సు మార్చుకో.' ...తండ్రి ఆవేశాన్ని అదుపు లోకి తెచ్చుకుని కాస్త ఒక మెట్టు దిగి వచ్చినట్లు మాట్లాడటంతో సీతకి మరింత ధైర్యం వచ్చింది.
