గిన్నె మాడుతున్న వాసనకు మొహం చిట్లించుకుని, కంగారుగా నిప్పుల మీద గిన్నె కింద పడేసి మరో గిన్నెలో నీళ్ళు పెట్టింది. శ్రద్దగా కాఫీ కలిపి పట్టు కెళ్ళింది గదిలోకి. నుదుటి మీద చెయ్యి వేసుకుని మగతగా కన్ను మూసిన మాష్టారు పార్వతి రాకను గ్రహించుకుని కళ్ళు విప్పారు .
"కాఫీ తీసుకో, నాన్నా!"
మాట్లాడకుండా గ్లాసు అందుకున్నారాయన. పార్వతి మొహం లో ఎప్పటి కళాకాంతులు కనిపిస్తుంటే కొంచెం ఆశ్చర్యం కలిగింది. కూతురు తనలో తను బాధపడి ఎడ్చుకున్న లక్షణాలేమీ లేవు.
"అలా కాసేపు బజారు కేసి వెళ్ళి వస్తానమ్మా!" గ్లాసు బల్ల మీద పెడుతూ లేచారు. "కూరలే మైనా తెమ్మంటావా? ఏదీ, ఆ చిన్న సంచీ ఇస్తావూ?"
"వంకాయలు వీధిలో కొస్తే మధ్యాహ్నం కొన్నాను, నాన్నా! కూరలేం వద్దు. తెస్తే కొంచెం కాఫీ పొడి , పంచదార తెచ్చుకోవాలి."
'అలాగే ." చెప్పులు తొడుగుకుంటూ, "వీళ్ళేరి? సూర్యం, రుక్కూ ఇంకా రానే లేదూ? చీకటి గూడా పడుతోంది' అంటూ వీధి గుమ్మం కేసి దారి తీశాడు.
"ఇంటికి వచ్చే వెళ్ళారు, నాన్నా! ఆడుకోటానికి పోయినట్టుంది."
"వాళ్ళ మొహం! చీకటి పడుతోన్నా ఏం ఆటలు/ కొంచెం మందలించమ్మా వాళ్ళని" అంటూనే రోడ్డు ఎక్కారు.
జనసమర్ధంలో కలిసి నడుస్తున్న తండ్రి కనిపించే వరకూ అలాగే చూస్తూ నించుంది పార్వతి. ఇంతమంచి తండ్రి అందరికీ ఉంటాడా? తమ మీది నాన్న కున్న ప్రేమ ప్రతి తండ్రికీ తన బిడ్డల మీద ఉంటుందా? అమ్మ పోయినా అమ్మలాగే చూసుకుంటున్న నాన్న, పుట్టెడు బీదరికంతో రాత్రింబవళ్ళు కష్ట పడుతున్న నాన్న, తమ సుఖం కోసమే ఎన్ని బాధలైనా భరిస్తున్న నాన్న, అమ్మలేని లోటు తెలీనంతగా ప్రేమిస్తున్న నాన్న-- ఇంత మంచి నాన్నకు తనేం ప్రతిఫలం ఇవ్వగలదు? తనకోసం కన్నీళ్ళు పెట్టుకునే నాన్నను ఎలా ఒదార్చగలదు? నాన్నను ఎల్లవేళలా సంతోషపెట్టటానికి తనేం చెయ్యగలదు?
'అక్కా! అక్కా, మాట్లాడవేమే?" వోణీ పట్టుకు లాగుతున్న రుక్కు బిక్క మొహం వేసుకోంది.
"ఏమిటే ? ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" చెల్లెలి పలకరింపుతో తండ్రి ధ్యాస మళ్ళిపోగా రుక్కును బుజ్జగిస్తూ అడిగింది పార్వతి.
"అన్నయ్య కొట్టి పారిపోయాడక్కా!" ఏడ్చేయ్యటానికి సిద్దంగా ఉంది రుక్కు.
"అన్నయ్య కొట్టాడా? ఛ! వాడెప్పుడూ అలా కొట్టడే! ఏమైందసలు? ఎందుకు కొట్టాడు నిన్ను?"
"నాకో చింతకాయ దొరికింది. వాడికి చూపించాను. కొంచెం విరిచి ఇమ్మన్నాడు. ఊహూ! ఇవ్వనన్నాను. నెత్తి మీద మొట్టేసి...." బావురుమంది రుక్కు.
పార్వతి చెల్లెల్ని దగ్గరికి తీసుకుని లాలించింది.
"ఛ! ఏడవ కూడదే, రుక్కూ! రానీ, ఆ వెధవని. అడుగుతాను. పోనీ, రుక్కూ, అన్నయ్య కి కొంచెం పెట్టలేక పోయావా? పాపం, మీఅన్నయ్యే కదా? నిన్ను అడగనే అడిగాడు కదా?"
"ఊహూ! నే పెట్టను. చింతకాయ చెట్టు కింద నాకే దొరికింది" అంది రుక్కు వెక్కిళ్ళు పెడుతూ.
"పోనీలే. ఊరుకో. వెళ్ళి నీళ్ళు పోసుకో.ఎసరు మరిగే పోతోందో ఏమో!" అంటూ గబగబా లోపలికి పోయింది పార్వతి.
సూర్యం ఇంటికి చేరాక కాస్సేపు వాళ్ళ తగువు పరిష్కరించి , ఇద్దర్నీ మందలించి, అన్నాలు పెట్టింది. తిళ్ళు తిని లేచి ఆ ఒక్క లైటుకు దూర దూరంగా ఎడమొహం పెడ మొహాలతో చదువుకుంటూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ.
మాస్టారు వీధి లోంచి వస్తూనే బడలికగా కూలబడ్డారు. ఖాళీ సంచీ అందుకని వంకెన తగిలించింది పార్వతి. కాస్సేపు ఊరుకుని అంది "నాన్నా! లేవకూడదూ? స్నానం చేసి కొంచెం అన్నం తిని...."
మాటలు పూర్తీ కాకుండానే లేచాడు తండ్రి. తువ్వాలు అరవేసి కంచం ముందు కూర్చుంటూ పార్వతి కేసి చూశాడు. అంతవరకూ తండ్రి కేసే చూస్తూ నించున్న పార్వతి కొంచెం చూపు మళ్ళించుకొంది.
"అమ్మా! పార్వతీ! నేనొకటి అనుకుంటున్నా నమ్మా!"
"ఏమిటి, నాన్నా! ఏమైనా కావాలా?"
"అది కాదమ్మా! ఇలా కూర్చో! కొంచెం మాట్లాడుకుందాం." పార్వతి అనుమానంగా చూస్తూ తండ్రి పీట దగ్గరే కూర్చుంది.
"పాపం చలపతి మామయ్యా కైనా మన మీద అభిమానం లేకపోలేదమ్మా! వేలకు వేలు గుమ్మరిస్తామంటూ సంబంధాలు వస్తోంటే ఏం చేస్తాడు? ఎవరి కైతే మాత్రం డబ్బు చేదా? ఈ రోజుల్లో వరకట్నం ప్రతి వివాహానికి ఉండేదే! ఎవరి ఆశ వాళ్ళది. తప్పేముందమ్మా?"
అయోమయంగా చూసింది పార్వతి. ఏమిటి తండ్రి చెప్పుతున్నది? ఇన్నాళ్ళు కబుర్లు చెప్పి, హస్యాలాడి ఊరించి, ఆశ పెట్టి, ఇప్పుడిలా చేస్తుంటే తప్పే లేదా? ఇంతకూ వాళ్ళను సమర్చించకపోతే తాము చెయ్యగలిగింది మాత్రం ఏముంది?
"నేను బాగానే ఆలోచించానమ్మా! అంతలేసి కట్నాలు కానుకలూ మనం ఇవ్వలేక పోయినా ఏవో రెండు మూడు వేలు ఇస్తామని కాళ్ళా వెళ్ళా పడతాను. తప్పేం లేదమ్మా! మనం పౌరుషాలతో మొహాలు తిప్పుకు కూర్చుంటే వాళ్ళకేం నష్టం? సిరిసంపదలతో తులతూగే రాజాలాంటి సంబంధం. ఐదారేళ్ళుగా హాస్యానికో, నిజానికో అనుకుంటూ ఉన్నదే!"
"నాన్నా!' ఆశ్చర్యంగా చూసింది పార్వతి. "రెండు మూడు వేలు మాత్రం మనం ఎలా ఇవ్వగలం?"
"మీ అమ్మ పేర నున్న ఎకరం అమ్మేస్తే మూడు వేల పై చిలుకే వస్తుందమ్మా! ఆహా! నిక్షేపం లా వస్తుంది. ఇక ఆలస్యం చెయ్యను. ఈ రాత్రే మామయ్యా ని అడిగేస్తానమ్మా , పార్వతీ!"
పార్వతీ మాట్లాడలేక పోయింది.
"ఏం తల్లీ! ఇది చక్కటి ఆలోచన కదూ?"
"మరి.....మరి, అ ఒక్క ఆధారం తెగ నమ్ముకుంటే తమ్ముడి చదువూ, చెల్లాయి పెళ్ళీ...."
"మరేం ఫరవాలేదు, పారూ! భగవంతుడు లేడూ? నారు పోసిన వాడే నీరూ పోస్తాడంటారు. మరొక్క రెండేళ్ళు కష్ట పడి చదివించానంటే -- సూర్యం స్కూలు ఫైనల్ పరీక్ష వ్రాస్తాడు. ఆ సెలవుల్లోనే ఏ అయ్యా కాళ్ళో పట్టుకుని వాణ్ణి ఏదైనా ఉద్యోగం లో వేయించేస్తాను. ఇక రుక్కు మాటంటావా? శాంతమ్మత్త కొడుకు ఉండనే ఉన్నాడు. చేసుకోమని బ్రతిమాలాడుతాను. అత్త నా మాట కాదనదు." మాస్టారి మొహంలో చూస్తుండగానే కాంతి అలుముకుంది.
"తెలివి తక్కువగా ఈసంబంధం వదులుకోవద్దమ్మా! రఘుపతి మన యింటి అల్లుడే కావాలి. మహా గుణవంతుడు. నీ మొహం చూసి మాట్లాడమని మామయ్యను మరీ మరీ అడుగుతాను. ఇదిగో, ఇప్పుడే వెళ్తాను." గబగబా అన్నం తింటూనే మాట్లాడుతూ కూర్చున్న తండ్రిని చూస్తుంటే ఏమిటో భయం వేసింది పార్వతికి. నాన్న బజారులో తిరుగుతూ ఈ విషయమే ఆలోచించాడు కాబోలు. అమ్మ పసుపు కుంకాల క్రింద తెచ్చుకున్న ఆ ఒక్క ఎకరం ఇంతకాలం కుటుంబాన్ని పెన్నిధి లాగే కాపాడుతూ వచ్చింది. వేన్నీళ్ళకు చన్నీళ్ళు గా తోడూ పడింది. తీరా అది ఇప్పుడు అమ్మేస్తే ఇల్లు గడిచే మాట అటుంచి సూర్యం చదువేమవుతుంది? రుక్కుకు మాత్రం పెళ్లెలా అవుతుంది? పాపం, వాళ్ళనిద్దర్నీ చిన్నవాళ్ళను చేసి, ఉన్నది కాస్తా తన ఉపయోగానికి వినియోగించుకుంటే ఛ! నాన్న కైనా జాలి వెయ్యటం లేదూ? పదమూడేళ్ళు నిండి నిండని సూరి మరో రెండేళ్ళ కే ఉద్యోగం చెయ్యగలడా? అంత చిన్న వాడికి ఉద్యోగం మాత్రం ఎవరిస్తారు?
"నువ్వు కూడా తొందరగా వడ్డించుకో , అమ్మా." తండ్రి లేచి పోతుంటే కంగారు పడింది పార్వతి. "అదేమిటి నాన్నా? మజ్జిగ పోసుకోవూ?"
"తాగుతాలే , అమ్మా! గ్లాసులో పోసి ఇవ్వు." తండ్రికి మజ్జిగ అందించి అన్నం కలుపుకుంది పార్వతి. సరిగా సయించ లేదు. వదిలి లేవలేక బలవంతంగా ముద్దలు మింగింది. నాన్న ఇచ్చే ఇంత తక్కువ కట్నానికే మామయ్య ఒప్పుకుంటాడా? కాదనేస్తే మళ్ళా నాన్న ఎంత బాధ పడతాడో గదా? తానూ ఓ పుస్తకం తెరచుకొని దీపందగ్గరే కూర్చుంది.
సూరి ఏక దీక్షగా ఇంగ్లీషు పద్యాలు కంఠస్తం చేస్తున్నాడు. రుక్కు నిద్రతో జోగుతూ లైటు మీద పడబోయింది. దాన్ని వీపు మీద తట్టి లేపి పోయి పడుకోమంది పార్వతి. రుక్కు పడుకోవటంతో సూర్యం కూడా జోగటం మొదలెట్టాడు. వాణ్ణీ పొమ్మని కసిరి పుస్తకాలు సర్దేసి లైటు తగ్గించి రుక్మిణి పక్కనే ఒరిగింది పార్వతి.
