
ఆ వేళ వేణుగోపాల్ పడద కొడుకును పిలిచాడు. రవి అక్కడే ఉన్నాడు. మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకొని విషాదంగా నవ్వాడు. "ఈ పిల్లలకోసమే బ్రతికి ఉన్నన్ని రోజులూ తపించిపోయింది. ఇప్పుడు పిల్లలు నట్టింట నవ్వుతూంటే చూడలేకపోయింది."
తల్లి పేరు వినబడగానే ఇద్దరి మొహాలూ విషాదంతో చీకటిని ఆవరించాయి.
"ఇంక నామీదకూడా భరోసా లేదు. రవి అవకతవకలు చేస్తాడని అనుక్షణం బెంగపెట్టు కొనేవాడిని. కానీ వాడే మంచిపని చేశాడు. ఒక ఇంటివాడై తండ్రికోర్కె నేరవేర్చాడు. ఏమంటావురా, తాతా?" పిల్లవాడిని రెండు చేతులతో ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు.
రాము మాట్లాడలేదు.
'నువ్వుకూడా పెళ్ళి చేసుకో, రామా ఇప్పుడు చూడు, మీ అమ్మ లేకపోతే నేను ఎంత అవస్థపడిపోతున్నానో. అంటే కోడలు ఉపేక్ష చేసిందని కాదు. రేపు రవి సాగర్ డామ్ కి వెళ్ళిపోతాడు. ఆవిడకూడా వెళ్ళాలి. ఇంత ఇంట్లో మనం ఇద్దరం ఎలా ఉండగలం!
"నువ్వూ ఒక సమస్రం ఏర్పరుచుకొని నీ ప్రాక్టీసు ఇక్కడే కనక నా కళ్ళఎదుటే ఉంటే ఆ అందం ఎలాగైనా వేరు. ఈ నెల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఏమంటావు?" వేణుగోపాల్ కొడుకు నెత్తిన భాద్యత ఉంచాలని తాపత్రయపడుతున్నాడు.
"తొందరేం, నాన్నగారూ! అలాగే కానివ్వండి." రాము తమ్ముడివైపు చూశాడు.
"ఏరా, రవీ, అన్నయ్య అన్నది సబబేనా?"
రవి ఇరుకున పడ్డాడు. "ఏడాదిలోపల ఎప్పుడైనా ఫరవాలేదుకదూ, నాన్నగారూ?" తెలివిగా తప్పించు కొన్నాడు.
* * *
పెట్టిన వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఒకటీ తీరూతెన్నూగా లేదు. అంతా గజిబిజిగా షెల్ఫ్ అంతా నానా హంగామాగా అంది. వెతికి వెతికి విషిగి పోయాడు రాము.
తన సూట్ కేస్ లో బట్టలు సగం ముందుకువచ్చి వెక్కిరిస్తున్నాయి. ముందుకు వచ్చిన ఆ బట్టల్ని ఎలకలు స్వాహాచేశాయి. దుమ్మూ, ధూళితో పుస్తకాలు ఇంచు మించు శిథిలావస్థలో ఉన్నాయి. కళ్ళముందు నవ్వుతున్న తల్లి ప్రతిమ కనిపించి, "నువ్వు అమాయకుడివిరా!" అంటున్నట్లుంది. రాము కళ్ళలో నిలిచిన నీళ్ళు టప్ మని జారిపడ్డాయి.
"నా బాబూ, రామూ!" హఠాత్తుగా ఆగిపోయింది రాముదృష్టి. తల్లి అక్షరాలు పలకరిస్తున్నాయి. కవరుమీద తన పేరే. తల్లికి ప్రేమ పొంగినపుడు ఇలాగే పిలిచేది. అప్రయత్నంగా కవరు అందుకొని చింపాడు. అక్షరాల బారులవెంట దూసుకుపోతున్నాయి కళ్ళు.
* * *
పెంకుటింట్లోంచి పొట్టి పరికిణీ, ఓణీ వేసుకొని జడగంటలు పెట్టుకొన్న భారతి నీళ్ళకోసం అరమైలు నడిచి కాలవవరకూ వచ్చింది. పెద్ద రావిచెట్టుకింద సదా ప్రవహించే గోదావరి తాలూకు ఆ పాయ అంటే భారతికి భలే ఇష్టం. తన కష్టాల్ని పంచుకొనే ఆత్మీయురాలు. తన ఆనందాన్ని పంచి ఇచ్చే ఆప్తురాలు. దూరాన పడవలు తెరచాప చాచుకొంటూ ముందుకు వస్తూంటాయి. పల్లెపదాలు పాడుకొంటూ సాగిపోతూండే ఆ వాతావరణమే వేరు. పడవకు తాళ్ళుకట్టి ఆపసోపాలు పడుతూ 'హయిలో, హయిలెస్స' అంటూ గట్టుమీద బలవంతంగా పరుగులెత్తే ఆ కష్టజీవుల్ని చూస్తే తను కష్టం మరిచిపోతుంది. అందుకే గంటల తరబడి తలపడేసిన తేగల్ని బిందెలో దాచుకువచ్చి కాలవ మెట్లమీద కూర్చుని తింటూ చిట్టచివరకు బిందెనిండా నీళ్ళు నింపుకొని ఇంటిదారి పడుతుంది. తనకు తెలుసు ఇంటికి వెడితే జరిగే సన్మానం. కానీ ఈ కాలవ సమ్మోహనాస్త్రం వేసి నిలబెట్టేస్తుంది భారతిని. తూర్పు గోదావరిజిల్లాలో ఎక్కడో మారుమూల గంటి గ్రామంలో పెరిగిన భారతికి అదే ప్రపంచం; అదే కైలాసం; అదే సర్వస్వం.
"ఇంత ఆలస్యం అయిందేం? నీ అబ్బ నౌఖరెవరో చేసిపెడితే మింగుదాం అనుకొన్నావు కాబోలు? సిగ్గు లేకపోతే సరి. అరబిందెడు నీళ్ళు తీసుకురావడానికి ఆరు గంటలు!" ఠంగున పడింది భారతి నెత్తిన సవతితల్లి చేతిలో ఉన్న గరిటె.
"లేదు, పిన్నీ పరధ్యానంగా కూర్చుండి పోయాను." భారతికి ఏడుపు రాలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళు అసలు లేకుండానే పోయాయి.
"పరధ్యానం పరులమీద అంత ధ్యానం దేనికొచ్సిందీ? పిండి విసిరి, పిల్లలికి జడలువేసి, బట్టలు ఉతికి, అంట్లు తోమి కంచంలో అన్నం పెట్టాను. మింగు."
పన్నెండు గంటలు క్షణంలో దాటిపోయాయి. పుస్తకం ముందు కూర్చుని మాస్టారిచ్చిన వ్యాసం వివరంగా ఇంగ్లీషులో వ్రాస్తూంది భారతి.
"చదువు కాదు దరిద్రపు మొహాలకి చట్టిబండలు కూడాను." పిన్ని విసిర్న పుస్తకం ఆమడ దూరంలో పడిపోయింది. ఎదురింటి నారాయణ మాస్టారి దయ వల్ల మెట్రిక్ పరీక్షకు కూర్చున్నది భారతి.
* * *
కష్టాల్లో పెరగడం ఒకవిధంగా అదృష్టమే మరి. దైవం వెనక నిలబడి అభయహస్తం చూపిస్తూ ఉంటాడు. అందుకే బారతి చక్కగా పాసైంది. తండ్రి పోవడంతో సవతితల్లి రాజమండ్రి చేరుకొంది. ఉన్నంతలో తినడానికే కష్టంగా ఉండటంతో భారతి అణకువతో బాంక్ లో ఉద్యోగంకూడా సంపాదించింది.
"ఈవిడ ఆఫీసు వదలడం ఆలస్యం పరుగున చేరుకొంటుంది ఇల్లు." నవ్వాడు శ్రీధర్.
వెళ్ళబోయే భారతి చటుక్కున ఆగి చురుగా చూసింది. "అసలు మీ కెందుకా విషయం? నా ఇష్టం." విసురుగా సమాధానం ఇచ్చి చరచరా దూసుకుపోయింది.
మర్నాడు మెల్లిగా వచ్చి అన్నాడు శ్రీధర్: "క్షమించండి. మీకు కోపం వస్తుందని అనుకోలేదు. అయినా ఒకళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం నాదే పొరబాటు."
తలెత్తి శ్రీధర్ కళ్ళలోకి సూటిగా చూసింది భారతి. రెండు కళ్ళలో అందం ఉబికివస్తూంటే, ఠీవిగా, సూటిగా దూసుకుపోయే అతని ముక్కు, లావుగా మొరటుగా ఉన్న అతని పెదవులూ ఈ అయిదారు మాసాల్లో తనెప్పుడూ గమనించనేలేదు.
"పొరబాటే అయిందని చెప్పాను కదండీ!" పశ్చాత్తాపం మేళవించి అన్నాడు. మౌనంగా తల వాల్చేసింది.
* * *
పక్కమీద పడుకొన్నదే కానీ నిద్ర రాలేదు భారతికి. సవతితల్లి తనకు విడరాని బంధంగా తయారై నరకాన్ని రుచి చూపిస్తూంటే తను అసహాయురాలై, చింతించడం తప్ప ఏమీ చేయలేకపోతూంది. అవును, ఈ ప్రపంచంలో తను ఒంటరిగా బ్రతకలేదు. తనకు తోడు కావాలి. తన కష్టాల్నీ, సుఖాల్నీ పంచుకొనే ఆత్మీయుడు కావాలి. అతని హృదయంలో తల దూర్చి శాశ్వతంగా అలాగే అంటిపెట్టుకొని ఉండిపోవాలి. ఈవేళ కొత్తగా తను ఒక్కతే కోరలేదీ కోరిక. ఎన్నో సంవత్సరాలుగా, ఇకముందు ఎన్నో తరాలు కోరుకునే ఈ విచిత్రమైన కోరిక తనకు కలగడంలో ఆశ్చర్యం ఏముంది? శ్రీధర్ ను తను చేసుకొంటే వచ్చిన నష్టం ఏముందీ? అయినా తనకై తాను అడగలేదే?
ఆఫీసులో తలెత్తకుండా తన పని తాను కానిచ్చు కొని ఆఫీసు వదలగానే ఇంటికి చేరుకొనే భారతి క్రమ క్రమంగా శ్రీధర్ స్నేహాన్ని పెంచుకొని గంటల తరబడి ఆగిపోయేది.
అందరికంటే ముందుగా వచ్చి అందరూ వెళ్ళి పోయాక ఇంటిముఖం పట్టేది. శ్రీధర్ మాటల్లో ఆత్మీయతనూ, శ్రీధర్ కళ్ళలో అయస్కాంతశక్తినీ తనుదూరంగా నెట్టి వేయలేని అసమర్ధురాలైపోతూంది. శ్రీధర్ పరిష్వంగం కోసం మనసూ, శరీరమూ ఏకమై ఆక్రోశించేవి. గంటలూ, రోజులూ, నెలలూ నిమిషాల్లా దొర్లిపోతున్నాయి.
"ఇంకా ఎన్నాళ్ళు, భారతీ? నీకు దూరంగా నీ దగ్గిరే ఉండి నేను భరించలేను." శ్రీధర్ కోపగించుకొన్నాడు.
గోదావరి ఉరకలు వేస్తూ ప్రవహిస్తూంది. వరద రోజులు. విజ్రుంభించిన ఆ తల్లి సన్నిధిలో శ్రీధర్ ను చూస్తూంటే నవ్వు వస్తూంది. "మీకు తెలియదా? కొన్ని కట్టుబాట్లకు అందరిలాగే నేనూ లొంగి తీరాలి. నన్నుగురించి నలుగురూ అనుకోవడం నాకు అసహ్యం."
"నన్ను ఊరించి, ఆశపెడుతున్నావు. నిన్ను పెళ్ళి చేసుకోనని నేను అనలేదు కదా?"
"అందుకే కొన్నాళ్ళు ఆగాలి, మిస్టర్!" భారతి కొంటెగా నవ్వింది.
"నీమీద ఒట్టు!" శ్రీధర్ ఆత్రుతగా వంగి భారతి పెదవుల్ని మెల్లగా స్పృశించి వదిలేశాడు.
"గోదావరి సాక్షిగా నిన్ను నేను పెళ్ళి చేసుకొంటాను."
భారతి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. "నా కెవరూ లేరనేగా మిమ్మల్ని నమ్ముకొన్నాను. నన్ను మీరు అన్యాయం చేస్తే భరించలేను. 'గోదావరి సాక్షి' అంటున్నారు. వరదలు తీశాక మీ 'సాక్షి' గాలిలో కలిసిపోతుందేమోననే భయం. నన్ను మోసం చేస్తారా...." దూరంగా జరిగి నిలబడింది భారతి.
"లేదు, భారతీ. ఇంటికి వెళ్ళి అమ్మని ఒప్పించి నిన్ను తప్పకుండా తీసుకు వెడతాను. నువ్వు అమాయకురాలివి అనుకొన్నాను. కానీ గడుసుదానివే. నీ గడుసు తఃనంతో ఇలా ఏడిపిస్తూంటావు కాబోలు." శ్రీధర్ నదిలోకి రాళ్ళను విసురుతూ అన్నాడు.
"తప్పు కదా! నిండు గర్భిణి అంటారు మన తెలుగువాళ్ళు ఇప్పటి గోదావరితల్లిని. మీరలా రాళ్ళు విసిరితే నాకు కోపం వస్తుంది."
"ఐసీ!" నవ్వాడు శ్రీధర్.
* * *
రైలు ముందుకు దూసుకుపోతూంటే ఆలోచనలు వెనక్కుపోతున్నాయి. హైదరాబాదువైపు పరుగు తీస్తూంది రైలు. గతాన్ని తలుచుకోమ్తూ కన్నీరు కారుస్తూనే ఉంది భారతి. తఃనీ బరువు మోయలేదు. భగవంతుడు మూడు పంక్తులా రాసివేసిన ఈ క్షోభను తప్పించుకోలేదు. తనచేత కాదు. ఆనాడు అన్నట్లు చేయలేకపోయింది. అటు గోదావరిలో దూకలేకపోతూంది. ఇటు నలుగురిలో తలెత్తుకోలేకపోతూంది. తన కోరికలు ఆకాశాన్నంటుకొంటే నిచ్చెనలు వేసిన శ్రీధర్ అయిపులేకుండా పరారి అయిపోయాడు. ఒక ఆడపిల్లను, అభంశుభం తెలియని అమాయికురాల్ని పెట్టిన ఉసురు ఊరికేపోదు. తను ప్రేమించింది నిజమే. కానీ అన్యాయం చేయమనలేదే? ప్రేమ ప్రతీకారం కోరదు అనేది వట్టిమాట. పచ్చి అబద్ధం. తన హృదయంలో చెలరేగే మంటలు కురిపించేవి కన్నీరు కాదు రక్తపుధారలు. ఒక్కొక్క బొట్టు భూమిమీద పడుతూంటే అది శీధర్ కూ, శ్రీధర్ వంశానికి తర తరాలకూ తగలకుండా ఉండదు. అయోమయస్థితిలో తనను తాను సంబాళించుకోలేని పరిస్థితిలో మంచీ, చెడూ చెప్పవలసింది పోయి తన స్వార్ధానికి బలి చేస్తాడా? తను మొదట్లోనే చెప్పిందే-తనకు ప్రపంచంలో పేరు ప్రతిష్టలు కావాలని? ఇలా అనామకురాలిని చేయమని అన్నదా? నిరంతరం ప్రజ్వరిల్లే ఈ ప్రతీకారం కార్చిచ్చుల్లా ఎక్కడున్నా శ్రీధర్ ను తాకదూ? ఆ జ్వాలలో నిజం తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతున్న శ్రీధర్ని భగవంతుడే రక్షించాలి. మళ్ళీ నవ్వుకొంది భారతి. ఇంత ప్రతీకారంలోనూ శ్రీధర్ అంటే తన కెంత అభిమానం! ఒక ఆడపిల్ల అసమర్ధత గ్రహించలేని శ్రీధర్ తను కన్నకూతురి ద్వారా తెలుసుకోవాలి. అమాయకంగా తప్పటడుగు వేసినట్లైతే తన శాపం వృథా పోదు.
అమాయాకంగా పెరుగుతున్న తన గర్భస్థ శిశువును హత్యచేసి చేసిన నేరాన్ని రెట్టింపు చేసుకోదు. కంటికీ మింటికీ ఏకధారగా దుఃఖిస్తున్న తనను ఈ సమయంలో ఆదరించే దిక్కెవరు? బ్రతుకులో జరిగిన అధ్యాయాల్ని నెమరు వేసుకొంటూ కుళ్ళికుళ్ళి ఏడ్చింది భారతి.
* * *
తలుపులన్నీ తెరిచి నిండు హృదయంతో ఆహ్వానించారు అవధానిగారు. తల్లినిమించిన తల్లిగా ఆదరించింది రాజ్యలక్ష్మి. మానవుల్లో దానవులే కాదు, దేవతలు కూడా ఉన్నారు. అదే అబద్ధం అయితే భారతివంటి అభాగ్యులు ప్రపంచంనుంచి ఎంతమంది నిష్క్రమించేవారో?
నిండు నెలలతో అప్పచెల్లెళ్ళు ఇద్దరూ కదులుతూంటే అవధానిగారు అన్నారు: "నువ్వీ రోజునుంచి ఏ పనీ చేయద్దు, భారతీ! నీ భర్త వదిలేశాడనే తప్ప నువ్వేదో చేయరాని పని చేశాననీ, చెడిపోయాననీ అనుకోవడం లేదు మేం.
"ప్రకృతి సహజం అది. కోయిల వసంతంలోనే కూస్తుంది. నెమలి మబ్బుపడితేనే ఆడుతుంది. వయసు వచ్చిన పిల్లల విషయంలో తల్లితండ్రులు బాధ్యతా రహితులు అయితే ఆ తప్పు నీదెలా అవుతుంది? తప్పు అంటే ఏమిటి? అదే నిజమైతే ఆ తప్పు ఎవరు చేసినా ఒకటే.
"తల్లీ తండ్రీ లేని నీపాలిట దైవం విధించిన శిక్ష కూడా ఇంత విచిత్రంగా ఉన్నదంటే ఎంతో బాధగా ఉంది. ఈ సమయంలో నువ్వు మనసు వేధించే ఆలోచంలతో ఆరోగ్యం పాడుచేసుకోకు. నీకు కావలసింది ఇచ్చే బాధ్యత నాకుంది. మీ అక్కయ్య ఉన్నది చూశావూ? అది అక్కయ్య కాదు, సాక్షాత్తూ నీకు తల్లి!"
భారతి కృతజ్ఞతగా చూసింది.
* * *
భారతి కొడుకును వదలి అత్తవారింటికి వెళ్ళి పోయింది. అపురూప సౌందర్యవంతుడూ, అనురాగాల లహరి అయిన వేణుగోపాల్ కోరి చేసుకుంటాడని తెలిసిన రోజున ఆశ్చర్యంతో నోట మాట నిలిచిపోయింది భారతికి.
తనను తను పరీక్షించుకొంది. జీవితంలో అన్నీ పోగొట్టుకొన్న తనను ఏమి ఎరగని లాయరు వేణుగోపాల్ కానీ కట్నంలేకుండా చేసుకొంటాడని తెలిసిన ఆ రోజున ఆ ఆనందం పట్టలేక చచ్చిపోవాలనుకొంది.
అవధాని దంపతులు భారతికి వీడ్కోలిచ్చారు.
* * *
వేణుగోపాల్ వట్టి అమాయకుడు. ఈ సంగతి భారతి ఒక్కదానికే తెలుసు. నిత్యం దేవుడికి పూజలు చేస్తూంటే పిల్లలకోసం అనుకొన్న అతని అపోహను కడిగివేయలేకపోయింది. భారతిక్ మామూలుగా ప్రసవం జరగలేదనీ, ఆపరేషన్ చేసి బిడ్డనూ తల్లినీ బ్రతికించారనీ అనతి నుంచి భారాతికి ఇక ఈ జన్మలో తిరిగి తల్లి అయే అదృష్టం లేదనీ వేణుగోపాల్ కు తెలియదని భారతి నిత్యం దుఃఖిస్తూనే ఉన్నది. "నా కిక పిల్లలు పుట్టరా?" అని అందరు అబలలు చేసే పని తనూ చేసి నాటకం ఆడింది.
"మీ అక్కయ్యకి అంత సీరియస్ గా ఉన్నదంటే కదలవేం, భారతీ?" అన్నాడు వేణుగోపాల్.
భారతి హృదయం భయంతో కంపించిపోయింది. భూదేవి పగిలిపోయి తను మెడవరకూ కూరుకుపోగానే మళ్ళీ అతుక్కున్నట్టూ ఆ చీలికతో తనునలిగిపోతున్నట్టూ బాధపడింది. జీవితం నాటకరంగం కనక నటన తన కర్తవ్యం అనుకొంది. కానీ దైవాన్ని మించిన వేణుగోపాల్ కొడుకు లిద్ధర్నీ చేరదీయగానే వేణుగోపాల్ కు తాను కాదు, తనవంటి అనేక రూపాలు దాస్యం చేయాలనిపించింది. వేణుగోపాల్ అనురాగానికీ, ఆపేక్షకూ హద్దే లేదా? అనిపించింది. ఆ ప్రేమప్రవాహానికి తను తట్టు కోలేక హృదయం ముక్కలయ్యే బాధ ననుభవించింది. చిన్ననాటి ఆ కష్టాలే ఈ సుఖం ముందూ, ఈ అనురాగం ముందూ కోటిరెట్లు బాగున్నా యనుకోసాగింది. తట్టుకోలేని ప్రేమను భరించడం సాధ్యం కాలేదు.
"దేవుడూ దేవతలే కాదు, రామా, మామూలు మనుషులు, అందులో అభంశుభం తెలియని అమాయకులు అన్యాయానికి ఆహుతి అయిపోతే ఇచ్చే శాపం వృథా కాదు, నాయనా!
"కన్ను తెలియని కామాంధకారంలో నిలువునా దగాచేసే మనుషులు ఈ ప్రపంచంలో పుడుతూనే చస్తూ బ్రతుకుతారు. అది అబద్ధం కానేరదు. నేను దోషినొ, నిర్దోషినో దైవం నిర్ణయించాలి...
