19
సాయంకాలం చల్లదనాన్ని ఆహ్వానిస్తోంది. నీరెండ లో చెట్ల కొమ్మలు గాలితో స్నేహం చేసి దోబూచులాడుతున్నాయి. అందించేందుకు ఆశ పెట్టి వెనక్కు లాక్కునే కొంటె పిల్లాడి లా, ఎత్తుగా వున్న కొమ్మలు ముందుకి వంగి, అంతలోనే వెనక్కి పోతున్నాయి.
ఉదయమనగా వెళ్ళిన ప్రభాకర్ యింటి ముఖం పట్టాడు. వీధి గేటు దగ్గర నిలబడి సిగరెట్ కాల్చుకుంటున్న డ్రైవర్ సందు మొదటలో ప్రభాకర్ కారు కనిపించగానే చటుక్కున దూరం విసిరేసి చేతులు దులుపుకున్నాడు. కారాగగానే ముందుకి వంగి తలుపు తీసి లోపలి దాకా ప్రభాకర్ ని అనుసరించాడు.
"అయ్యగారెక్కడికి వెళ్ళలేదెం? ఏం చేస్తున్నారివాళ?' అడిగాడు.
"వెడదామను కుంటుండగానే ఎవరో వచ్చారు, మాట్లాడుతూ వుండి పోయారు."
"అమ్మాయి గారు బజారు కెళ్ళిందా?" అడిగాడు వున్నట్లుండి . అప్పుడే గుర్తుకు వచ్చినట్లు.
"షాపుల కేసి ఎల్లలేదయ్యా. అట్టా పోస్టాఫీసు కు వెళ్ళి యింటి కొచ్చేశారు. అన్నాడు డ్రైవరు. ఒకసారి చేతి వాచీ వంక చూసుకుని, "కారు గారేజ్ లో పెట్టి నువ్వు వెళ్ళు. అయ్యగారితో నే చెప్తాలే?" అని పైకి వెళ్ళాడు.
అతను అంత త్వరగా వస్తాడనుకున్నట్లు లేదు కుసుమ ఎక్కడా ఆ దరిదాపుల్లోనే లేదు. బ్రీఫ్ కేస్ లోంచి ఫైల్స్ తీసి సొరుగు పెట్టి తాళం వేసి, చేతులు జేబులో వుంచుకుని ఆలోచిస్తూ కిటికీ దగ్గరగా వెళ్ళాడు. క్రింద చెట్ల మధ్య వున్న సిమెంటు బెంచి మీద కూర్చుని చదువు కుంటున్న కుసుమ కనిపించింది. ఆమె వంకే చూస్తూ వుండి పోయాడు ఎందుకో యింటంతటికి ఆ ఒక్క ప్రదేశం ఎంతో యిష్టం కుసుమకు. ఎప్పుడూ ఎక్కువగా అక్కడే కూర్చుని వుంటుంది. కిచకిచలాడే పక్షుల చప్పుడు, చెట్ల మీంచి వచ్చే మెత్తని సువాసన అక్కడ కూర్చుని ఎన్నయినా మర్చిపోగలదు. ఎంతసేపయినా గడప గలదు.
"కుసుమ పోస్టాఫీసు కు ఎందుకు వెళ్ళి వుంటుంది? పొద్దున డబ్బడిగింది....ఎవరి కోసమయినానా....' అనుకున్నారు సాలోచనగా....
వెంటనే వెళ్ళి అలమారు తెరిచి చూచాడు. అక్కడ డబ్బు అక్కడే వుంది ఎక్కువగా ఏమీ తీసినట్లుగా అనిపించలేదు. ఒక్క క్షణం ఆలోచిస్తూ. సందేహిస్తూ నిలుచుండి పోయాడు. ఏదో నిర్ణయించుకున్నట్లు ఒక్కసారి కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాడు. పుస్తక పఠనం లీనమయి వున్న కుసుమను చూచి, తలుపు తీసుకొని పక్క గదిలోకి వెళ్ళాడు. క్షణ కాలం సందేహిస్తూనే కుసుమ అలమారు తెరిచాడు.
` నిండుగా వున్న కుసుమ చీరలు అటూ, ఇటూ తీసి చూచాడు చివరకు వెనకగా ఒకటి రెండు కవర్లు కనిపించాయి. చేత్తో తీసి పట్టుకుని కొద్ది క్షణాలు గడిపాడు. ఒకసారి చుట్టూ చూసి గబగబా కవరు తెరిచి వుత్తరం మడత విప్పాడు.
ఎప్పుడో అయిదారు నెలలనాడు కుసుమకు వచ్చిన వుత్తరం అది --
ఛి|| మధుకు--
నువు పంపిన డబ్బు అందింది. నువ్వు ఇక్కడకు వచ్చి వెళ్ళి చాలా రోజులు అయింది. వీలయితే ఒక్కసారి వచ్చి వెళ్ళవలెను...." పై నుంచి క్రింద దాకా పైపైగా గబగబా చదివేసి క్రింద సంతకం కోసం ఆత్రుతగా చూచాడు. ఏ పేరు లేకుండా క్లుప్తంగా 'అమ్మ' అని వుంది. ఒక్కసారి సుదీర్ఘంగా నిట్టూర్చాడు వెంటనే కవరు తిప్పి చూచాడు. పోస్టు ముద్ర కోసం. వూరు పేరు మనసులోనే ఒకటికి రెండు సార్లు అనుకుని, ఆ వుత్తరాన్ని యధాస్థానం లో వుంచేసి బయటకు వచ్చేశాడు.
కుర్చీలో కూర్చుని బూట్లు వూడదీసు కుంటుంటే కాఫీ ట్రే పట్టుకుని లోపలకు వచ్చింది కుసుమ.
"ఎంతసేమయింది వచ్చి?' అడిగింది.
"యిప్పుడే ? ఎమిటంట దీక్షగా చదువు తున్నావు."
"యిక్కడ నుంచి చూచారా?....పిలవాల్సింది ' అంది క్లుప్తంగా.
"పరీక్ష కెళ్ళే బుద్ది మంతురాలిలా చదువు కుంటుంటే డిస్టర్బ్ చెయ్యబుద్ది అవలేదు. అదీ గాక మొక్కల మధ్యలో నిన్ను చూస్తుంటే కణ్వాశ్రమం నుంచి శకుంతల ఎప్పుడు వచ్చిందా అనుకున్నాను. శకుంతల చేతిలో పుస్తకం చూచిన గుర్తు లేదనుకో." అన్నాడు నవ్వుతూ.
కుసుమ కూడా నవ్వుతూ కాఫీ అందించింది. మా నాన్న ఏళ్ళ తరబడి సేకరించారా పుస్తకాలు అవి పూర్తీ చేయడానికి నీకొక్క సంవత్సరం కూడా పట్టేటట్లు లేదు." అన్నాడు ప్రభాకర్.
"రోజంతా ఏమీ తోచదు యింత యింట్లో. అ పుస్తకాలు కూడా లేకపోతె పిచ్చెక్కి పోతుందేమో. ఎలా వున్నారు బాబు , యింత కాలం యిక్కడ" అంది అనాలోచితంగా. "అదే నాకూ అర్ధం కాదు. ఎలా వున్నానో..... యిప్పుడనుకుంటూ వుంటాను నీలాంటి అమ్మాయి తోడు లేకుండా యిన్నేళ్ళు సాయంత్రం యింటికి రాగానే ఏం చేశానా. అని యిప్పుడు ఎప్పుడు యింటి కొద్దామా అనిపిస్తుంది." అన్నాడు కుసుమ కళ్ళలోకి కొంటెగా చూస్తూ.
ఎప్పుడూ అంతే ! కుసుమ అనాలోచితంగా అతి సామాన్యంగా ఏదో అనేస్తుంది. ఆ వెంటనే తన మనసంతా బయట పెడతాడు ప్రభాకర్. అతనలా మాట్లాడినప్పుడల్లా -- ఒకే భయం నరనరాల్లో మెదిలి ఒంట్లో శక్తి నంతా హరింపచేస్తుంది కుసుమకు.
"యింటి కొచ్చే టప్పటికి బజారంతా ఎదురుగా వుంటుందనుకున్నాను." అన్నాడు మాట మార్చాలని.
నవ్వుతూ అతని వంక చూచింది. "ఒంటరిగా బజారేళ్ళా లనిపించలేదు." అంది. ఎక్కడికి వెళ్ళావని అతను అడగనూ లేదు. ఆమె చెప్పనూ లేదు. చెప్తుందని అతను అనుకోనూ లేదు.
ఖాళీ కప్పు బల్ల మీద వుంచి చేతులు రెండు తల క్రిందకు పెట్టుకుని కుర్చీలో జారగిలపడ్డాడు ప్రభాకర్. కళ్ళు మూసుకుని.
అతని వంక చూస్తూ "యివాళ మీరు బాగా అలసి పోయారు." అంది కుసుమ.
"ఏం? ఎక్కడికయినా వెళ్దామనుకున్నావా. పద వెడదాం . ఫరవాలేదు" అన్నాడు లేవకుండానే.
'అబ్బే. అదేం లేదు." అంది.
"రోజంతా యింట్లో ఏమీ తోచదనుకుంటే యీ వూళ్ళో రకరకాల క్లబ్బులు సంస్థలు చాలా వున్నాయి. ఎందులా అయినా చేరకూడదు" అన్నాడు.
"కామేశ్వరరావు గారి భార్య కూడా అదే అన్నారు. నాకేమిటో అలాంటి సరదాలెం లేవు." అంది చేతి వేళ్ళ వంక చూసుకుంటూ.
తేలిగ్గా నిట్టూర్చాడు. ఏదో మాట వరుసకి అన్నాడు కాని కుసుమ ఒంటరిగా అంత మందిలోకి వెళ్ళడం ప్రభాకర్ కు ఏ మాత్రం యిష్టం లేదు. యధాలాపంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి కుసుమ విషయాలను అడగకుండా వుండరు. ఏ విషయానికి సరయిన సమాధానమైనా యివ్వలేని కుసుమ గతంలోకి వెళ్ళడం బాధాకరమే కాకుండా భయంకరంగా వుంటుంది.
"ఎన్నాళ్ళిలా?" అంది కుసుమ. వంచిన తల ఎత్తకుండానే.
"ఎలా?" అడిగాడు ఆమె మాట అనుకరిస్తూనే ఆమె వంక చూస్తూ.
"..........."
"ఏం, నీకు ఇబ్బందిగా వుందా యిక్కడ"
"నాకు కాదు....."
""మరెవరికి? నాకా?' అడిగాడు హాస్యంగా. సీరియస్ గా మొదలేసిన సంభాషణ ని మధ్యలోనే తుంచేయాలని.
తల ఎత్తి అతని ముఖంలోకి చూచింది. పెదిమలతో సమంగా కళ్ళు కూడా చిరునవ్వు చిందిస్తూన్నాయి. 'ప్రతి విషయం అంత తేలికగా ఎలా తీసుకో గలుగుతాడు. తనకు కొండలా కనిపించే సమస్యలన్నీ అతనికి అతి స్వల్పంగా కనిపిస్తాయి కాబోలు. అతి స్వల్పంగా నిజంగానే కనిపిస్తాయా, కనిపించేటట్లు ప్రవర్తిస్తాడో ......
"మీకే? మీకేం యిబ్బంది అనిపించటం లేదా" అడిగేసింది. ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట.
"వూహూ" ఖచ్చితంగా సమాధాన మిచ్చాడు ప్రభాకర్. కళ్ళెత్తి విప్పారితంగా చూసింది.
సాయంత్రం యింటి కొచ్చేటప్పటికి కమ్మటి కాఫీతో నా కళ్ళకు నచ్చినమ్మాయి ఎడురోస్తూ అడగకుండానే అవసరాలన్నీ అమర్చి పెడుతుంటే హాయిగా కబుర్లతో కాలక్షేపం చేయడం నాకేం యిబ్బందిగా లేదు.
'అంతేనా అతనికి కావలసింది. జీవితమంతా అలా గడపగలడా?" అదే అడిగేయ్యాలనిపించింది కుసుమకు.
అంతలోనే తిరిగి అతనే అన్నాడు. "నువ్వు వచ్చాక ఎంత నిశ్చింతగా వుందో తెలుసా... నేను అరగంట సేపు రావడం ఆలస్యమైతే నీ కళ్ళు కిటికీ దగ్గరే కాపురముంటాయని నాకు తెలుసు. నాకోసం ఎదురు చూచే వాళ్లున్నారన్న భావనే నాకు తృప్తి నిస్తుంది.... మా నాన్న విషయం లో మాత్రం.... యిదివరకు ఏ వూరు వెళ్ళాలన్నా చాలా ఇదిగా వుండేది. యిప్పుడు నాకంటే ఎక్కువ శ్రద్ధ కనబరిచే వాళ్ళు యింట్లో వున్నారంటే నాకెంతో నిశ్చింతగా వుంది."
ఏం మాట్లాడలేదు కుసుమ. ఏం మాట్లాడుతుంది? మెల్లిగా అక్కడ నుంచి లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి నుంచుంది.
పలచబడి పోతున్న వెలుతురు , తరుముకోస్తున్న చీకటి పరిచయం చేసుకోబోతూన్నాయి. ఎక్కడెక్కడ తిరిగి వచ్చాయో పక్షులు గూళ్ళు చేరుతున్నాయి.
ప్రభాకర్ కూడా లేచి కుసుమ వెనకనే కిటికీ దగ్గరకు వచ్చి , ఒక చెయ్యి గోడ కానించి నుంచున్నాడు. వెనక్కి తిరిగితే అతని గుండెలకు తగిలే అంత దగ్గరగా వుంది చేతికి. కిటికీ కి మధ్య బంధిత అయిన కుసుమకు వెనక్కి తిరగడానికి ధైర్యం చాలలేదు. తను తిరగగానే అతను దగ్గరకు తీసుకుంటే.....కదలకుండా ముందుకు దృష్టి సారించి వుండిపోయింది.
"ఏం చూస్తూ వుంటావు? ఎప్పుడూ ఈ అరుగు మీదో, యీ కిటికీ దగ్గరో నుంచుని వుంటావు. నాకూ చూపించు" బాగా దగ్గరగా వినవస్తున్న ప్రభాకర్ మాటలు వింటూ నిశ్శబ్దంగా వుండిపోయింది. చాలాదగ్గరగా వున్నట్లు అతని వెచ్చని శ్వాస ఆమెకు తగులుతోంది.
"ఆహారం తీసుకు వస్తున్నా పక్షి. ఆతృతగా ఎదురుచూచే పిల్ల -- వీరి సంబంధం అతి స్వల్ప కాలం అంటే నమ్మబుద్ది అవదు" అంది కుసుమ చాలాసేపటికి. సాలోచనగా ఎదురుగా యెగిరి చెట్టు మీద వాలిన పక్షిని చూస్తూ.
"బిడ్డలకు , తల్లి దండ్రులకు వుండే బంధం అతి స్వల్పమని పక్షులు, పశువులు అంగీకరించి నంత తేలికగా మనుష్యులు ఒప్పుకోరు. కాని తరచి చూస్తె అదొక నగ్న సత్యం' అన్నాడు ప్రభాకర్.
"ఎలా ఒప్పుకోగలరు? కష్టపడి కని, పెంచి చివరకు ఏ సంబంధం లేనంత దూరంగా బిడ్డలు వెళ్ళిపోవడం ఏ తల్లి దండ్రులు మాత్రం అంగీకరించగలరు?"
"అది ఒప్పుకోలేకే చాలా కుటుంబాల్లో యీ మన క్లెశాలన్నీను. పెంచి పెద్ద చేసిన పిల్లలు తమకు కృతజ్ఞతగా వుండాలనుకోవడం పొరపాటు కాదా? ఒకడు జీవితంలో దొరకాల్సిన సుఖాలు అనుభవించ దలచుకున్నప్పుడు పిల్లలనేది ఆ సుఖం కలిపించే బంధాలు , వారి ఆగమనానికి కారకులయి, వారిని పెంచడం కూడా ఒక అందమయిన అనుభవం కాబట్టి పెంచడం జరిగుతుంది కాని తిరిగి ప్రతిఫలం ఆశించడం అవివేకం - తన తరాల మధ్య వుండే బంధం ఎప్పుడూ తాత్కాలికమే!"
వెనక్కి తిరిగింది కుసుమ. ముఖాముఖి గా , బాగా దగ్గరగా వున్న ప్రభాకర్ ని చూస్తూ నిలబడింది. పరిపూర్ణంగా వున్న అతని ముఖంలో ఎలాంటి అవేశమూ లేదు. ఆ కళ్ళల్లో ఏ కోరికా లేదు. మాములుగా ఏ స్నేహితుకుడి తోనో కబుర్లు చెప్పేటప్పుడు వుండేంత సామాన్యంగా వుంది.
"అవును అందుకే కాబోలు పొద్దున మాట్లాడి వెళ్ళి, మధ్యాహ్నం చూచి కూడా మధ్యలో ఎలా వున్నారంటూ మీ నాన్నగారికి ఫోను చేసి కనుక్కోకుండా వుండరు, రోజూ? మీకు రెక్కలు వచ్చి ఎగిరిపోలెకెనా యిక్కడ ఉందీ? ఎటువంటివి ఆశించకూడని అయన, ఏమీ పంచి యిచ్చే అవసరం లేని మీరు...." నవ్వుతూ ఏదో అనబోయింది కుసుమ.
"యిచ్చే అవసరం లేదని అన్నానా? ఆశించకూడదని అన్నాను కాని.... ఆశించడం అనేది జరిగినప్పుడు నిరుత్సాహానికి చోటు వుంటుంది. కాని అదో బాధ్యతగా నెరవేర్చగలిగినప్పుడు ఆశించడం అనేదీ జరగదుగా నువ్వుతూనే అన్నాడు ప్రభాకర్ కూడా!' "అయినా నేను వ్యక్తీ గతంగా నా విషయం చెప్పడం లేదు కుసుమా?" అన్నాడు హాస్యంగా నవ్వుకున్న కుసుమ వంక చూస్తూ.
"అందరూ అలాగే అంటారు ఈ వయస్సులో. రేపు మీకు పిల్లలు పుట్టి...పెరిగి ...." చటుక్కున వెనక్కి తిరిగింది దారం పుటుక్కున తెగినట్లే త్రేగిపోయింది కుసుమ మాటల ధోరణి.
