Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 15


    
                                           17
    తన ఇంటికి వచ్చిన జానకిని పది క్షణాల పాటు ఎగాదిగా చూస్తూ నిలుచుంది దుర్గ -- దుర్గ చూపులలోని భావం గ్రహించిన జానకి, కృత్రిమ కోపంతో బొమలు ముడిచి నవ్వుతూ, "దృష్టి బొమ్మలా అలా చూస్తావేం? నా ముఖాన కోతులాడుతున్నాయా?" అంది కూర్చుంటూ, దుర్గ తను కూడా జానకి ప్రక్కన కూర్చుని "నీ అలంకరణ నిజంగా దృష్టి కొట్టే లాగే ఉంది. ఎంత టైం పట్టింది నీకు? ఇంక ఇంట్లో వేరే పనులేమీ ఉండవా?' అంది.
    జానకి చెక్కిళ్ళు కొంచెం ఎర్రబడగా . "ఏం చెయ్యను? ఇలా అలంకరించుకోక పొతే అయన చంపేస్తారు.' అంది. 'అలా చెప్పు! ఇదంతా మా బావగారి కళా ప్రావీణ్యమన్న మాట.' దుర్గ కిలకిల నవ్వింది. జానకి తను కూడా నవ్వి "ఆయనకి అలంకరణ విషయం లో ఎంత చాదస్తమనుకున్నావ్. ఎక్కడా ఏ లోటు ఉండడానికి వీలు లేదు. చీరా, జాకెట్టు , గాజులూ, పువ్వులు, లాకేట్టు, అన్నీ ఒక దానితో ఒకటి శ్రుతి కలిసి తీరవలసిందే! లేకపోతె అప్పటికప్పుడు బజారు నుంచి కొని తీసుకు వస్తారు. అంతేకాదు పేరంటాలకి ఒకలాగ డిన్నర్ల కు ఒక లాగ, పార్టీలకు, మరోలాగ అలంకరించు కోవాలి-- నిజంగానే నువ్వన్నట్లు నా టైమంతా ఈ అలంకరణ కి వృధా అవుతుంది. నాకొక్కోసారి విసుగొస్తుంది కూడా! అయినా ఆయన మనసుని కష్టపెట్ట లేను." అంది.
    దుర్గ కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. 'అయితే నువ్వు తరచుగా క్లబ్బులకూ, పార్టీలకూ, సినిమాలకూ వెడుతుంటావా?' 'అయ్య బాబోయ్! తరచుగా ఏమిటీ? ఇంచుమించు రోజూ ఏదో ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి రోజూ నేను నిద్ర పోయే సరికి పన్నెండు , ఒంటి గంట అవుతుంది. అప్పుడప్పుడు మేం కూడా పార్టీలిస్తూ ఉంటాము-- ఇంటి పనులు నువ్వన్నట్లుగానే నాకేమీ లేవు, అజమాయిషీ తప్ప -- అయినా, ఈ వ్యాపకాలన్నింటి తో ఉక్కిరిబిక్కిరి గా ఉంటుంది."
    "నీకు బాగుందా, ఇలా?"
    "బాగుందా . అంటే ఏం చెప్పను? ఆయనకిలా చాలా ఇష్టం-- ఒక్కొక్కసారి నాకు ప్రశాంతంగా ఇంటి దగ్గరే ఉండాలని పిస్తుంది -- కాని తను నన్ను వదలరు. తప్పించు కోవాలంటే ఒకటే మార్గం-- ఏ తలనొప్పి అనో, కడుపు నొప్పి అనో వంక పెట్టాలి-- అప్పుడు నేను వస్తానన్నా తను తీసుకుని వెళ్ళరు కాని ఇంకా ఇబ్బంది వస్తుంది. తను కూడా అన్ని వ్యాపకాలు, మానుకుని నానా కంగారు పడుతూ నాదగ్గిరే కూర్చుంటారు. డాక్టరు ని పిలిపిస్తారు. ఎంత గొడవ జరగాలో అంతా అవుతుంది. ఇంతకంటే ఆయనతో కలిసి బయటకు పోతేనే మేలనిపిస్తుంది." ఆ ప్రయత్నంగా దుర్గ భారంగా నిట్టూర్చింది.
    "ఎంత అదృష్ట వంతురాలివే నువ్వు జానీ!" జానకి పకపక నవ్వింది. "అవును! నా అదృష్టాన్ని నువ్వు పోగుడుతే విని ఆనందిస్తాను."
    "అదేం? ఇంతకంటే అదృష్ట మేం కావాలి?"
    నవ్వుతున్న జానకి ముఖం క్షణం లో నల్లగా అయిపొయింది. భారంగా, "పోనీవే! అదృష్ట వంతురాలిననే అనుకో!" అంది-- దుర్గ ఆశ్చర్యపోతూ "నాకు చెప్పకూడని రహస్యమే మయినా ఉందా?" అంది--
    "అసలు రహస్యమే కాదు-- కాను అనుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. మొన్నీ మధ్యనే మా ఆయనకు గుండె జబ్బు ఉన్నట్లుగా తెలిసింది. ఏ క్షణం లో నైనా నా ఈ స్వర్గామంతా అంధకారం లో కరిగి పోవచ్చు -- దుర్గా! నా అదృష్టాన్ని మెచ్చు కుంటావా? నన్ను చూసి జాలి పడతావా?"
    దుర్గ నిర్ఘాంత పోయింది -- మూడురాలి గా జానకి ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. చైతన్యానికి మారు పేరులా ఉండే జానకి, సృష్టి లో విలాసము, రూపు ధరించి వచ్చిందా, అని జానకి, తన గుండెల్లో ఈ ఆరని కుంపటి ని ప్రజ్వలింప జేసుకుంటూ పైకి పకపక నవ్వగలుతుందా?
    ఎప్పుడూ నవ్వుతూ ఉండే జానకి కళ్ళ నీళ్ళు దుర్గ గుండెలను పిండి చేసాయి. ఆప్యాయంగా జానకి చేతిని తన చేతిలోకి తీసుకుని :పాపిష్టి దానిని-- నవ్వుతూ వచ్చిన నిన్ను ఎదిపిస్తున్నావే నవ్వు, కన్నీళ్లు నీకు తగినవి కాదు--" అంది.
    జానకి పెదవుల పైకి పేలవమైన చిరునవ్వు మెరిసింది. "నిజం దుర్గా కన్నీళ్లు నాకు తగినవి కావు. నా గురించి నాకు ఏమీ బాధ లేదు. కాని అంతరాంతరాలలో అయన పడే క్షోభ చూస్తుంటే నా గుండె పగిలి పోతుంది----
    "ఈ సంగతి ముందే గుర్తించ కుండా, నిన్న న్యాయం చేశాను. నన్ను క్షమించ గలవా జానకీ?' అని అయన అంటుంటే ఏం సమాధానం చెప్పాలో తోచదు. "నాకు ముందే ఈ సంగతి తెలిసినా, మిమ్మల్ని ఒడులుకునే దానిని కాను." అంటాను. అయన దరిదాపులకు విషాద మేఘాలు రాకుండా నా శాయ శక్తుల ప్రయత్నిస్తాను. అయినా తన అంతరంగం లో ఆవేదన తుడిచి వెయ్యటం నా తరం కావటం లేదు--"
    దుర్గ మనసు కరిగి పోతోంది. జాలిగా జానకి వంక చూడటం కంటే ఏమీ మాట్లాడలేక పోయింది. జానకి ఇంకా ఏదో చెప్పబోయేటంతలో శంకర్ రావటంతో ఆగిపోయింది -- శంకర్ జానకిని చూసి "హలో! జానకి! ఈ మధ్య బొత్తిగా కనబడటం లేదే." అన్నాడు. జానకి నవ్వింది.
    "నేను రాకపోతే పోనీ, మీ ఇద్దరూ రాకూడదా? మీరూ అసలు కనపడటం లేదు."
    "వద్దామనే అనుకున్నాను. రెండుసార్లు దుర్గా నేనూ బయలుదేరి కూడా ,ఏవో అవాంతరాల వల్ల ఆగిపోయాం. అయినా, మీరు కనబడక పొతే మాకేం తోచదు."
    "అవునా దుర్గా!" అంటూ జానకి దుర్గ వంక చూసింది. తన భర్త ఈ లేనిపోని అబద్దాలన్నీ ఎందుకు చెప్తున్నాడో అర్ధం కాని దుర్గ అయోమయంగా తల ఊపింది.
    శంకర్ "దుర్గా! జానకికి కాఫీ అదీ ఏమైనా ఇచ్చావా , లేదా?" అన్నాడు.
    కబుర్ల సందడి లో ఆ మాటే మర్చిపోయిన దుర్గ హడావుడి గా లేవబోతుంటే జానకి దుర్గ ను బలవంతాన కూర్చో బెట్టి "నాకు కాఫీ అలవాటు లేదు. ఎవరింటి కైనా వెడితే మర్యాద కోసం తాగుతాను. ఇప్పుడు తాగాలని లేదు." అంది.
    "అబ్బ! మీకెంత మంచి అలవాట్లండీ!" అన్నాడు శంకర్. జానకి నవ్వి వూరుకుంది.
    కొంచెం సేపు కూర్చుని అది ఇదీ మాటడ్లాక జానకి వెళ్తానని లేచింది. దుర్గ ఇంకా కాస్సేపు కూర్చోమంది. కానీ, జానకి పని ఉందని లేచింది.
    "వీలైనప్పుడలా కన్పిస్తూ ఉండండి." మళ్ళీ ఒకసారి హెచ్చరించాడు శంకర్.
    జానకి వెళ్ళం గానే తనలో తను నవ్వుకుంటున్న శంకర్ ను చూసి ఆశ్చర్యంగా "ఏమిటీ?' అంది దుర్గ.
    "మీ జానకి ని తల్చుకుని నవ్వు కుంటున్నాను. అదీ ఒక ఆడదేనా? చేతులు లేని ఆ జాకెట్టు లిప్ స్టిక్ , హైహీల్స్ , జుట్టంతా అలా కావాలని రింగులు తిప్పుకోవటం , ఎవడితో పడితే వాడితో అలా విరగబడి మాట్లాడటమూ ! -- ఆ మొగుడు వెధవని అనాలి-- పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్లు వూరేగ నిచ్చి అడముండలా చేతులు నలుపుకుంటూ కూర్చున్నాడు. హహహ.......' శంకర్ వికతమైన నవ్వు దుర్గ చెవులకు శూలపు పోటులా తగిలింది. బాల్య స్నేహాన్ని మరువని జానకి స్నేహ శీలతనూ, స్నేహితురాలి భర్తగా శంకర్ కిచ్చే గౌరవాన్ని , వెకిలి తనం క్రిందా రాజారాం విశాల హృదయాన్ని చేతకాని తనం క్రింద, వ్యాఖ్యానించే భర్త మాటలకు నిష్కారణ మైన ఈ అభాండాల్నీ సహించలేక పోయింది. "మరి, అట్లాంటి జానకితో మీరంతా స్నేహంగా ఎలా ఉనగలుగు తున్నారో?' రోషంగా అడిగింది దుర్గ.
    "నీ తలకాయి, స్నేహమేమిటి? నా అందం చూసి అది వెంట బడింది. పోనియేలే! నాకు మంచి కాలక్షేపమని నేనూ సరదా పడ్డాను."
    ఇల్లెగిరి పోయేలా నవ్వాడు శంకర్.
    భరించలేని విరక్తి తో దుర్గ నవనాడులూ మండాయి. "ఛీ! ఏం మనుష్యులూ? ముఖ మెదురుగా ఎంతో స్నేహాన్ని చూపించి కనుచాటు కాంగానే ఇంత నీచంగా మాట్లాడటమా?"
    "నీచమైన వాళ్ళను గురించి నీచంగా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు ? ఈవిడ నీచత్వాన్ని కప్పి పెట్టడానికి , ఆ మొగుడు వెధవ అడ్డున్నాడని నన్నిప్పుడు పతివ్రత అనమంటావా?"
`    "అవును-- భార్యను అనురాగంతో చూస్తూ ఆమెను విశ్వసించే స్వాతంత్యాన్ని ఇవ్వటం చేతకానితనం. క్షణక్షణానికి తన ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ భార్యకు వ్యక్తిత్వమనేదే లేకుండా పశు బలంతో అణచి ఉంచడం మొగతనం."
    శంకర్ రుద్రుడయ్యాడు. లేత తమలపాకు వంటి దుర్గ చెంప చెళ్ళుమని ఉబ్బింది. మళ్ళీ అన్నాడు రోషంగా --
    దుర్గ మనసు మండి పోతోంది --ఆమెకు భయమూ, బాధా కలగటానికి మారుగా రోషమూ, కసీ పెరుగుతున్నాయి.
    "నేను అనడమెందుకూ? మీరే ఋజువు చేసుకుంటున్నారు."
    శంకర్ యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం పోగొట్టుకున్నాడు. వెర్రి ఆవేశంతో తన చేతినీ, కాళ్ళ నూ కూడా దుర్గ మీద ప్రయోగించ సాగాడు.
    దుర్గ ప్రతిఘటనైనా లేకుండా కనీసం కన్నీరైనా రాకుండా, తన శరీరాన్ని శంకర్ మూర్ఖత్వానికి అప్పగించి తనీ లోకంలో లేని దానిలా నిల్చుంది. ఈ మొండి తనం శంకర్ ఆవేశాన్ని మరింత రెచ్చ గొట్టగా తీవ్రమయిన రోషంతో మూలనున్న కర్ర పైకెత్తాడు. కర్ర ఎత్తిన అతని చెయ్యి అలాగే దృడంగా పట్టుకో బడింది. శంకర్ ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి వెంటనే పాలి పోయాడు. గిరి కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి. అతని దృడ మైన బంధంలో శంకర్ చెయ్యి ఇరుక్కుంది. గిరిని చూడగానే దుర్గ గిరి పాదాల మీద వాలి "గిరీ! నాకింత విషమియ్యి . అదే! అదొక్కటే నేను నిన్ను కోరుకుంటున్నాను." అంది.
    గిరి కడుపు తరుక్కు పోయింది. "ఇదంతా నీ ప్రయోజకత్వమే! అని ఎవరో తనను దేప్పినట్లయింది. చతుక్కుని శంకర్ వంక తిరిగి"నీ భార్య ఏదో అడుగుతుంది విన్నావా? తెచ్చి పెట్టు. అందరి సమస్యలు తీరిపోతాయి." అన్నాడు.
    శంకర్ వంచిన తల ఎత్తలేదు. ఆ మాట్లాడి నది గిరి కాక, ఇంకొకరైతే అతడు ఘాటైన సమాధానం చెప్పేవాడే! అతడు ప్రపంచం లో అందరి కన్న అధికంగా ప్రేమించి, గౌరవించే వ్యక్తికీ ఏ సమాధానము ఇయ్యలేక పోయాడు.
    "దుర్గా! నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో! వెళ్ళు" అన్నాడు గిరి -- దుర్గ నీళ్ళు నిండిన తన పెద్ద కళ్ళతో నిరాశగా చూస్తూ "ఒకటే విశ్రాంతి." అంది దీనంగా.
    "నా మాట విని-- వెళ్ళు" అన్నాడు గిరి మళ్ళీ. దుర్గ వెళ్ళిపోయింది. గిరి శంకర్ ను చెయ్యి పట్టుకుని తన దగ్గిర సోఫాలో కూర్చోపెట్టుకుని "శంకర్! నేను నిన్ను స్వంత తమ్ముడి లాగ అభిమానిస్తానని, మనసారా నీ సుఖం కోరుకుంటానని నమ్ముతావు కదూ అన్నాడు. శంకర్ తలవంచుకుని "నువ్వు నా పాలిట దేవతవి." అన్నాడు.
    గిరి నిరసనగా నవ్వి "అంత స్త్రోత్రం వద్దులే! ఇది విను-- నీకు ఈ సమస్య లన్నింటికి చక్కటి పరిష్కార మార్గం చెప్పనా?'అన్నాడు.
    'అంతకంటేనా?చెప్పు."
    గిరి సాధ్యమైనంత శాంతంగా నవ్వుతూ "దుర్గ సూచించిన మార్గమే! ఎలాగో ఒకలాగ దుర్గను, ఈ లోకంలో లేకుండా చేస్తే నువ్వు హాయిగా నీకు నచ్చిన మరో స్త్రీని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవచ్చును. నీమీదకు ఏ కేసులూ రాకుండా నేను చూస్తాను."అన్నాడు.
    శంకర్ ముఖం పాలిపోయింది.
    "గిరీ! దుర్గ నన్ను రెచ్చ గోడ్తుంది. అవమానకరం గానూ మాట్లాడుతుంది. కొట్టాను. కొట్టడం తప్పే అనుకో! కానీ ఆ వెర్రి ఆవేశంతో నాకంత ఆలోచన ఉండదు -- అంతేకానీ, దుర్గ చావాలని నేను కోరుకుంటానా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS