Previous Page Next Page 
పారిజాతం పేజి 15


    పదకొండు గంటలు కావచ్చింది. బంగళా నిండా రేరాణి వాసనలు పలచగా అలముకొని ఉన్నాయి.
    లలిత పడక గదిలో పడుకొని ఏదో మాగజీస్ తిరగవేస్తున్నది. హఠాత్తుగా వచ్చిన పారిజాతాన్ని చూసి ఆశ్చర్య పడింది. కొంత కలవరపడింది కూడా!
    పారిజాతం నవ్వుతూ, "నమస్కారమండీ, వదిన గారూ!'ఏమిటి ఈ మబ్బులేని పిడు'గని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఏం చేస్తాము? మీ ఊరు అంతగా ఆకర్షిస్తున్నది మరి. సరేగాని నేనొక ప్రశ్న అడుగుతాను. దానికి సరియైన సమాధానం మీ రివ్వగలరని ఆశిస్తున్నాను. భర్త ఏదైనా తప్పు చేస్తే, భార్య డ్యూటీ ఏమిటంటారు?" అని అడిగింది లలితను.
    ప్రశ్న విని లలిత ఆశ్చర్యపడింది. బహుశా, ఈయన ఈవిడకు ప్రేమలేఖ వ్రాసి ఉంటాడు. అదేదో తనకు చూపించటానికి పనిగట్టుకొని వచ్చి ఉంటుంది. చికాకు వేసింది లలితకు.
    "నాకు డొంక తిరుగుడు ఇష్టం ఉండదు. చెప్పేదేదో సూటిగా చెప్పండి!"
    "అయితే వినండి!" అంటూ పారిజాతం అనంత లక్ష్మి సంగతి వివరించింది. దిగ్భ్రమ చెందింది లలిత. తన అనుమానం పారిజాతం చుట్టూ తిరిగింది. కాని ఇదేమిటి ఇట్లా జరిగింది?
    మూడు నిమిషాల తరవాత తెప్పరిల్లి, "అయితే ఈ శుభవార్త ఇంతదూరం మోసుకురావటంలో నీ ఉద్దేశ్యం?" అని కోపంగా అడిగింది లలిత.
    "ఏముందీ! జరిగిన అన్యాయాన్ని సరిచెయ్యడమే! మీరూ స్త్రీ కాబట్టి, ఆడవాళ్ళ నర్ధం చేసుకోగలరు. అనంతలక్ష్మి గతి ఏం కావా లిప్పుడు?" నెమ్మదిగా అంది పారిజాతం.
    మధ్యలోనే అందుకొని కచ్చగా అంది లలిత:"మెడ కో రాయి కట్టుకొని నూతిలో దూకమను! సిగ్గులేకపోతే సరి! మగాడు కనబడితేసరి, ఒళ్ళు మరిచి పోవడమేనా?"
    "అంత తేలికగా మాట్లాడకండి, లలితగారూ! ఒక వేళ నూతిలో దూకవలసి వస్తే మీ ఆయనతోకూడా దూకుతుంది! యథాశక్తి మేమంతా సాయం చేస్తాము, ఆ మంచిపనికి! ఉద్రేకపడి లాభంలేదు. దయచేసి శాంతంగా ఆలోచించండి. అనంతలక్ష్మి ని మీ భర్త వివాహం చేసుకోవటానికి మీరు విశాల హృదయంతో అంగీకరించాలి. మీకు సంతానం లేదు. క్షమించండి! మిమ్మల్ని నొప్పించాలని ఆ మాట అనటం లేదు. మీ భర్త అనంతలక్ష్మిని వివాహం చేసుకొంటే, అన్ని సమస్యలూ పరిష్కారమౌతాయి. మీరీ త్యాగం చేస్తే చాలు!"
    "చాలా బాగుందండీ, పారిజాతం! మా ఆయన అసలు చంచలచిత్తుడు! ఊళ్ళో ఎంత మందికి సంతానదానం చేశాడో నాకైతే తెలియదు! వాళ్ళం దరినీ తెచ్చి ఆయనకి కట్టబెట్టి, వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడాని కిదేం నవాబు అంతఃపుర మనుకొన్నారా? లేక అనాథ శరణాలయ మనుకొన్నారా? చాల్చాలు! ఎవరేనా వింటే నవ్వుతారు. అసలు నీ వెవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకో! మిసెస్ రామనాథం తో! డెప్యూటీ కలెక్టర్ భార్యతో!" అహంకారమంతా ముఖంలోనే కనపడుతున్నది లలితకు.
    "హృదయ మున్న వాళ్ళెవరూ నవ్వరు. మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తున్నది. మిసెస్ రామనాథం, మిసెస్ సో ... సో...! ఇంతే నన్నమాట! అందుకే నేను మీరంతా దిష్టి పిడతల్లాంటి వారని అంటాను! 'మిసెస్' తీసేస్తే ఏమీ మిగలదు మీకు! ఆ బిరుదు ఉన్నంత కాలమే బ్రతుకు! మిమ్మల్ని మిసెస్ రామనాథంగా ఆలోచించమనలేదు. లలితగా, వ్యక్తిత్వంగల స్త్రీగా ఆలోచించ మన్నాను. అనంతలక్ష్మి స్థితిలో మిమ్మల్ని ఊహించుకొని, ఆలోచించమని ప్రార్ధిస్తున్నాను" అని పారిజాతం అంది.
    "ఏమిటి నీ ఉద్దేశ్యం? నేను అనంతలక్ష్మిని కావడమేమిటి? దానితో నాకు పోలికేమిటి? మానాభిమానాలు లేక మగవాళ్ళ వెంట పడే మదపిచ్చి ముండ, దానితో నాకు సాపత్యమా?" కోపంలో లలిత ముఖం కందగడ్డ అయింది.
    "అంత తేలికగా మాట్లాడకండి! కొందరికి అడగ కుండానే అన్నీ లభిస్తాయి. మీ సంగతే చూడండి. కలిగిన ఇంట్లో పుట్టారు. కోరిన వరుడిని కొను క్కున్నారు. భర్త హోదాలో పాలు పంచుకొంటున్నారు. మీకు ఏం కావాలన్నా క్షణాల మీద సంపాదించగలరు. బాధ్యత అన్నది మీ కసలు తెలియదు. అందుకే, హాయిగా భర్త సంగతి పట్టించుకోకుండా తిరగ గలుగుతున్నారు. ఇంటా, బయటా మీ స్థానం సుస్థిరంగా ఉంటే చాలు! ఇక ఎవరేమైనా మీకు చీమకుట్టిన ట్లుండదు!
    "కాని, కొందరి జీవితా లట్లా కాదు. పుట్టింది మొదలు ఒక్క కోరికా తీరదు. అటు బాధ్యతలనుండి పారిపోలేరు. ఇటు స్వార్ధమూ మానుకోలేరు. వాళ్ళకి దృఢమైన మనస్సు ఉండదు. అనంతలక్ష్మీ అలాంటిదే. చూస్తూ చూస్తూ తన కుటుంబాన్ని నిర్ధాక్షిణ్యంగా గాలికి వదలలేదు! తన సుఖాన్నీ వదులుకోలేదు! అందం లేదు. డబ్బులేదు. చుట్టూ బాధ్యతలు వల పన్నాయి. వాటి నుంచి తప్పించుకొనలేదు. సహజమైన కోరిక లను, మనో వికారాలను అణుచుకోలేదు! నాకు పరిచయమైనప్పటినుండీ ఆమెను నేను గమనించుతున్నాను.    ఆవిడ ఎప్పుడూ పెళ్ళి కబుర్లే సాధారణంగా మాట్లాడేది! ఊళ్ళో ఎవరి పెళ్ళైనా ఏడ్చేది! సినిమాలో పెళ్ళి సీను వస్తే వెక్కిళ్ళు పెట్టేది! మృగాలు తమ ప్రవృత్తులను పైకి చూపించటానికి సిగ్గుపడవు. అనంతలక్ష్మిదీ, మీ భర్తదీ కూడా అదే ప్రవృత్తి! కనకనే, వారిద్దరికీ అలా కుదిరింది. మీరు మనిషి స్వభావాన్ని అర్ధం చేసుకొని, నిర్ణయానికి రమ్మనమని ప్రార్ధిస్తున్నాను. వివాహానికి ఒప్పుకొంటే మీ గొప్ప తనమే బయటపడుతుంది!" బతిమాలుతున్న ధోరణిలో అంది పారిజాతం.
    "పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో! ఊకదంపుడు ఉపన్యాసాలు వినవలసి వచ్చింది. ఖర్మ! పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి. మావా రెవరెవరితో తిరిగారో అందరినీ తీసుకురండి! అందరికీ ఒకేసారి పెళ్ళి చేద్దాము! సంఘ సంస్కర్తలం కధా౧" హేళనగా అంది లలిత.
    "అందరి విషయాల్లో జోక్యం కలగజేసుకోడానికి, నాకు వాళ్ళెవరూ తెలియదు. మీ వారి రాసక్రీడలు మీకే తెలియాలి! అనంతలక్ష్మి మాకు పరిచయమైన అమ్మాయి. కనకనే ఆవిడ తరఫున రాగలిగాను. మీ సంపద నేమీ పంచి ఇవ్వక్కరలేదు! ఆమెను బార్యగా స్వీకరించేటట్లు చేస్తే చాలు!" రాజీ ధోరణిలోనే అంది పారిజాతం.
    "ఏమిటి నీ పిచ్చి! సవతి రావడం ఎవరి కిష్టం ఉంటుంది? అసలు ఈ విషయంలో నా సంబంధమే లేదు. నీ విక వెళ్ళవచ్చు." కోపం, ఎగతాళి కలిసిన స్వరంతో అంది లలిత.
    పారిజాతం కోపాన్ని నిగ్రహించుకొని, "ఎందుకండీ అంత తేలికగా మాట్లాడుతున్నారు? భర్త హోదాలో భాగం కావాలి! భర్త జల్సాలలో భాగం కావాలి! భర్త జీతంలో భాగం కావాలి! జీవితంలో భాగం కావాలి! కాని, భర్త చేసిన తప్పుల్లో మాత్రం భాగ మక్కర్లేదు! వాటిని చక్కదిద్ధవలసిన బాధ్యత లేదు. సరే! మీ ఊహ ఏమిటో చెప్పారు. ఇక మీ వారి సంగతి కూడా చూద్దాము!" అంటూ పారిజాతం అక్కడే టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరీలో రామనాథం ఆఫీస్ ఫోన్ నంబరు చూసి, అతనికి ఫోన్ చేసింది.
    
                            *    *    *

    మేఘాల మీద వచ్చాడు రామనాథం. పారిజాతం తనకు ఫోన్ చేసింది! తనకోసం వచ్చింది! ఈ పిట్ట చేయిజారిపోయిదంని ఎంత బాధపడ్డాడు తను! కాని, ఎంత తెలివిగల పిల్ల! వాళ్ళందరి ముందూ నిశ్చలంగా ఉండి, ఈ వేళ తనకోసం అభిసారికలా వచ్చింది! నిజంగా తాను ఎంత అదృష్టవంతుడు! కాని, ఒకే ఒక చిన్న లోటు! ఇంటినుండి ఫోన్ చేస్తున్నది. పానకంలో పుడకలా లలిత అక్కడే తగలడిందేమో! ఉహూఁ! కాదు, కాదు! ఇంత తెలివిగల పారిజాతం తెలివతక్కువ పని చెయ్యదు. ముందుగా లలితతో స్నేహం నటించి, దాన్ని బుట్టలో పెట్టి ఉంటుంది!
    కారు దిగి లోనికి పోయేసరికి, ముందు హాల్లో కూర్చుని ఉన్న లలితా, పారిజాతం కనుపించారు. లలిత ముఖం ధుమధుమలాడుతూన్నది. పారిజాతం ముఖం... ఆహా! ఆహా!
    "హల్లో! ఏమిటీ ప్లెజంట్ సర్ ప్రైజ్! ఈవేళ లేచిన వేళ ఎంత మంచిది!" అన్నాడు.
    "కాదూ, మరి! లేచిన వేళ చాలా మంచిది! కాబట్టే మన ఘనకార్యం ఊళ్లు దాటిపోయింది!" ఈసడింపుగా అంది లలిత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS